శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


ఉద్యోగ వేట

1900  లో FIT  లో ఆల్బర్ట్ చదువు పూర్తయ్యింది. ఇక ఉద్యోగ వేట మిగిలింది. FIT  నుండి ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో కొందరు తిరిగి అక్కడ ప్రొఫెసర్ల వద్దనే అనుచరులుగా చేరే ఆచారం వుంది. ప్రొఫెసర్ల పరిశోధనల్లో వాళ్ళు సహకరిస్తూ ఉంటారు. రకమైన ఉద్యోగం వస్తే చాలని ఆల్బర్ట్ ఆశించాడు. తనతో పాటు పాసైన మరి ముగ్గురికి అలాంటి ఉద్యోగాలు వచ్చాయి. కాని ఆల్బర్ట్ కి మాత్రం రాలేదు

ప్రొఫెసర్ వెబర్ కి ఆల్బర్ట్ కి మధ్య స్పర్థ గురించి FIT  లో అందరికీ తెలిసినదే. ఆయన వేసిన అడ్డుపుల్లల మహిమ వల్లనే ఆల్బర్ట్ కి తక్కిన ప్రొఫెసర్ల వద్ద పని చేసే అవకాశాలు రాకుండా వున్నాయి. ఆల్బర్ట్ కి తలబిరుసు అని, చెప్పిన పని చెయ్యకుండా తన సొంత కవిత్వం వల్లించే తత్వం అని, పరిశోధనల్లో తన నుండి వచ్చే సహకారం ఏమీ ఉండదని సహోద్యోగులకి ఏవో కల్పించి చెప్పాడు వెబర్. విషయం అర్థమైన ఆల్బర్ట్ కి ఏం చెయ్యాలో పాలుపోలేదు.

తన ఉద్యోగ సమస్య గురించి స్నేహితులైన మిలేవా, గ్రాస్మన్ లతో వెళ్లగక్కుకున్నాడు. కాస్త ఓపిక వహించమని, ఉద్యోగాలు చెట్లకి కాయవని, నెమ్మది మీద అన్నీ చక్కబడతాయని మిలేవా హితవు చెప్పింది. FIT లో ఉద్యోగం రాకపోయినా ప్రైవేటుగా ట్యూషన్లు చెప్పుకుంటే కొంత ఆదాయం వస్తుందని సలహా ఇచ్చింది. ఒక పక్క ఆల్బర్ట్ కి ధైర్యం చెప్తున్నా మిలేవా తన కష్టం తనలోనే దాచుకుంది. FIT  లో ఫైనలు పరీక్షలు అప్పటికే రెండు సార్లు తప్పింది. అవి పాసు అయితే గాని పట్టా రాదు. పట్టా ఉంటేగాని ఉద్యోగం రాదు.

ఆల్బర్ట్ తన ఉద్యోగ వేట కొనసాగించాడు. 1901  లో మే నెలలో వింటర్ థర్ అనే ఊళ్లో బళ్లో టీచరుగా ఉద్యోగం వచ్చింది. ఇది తాత్కాలిక ఉద్యోగం మాత్రమే. అక్కడి టీచరు కొన్ని నెలలు సెలవు పెట్టడం చేత, స్థానాన్ని పూరించడానికి మరో టీచరు కావాలి. మాసిన బట్టలతో, చెదరిన జుట్టుతో రంగప్రవేశం చేసిన కుర్ర టీచరు అంటే అక్కడి పిలల్లకి మొదట్లో సదభిప్రాయం ఏర్పడలేదు. వీలైనంత త్వరగా కొత్త మొహాన్ని వొదిలించుకోవాలని అనుకున్నారు. బల్లల మీద బాదారు. ఈలలు వేశారు. కాని ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ పాఠం మొదలెట్టిన కొద్ది నిముషాల్లోనే శబ్దం కాస్త సన్నగిల్లింది. అంతవరకు గుర్తించని ఏదో కాంతి కుర్ర టీచరు కళ్లలో వారికి కనిపించింది. భౌతిక శాస్త్ర భావాలని అర్థం చేసుకోకుండా కంఠస్థం చేయడమే తెలిసిన పిల్లలకి కొత్త టీచరు బోధన చాలా భిన్నంగా తోచింది. ఎంతో సంక్లిష్టం అని భయపడే భావాలని కూడా సునాయాసంగా అరటిపండు వొలిచిపెట్టినట్టు చెప్తున్నాడు. ఎప్పటికీ మింగుడు పడవనుకుని వొదిలేసిన విషయాలని అతి సులభం చేస్తూ గోరుముద్దలు తినిపిస్తున్నాడు. క్లాసు పూర్తయ్యేసరికి పిల్లలంతా లేచి చప్పట్లు కొట్టారు.

