భూమి
అన్వేషణ ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఆ అన్వేషణలు
చైనా, పాలినేషియాల వరకు
కూడా విస్తరించాయి. అంతే కాక ఆయా ప్రాంతాల వారు కూడా ప్రపంచంలో ఇతర ప్రాంతాలకి ప్రయాణించారు. ఆ ప్రయత్నంలో ముక్తాయింపుగా
క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాని కనుగొన్నాడు. ఆ తరువాత కొన్ని
శతాబ్దాల పాటు జరిగిన యాత్రలలో భూమి యొక్క భౌగోళిక అన్వేషణ పూర్తయ్యింది. కొలంబస్ యొక్క మొట్టమొదటి సముద్ర యాత్ర ఎరటోస్తినిస్ చేసిన లెక్కలతో సరిగ్గా అనుసంధానమై వుంది. కొలంబస్ కి
మొదటి నుంచి “ఇండీస్ ప్రయత్నం” అంటే ఎంతో మక్కువ ఉండేది. ఓ వినూత్న
మార్గంలో జపాన్, చైనా,
ఇండియాలని చేరుకోవాలని అతడి పథకం. అతడు ఊహించిన
మార్గం ఆఫ్రికా తీరం వెంట దక్షిణంగా ముందుకి సాగి దక్షిణ కొమ్ము వద్ద తూర్పు దిశకి తిరిగి ప్రయాణించడం కాదు. అజ్ఞాత పశ్చిమ
మహాసముద్రానికి ఎదురొడ్డి ప్రయాణించాలని అతడి ఆలోచన. ఎరటొస్తినిస్ మాటల్లో
చెప్పుకోవాలంటే “ఐబీరియా నుండి ఇండియాకి సముద్ర మార్గం మీద చేరుకోవాలని” అతడి ఆలోచన.
పాత మ్యాపులు ఎక్కడ దొరికినా కొని సేకరించేవాడు కొలంబస్. ఎరటోస్తినిస్, స్ట్రాబో, టోలెమీ
మొదలైన ప్రాచీన భౌగోళికులు రాసిన పుస్తకాలు ఆవురావురని చదివేవాడు. కాని ఇండీస్
ప్రయత్నం సఫలం కావాలంటే, ఆ సుదీర్ఘ
యాత్రకి నౌకలు, నావికులు తట్టుకోగలగాలంటే, ఎరటోస్తినిస్ ఊహించిన దాని కన్నా భూమి చిన్నది కావాలి. కాబట్టి కొలంబస్
తప్పుడు లెక్కలు పుట్టించాడు. అతడి
ప్రతిపాదనలని పరీక్షించిన సాలమాంకా విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు ఆ దోషాలని సులభంగా
పట్టుకోగలిగారు. భూమి చుట్టుకొలతకి సంబంధించిన అంచనాల లోకెల్లా అతి చిన్న అంచనాని తన లెక్కల్లో స్వీకరించాడు. తనకి అందుబాటులో ఉన్న పుస్తకాల ప్రకారం, తూర్పు దిశలో
ఆసియా విస్తృతికి చెందిన అంచనాలలోకెల్లా అతి పెద్ద అంచనాని స్వీకరించాడు. అక్కడితో చాలక ఆ అంచనాలని కూడా
తన అవసరానికి తగ్గట్టుగా సర్దుబాటు చేశాడు. తన మార్గ
మధ్యంలో అమెరికా ఖండాలే లేకపోయుంటే, అతడి యాత్ర ఘోరంగా విఫలం అయ్యుండేది.
భూమి ఇప్పుడు క్షుణ్ణంగా అన్వేషించబడింది. ఇంకా తెలుసుకోవలసిన కొత్త ఖండాలు గాని, నవ్య భూములు
గాని లేవు.
కాని
భూమి మీద మారుమూల ప్రాంతాలని, సుదూర ప్రాంతాలని కూడా కనుగొని, వాటిని నివాస
యోగ్యంగా మార్చగలిగే సాంకేతిక నైపుణ్యమే ఇప్పుడు అంతరిక్షంలోకి ప్రవేశించి, ఇతర ప్రపంచాలని అన్వేషించే ప్రయత్నంలో దొహదం చేస్తోంది. భూమిని వదిలి, నింగిగెగసి ఇప్పుడు పై నుండి భూమిని చూడగలుగుతున్నాము. ఎరటోస్తినిస్ ఊహించినట్టుగానే, అంతే పరిమాణం గల దాని గోళాకృతిని చూడగల్గుతున్నాము. ఖండాల రూపురేఖలని స్పష్టంగా చూస్తూ, మన ప్రాచీన
మ్యాపుల నిర్మాతల ప్రతిభని అర్థం చేసుకోగలుగుతున్నాము. ఇలాంటి పృథ్వీ దర్శనం ఎరటోస్తినిస్ కి, తదితర
అలెగ్జాండ్రియా నగర భౌగోళికులకి లభ్యమై ఉన్నట్లయితే వారికి ఎలాంటి పరమానందం కలిగేదో కదా?
