అసమాన
ప్రతిభకి అందం తోడైన ఆల్బర్ట్ అంటే అమ్మాయిలు మోజుపడేవారంటే ఆశ్చర్యం లేదు. తన పరిచయం కోసం, స్నేహం కోసం తహతహలాడేవారు. కాని అమ్మాయిలతో జట్టు కట్టడానికి ఆల్బర్ట్ కి కొన్ని నిర్బంధాలు ఉన్నాయి. ఒక స్త్రీతో సాన్నిహిత్యంలో తను కోరుకుంటున్నది, చూస్తున్నది కేవలం పిచ్చాపాటి మాట్లాడుకోడానికి, సరదాగా కాలక్షేపం చెయ్యడానికి ఓ తొడు కాదు. పెళ్ళి చేసుకుని గంపెడు సంతానం కనడానికి అంతకంటే కాదు. తను వెతుకుతున్నది మేధోరంగంలో తను కొనసాగిస్తున్న ప్రయాణంతో తనతో పాటు కలసి ప్రయాణించగల సహయాత్రికురాలు. ఆ లోకంలో తనకి తోడై జీవించగల సహవాసి. బాహ్యలోకంలో తనకి దగ్గర కావాలని ప్రయత్నించిన అమ్మాయిలే తనకి తారసపడ్డారు గాని, తన అంతర్యంలోకి ప్రవేశించి, తన ఊహలని సిద్ధాంతాలని అర్థం చేసుకోగల మేధస్సుగల సమవుజ్జీలు తనకి ఇంకా దొరకలేదు. కాని ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ జీవితంలోకి మిలేవా మారిక్ ప్రవేశించడంతో పరిస్థితి మారిపోయింది.
మిలేవా మారిక్
మిలేవా
మారిక్ ఆధునిక సెర్బియాలో ఉన్న టైటెల్ అనే ఊళ్లో 1875 లో
జన్మించింది.
1894 లో హైస్కూల్ పూర్తి చేసిన దశలో గణిత, భౌతిక శాస్త్ర రంగాల్లో ఈమెకి ప్రత్యేక ప్రతిభ వుందని తల్లిదండ్రులకి అర్థమయ్యింది. పుట్టుకతో
హంగరీ దేశానికి చెందింది. ఆల్బర్ట్ లాగానే పై చదువుల కోసం జ్యూరిక్ కి వచ్చింది. కాని అదే సంవత్సరంలో ఆమెకి సుస్తీ చెయ్యడం వల్ల పరిశుద్ధమైన వాతావరణం గల
స్విట్జర్లాండ్
కి మకాం మార్చితే అమ్మాయి ఆరోగ్యం కుదుటపడుతుందని తండ్రి అనుకున్నాడు. కనుక అదే ఏడు జ్యూరిక్ లోని ‘గర్ల్‍స్ హై స్కూల్’ లో మిలేవాని చేర్పించాడు. జ్యూరిక్ లో చదువుకుంటున్న రోజుల్లేనే ఆమెకి ఆల్బర్ట్ తో పరిచయం ఏర్పడింది.
మిలేవాలో
ఆల్బర్ట్ కి ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ కనిపించింది. బట్టల గురించో, నగల గురించో ముచ్చటించుకునే అమ్మాయిలతో పోల్చితే మిలేవా పూర్తిగా భిన్నంగా అనిపించింది. గణిత, భౌతిక రంగాల్లో ఆమె ప్రతిభ ప్రత్యేకంగా ఆల్బర్ట్ ని ఆకట్టుకుంది. ఆచార్యులు చెప్పింది, పుస్తకాల్లో చదివింది అక్షరసత్యాలని నమ్మే తోటి విద్యార్థుల్లా కాకుండా, మిలేవాకి శాస్త్రవిషయాల గురించి సొంతంగా శోధించి, తన సొంత నిర్ణయాలకి రాగల సత్తా వుందని ఆల్బర్ట్ త్వరలోనే గుర్తించాడు. సాంప్రదాయక భౌతిక శాస్త్రానికి పూర్తిగా భిన్నంగా పోతున్న తన నవ్య భావాలని పరీక్షించుకునేందుకు తగిన గీటురాయి ఆమెలో కనిపించింది ఆల్బర్ట్ కి. తన సిద్ధాంతాలని ఆమెతో తరచు చర్చిస్తూ ఉండేవాడు. ఆమె స్పందన బట్టి, ఆమె ఇచ్చే సూచనల బట్టి వైజ్ఞానిక సమాజాల ముందు తన నూతన భావాలని ఎలా ప్రవేశపెట్టాలో, వారికి అర్థమయ్యేలా తన సిద్ధాంతాలని ఎలా వివరించాలో అతడికి ఇంకా ఇంకా స్పష్టం కాసాగింది. ఇంతకాలం తను ఎదురుచూస్తున్న జీవన సహవాసి మిలేవాలో కనిపించింది. కథ పెళ్లి వరకు వచ్చింది. కాని అప్పటికి ఆల్బర్ట్ చదువు ఇంకా పూర్తి కాలేదు. ఆ తరువాత ఉద్యోగం అనే అవరోధం కూడా వుంది. మరో సమస్య ఏంటంటే మిలేవా ఆల్బర్ట్ కన్నా నాలుగేళ్లు పెద్దది. పైగా
జర్మనీ కి చెందిన ఐన్ స్టయిన్ కుటుంబం, సెర్బియాకి చెందిన కోడలిని స్వీకరిస్తుందా అన్న సందేహం, యూదుడైన ఆల్బర్ట్ ని మిలేవా కుటుంబం స్వీకరిస్తుందా అన్న సంశయం ఇద్దరి మనసుల్లో లేకపోలేదు. ఈ
అవరోధాలన్నీ
గట్టెక్కాకే
వివాహం చేసుకోవాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు.
ఆల్బర్ట్
ఆలోచనలు ఉద్యోగం మీదకి మళ్లాయి. స్విట్జర్లాండ్ లోనే ఆచార్యుడిగా ఉద్యోగం వెతుక్కోవాలని అనుకున్నాడు. కాని
స్విట్జర్లాండ్
లో పరదేశీలకి ఉద్యోగాలు దొరకవు. అంటే ఆ దేశపు పౌరసత్వం స్వీకరించాలి. కేవలం ఉద్యోగం కోసం మరో దేశపు పౌరుడిగా మారాలా? పైగా తను చదువుకుంటున్న FIT లో కూడా చదువు అంత బ్రహ్మాండంగా ఏమీ లేదు. అయితే జర్మనీ కన్నా ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగు. కనుక స్విట్జర్లాండ్ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోడానికే నిర్ణయించుకున్నాడు.
కాని
పౌరసత్వం కోసం దరఖాస్తు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అసలే తన ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా వుంది. బంధువు ఉదారంగా పంపుతున్న సొమ్ము మొత్తం నూరు ఫ్రాంక్ లు. ఇందులోనే పౌరసత్వపు ఫీసు సొమ్ము చెల్లించుకోవాలి. కనుక ఖర్చులు బాగా తగ్గించుకోవాలని కొన్ని చర్యలు తీసుకున్నాడు. అప్పుడప్పుడు పస్తులు ఉండేవాడు. కొత్త బట్టలు కొనుక్కోవడం మానేశాడు. మాసిన బట్టలలో కూడా ఏం పట్టనట్టు తిరిగేవాడు. ఎలాగో తగినంత
సొమ్ము వెనకేసి పౌరసత్వం కోసం అర్జీ పెట్టుకున్నాడు.
(ఇంకా
వుంది)
2 comments