ఆల్బర్ట్ కి కూడా అధ్యాపక వృత్తి చాలా నచ్చింది. దాన్నొక ఉద్యోగ భారంగా తీసుకోకుండా సహజంగా, సంతోషంగా చెప్పేవాడు. రోజుల్లో తన దినక్రమం గురించి ఇలా ఉత్తరంలో రాస్తాడు: “ఉదయం ఐదు ఆరు గంటలు పాఠాలు చెప్పాక కూడా మధ్యాహ్నం చాలా ఉత్సహంగా, ఓపిగ్గా ఉంటుంది. లైబ్రరీకి వెళ్లి ఏవైనా ఆసక్తికరమైన కొత్త సంగతులు చదువుకుంటాను. లేదా ఇంటికెళ్ళి ఏవైనా ఆసక్తికరమైన శాస్త్ర సమస్యల మీద పని చేస్తాను.” కాని కొత్త ఉద్యోగం కొన్ని నెలల పాటే వుంది. అసలు టీచరు తిరిగి రాగానే ఆల్బర్ట్ కి ఉద్యోగం వొదిలేయక తప్పలేదు.
1901  లో సెప్టెంబర్ లో షాఫ్ హౌసెన్ అనే మరో ఊళ్లో బళ్లో ఉద్యోగం దొరికింది. కొత్త ఉద్యోగంలో ఏడాది పాటు పని చెయ్యాలి. మానసిక స్థితిమితం లేని ఇద్దరు పిల్లలకి చదువు చెప్పడమే ఉద్యోగం. ప్రతిభకి తగ్గ పని కాదనుకోకుండా కొత్త ఉద్యోగాన్ని కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. సాంప్రదాయేతర పద్ధతుల్లో, చిత్ర విచిత్ర రీతుల్లో బోధన కొనసాగించాడు. అలాంటి పద్ధతుల్లో బోధన కూడదని యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. కాని పిల్లలు అలాంటి బోధన నచ్చుతోంది, వాళ్లు చక్కగా స్పందిస్తున్నారు, అని ఆల్బర్ట్ వాదించాడు. కాని వాదన వారికి రుచించలేదు. ఉద్యోగం కూడా ఎంతో కాలం సాగలేదు.

ఇలా రెండేళ్ల పాటు సరైన ఉద్యోగం దొరక్క అవస్థపడ్డాడు ఆల్బర్ట్. పరిశోధనా రంగంలో కూడా తన అదృష్టం అంతంతమాత్రంగానే ఉంది. 1901  లో పరిశోధనా పత్రం వ్రాసి జ్యూరిక్ విశ్వవిద్యాలంలో నిపుణులకి దాన్ని పంపాడు. పత్రం ఆమోదితం అయితే దాని ఆధారంగా తనకి PhD  వస్తుందని గంపెడంత ఆశతో ఉన్నాడు. కాని పత్రాన్ని పరిశీలించిన నిపుణులు దాన్ని తిప్పికొట్టారు

