నిజానికి ఆ అంచనా సరైనదే. కట్టెలు, కళ్లు, పాదాలు, పదునైన బుద్ధి – తన ప్రయోగంలో ఎరటోస్తినిస్ వాడిన పరికరాలు ఇవే. ఆ
కాస్త సరంజామాతో అతడు భూమి చుట్టుకొలతని ఒక శాతం కన్నా తక్కువ దోషంతో కనిపెట్టగలిగాడు. 2,200 ఏళ్ల క్రితం అలాంటి ఫలితాన్ని సాధించగలగడం నిజంగా గొప్ప విషయం. మన గ్రహం
యొక్క వ్యాసాన్ని కచ్చితంగా కొలిచిన వారిలో అతడు ప్రథముడు.
మధ్యధరా ప్రాంతం ఆ రోజుల్లో సాహసోపేతమైన
సముద్ర యాత్రలకి నెలవు. ఆ రోజుల్లో
అలెగ్జాండ్రియా ప్రపంచ ప్రఖ్యాతి గల ఓడరేవు. పుడమి గోళం
అని తెలిశాక, మరీ అంత
పెద్దదేం కాదని అర్థమయ్యాక, సాహసుల మనసుల్లో కొత్త ఊహలు పుట్టకమానవు. విశాల సముద్రాలని జయించాలని, కనీ వినీ
ఎరుగని ప్రదేశాలని దర్శించాలని, సుదూర రహస్య నిధులని కొల్లగొట్టాలని, ధీమాగా లోకం చుట్టి రావాలని కలలు కనక మానరు. ఎరటోస్తినిస్ కి
నాలుగు వందల సంవత్సరాలకి ముందు ఏజిప్షియన్ ఫారో అయిన నీచో నియామకం మీద ఒక ఫోనీషియన్ నౌకాదళం ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చింది. వాళ్లు బహుశ
చిన్నపాటి పడవల్లో ఎర్రసముద్రం నుండి బయల్దేరి ఉంటారు. ఆఫ్రికా తూర్పు
తీరం వెంట దక్షిణంగా పయనించి, దక్షిణ కొమ్ము
వద్ద చుట్టు చుట్టి, అట్లాంటిక్ మహాసముద్రం లోకి ప్రవేశించి, ఆ సముద్రం ద్వార
తిరిగి మధ్యధరా సముద్రాన్ని చేరుకుని ఉంటారు. ఆ చారిత్రక
యాత్ర పూర్తి చెయ్యడానికి మూడేళ్లు పట్టింది. ఆధునిక యుగంలో భూమి నుండి సాటర్న్ కి వాయేజర్ వ్యోమనౌకకి పట్టేటంత సమయం అన్నమాట.
ఎరటోస్తినిస్ ఆవిష్కరణ తరువాత ఎంతో మంది సాహసులైన నావికులు గొప్ప గొప్ప యాత్రలు తలపెట్టారు. వారి నౌకలు చిన్నవి. వారి పరికరాలు
అంత అధునాతనమైనవి కావు. వేగాన్ని కూడుకుంటూ
దూరాన్ని కొలుచుకునేవారు. వీలైనంత వరకు తీరాన్ని అంటిపెట్టుకుని ప్రయాణం చేసేవారు. అపరిచిత సాగరాలలో
దిక్చక్రం మీదుగా తారా స్థానాల బట్టి అక్షాంశరేఖని (latitude) తెలుసుకోగలిగేవారు
కాని, రేఖాంశరేఖ (longitude) ని తెలుసుకోవడం వారికి సాధ్యపడలేదు. అజ్ఞాత సంద్రాల మీద ప్రయాణించేటప్పుడు చీకటి ఆకాశంలో తెలిసిన తారారాశులు కనిపిస్తే
మనసు తేలికపడేదేమో. అన్వేషకులకి తారలు చిరకాల స్నేహితులు. ఆ రోజుల్లో సముద్ర
యాత్రల్లో అవి పనికొచ్చేవి. నేడు అంతరిక్ష యాత్రల్లోనూ వాటి సహాయం అనివార్యం. ఎరటోస్తినిస్ తరువాత
ఎంతో మంది ప్రయత్నించి ఉండొచ్చు. కాని మాజెలాన్
(Magellan) కి ముందు మరెవ్వరూ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసి సఫలీకృతం కాలేకపోయారు. ఆ విధంగా ఆ
అలెగ్జాండ్రియా శాస్త్రవేత్త వేసిన లెక్కలని నమ్ముకుని, ప్రాణాలు పణంగా
పెట్టి, విశాల సముద్రాల
మీద ధ్వజం ఎత్తిన నావికోత్తముల వీర గాధలు కోకొల్లలు.
ఎరటోస్తినిస్ కాలంలో కూడా భూమి యొక్క గోళాకార నమూనాలు చలామణిలో ఉండేవి. అంతరిక్షం నుండి
చూస్తే భూమి ఎలా కనిపిస్తుందో ఆ నమూనాలు సూచించేవి. అయితే అప్పటికి యూరప్ లో బాగా సుపరిచితమైన మధ్యధరా ప్రాంతానికి చెందిన వివరాలు ఆ నమూనాలలో కచ్చితంగానే
వున్నా, అక్కడి నుండి
దూరం అవుతున్న కొద్ది దోషాలు హెచ్చవుతూ ఉంటాయి. విశ్వం గురించిన
మన ప్రస్తుత పరిజ్ఞానంలో కూడా ఈ రకమైన ధోరణి
కనిపిస్తుంది. ఈ విషయం గురించి
ఒకటవ శతాబ్దంలో, అలెగ్జాండ్రియాకి చెందిన భౌగోళికుడు
స్ట్రాబో (Strabo) ఇలా రాస్తున్నాడు –
“భూమి చుట్టూ ప్రదక్షిణ చెయ్యబోయి వెనక్కు తిరిగి వచ్చిన వారు తమ ప్రయత్నానికి మరేదో ఖండం అడ్డుపడిందని అనరు. ఎందుకంటే ఎల్లలు
లేని వారిధి వారిని రమ్మనే అంటోంది. కాని వారి
వైఫల్యానికి కారణం సంకల్పంలోను, సరంజామాలోను ఉన్న లోపమే… అట్లాంటిక్ మహాసముద్రం
యొక్క విస్తృతి ఒక అవరోధం కాకపోతే, ఐబీరియా నుండి
ఇండియాకి ప్రయాణించొచ్చు అంటాడు ఎరటోస్తినిస్… సమశీతోష్ణ (temperate) ప్రాంతంలో ఒకటో రెండో నివాసయోగ్యమైన భూములు ఉండే ఆస్కారం వుంది…నిజానికి ఆ [మరో భూమి ప్రాంతం] మానవ ఆవాసాలే
ఉంటే, వాళ్లు మన
ప్రాంతానికి చెందిన మనుషుల్లా ఉండకపోవచ్చు. దాన్ని అన్య మానవావాసిత ప్రాంతంగా పరిగణించవలసి రావచ్చు.”
అప్పుడే మానవులు
ఇతర ప్రపంచాల మీదకి తమ దృష్టి సారించడం మొదలెట్టారు.
(ఇంకా
వుంది)
0 comments