ఈ మధ్యన మన దేశంలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య నాలుగో స్థానానికి పడిపోయిందని వార్త వచ్చింది. ఆ వార్తకి స్పందనగా ఏదైనా రాయమని ఎవరో అడిగారు. అందుకు ఇదీ స్పందన.
రేపటి
తె(వె)లుగు - వి. శ్రీనివాస
చక్రవర్తి
భాషాపరంగా
రాష్ట్రవిభజన
జరిగిన దేశం కనుక మన దేశంలో జనాభా లెక్కలు తీసుకున్న ప్రతీసారి వివిధ భాషాబృందాలలో సభ్యుల సంఖ్యకి సంబంధించిన గణాంకాలు వెల్లడి చెయ్యడం పరిపాటి. అలాంటి గణాంకాల ప్రకారం ఇటీవలి కాలంలో మన దేశంలో తెలుగులో మాట్లాడేవారి సంఖ్య 4 వ స్థానానికి పడిపోయింది అని సమాచారం. ఈ “సమస్య” కి తగ్గ “స్పందన” ఏమిటి అన్నది చర్చాంశం.
అసలు
మొదట పైన చెప్పుకున్న విషయం ఒక సమస్యా కాదా చూడాలి. ప్రపంచ దేశాలలో మన దేశపు జనాభా ప్రస్తుతం ఉన్న రెండవ స్థానం నుండి చైనాని ఓడించి మొదటి స్థానం దిశగా వేగంగా పరుగులు తీస్తోంది. పైన చెప్పిన తర్కం బట్టి చూస్తే ఇది చాలా గర్వించదగ్గ విషయం. కాని ఇంత స్థాయిలో జనాభా భూభారం తప్ప మరేమీ కాదని మనకి తెలుసు. జనాభా విపరీతంగా పెరిగితే కొన్ని అవాంఛనీయ పరిణామాల వల్లనే అది నియంత్రించబడుతుందని అంటుంది మాల్థస్ జనాభా సిద్ధాంతం. దేశస్థాయిలో పరిణామాలు అలా ఉంటే, దక్షిణాదిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి.
దక్షిణాది
రాష్ట్రాలన్నిట్లోను జనాభా
చక్కగా కట్టడి చెయ్యబడింది. దక్షిణ రాష్ట్రాలలో సంతాన సాఫల్య రేటు (fertility rate) బాగా
తగ్గిపోయింది (కేరళ=1.63; తమిళనాడు = 1.67; తెలంగాణ = 1.78; ఆంధ్రప్రదేశ్ = 1.8; కర్నాటక = 1.84). సంతాన సాఫల్య రేటు 2.1 (దీన్ని replacement rate అంటారు)కన్నా తక్కువగా ఉంటే అక్కడ జనాభా నియంత్రణ సరిగ్గా వుందన్నమాట.
ఈ
విషయంలో దేశ సగటు విలువ 2.18 వద్ద ఉంది. ఇక అడ్డు అదుపు లేకుండా జనాభా పెంచుతున్న రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి (ఉదా॥ బీహార్ =3.34; యూపీ =2.64). కాబట్టి జనాభా వృద్ధి దృష్ట్యా చూస్తే తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి హర్షించదగ్గనది గానే వుందని అనుకోవాలి. తెలుగు నాలుగో స్థానానికి “పడిపోవడానికి” కారణం అదే అయితే అది నిజానికి సంతోషించదగ్గ విషయమే.
అయితే
ఇక్క మరో దృక్కోణం కూడా వుంది. ఒక భాష మాట్లాడేవారి సంఖ్య తగ్గుతోంది
అంటే
అందుకు కారణం పైన చెప్పుకున్నట్టు అభివృద్ధి చెందుతున్న సమాజాలలో జనాభా తగ్గడమైనా కావాలి. లేదా ఆ భాషకి, దానికి నెలవైన సంస్కృతికి ప్రపంచంలో ప్రాభవం తగ్గిపోవడమైనా కావాలి. మొదటిది మంచి కారణమైతే, రెండవది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకి ఇంగ్లండ్ జనాభా 65 మిలియన్లు. కాని ఇంగ్లీష్ మాట్లాడేవారి సంఖ్య 1.5 బిలియన్లు. భూమి మీద ప్రతీ ఐదుగురిలో ఒకరికి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చునన్నమాట. ‘రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం’ మరి ఆ పొద్దు గుంకేలోపు లోకం అంతటా ఇంగ్లీష్ నేర్పేసింది. అంటే ఇంగ్లీష్ మాతృభాషగా గల ఆ దేశం తన సరిహద్దుల కన్నా ఎంతో దూరం వరకు కూడా తన భాషా ప్రభావాన్ని సారించగలిగింది.
ఈ
నేపథ్యంతో వ్యాసానికి ఆధారమైన చర్చాంశాన్ని మరో సారి పరిశీలించాలి. తెలుగు వారి స్థానం 4 వ స్థానానికి పడిపోయింది – ఏం చెయ్యాలి, ఎలా స్పందించాలి? కేవలం జైవిక కారణాల వల్ల ఆ తరుగదల జరిగినట్లయితే దానికి స్పందనగా వేడుక చేసుకోవాలి! కాని సాంస్కృతిక కారణాల వల్ల ఆ తరుదగల జరినట్టయితే ఆ భాషకి సంబంధించిన సంస్కరణలు చేపట్టాలి.
ఆ
సంస్కరణలలో
మొట్టమొదటి
మెట్టుగా అసలు భాష పట్ల
మన
దృక్పథాన్ని
మార్చుకోవాలని
అనిపిస్తుంది. మన దేశంలో భాషని ఒక తల్లిలా, వేలుపులా కొలుస్తాం. సెంటిమెంటల్ గా కమ్మటి కబుర్లెన్నో చెప్తాం. “భాషా సేవ” గురించి, “భాషని పోషించడం” గురించి మాట్లాడతాం. కాని భాష ఒక వాహనం. అందులో ప్రయాణిస్తూ సమాజాలు ముందుకు పురోగమిస్తాయి. భాష ఒక సాధనం. దాని వినియోగంతో సమాజాలు వాటినవి సంస్కరించుకుంటాయి.
భాష సమాజాలకి సేవ చెయ్యాలి. సమాజాలు భాషకి గుడి కట్టి, పొర్లుదండాలు పెడుతూ పూజలు చెయ్యవు.
తెలుగు
భాష పట్ల పెరుగుతున్న నిరాదరణ గురించి చాలా మంది విచారం వ్యక్తం చేస్తుంటారు.
సంస్కరణ గురించి ఎంతో మంది ఎన్నో సూచనలు చేశారు. “మమ్మీ డాడీ కాదు, అమ్మా, నానా అనాలి” అని ఏవో పైపై మెరుగులు దిద్దాలని చూస్తారు పైతరం వారు. అంతకు మించి వారికి భాష పట్ల అవగాహన ఉండదు. “చచ్చినట్టు చదవాల్సి వస్తే తప్ప, ఈ తెలుగు వల్ల మాకు ఒరిగిందేముంది?” అని మాతృభాష నుండి వేగంగా వైదొలగుతోంది నవతరం. అంతకు మించి మరి వీరికీ అవగాహన ఉండదు. ఈ రెండు తరాల మధ్య భాష అథోపతనాన్ని చవిచూస్తోంది.
ఇలా
ఎందుకు జరుగుతోంది? రాపిడెక్స్ ఇంగ్లీష్ కోర్సులతో కోరి ఇంగ్లీష్ నేర్చుకుంటారు. అలెయాన్స్ ఫ్రాన్సే కెళ్లి ఎలాగైనా ఫ్రెంచ్ నేర్చుకుంటారు. మాక్స్ ముల్లర్ భవనాలలో దూరి జర్మన్ నేర్చుకుంటారు. తెలుగు అంటే ఎందుకు ముఖం తిప్పుకుంటారు?
నేటి
ప్రపంచంలో చర్యని ముందుకు తోసే శక్తి ‘ప్రయోజనం.’ ఇంగ్లీష్ తెలిస్తే ఆధునిక పరిజ్ఞానాన్ని వంటబట్టించుకోవచ్చు.
దాంతో
ఉద్యోగావకాశాలు
ఏర్పడతాయి. ఆధునిక ప్రపంచాన్ని అదిలించే ఆద్యశక్తి విజ్ఞానం – సైన్స్. ఇంగ్లీష్ తెలిస్తే ఆ విశాల విజ్ఞాన భాండారం చేయిచాచితే అందేటంత చేరువ అవుతుంది. తెలుగు తెలుస్తే ఏమొస్తుంది?సమకాలీన ప్రపంచాన్ని సలక్షణంగా వర్ణించే పుస్తకాలు ఇంగ్లీష్ లో లక్షల్లో ఉంటాయి. తెలుగులో ఏముంటాయి?
సాంప్రదాయం
అనే గుంజెకి కట్టిన గంగిరెద్దుల్లా
మన
భారతీయభాషలు
ఒక ఇరుకైన వృత్తానికే పరిమితమై చరిస్తుంటాయి. అలా పుట్టిన సాహితీ సున్నాన్నే ఇంతకాలం మన సమాజాలు పూసుకుంటూ గడిపేశాయి. ఎటు నుండి చూసినా మన భాషలు ఇరవై ఒకటవ శతాబ్దపు అవసరాలని తీర్చే సత్తాగల భాషల్లా మాత్రం కనిపించవు. ఆ అవసరం తీరాలంటే గొప్ప దూరదృష్టితో దేశవ్యాప్తంగా ఓ బృహద్ ప్రయత్నం జరగాలి. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుండి డెబ్బై ఏళ్ల పాటు ఈ రంగంలో మన పైతరాల వాళ్లు కబుర్లు చెప్తూ ఎలాగోలా నెట్టుకొచ్చారు. కబుర్లకి కాలం చెల్లిపోయింది. నేడు పని చేస్తేనే రేపటి బతుకు అర్థవంతంగా ఉంటుంది.
పెద్ద ఎత్తున
తెలుగుని ఆధునీకరించే ప్రయత్నం చెయ్యాలి. సమకాలీన ప్రపంచం యొక్క అవసరాలకి సరిపోయేలా
తెలుగులో సాహిత్యాన్ని పెంచాలి. తెలుగులో అకల్పనిక సాహిత్యం (non-fiction) బాగా పెరగాలి. వివిధ వస్తుగత శాస్త్రాల
(objective sciences) లో సాహిత్యాన్ని పెంచడానికి ఆయా రంగాల నిపుణులు ముందుకు రావాలి.
ఇంటర్నెట్ లో సమకాలీన జ్ఞానానికి చెందిన సాహిత్యం మన భాషాల్లో (పాశ్చాత్య భాషలతో పోల్చితే)
చాలా తక్కువ. ఆ వెలితిని పూరించేలా ప్రయత్నాలు జరగాలి. తక్కువ కాలంలో పెద్ద ఎత్తున
సాహిత్యాన్ని సృష్టించడం అంత సులభం కాదు. కాబట్టి ప్రపంచ భాషల నుండి విలువైన పరిజ్ఞానాన్ని
అందించే సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించే ప్రయత్నం చెయ్యాలి. 12, 13 శతాబ్దాల కాలంలో
యూరప్ లో పెద్ద ఎత్తున జరిగిన అనువాద ఉద్యమాలే
ఆ ఖండంలో సాంస్కృతిక పునరుద్దీపనకి ఊపిరి పోశాయంటారు. భారతీయ భాషలని ఈ విధంగా
సంస్కరించుకోగలిగితే మన భాషలకి కొత్త జన్మనిచ్చినట్లు అవుతుంది. అలా సమగ్రంగా నవీకృతమైన
భారతీయ భాషలు గొప్ప సామాజిక ప్రగతికి దారితీయగలవు.
postlink