ఇంట్లో
పరిస్థితి ఇలా అల్లకల్లోలంగా ఉన్న తరుణంలో తండ్రి హర్మన్ ఒక సారి హఠాత్తుగా స్ట్రోక్ తో మంచాన పడ్డాడు. ఆల్బర్ట్ వెంటనే జ్యూరిక్ నుండి మిలాన్ వెళ్లాడు. ఈ సమయంలో తల్లికి తన తోడు ఎంతో అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో సముచితం కాదని ఈ సారి పెళ్ళి ప్రస్తావన తీసుకురాలేదు. కాని కొన
ఊపిరి తో వున్న తండ్రి ఆల్బర్ట్ మిలేవాల పెళ్లికి ఒప్పుకుంటూ కన్నుమూశాడు.
భర్త
అకాల మరణం పాలిన్ కి గొడ్దలి పెట్టు అయ్యింది. ఆల్బర్ట్ కొన్ని నెలలు ఇంట్ళోనే అమ్మకి చేయూతగా ఉన్నాడు. మెల్లగా ఆమె మనసు మారుతుందని అనుకున్నాడు. కాని అలాంటి సూచనలేం కనిపించలేదు. చివరికి ‘నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఫో!’ అని నిష్టూరంగా అనేసి ఊరుకుందా తల్లి.
జనవరి
1903 లో ఆల్బర్ట్ మిలేవాల వివాహం జరిగింది. ఏడాది తిరిగేలో వారికొక కొడుకు పుట్టాడు. పిల్లవాడికి హన్స్ అని పేరు పెట్టుకున్నారు. ఆల్బర్ట్ కి తన జీవితం ఓ కొత్త మలుపు తిరుగుతున్నట్టు అనిపించింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మొదట్లో
కొంత అనిశ్చితి వున్నా చివరికి తన ఇష్టమైన కన్యని పెళ్లి చేసుకోగలిగాడు. బంతిలా ఇల్లంతా పాకుతూ ఆడే పసివాణ్ణి చూస్తే తన గుండె నిండిపోయేది. పగలంతా పేటెంట్ పని లోను, తన వ్యక్తిగత పరిశోధనల్లోను మునిగితేలే ఆల్బర్ట్ కి ఇంట్లోని వాతావరణం ఎంతో సంతోషాన్ని, విశ్రాంతిని ఇచ్చేది.
పైపైన
చూసినప్పుడు
అందరు యువకుల్లాగానే ఉద్యోగం చేసుకుంటూ, డబ్బు సంపాదిస్తూ, భార్య బిడ్డలతో హయిగా జీవిస్తున్న ఆల్బర్ట్, ఆ దశలో తన పరిశోధనలతో భౌతిక శాస్త్ర చరిత్రలో ఓ కొత్త అధ్యాయం తెరవబోతున్నాడు. ఉద్యోగ రీత్యా చూస్తే అతడు ఏదో గొప్ప విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్
కాడు. పోనీ ఓ పరిశోధనా సంస్థలో శాస్త్రవేత్త కూడా కాడు. విద్యార్హతల బట్టీ చూస్తే ఇంకా పీ.హెచ్.డీ. పట్టం రాలేదు. అతడు కేవలం పేటెంట్ ఆఫీసులో పని చేసే ఓ క్లర్కు.
పేటెంట్
ఆఫీసులో ఆల్బర్ట్ పని చాలా సులభంగా ఉండేది. రోజు పని కొన్ని గంటల్లో అయిపోయేది. ఇక మిగతా సమయం తన పరిశోధనల్లో మునిగిపోయేవాడు. సామాన్యంగా పరిశోధనలు చేసే వారు ప్రత్యేక పరిశోధనా సంస్థల్లోనో, విద్యాసంస్థల్లోనో పని చేస్తారు. అక్కడే వారికి పరిశోధనలకి తగ్గ వసతులు ఉంటాయి. ప్రయోగశాలలు ఉంటాయి. పనిలో సహాయం చెయ్యడానికి అనుచరులు, విద్యార్థులు ఉంటారు. ఇలాంటి వసతులేమీ లేని, అసలు పరిశోధనా జీవితానికి అసలు సంబంధమే లేని ఉద్యోగం చేస్తూ భౌతిక శాస్త్ర చరిత్రనే మార్చే పరిశోధనలు ఏ ఆర్భాటమూ లేకుండా చేస్తున్నాడు. తన పరిశోధనా రంగం ఏదో ఖరీదైన ప్రయోగశాల కాదు. అమూల్యమైన తన మనో రంగం లోనుండి పెల్లుబికే విప్లవాత్మక భావాలని కలంతో, సిరాతో కసితీరా వ్యక్తం చేస్తున్నాడు.
భౌతిక
శాస్త్రంలో ఓ మౌలిక సమస్య ఎంతో కాలంగా ఆల్బర్ట్ మనసుని ఆక్రమించుకుంది. అది చలనానికి సంబంధించిన సమస్య.
ఒక వస్తువు యొక్క కదలికని ఎప్పుడూ మరో వస్తువుని బట్టి మాత్రమే చెప్పడానికి వీలవుతుంది. ఒక ప్రమాణం బట్టి కదులుతున్న వస్తువు, మరో ప్రమాణం బట్టి నిశ్చలంగా ఉండొచ్చు. ప్లాట్ ఫామ్ మీద ఉన్న వారికి కదులుతున్నట్టు ఉన్న రైలు, అందులో కూర్చున్ని వున్న వారికి నిశ్చలంగా ఉన్నట్టు ఉంటుంది. చలనం యొక్క ఈ లక్షణాన్ని సాపేక్షత (relativity) అంటారు. అంటే చలనం అనేది ‘ఒక దాన్ని బట్టి’ (అంటే ‘సాపేక్షంగా’, relative గా) మాత్రమే నిర్ణయించడానికి వీలవుతుంది. చలనం యొక్క ఈ సాపేక్షత గురించి గెలీలియో కాలం నుండీ శాస్త్ర సమాజానికి తెలుసు.
అయితే
పందొమ్మిదవ శతాబ్దపు చివరి దశల్లో కాంతి యొక్క చలనం గురించి చేసిన కొన్ని ప్రయోగాల దృష్ట్యా ఈ ప్రాథమిక సాపేక్షతా సూత్రం ఉల్లంఘించబడుతున్నట్టు అనిపించింది. ఆ ఉల్లంఘనని వివరించడానికి కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించబడ్డాయి. కాని అవేవీ అంత సంతృప్తి కరంగా లేవు.
కాంతి
విషయంలో సాపేక్షత యొక్క ఉల్లంఘన ఏదో విడ్డూరమైన విషయం అని, దాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదని అనుకున్నవారు ఉన్నారు. కాని కాంతి వద్ద ఉల్లంఘించబడ్డ సాపేక్షత ఓ లోతైన రహస్యాన్ని దాస్తోందని గుర్తించాడు ఆల్బర్ట్. ఆ రహస్యాన్ని ఛేదిస్తే భౌతిక
శాస్త్ర స్వరూపం సమూలంగా మారిపోతుంది అని గ్రహించాడు ఆ యువకుడు. తనకి
ముందు ప్వాంకరే, లోరెన్జ్ వంటి మహామహులు అంతా గ్రహించలేని సత్యాన్ని ఏ వైజ్ఞానిక సమాజంతోనూ సంబంధం లేకుండా ఒంటరిగా కృషి చేస్తున్న ఆల్బర్ట్ ఐన్స్టయిన్ గుర్తించాడు.
(ఇంకా వుంది)
0 comments