ఆల్బర్ట్ కి గడ్డుకాలం కొనసాగింది. దశలో మిలేవా తనకి తోడుగా ఉంటూ ధైర్యం చెప్పింది. అలా రెండేళ్లు గడిచాక ఆల్బర్ట్ కి మరో ఉద్యోగం వచ్చింది. బెర్న్ నగరంలో పేటెంట్ ఆఫీసులో ఉద్యోగం. ఆల్బర్ట్ మిత్రుడైన మార్సెల్  గ్రాస్మన్ ప్రమేయం వల్ల వచ్చిందీ ఉద్యోగం. గ్రాస్మన్ తండ్రికి పేటెంట్ ఆఫీసు డైరెక్టర్ అయిన మిస్టర్ హేలర్ మిత్రుడు

చదువుతో, బోధనతో సంబంధం లేని ఉద్యోగం అంటే ఆల్బర్ట్ కి ససేమిరా నచ్చలేదు. కాని ఉద్యోగం తప్పనిసరిగా కావాలి. కనుక ఇష్టం లేకపోయినా కొత్త ఉద్యోగంలోకి దిగాడు. 1902  లో జూన్ లో, పేటెంట్ ఆఫీసులో జూనియర్ అధికారిగా పన్లోకి దిగాడు. ఉద్యోగం అనుకున్నంత అనాసక్తికరంగా ఏమీ లేదు. వైజ్ఞానిక భావనలు వాడి ఏవైనా ఆవిష్కరణలు చేసినప్పుడు వాటి మీద ప్రత్యేక హక్కులు వచ్చేలా పేటెంట్  కోసం అర్జీ పెట్టుకుంటారు. అలా వచ్చిన పేటెంట్ల లో కొన్ని గొప్ప ప్రతిభతో కూడినవి వుండడం ఆల్బర్ట్ గమనించకపోలేదు. కొన్ని నెలలలోనే ఉద్యోగానికి కావలసిన ఒడుపులన్నీ నేర్చుకున్నాడు. దినసరి పని రెండు మూడు గంటలలో పూర్తిచేసుకునేవాడు. ఇక తక్కిన సమయం అంతా తనకి ఇష్టమైన పరిశోధనల్లో మునిగిపోయేవాడు. ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు గట్టెక్కడంతో జీవితం సాఫీగా సాగిపోతోంది.

చేతిలో ఉద్యోగం ఉంది కనుక ఇక పెళ్లి సంగతి చూడాలి. తల్లిదండ్రులకి మిలేవా సంగతి చెప్పి ఎలాగైనా వారి అనుమతి పొందాలి. కొడుకు మనసులో మాట వినగానే తండ్రి ఉగ్రుడయ్యాడు. తల్లికి కూడా కొడుకు వరస ససేమిరా నచ్చలేదు. కొడుకు కన్నా అమ్మాయి నాలుగేళ్లు పెద్దదట!  పైగా సెర్బ్ జాతి పిల్ల, జ్యూరిక్ లో స్థిరపడిందట! పిల్ల ఎవరో, తన కుటుంబం ఎలాంటిదో, వారి గోత్రనామాలేంటో, ఏమీ తెలీకుండా నిర్ణయం కొడుకు ఎలా తీసుకున్నాడు? అలాంటి పిల్ల వారి కుటుంబంలో ఎప్పటికీ ఇమడలేదు అని తల్లిదండ్రులు ఇద్దరూ తమ అభ్యంతరం తెలియజేశారు. పైగా తల్లి పాలిన్ ఒక పక్క ఆల్బర్ట్ కోసం సంబంధాలు చూస్తోంది. వాళ్లలో కన్యని పెళ్ళి చేసుకోడానికి ఆల్బర్ట్ ఒప్పుకుంటాడని ఆమె ఆశపడింది.కాని మిలేవాని తప్ప మరో మహిళని పెళ్లి చేసుకోనని కూర్చున్నాడు ఆల్బర్ట్.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts