ప్రఖ్యాత పాపులర్ సైంస్ రచయిత, పులిట్జర్ బహుమతి విజేత, కార్ల్ సాగన్ రాసిన Cosmos పుస్తకం 1980 లో వెలువడినప్పుడు ఒక సైన్స్ సాహితీ రంగంలో ఒక సంచలనం సృష్టించింది.
ఈ ప్లుస్తకంలో విజ్ఞానం, ఆధునిక ఖగోళ శాస్త్రం, జీవశాస్త్రం, పరిణామ సిద్ధాంతం, గణితం, ఇలా ఎన్నో రంగాల నుండి మౌలిక భావాలని సునాయాసంగా చర్చిస్తూ పాఠకుల మేధకి విందు చేస్తాడు సాగన్.
ఈ పుస్తకం ఆధారంగా ఒక ప్రఖ్యాత టీవీ సీరియల్ కూడా 80 లలోనే వచ్చింది.
అదే అంశం మీద, అదే టైటిల్ తో ఇటీవలి కాలంలో నీల్ టైసన్ నిర్మించిన సీరియల్ కి కూడా గొప్ప సైంస్ ప్రియుల నుండి లభించింది.
సాగన్ పుస్తకానికి నేను చేసిన అనువాదం కొన్ని వారాల క్రితమే వెలువడింది. 450 పేజీల ఈ పుస్తకాన్ని ఎమెస్కో ప్రచురణ సంస్థ ప్రచురించింది.
ఆ పుస్తకం నుండి మచ్చుకి ఒక పేరా. "భూమి తరపున ఎవరు మాట్లాడతారు?" అనే అధ్యాయం నుండి -
"మానవుడు అనే సజీవమూర్తిలో విశ్వం ఆత్మస్పృహను సాధించింది. మన మూలాలని మనం శోధించాలి. తారాపదార్థంతో మలచబడ్డ ఈ మూర్తి తారలని ధ్యానిస్తోంది. పది బిలియన్ బిలియన్ బిలియన్ పరమాణువుల మహారాశిలో సంక్లిష్టంగా పరిణామం చెందిన ఓ చిన్నపాటి పరమాణురాశి. ఓ సుదీర్ఘమైన యాత్రకి అంతంలో చైతన్యం పల్లవించింది. మన విధేయత ఏ జాతికో, తెగకో కాదు. మన విధేయత మానవజాతికి, ఈ భూమికి. భూమి తరపున మనం మాట్లాడుతున్నాం. మనం కేవలం మన భవితవ్యానికి మాత్రమే బాధ్యులం కాము. మనకి జన్మనిచ్చిన ఈ పురాతన, బృహత్తర విశ్వం మన స్పందన కోసం ఎదురుచూస్తోంది."
రేపటి
చదువులు
డా॥ వి. శ్రీనివాస చక్రవర్తి,
బయోటెక్నాలజి విభాగం, ఐ. ఐ. టి. మద్రాస్, చెన్నై.
Right to Education (RTE) హక్కు పుణ్యమా అని ప్రస్తుతం మన బడులలో enrollment
గణనీయంగా పెరిగింది. కాని ASER నివేదికల ప్రకారం మన ప్రభుత్వ బడులలో అందే చదువులో నాణ్యత
కొరవడుతోందని తెలుస్తోంది. పిల్లల చేత పరీక్షలు పాసు చెయ్యించడమే అనన్య లక్ష్యంగా పని
చేసే నేటి విద్యా సంస్థలు, విద్యావిధానం పిల్లల్లో అవగాహనని, అనుభవ సంపదని పెంచాలన్న
ప్రాథమిక నియమాన్ని మర్చిపోతున్నాయి. విద్యార్థుల
జీవితాలలో విద్యావ్యవస్థల పాత్ర కేవలం ఉద్యోగ ప్రాప్తికే పరిమితం కారాదు. ఆ విద్యార్థుల ఆత్మావిష్కరణ ప్రయాసలో కూడా
అవి పాలుపంచుకుని వారికి తగిన మార్గనిర్దేశం చెయ్యాలి. అలాంటి విద్యావ్యవస్థ ఎలా ఉండాలి? ఈ ప్రశ్నకి సమాధానంగా కొన్ని ప్రాథమిక భావనల సమాహారమే ఈ వ్యాసం.
1.
చదువు
మోయలేని భారం కాకూడదు
“భారీ కళేబరాన్ని మోసుకుపోయే బుల్లి ఆత్మ మానవుడు,” అంటాడు గ్రీకు తాత్వికుడు
ఎపిక్టిటస్ మానవ స్థితి మీద వ్యాఖ్యానిస్తూ. మన దేశంలో పిల్లల చదువుల పరిస్థితి గమనిస్తే
సరిగ్గా అదే వర్ణన మనసులో స్ఫురిస్తుంది. ఆ భారం చిన్న తరగతుల నుండే మొదలవుతుంది. ఇంతేసి
బుడుతలు అంతేసి బాక్ పాక్ ల నిండా పుస్తకాలతో పడి లేస్తూ బడికి వెళ్లే దృశ్యం చూస్తుంటే
మనసు ఉస్సురంటుంది. అలా నెత్తిన పడ్డ భారం బడికి వీడ్కోలు చెప్పినంత వరకు విక్రమార్కుడి
నెత్తిన బేతాళుడిలా పిల్లలని విడిచిపెట్టదు.
ఇక ప్లస్ టు స్థాయిలో పాఠ్య పుస్తకాల భారం చూసి నాకు తెలిసిన ఒక మాంటిసోరీ స్కూలు
ప్రిన్సిపాలు “వీటి ప్రయోజనం మనో వికాసం కాదు,
బాడీ బిల్డింగ్,” అంటూ ఛలోక్తి విసిరారు. ఐ. ఎస్.సి. బోర్డులో 12 వ తరగతిలో ఫిజిక్స్,
కెమిస్ట్రీ, మాథ్స్ సబ్జెక్ట్ లకి చెందిన పుస్తకాలలో ఒక్కొక్క దాంట్లో 1300 - 1500
పేజీలు ఉంటాయి.
పన్నెండవ తరగతి పిల్లలకి నేర్పడానికి అంత సైన్స్ ఏముంటుంది? వారంతా
మహా గణితవేత్తలు, రసాయనవేత్తలు కావాలని కోరుకుంటే తప్ప ఆ ప్రయాస పూర్తిగా అర్థం లేని
ప్రయాస అనిపిస్తుంది. అతిభోజనం వల్ల అజీర్తి చేసినట్టే, ఈ “అతి చదువు” మానసిక రుగ్మతలకి
దారితీయడంలో ఆశ్చర్యం లేదు.
బడి చదువులే ఇలా దుర్భరంగా ఉంటే ఇక కోచింగ్ సెంటర్లు దీన్ని ఓ కొత్త ఎత్తుకు
తీసుకుపోతున్నాయి. ముఖ్యంగా జే. ఈ. ఈ. కోచింగ్
సెంటర్లలో పిల్లల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటుందో మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము.
రాజస్థాన్ లోని ప్రఖ్యాత కోటా కోచింగ్ సెంటర్ లో,
గత డిసెంబర్ లో కేవలం రెండు రోజుల వారడిలో రాబోయే జే. ఈ. ఈ. 2019 కోసం చదువుకుంటున్న
ముగ్గురు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారన్న
వార్త సంచలనం సృష్టించింది.
నిజమైన చదువు ఎదుగుదలకి దారితీస్తుంది. ఎదుగుదల ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి
డిప్రెషన్ కి, ఆత్మహత్యలకి అది కారణం కాలేదు. మరి మన చదువుల్లో ఏమిటి లోపం?
2.
చదువుకు,
జీవితానికి స్వేచ్ఛే పునాది
ఉత్తరాదిలో కొన్ని చిన్న ఊళ్లలో పిల్లవాడు జే.ఈ.ఈ. పరీక్షలో రాంకు తెచ్చుకుంటే
అదొక పెద్ద పండుగా జరుపుకుంటారట. బంధుమిత్రులంతా ఆ “ఉత్సవం”లో పాల్గొంటారట. పిల్లవాడు సాధించబోయే
జే.ఈ.ఈ. రాంకు కోసం ఇంట్లో వాళ్లే కాక, మిత్రవర్గం, బంధువులు, మాత్రమే కాక ఊరు ఊరంతా
వేయి కళ్లతో ఎదురుచూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ ఎదురుచూపు అక్కడితో ఆగదు. ఆ పిల్లవాడు
ఓ ఐ.ఐ.టి.లో చేరి, బీ. టెక్. పూర్తి చేసి ఓ మల్టీ నేషనల్ సంస్థలో పెద్ద ఉద్యోగం సంపాదించినంత
వరకు ఇన్ని వర్గాల వాళ్లు ఆత్రంగా కనిపెట్టుకుని ఉంటారు. కాబట్టి అన్నేళ్ల పాటు ఆ పిల్లవాడు
వేసే ప్రతి అడుగు తన కోసం కాక తల్లిదండ్రుల కోసం, తన కోసం కాక బంధువుల కోసం, తన కోసం
కాక మిత్ర వర్గం కోసం, తన కోసం కాక ఊరి ప్రజల కోసం అన్నట్టు విచిత్రంగా, దయనీయంగా సాగుతుంది.
తన జీవితం ఎప్పుడో తన నుండి చేజారిపోయిందన్న నిరాశ మనసుని దొలిచేస్తుంది. తన జీవితంలో
తనుగా కోరుకుని, కైవసం చేసుకోదగ్గ ఆనందహేతువులేవీ లేవని తెలిశాక, ఇక అలాంటి జీవితం
మీద ఆసక్తి ఏముంటుంది? అలాంటి జీవితంలో డిప్రెషెన్ కాక మరేముంటుంది? అలాంటి జీవితానికి అంతంలో ఆత్మహత్య
కాక మరేముంటుంది?
ఒక జాతి ఎదుగుదలకి స్వాతంత్ర్యం ఎంత అవసరమో, వ్యక్తికి కూడా స్వేచ్ఛ అంతే అవసరము.
తను కోరుకున్న లక్ష్యాల కోసం పని చేస్తూ, అనుదినం ఆ లక్ష్యాల దిశగా పయనిస్తూ, ఆ మార్గంలో
సాధించబడే చిన్న పెద్ద విజయాలు అందించే ఆనందాన్ని అనుభవిస్తూ, ముందుకు సాగుతున్నప్పుడు
జీవితం అర్థవంతంగా అనిపిస్తుంది. ఆనందమయం అవుతుంది. కాబట్టి జీవితంలో భాగం అయిన విద్యాజీవనంలో
కూడా ఈ నియమమే వర్తిస్తుంది. జీవితానికి మల్లె చదువుకి కూడా స్వేచ్ఛే పునాది.
చదువుకి స్వేచ్ఛ అత్యవసరమని, అదే దాని జీవనాడి అని గుర్తించిన ఎంతో మంది అభ్యుదయ
విద్యావేత్తలు, విద్యారంగంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. పిల్లలకి అసాధారణామైన స్వేచ్ఛ
నిచ్చే విద్యావ్యవస్థలని రూపొందించారు. అలాంటి ఓ మచ్చుతునకని పరిశీలిద్దాం.
కోపెన్ హాగెన్ నగరం వద్ద ‘లిల్ నై స్కోల్’ (కొత్త బుల్లి బడి) అనే ఓ అసాధారణమైన
బడి వుంది. అక్కడ చదువులో ప్రత్యేక విద్యా కార్యక్రమాలు గాని, పాఠ్య ప్రణాలికలు గాని,
ఏడాది తిరిగే లోపు చచ్చినట్టు పూర్తి చేయాల్సిన సిలబస్ గాని ఉండవు. బోధన ఉండదు, పరీక్షలు ఉండవు. పెద్దల్లాగే పిల్లలు
కూడా పూర్తి స్వేచ్ఛతో అక్కడ మసలుకోవచ్చు. వాళ్లు చదువుకోదలచినది ఏది కావలిస్తే అది,
ఎప్పుడు కావలిస్తే అప్పుడు, ఎంత మేరకి కావలిస్తే అంత, ఎవరి వద్ద కావలిస్తే వారి వద్ద
చదువుకోవచ్చు. అలాంటి బళ్లో మరి చదువెలా సాగుతుంది?
ఉదాహరణకి ఒక పాపకి ఉన్నట్టుండి ఓ రోజు ఏదైనా చదువుకోవాలని అనిపిస్తుంది అనుకుందాం.
అందుబాటులో ఉన్న ఓ పుస్తకం పట్టుకుని తన ప్రియతమ టీచర్ వద్దకి వెళ్లి “ఈ పుస్తకం చదువుకుందామా?”
అని అడుగుతుంది. టీచర్ సంతోషంగా ఒప్పుకుంటాడు. ఒళ్లో పుస్తకం పెట్టుకుని టీచర్ పక్కనే
చతికిల బడి చదవడం మొదలెడుతుంది పాప. మరీ అవసరం అయితే తప్ప ఆ చదువులో పెద్దగా టీచర్
జోక్యం చేసుకోడు. మహా అయితే మధ్యలో ఏదో మెచ్చుకోలు మాట అంటుంటాడు. అడిగితే తప్ప తప్పులు
ఎత్తి చెప్పడు. ఏదైనా పదం వద్ద బండి అగినట్టు కనిపిస్తే ఆ పదం మాత్రం చెప్పి ఊరుకుంటాడు.
ఈ తంతు ఓ ఇరవై నిముషాలు సాగుతుందేమో. ఇంతలో పాప మనసు మళ్లీ ఆటల మీదకి మళ్లుతుంది. చదువుతున్న
పుస్తకం పక్కన పడేసి ఎటో తుర్రు మంటుంది.
ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, చిన్న తరగతుల్లో అలాంటీ “చదువు” చదివిన పిల్లలు
కూడా, పై చదువులకి వెళ్లి, మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అలాంటి అభ్యుదయ విద్యాలయాలు
ఉన్న డెన్ మార్క్ లో అక్షరాస్యత మరి 99% వద్ద ఉందంటే ఆశ్చర్యం లేదు.
3.
చదవడం
ఎందుకంత కష్టం?
మన దేశంలో రాష్ట్ర స్థాయిలోను, జిల్లా స్థాయిలోను మౌలిక విద్యా కౌశలాలు ఏ స్థాయిలో
ఉన్నాయో తెలుసుకోవడం కోసం ఏటేటా ASER
(Annual Status of Education Report) అనే సర్వే జరుగుతుంది. ఆ నివేదిక ప్రకారం మన బడులలో పఠన కౌశలం ఆశించిన
స్థాయిలో లేదని తెలుస్తోంది. ఐదవ తరగతి చదువుతున్న పిల్లల్లో, కనీసం రెండవ తరగతి స్థాయిలో
నైనా చదవగలిగే పిల్లల సంఖ్య కేవలం 50.3% వద్ద
ఉంది. రెండేళ్ల క్రితం జరిగిన సర్వేలో ఆ విలువ 47.9% వద్ద ఉండేది. ఇక ఐదవ తరగతి చదివే
పిల్లల్లో, ఐదవ తరగతి స్థాయిలో చదివే వారి సంఖ్య ఇంకా ఎంత తక్కువగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
చదవడం ఎందుకంత కష్టం? చదవలేకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. కాని చదవడానికి
కారణాలలో ఓ ముఖ్యమైన కారణం వుంది. అది ఆసక్తి. ఓ పుస్తకంలో మనం తెలుసుకోదగ్గ విలువైనది
ఏదో ఉందనిపిస్తే ఆ పుస్తకం పట్ల ఆసక్తి కలుగుతుంది. ఎంత శ్రమయినా పడి ఆ పుస్తకం చదవడానికి ప్రయనిస్తాము.
ఆసక్తికరంగా లేకపోతే పుస్తకం ఎంత “సులభం”గా ఉన్నా దాని జోలికి పోము.
కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలో పిల్లల్లో పఠన కౌశలం కొరవడుతోందని వాచకాలలో
పదాల సంఖ్య తగ్గిస్తూ వచ్చారు. దాని వల్ల పెద్దగా గుణం కనిపించలేదు. ఆ పరిణామం గురించి
వ్యాఖ్యానిస్తూ అమెరికన్ విద్యావేత్త జాన్ హోల్ట్ “వాచకాలు … ఉత్సాహకరంగా, స్ఫూర్తిదాయకంగా
ఉండాలి, ఆనందాన్ని ఇవ్వాలి, చదవాలి అనిపించాలి”
అంటాడు.
పుస్తకం ఆసక్తికరంగా ఉంటే, విద్యార్థికి తన జీవితంతో సంబంధం వుందని అనిపిస్తే,
పిల్లవాడిలో అంతవరకు గాఢనిద్రలో ఉన్న “చదువరి” ఠక్కున మేలుకుంటాడు. అందుకు ఉదాహరణగా
జాన్ హోల్ట్ ఓ సన్నివేశాన్ని పేర్కొంటాడు.
అమెరికాలో చదువులో వెనుకబడ్డ పిల్లల కోసం నిర్వహించబడ్డ ఓ వేసవి క్యాంపులో
లియాన్ అనే నల్లజాతికి చెందిన ఓ కుర్రవాడు ఉన్నాడు. పరీక్షల్లో క్రమం తప్పకుండా డింకీలు
కొట్టే లియాన్ కి ఇక చదువు రాదని ఇంట్లో వాళ్లు, టీచర్లు కూడా ఆశ వదులుకున్నారు. ఆ
క్యాంప్ లో చాలా మంది పిల్లలు పేద కుటుంబాల నుండి, వెనుకబడ్డ తరగతుల నుండి వచ్చినవాళ్లు.
చదువులో వాళ్లు ఎదుర్కునే సమస్యల గురించి మాట్లాడమన్నారు టీచరు. రోజంతా మౌనంగా ఉండిపోయిన
లియాన్ ఆ సాయంత్రం మాత్రం లేచి నించుని “ఈ పుస్తకం గురించి నాకు ఇంతవరకు ఎవరూ ఎందుకు
చెప్పలేదు,” అని అరిచాడు. అతడి చేతిలో ఓ పుస్తకం వుంది. అది నల్లజాతి వారి హక్కుల కోసం,
విమోచనం కోసం పోరాడిన డా॥ మార్టిన్ లూథర్ కింగ్ రాసిన “Why we cant wait” అన్న పుస్తకం.
అసలు చదువే రాదని స్కూలు చేత ముద్ర వేయబడ్డ లియాన్ విశ్వప్రయత్నం చేసి నెల రోజుల్లో
ఆ పుస్తకం పూర్తి చేశాడు.
ఈ సన్నివేశం గురించి చర్చిస్తూ జాన్ హోల్ట్ ఇలా అంటాడు. “దీన్ని బట్టి మనకు
రెండు విషయాలు అర్థమవుతున్నాయి. 1) పిల్లలు తమకి అర్థవంతంగా తోచే పుస్తకాలు చదవడానికి
ఇష్టపడతారు, అపేక్షిస్తారు, ఎదురుచూస్తారు. 2) అటువంటి పుస్తకాలని వాళ్ల అందుబాటులో
పెడితే, పెద్దల నుండి అవసరమైనంత మేరకు కనీస సహాయాన్ని మాత్రమే తీసుకుంటూ వాళ్లంతకు
వాళ్లే పుస్తకాలు చదవడం నేర్చుకుంటారు.”
4.
అర్థవంతమైన
పుస్తకాలు
పిల్లలకి అర్థవంతమైన పుస్తకాలు అందించాలంటే ఏవి అర్థవంతమైనవి అన్న ప్రశ్న వస్తుంది.
అన్ని పుస్తకాలు అందరికీ అర్థవంతంగా, ఆసక్తి కరంగా అనిపించవు. పిల్లలకి వారి జీవనానుభవాల
బట్టి, స్వభావాన్ని బట్టి కొన్ని కొన్ని రకాల పుస్తకాలు నచ్చుతాయి.
ఇంగ్లీష్ సాహిత్యంలో గొప్ప వైవిధ్యం గల అంశాల మీద విస్తారమైన బాల సాహిత్యం ఉంటుంది.
కాని తెలుగులో బాలసాహిత్యం విస్తారంగానే వున్నా అది కేవలం కొన్ని అంశాలకి మాత్రమే పరిమితమై
ఉంటుంది. పంచతంత్రం, జాతక కథలు, నజీరుద్దీన్, బీర్బల్, తెనాలి రామలింగడు మొదలైన వాళ్ళ కథలు. ఇవి కాకపోతే
మన ‘ఎవర్
గ్రీన్’ రామాయణ, భారత, పురాణ గాధలు. తరతరాలుగా ఆ
సమాచారమే బాలల సాహిత్యం పేరిట ‘రీసైకిల్’ అవుతున్నట్టు
అనిపిస్తోంది. మొత్తం మీద తెలుగులో బాలసాహిత్యాన్ని
ప్రధానంగా రెండు వర్గాలలో ఇమడ్చవచ్చు – నీతి సాహిత్యం, సాంప్రదాయక సాహిత్యం.
అందుకు భిన్నంగా ఇంగ్లీష్ లో బాలసాహిత్యంలో వర్గాలు ఇలా ఉంటాయి. – 1)
ఊహా సాహిత్యం (fantasy
సాహిత్యం), 2) అన్వేషకుల గాథలు,
3) సైన్స్
సాహిత్యం,
3) సైన్స్
ఫిక్షన్ సాహిత్యం,
4) భయానక సాహిత్యం, 5)
అపరాధ
పరిశోధన, 6)
సాహసగాధలు, 7) వృత్తులు, క్రీడలకి
సంబంధించిన సాహిత్యం, 8) చారిత్రక సాహిత్యం, 9) కల్పిత చారిత్రక
సాహిత్యం.
నేటి ప్రపంచంలో సైన్స్ పాత్ర అత్యంత
ప్రధానమైనది. నేటి ప్రపంచం పని తీరు అర్థం కావాలంటే అంతో ఇంతో శాస్త్రీయ దృక్పథం ఉండాలి. తెలుగులో పాఠ్యపుస్తకాలు తప్ప సరదాగా చదువుకోడానికి జన విజ్ఞాన
సాహిత్యం (popular science) కొంచెం తక్కువే.
అలాంటి పుస్తకాలు ఉంటే గురువుల, బడుల ఆసరా లేకుండానే పిల్లల్ వాళ్లంతకు వాళ్లు ఆ పుస్తకాలు
చదువుకుని విషయం తెలుసుకుంటారు, స్ఫూర్తి పొందుతారు. అలాగే తెలుగులో సైన్స్ ఫిక్షన్
సాహిత్యం కూడా తక్కువే. ఇక ప్రత్యేకించి పిల్లల
కోసం రాయబడ్డ సైఫై సాహిత్యం మరీ తక్కువ. కాని అలాంటి సాహిత్యం ఉంటే పిల్లలకి స్ఫూర్తి
దాయకంగా ఉంటుంది. పిల్లలు సహజంగా సైన్స్ చదువుల పట్ల ఆకర్షితులు అవుతారు.
మరి అలాంటి విస్తారమైన, వైవిధ్యంతో
కూడిన సాహిత్యాన్ని సృష్టించాలంటే అది ప్రభుత్వం వల్ల కాదు. సామాజిక స్పృహ గల రచయితలు,
ప్రచురణ కర్తలు నడుము కట్టి అలాంటి సాహిత్యాన్ని సృష్టించాలి.
5.
అందుబాటులో
పుస్తకాలు
ఆ విధంగా గొప్ప వైవిధ్యంతో కూడుకున్న సాహిత్యాన్ని సృష్టిస్తే సరిపోదు. అది
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే దిగువ మధ్య తరగతి పిల్లకి అందేలా ఏర్పాటు చెయ్యాలి.
అందుకు పాఠశాలలకి చెందిన గ్రంథాలయాలని బలోపేతం చెయ్యాలి.
పాఠశాలలో సామాన్యంగా టీచర్లకి ఏడాది తిరిగేలోపు ‘సిలబస్’ పూర్తి చెయ్యాలనే ఒత్తిడి
ఉంటుంది. కాబట్టి గ్రంథాలయంలో దొరికే పుస్తకాలని
చదివించడం పిల్లల మీద అనవసరమైన భారంగా వాళ్లు తలంచవచ్చు. కొన్ని బళ్లలో గ్రంథాలయాలు
ఉండకపోవు. ‘లిబ్రరీ పిరియడ్’ లో పిల్లలని గ్రంథాలయంలో చదువుకోనిచ్చే ఆచారం కూడా ఎన్నో
బళ్లలో ఉంటుంది. అయితే పిల్లలకి కోరుకున్న పుస్తకం చేతికి అందేలాంటి ఏర్పాటు ఉంటే బావుంటుంది
అనిపిస్తుంది. సామాన్యంగా ప్రభుత్వం ఇచ్చే వనరుల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. అందుకు
మరో తరుణోపాయం వుంది. అందుకు పుస్తకాల దాతలని ఆశ్రయించాలి.
చాలా మందికి విద్యారంగంలోను, చదువుకునే పిల్లల కోసం ఏదైనా
చెయ్యాలని ఉంటుంది. విద్యాదానాన్ని మించిన దానం లేదు. స్తోమతకి తగ్గట్టుగా చిన్న మొత్తాలు ఇవ్వగలిగే
వారికి కూడా పుస్తక దానం సాధ్యమవుతుంది. ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే ప్రతీ విద్యార్థికి
అందుబాటులో గొప్ప పుస్తకభాండారం ఉండేలా ఒక కంపెనీని ఊహించుకోవచ్చు. ఆ కంపెనీ ద్వార
పుస్తక దాతలు ప్రభుత్వ పాఠశాలలకి పుస్తకాలు దానం చేస్తారు. ఆ కంపెనీ ఇంటర్నెట్ కంపనీ
అయ్యుండాలి. అప్పుడు దాతలు దేశవిదేశాలకి చెందిన వారైనా సరే, ఆ కంపెనీ ద్వార పుస్తక
దానం చెయ్యగలుగుతారు. ఆ కంపెనీ పని తీరును ఇలా ఊహించుకోవచ్చు. ఫలానా బళ్లో, ఫలానా పాపకి
ఫలానా పుస్తకం చదవాలని ఉంటుంది. ముందుగా ఆ పాప చదువుకునే బడి ఆ కంపెనీ వెబ్ సైట్ లో
రిజిస్టర్ చేసుకోవాలి. పాప అడిగిన పుస్తకం వివరాలు అప్పుడు ఆ స్కూలు అధికారులు ఆ కంపెనీ
వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. ఆ వివరాలు ప్రపంచం అంతటా ఎవరైనా చూడొచ్చు. ఎక్కడో
విదేశాల్లో ఎవరికో సరిగ్గా ఆ బడి కోసమే ఏదైనా చెయ్యాలని ఉంటుంది. (వాళ్ళు ఆ బడి ఉన్న
ప్రాంతానికి చెందిన వారు కావచ్చు, లేదా ఆ బళ్ళోనే ఎప్పుడో చదువుకున్న వారు కావచ్చు).
వాళ్లు ఆ పుస్తకాన్ని ఏ అమేజాన్ లోనో, ఫ్లిప్ కార్ట్ లో ఈ కంపెనీ ద్వార కొని ఫలానా
బడికి పంపుతారు.
అయితే ఈ వ్యవహారం అక్కడితో ఆగిపోదు. పుస్తకాన్ని అందుకున్న
పాప, ఆ పుస్తకం నచ్చితే దాని గురించి ఓ సమీక్ష రాసి, ఆ వివరాలన్నీ అదే వెబ్ సైట్ లో
అప్ లోడ్ చేస్తుంది. ఆ సమీక్ష చదివిన ఇతర బడులకి చెందిన పిల్లలకి ఆ పుస్తకం మీద ఆసక్తి
పుడుతుంది. వాళ్లు కూడా అదే పుస్తకం కావాలని కోరుకుంటారు. అందుకు మరెవరో దాతలు స్పందిస్తారు.
ఆ విధంగా కంపెనీ ద్వార పుస్తకాల పట్ల ఆకాంక్ష ఉన్న పిల్లలు,
బడి పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని అపేక్షించే దాతలు, ఇంటెర్నెట్ మీదుగా కలుసుకుంటారు.
ఇందులో ప్రభుత్వం మీద భారం లేదు కనుక, ప్రభుత్వ పాఠశాలలు ఈ విధంగా లాభపడడానికి రాష్ట్ర
ప్రభుత్వాలు కూడా అడ్డుపడవు.
ఈ దిశలో మరో అడుగు ముందుకు వెళ్లొచ్చు. పుస్తకాలు చదివిన
పిల్లలని కేవలం సమీక్షలతో ఆగిపోకుండా వాటి మీద ప్రసంగాలు ఇవ్వమని అడగొచ్చు. బాగా ప్రసంగాలు
ఇచ్చే విద్యార్థులు టీవీ లో మాట్లాడే అవకాశాన్నిచ్చే ప్రోగ్రాం లు ఏర్పాటు చెయ్యాలు.
ఆ విధంగా పుస్తకాలు చదివి, వాటి గురించి నలుగురితోను పంచుకోవడం విద్యార్థి ప్రపంచంలో
ఓ ముఖ్యమైన కళగా పరిణమిస్తుంది. పుస్తకం చదివి, దాని నుండి జీవితానికి అవసరమయ్యే పాఠాలు
నేర్చుకునే పిల్లవాడికి గాని, పాపకి గాని జీవితకాలం అక్కరకొచ్చే ఓ గొప్ప పెన్నిధి చేతికి
అందినట్టే.
6.
చేసి,
చూసి, నేర్చుకో
నేర్చుకోడానికి పుస్తకాలు అవసరం అన్నది నిజమే కాని, నేర్చుకోదగినది అంతా పుస్తకాల
నుండే నేర్చుకోగలం అనుకుంటే పొరబాటే. పుస్తకాలకే అతుక్కుపోయే పిల్లలు పుస్తకాల పురుగుల్లా
మిగిలి జీవితానికి పనికిరాకుండా పోయే ప్రమాదం వుంది. కాబట్టి పుస్తక పరిజ్ఞానానికి,
అనుభవం జత కావాలి. గురువు వద్ద విన్నది, పుస్తకంలో చదివినది పిల్లలు మరచిపోవచ్చు. కాని
సొంతంగా శోధించి, ఆవిష్కరించి, స్వానుభవంలో తెలుసుకున్నది ఎన్నటికీ మరచిపోరు. అలా నేర్చుకున్నది
మన రక్తంలో ప్రవహిస్తుంది, మన నరాలలో విలీనమవుతుంది.
ముఖ్యంగా సైన్స్ బోధనలో ఇలాంటి అనుభవైక జ్ఞానం ఎంత అవసరమో మనకి తెలుసు.
సైన్స్
విషయాలలో పుస్తక పరిజ్ఞానం తప్ప స్వానుభవం లేనప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి ఓ హాస్య
సన్నివేశం. ఒక తండ్రి తన కూతురికి చీకటి ఆకాశంలో
గ్రహాలని చూపిస్తూ, “అదుగో చూడమ్మా! ఆ బాగా మెరిసే చుక్క వీనస్ గ్రహం. ఆ ఎర్రగా వెలుగుతోందే
అది మార్స్” అంటాడు. అప్పుడా పాప అడిగిందట, “మరి వీనస్ కి, మార్స్ కి మధ్య ఉండాలే,
ఆ భూమి ఎక్కడుంది నాన్నా?”
సైన్స్ సత్యాలని అనుభవం ద్వార నేర్చుకోడానికి మనకి ‘ప్రాక్టికల్స్’ అని ఏర్పాటు
చేశారు. కాని సైన్స్ ప్రాక్టికల్స్ లో ఎన్నో ప్రయోగాలని పిల్లలు ఎందుకు చేస్తున్నారో
తెలియకుండా, అలా ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోకుండా గుడ్డిగా చేయడం కనిపిస్తుంది.
అలాంటి ‘ప్రాక్టికల్స్’ వట్టి పుస్తక జ్ఞానం కన్నా ప్రమాదం.
పూనే కి చెందిన అరవింద్ గుప్తా అనే విద్యావేత్త సైన్స్ ప్రయోగాలని సరదాగా ఒక
ఆటలా ఎలా చేయొచ్చో చూపించాడు. సైన్స్ ప్రయోగాలంటే వ్యయంతో కూడిన వ్యవహారం కనుక చాలా
మందికి వాటి జోలికి పోవడానికి జంకుతారు. ఆ భయం లేకుండా అరవింద్ గుప్తా కేవలం పనికి
మాలిన వ్యర్థ పదార్థాలతో అద్భుతమైన, ఆసక్తికరమైన సైన్స్ ప్రయోగాలు ఎలా చేయొచ్చో చూపించాడు.
పారేసిన సీడీలు, పాత సైకిల్ టైర్ లు, వాల్వ్ ట్యూబులు, అగ్గి పుల్లలు, ఐస్ క్రీమ్ పుల్లలు… “కాదేదీ కవితకనర్హం” అన్నట్టు సైన్స్ నేర్చుకోడానికి
పనికిరాని వస్తువే లేదని ప్రదర్శించాడు. విద్యా రంగంలో, ఆధునిక యుగంలో, అనుభవైకంగా
నేర్చుకోడానికి ఇలాంటి వినూత్న, సృజనాత్మక విధానాలు కోకొల్లలు. అలాంటి విధానాలని పాఠశాలలు
వాటి స్థితిగతులకి అనుసారం, తమ నేపథ్యానికి తగినట్టుగా మలచుకుని వాడుకోవచ్చు. అలాంటి
విధానాల వినియోగం వల్ల బడిలో జరిగే వ్యవహారం పిల్లలకి మరింత ఆనందదాయకంగా, సఫలదాయకంగా
అనిపిస్తుంది.
7.
పిల్లలు
నేతలుగా ఎదగాలి
ఒక్క నరేంధ్ర మోదీ ఇంత తక్కువ కాలంలో మన దేశ ప్రజలని ఎంతగా ప్రభావితం చేసిందీ,
ఎంతగా స్ఫూర్తి నిచ్చి, ఆత్మవిశ్వాసాన్ని పెంచి, జాతి వేగంగా పురోగమించేలా చేసిందీ
మనం రోజూ చూస్తున్నాం. నేతల ప్రభావం మరి అలాంటిది! గొప్ప నేతలు తమ ప్రధానులుగాను, రాష్ట్రపతులుగాను
రావాలని దేశాలు ఎదురుచూస్తుంటాయి. గొప్ప నేతలు తమ సీ.ఈ.ఓ. లు గా రావాలని కంపెనీలు వెతుకుతుంటాయి.
గొప్ప నేతలు తమకి కోచ్ లు గా వచ్చి తమ టీమ్ లని గెలిపించాల్ని క్రీడా బృందాలు తపిస్తుంటాయి.
నేత అంటే ఎవరు? ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉంటారు. భారాన్ని మోపే వాళ్లు,
భారాన్ని మోసే వాళ్లు. చాలా మంది వ్యక్తులు తమ సమస్యలన్నిటికీ కారణం అవతలి వాళ్లే నన్న
భ్రమలో ఉంటూ, ఆ సమస్యలకి పరిష్కారం కోసం పరిశ్రమించకపోగా, ఎవరో వచ్చి తమ కష్టాలన్నీ
తీరుస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటారు. వీళ్లు మొదటి తరగతి వాళ్ళు. మరి కొందరు తమ సమస్యల
భారం అవతలి వారి మీద మోపక, తామే నడుము కట్టి సృజనాత్మకంగా కృషి చేస్తూ పురోగమించడమే
కాకుండా, తమతో పాటు మరో నలుగురుని ముందుకి తీసుకుపోతుంటారు. వీళ్లు రెండవ తరగతి వాళ్లు.
నేతలంటే వీళ్లే.
గణితాన్నో, క్రికెట్ నో తర్ఫీదు ఇచ్చి నేర్పించినట్టు, నేతృత్వ
లక్షణాలని కూడా తగ్గ శిక్షణ చేత యువతలో అలవడేట్టు చేయొచ్చు. విదేశాల్లో ఎన్నో బళ్లలో
పిల్లల్లో నేతృత్వ లక్షణాలు పెంచేలా స్ఫూర్తిదాయక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
పేదప్రాంతాలకి చెందిన బళ్లలో ఎంతో మంది వెనుకబడ్డ తరగతులకి చెందిన పిల్లలు ఉంటారు.
ఎన్నో సందర్భాలలో వారిలో ఆత్మవిశ్వాసం కొరవడడం కనిపిస్తుంది. జీవితం విసిరే సవాళ్లని
ఎదుర్కునే ధైర్యం, దీక్ష వాళ్లలో తక్కువగా ఉంటాయి. తగిన నేతృత్వ కార్యక్రమాల సహాయంతో
అలాంటి వారి జీవితాలని ప్రభావితం చెయ్యడం సాధ్యం. అలాంటి పిల్లలలో ధైర్యం నూరి పోసి,
వారి శక్తి యుక్తులు ఏ రంగంలో ఉన్నాయో గుర్తించి, వాటి పట్ల ఆ పిల్లల్లో అవగాహన కలుగజేసి,
ఆ దిశలో ముందుకు సాగిపొమ్మని నిశానిర్దేశం చెయ్యగల నేతృత్వ కార్యక్రమాలు బళ్లలో నిర్వహించడం
ఎంతో అవసరం.
ఉపసంహారం
పుస్తకాలు, పరీక్షల చుట్టూ గానుగెద్దుల్లా విద్యార్థులని తిప్పే మన ప్రస్తుత
విద్యావ్యవస్థ ఎలా మారుతుంది? ఈ ప్రశ్నకి సమాధానంగా కొన్ని భావాలని ఈ వ్యాసంలో చర్చించడం
జరిగింది. ఆ మార్పు దశాలవారీగా ఇలా జరగాలి.
విద్యార్థి యొక్క అవగాహన కేవలం పాఠ్యపుస్తకాలకి మాత్రమే పరిమితం కాకూడదు. అలా జరగాలంటే
భారతీయ భాషలలో విస్తారమైన, విద్యాసంబంధమైన సాహితీ సముద్రాన్ని సృష్టించాలి. అలా ఏర్పడ్డ
పుస్తక సంపద ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి అందేలా కొంత వ్యవస్థీకరణ చెయ్యాలి.
విద్యార్థులు నేర్చుకునేది కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాకూడదు. అది అనుభవైక జ్ఞానం
కావాలి. అందుకు అవసరమైన కొన్ని వ్యవస్థాగత సంస్కరణలని కూడా చర్చించడం జరిగింది. ఇక
చివరిగా కాస్తంత జ్ఞానాన్ని తలకి ఎక్కించడంతో విద్యావ్యవస్థ భాద్యత తీరిపోదు. విద్యార్థిని
సంపూర్ణ వ్యక్తిగా, ఒక నేతగా తీర్చిదిద్దాలి. అలాంటి నేతృత్వ లక్షణాలు అలవరచుకున్న
చదువుకున్న వ్యక్తులు సమాజంలోకి ప్రవేశించి తన భారాన్ని తాము సమర్థవంతంగా మోయడమే కాకుండా,
తమతో బాటు నలుగురిని ముందుకు తీసుకుపోగల మార్గదర్శకులు అవుతారు. వారి హితవైన ప్రభావం
వల్ల దేశం పురోగమిస్తుంది.
సమాప్తం
postlink