కొడుకు
మర్చిపోయినా
తండ్రి మాత్రం మర్చిపోలేదు. కొడుకు భవిష్యత్తు గురించి హర్మన్ కి బెంగ పట్టుకుంది. ఒకరోజు కొడుకుని దగ్గరికి పిలిచి మాట్లాడాడు. చదువు విషయం ఏం ఆలోచించావు అని అడిగాడు. తిరిగి మ్యూనిక్ కి ఎప్పుడు వెళ్తున్నావని అడిగాడు. ఇంక
ఎక్కడైనా చదువుకుంటా గాని తిరిగి మ్యూనిక్ కి మాత్రం ససేమిరా వెళ్లనని మొరాయించి కూర్చున్నాడు ఆల్బర్ట్. కొడుకు మనోభావం అర్థం చేసుకున్న తండ్రి పెద్దగా ఒత్తిడి చెయ్యలేదు. ఒక విధంగా కొడుకు
మీద ఎప్పుడో ఆశ
వదులుకున్నాడు.
పెద్దగా ప్రయోజకుడు అవుతాడన్న నమ్మకం అతడికి లేదు. జర్మనీ లో కాకపోయినా కొడుకు స్విట్జర్లండ్ లో చదువుకోడానికి ఏర్పాట్లు చేస్తానన్నాడు తండ్రి. భౌతిక శాస్త్రం అంటే ఆల్బర్ట్ కి ఎంతో ఇష్టం అని తండ్రికి తెలియకపోలేదు. కాని బడిలో ఇంతవరకు తనకి వచ్చిన మార్కుల బట్టి చూస్తే పై చదువుల్లో భౌతిక శాస్త్రంలో ప్రవేశం దొరకడం కష్టం. అందుకే
అంత కన్నా కాస్త సులభమైన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో, స్విట్జర్లండ్ లో కొడుక్కి ప్రవేశం సాధించాడు. కాని విచిత్రం ఏంటంటే తన
పుత్రరత్నం అసలు భౌతిక శాస్త్ర చరిత్ర లోనే అత్యున్నత స్థాయి మేధోవర్గానికి చెందినవాడని, ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ గా విశ్వవిఖ్యాతి చెందుతాడని, ఆ సమయంలో ఆ తండ్రి గుర్తించలేకపోయాడు.
స్విట్జర్లండ్ లో
చదువుకోడానికి
ఆల్బర్ట్ ఒప్పుకున్నాడు. తిరిగి జర్మనీలో చదవాలన్న నిర్బంధం లేకపోతే చాలు. ఇంకెక్కడ చదువుకోడానికైనా తను సిద్ధమే. స్విట్జర్లండ్ లో సెమిస్టర్ ఆరంభం కావడానికి ఇంకా కొంత గడువు వుంది. ఈ మధ్యలో ఇటలీ దేశం అంతా పర్యటించాలని వుందని తల్లిదండ్రులతో తన కోరిక బయటపెట్టాడు ఆల్బర్ట్. ఎక్కువ ఖర్చులేకుండా వీలైనంత వరకు కాలినడకనే వివిధ ప్రదేశాలు చూసి వస్తానని మాట ఇచ్చాడు. తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. నాలుగు జతల బట్టలు, తనకి ప్రీతిపాత్రమైన వయొలిన్ ఓ చిన్న సంచీలో సర్దుకుని, తల్లిదండ్రులకి, మాయాకి వీడ్కోలు చెప్పి, బయల్దేరాడు ఆల్బర్ట్.
ఇటలీ
చాలా అందమైన దేశం. ఉత్తరాన ఆల్ప్స్ పర్వతాలు, వెసూవియస్ లాంటి జ్వాలాముఖులు, రాచకుటుంబాల చేత
అద్భుత కళాఖండాల లాగా తీర్చిదిద్దబడ్డ తోటలు, విశాలమైన చెరువులు, ఆ చెరువుల మధ్య ద్వీపాల మీద వెలసిన పొందికైన రాచకోటలు, సుదీర్ఘమైన తీర రేఖ… ఇటలీ దేశపు అందాలు తనివితీరా చూడడానికి జీవితకాలం సరిపోదేమో.
ముందుగా
మిలాన్ కి ఉత్తరాన వున్న ఆల్ప్స్ కొండలు చేరుకున్నాడు. హిమావృతమైన ఆల్ప్స్ శిఖరాల మీద ఉషా కాంతులు నాట్యాలు చేస్తున్న దృశ్యం చూస్తుంటే ఆల్బర్ట్ మనసు పులకించింది. ఒంటరిగా ఆరోహణం ప్రారంభించాడు. మంచుకరిగిన నీళ్లు రాళ్ల సందుల్లోంచి తుళ్లుతూ, చుట్టూ చిందుతూ, వడిగా కిందకి ఉరుకుతూ పాడే పాటలు విని పరవశించిపోయాడు. కొండవాలు మీద అక్కడక్కడా కనిపించే తెల్లని భవనాలు చూసి మురిసిపోయాడు. కింద లోయలో అల్లంత దూరంలో కనిపించే ప్రశాంత తటాకం చూసి కన్నార్పలేక పోయాడు.
ఆల్బర్ట్
కి ఈ అనుభవంతో తన జీవితంలో ఇంత కాలం ఏం లోపించిందో అర్థమయ్యింది. తన జీవితంలో స్వేచ్ఛ లోపించింది. తను మనసులోని ఆలోచనలని నిర్భయంగా ప్రకటించే స్వేచ్ఛ, తను కోరుకున్న బడిలో, తనకి నచ్చిన విషయాలని చదువుకునే స్వేచ్ఛ, తన చేష్టలని ప్రవర్తనని ఎవరో విమర్శిస్తారని, వెక్కిరిస్తారని జంకు లేకుండా బతికే స్వేచ్ఛ, జీవితాన్ని
తాను ఆకాంక్షించిన రీతుల్లో, రాజీ పడకుండా బతికే స్వేచ్ఛ… ఇదీ లోపించింది. ఈ ఏకాంత, మహోన్నత మౌన సీమలో ఆ స్వేచ్ఛే తనకి పరిపూర్ణంగా అనుభవమయ్యింది. రాబోయే ఏళ్లలో సైద్ధాంతిక భౌతిక శాస్త్ర శిఖరాల దిశగా తను మొదలుపెట్టబోయే ఏకాంత పర్వతారోహణానికి ఈ అనుభవం ఓ చక్కని సన్నాహం అయ్యింది.
ఆల్ప్స్
పర్వతాల మీద కాళ్లరిగేలా సంచారం చేసిన తరువాత జెనొవా (Genoa) నగరానికి బయల్దేరాడు ఆల్బర్ట్. ఇటలీలో ఉత్తర-పశ్చిమ భాగంలో మధ్యధరా సముద్ర తీరం మీద వుందీ నగరం. కనీసం రెండున్నర సహస్రాబ్దాల చరిత్ర గల ప్రాచీన నగరం. ఈ ఊళ్లో ఐన్ స్టయిన్ కుటుంబానికి దూరపు బంధువులు ఉన్నారు. అక్కడ కొన్ని రోజులు బస చేసిన తరువాత పీసా (Pisa) నగరానికి పయనమయ్యాడు. భౌతిక శాస్త్ర పితామహుడైన గెలీలియోకి పుట్టినిల్లు పీసా. అక్కడి చరిత్రాత్మకమైన ‘వాలు బురుజు’ (Leaning tower) ని
సందర్శించాడు.
పీసా బురుజు వద్ద గెలీలియో చేసిన చారిత్రక ప్రయోగం గురించి తలచుకున్నాడు. గెలీలియో కాలంలో భౌతిక శాస్త్రంలో క్రీస్తు పూర్వం నాటి అరిస్టాటిల్ భావలు చలామణిలో వుండేవి. ‘తేలికైన వస్తువులు, బరువైన వస్తువుల కన్నా వేగంగా కింద పడతాయని’ అరిస్టాటిల్ బోధించాడు. బరువుని బట్టి వస్తువులు కింద పడే వేగంలో తేడా వున్నట్టు కనిపించినా అది గాలి నిరోధకత వల్ల మాత్రమే గాని, గాలి నిరోధకతని తొలగిస్తే అన్ని వస్తువులూ ఒకే వేగంతో కిందపడతాయని మనకిప్పుడు తెలుసు. గెలీలియో ఆ సత్యాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించాడు. పీసాలోని వాలు బురుజు నుండి ఓ బరువైన వస్తువుని, ఓ తేలికైన వస్తువుని
కింద పడేసి రెండూ ఒకే వేగంతో కింద పడతాయని ప్రదర్శించి, సహస్రాబ్దం పైగా చలామణిలో వున్న అరిస్టాటిల్ భావాలని మట్టికరిపించాడు. పీసా బురుజు కేసి తదేకంగా చూస్తూ, ఆ చారిత్రక ఘట్టాన్ని మనసులో స్మరిస్తూ మైమరచిపోయాడు ఆల్బర్ట్.
ఈ
రకంగా ఇటలీలో మరెన్నో ఊళ్లు చూడాలని ఉవ్విళ్లూరాడు ఆల్బర్ట్. కని దురదృష్టవశాత్తు తెచ్చుకున్న డబ్బు అయిపోవస్తోంది. పైగా స్విట్జర్లండ్ కి వెళ్ళి కాలేజిలో చేరాల్సిన రోజు కూడా దగ్గరపడుతోంది.
ఇష్టం
లేకపోయినా నెమ్మదిగా ఇంటి దారి పట్టాడు.
ఇంటికి
తిరిగొచ్చిన
సోదరుణ్ణి చూసి మాయా సంతోషం పట్టలేకపోయింది. తన అనుభవాల గురించి పూస గుచ్చినట్టు కథలు కథలుగా చెప్పాడా అన్నయ్య. తను ఎంత ఆనందం పొందింది, ఎంత స్వేచ్ఛని అనుభవించిందీ అంతా ఉత్సాహంగా పంచుకున్నాడు. కాని తల్లిదండ్రులు మాత్రం ఆ ఉత్సహంలో పాలుపంచుకోలేదు. పై ఊళ్ళు తిరిగొచ్చి గొప్పలు చెప్పుకుంటున్న కొడుకుని కాదు వాళ్ళు చూడదలచుకున్నది. పై చదువులు చదివొచ్చి మంచి ప్రయోజకుడని నిరూపించుకున్న కొడుకుని వాళ్లు చూడగోరుతున్నారు.
ఆల్బర్ట్
కి వారి మనోభావం చెప్పకనే అర్థమయ్యింది.
తన
వస్తువులన్నీ
తీసుకుని త్వరలోనే స్విట్జర్లండ్ కి బయల్దేరాడు.
(ఇంకా
వుంది)
postlink