అలెగ్జాండ్రియా నగరంలో రమారమి క్రీ.పూ.
300 లో ఓ అద్భుతమైన మనోజన్య
విప్లవం ఒకటి మొదలయ్యింది. ఓ ఆరొందల ఏళ్ల
పాటు ఆ విప్లవం నిరాఘాటంగా
వర్ధిల్లి మానవ జాతిని అంతరిక్షపు తీరాల సమీపానికి తీసుకుపోయింది. కాని ఆ చారిత్రక నగరపు
అవశేషాలు ప్రస్తుతం మనకి పెద్దగా మిగలలేదు. రాజకీయమైన అణచివేత, కొత్త విషయాలని నేర్చుకోవాలంటే భయం – ఈ రెండు
కారణాలు ప్రాచీన అలెగ్జాండ్రియాకి చెందిన జ్ఞాపకాలని చెరిపేశాయి. ఆ నగర వాసులలో
అద్భుతమైన సాంస్కృతిక వైవిధ్యం ఉండేది. మాసెడోనియాకి చెందిన
సిపాయిలు, ఆ తరువాత
వచ్చిన రోమన్ సిపాయిలు, ఈజిప్షియన్ అర్చకులు, గ్రీస్ కి చెందిన రాచకుటుంబాలు, ఫోనిషియాకి చెందిన నావికులు, యూదు వర్తకులు, ఇండియా నుండి, ఉపసహారా ఆఫ్రికా
నుండి వచ్చే సందర్శకులు – (విస్తారమైన బానిస వర్గాన్ని మినహాయిస్తే) అందరూ పరస్పర భావాలని మన్నించుకుంటూ, సామరస్యంగా ఆ నగరంలో నివసించేవారు. అలెగ్జాండ్రియా
అనుభవించిన సుదీర్ఘ వైభవానికి అలాంటి సమరస జీవనమే కారణం అయ్యింది.
అలెగ్జాండ్రియా నగరాన్ని అలెగ్జాండర్ చక్రవర్తి సంస్థాపించాడు. అతడి అంగరక్షకులలో ఒకడు దాన్ని నిర్మించాడు. అన్య సంస్కృతుల మన్నన, విప్పారిన మనసుతో
నూతన జ్ఞానాన్వేషణ – ఈ రెండూ అలెగ్జాండర్
ప్రోత్సహించేవాడు. ఎర్ర సముద్రపు జలాలలో ‘ముంపు గంట’
(diving bell) సహాయంతో మునిగిన సాహసం చేశాడని సాంప్రదాయం చెప్తుంది. చరిత్రలో అదే
మొట్టమొదటి ముంపు గంట అంటారు. తన సైనుకలని, సేనానులని ఇండియాకి, పెర్షియాకి చెందిన
స్త్రీలని పెళ్లాడమని
ప్రోత్సహించేవాడట. ఇతర ధర్మాలకి చెందిన దేవతామూర్తులని గౌరవించేవాడు. అరుదైన జంతువులని సేకరించడం అతడికొక సరదా. ఆఫ్రికాకి చెందిన
మదగజాన్ని పట్టి తెచ్చి తన గురువైన అరిస్టాటిల్ కి బహుమానంగా ఇచ్చాడు. మిరుమిట్లు గొలిపే
శోభతో ఆ నగరాన్ని మురిపెంగా
తీర్చిదిద్దాడు. వాణిజ్య, సాంస్కృతిక, విద్యా
రంగాలలో ప్రపంచంలోనే ఓ అసమాన కేంద్రంగా
ఆ నగరం రాజిల్లాలని
అతడి ఊహ. ముప్పై
మీటర్లు వెడల్పు గల విశాలమైన రహదార్లు, నగరాన్ని నిండుగా
అలంకరించే శిల్పకళ, స్థాపత్య కళ, సాలంకారమైన అలెగ్జాండర్ సమాధి, ప్రాచీన ప్రపంచానికి
చెందిన ఏడు అద్భుతాలలో ఒకటైన చక్కని దీపస్తంభం ఫారోస్ -
ఇవీ ఆ నగరానికి చెందిన
విశేషాలు.
అలెగ్జాండర్ ముంపు గంట (ఊహా చిత్రం)
వీటన్నిటినీ మించిన అద్భుతం ఆ నగరంలో మరొకటి
వుంది. అది అక్కడి
గ్రంథాలయం, దానికి జోడుగా
నిర్మించిన పురావస్తు ప్రదర్శనశాల (museum).
గ్రీకు సాంప్రదాయంలో
విద్యా దేవతలైన తొమ్మిదిమంది Muse దేవతల ఆరాధన కోసం నిర్మించబడింది కనుక దానికి museum
అని పేరొచ్చింది. ఆ చారిత్రక గ్రంథాలయంలో
ప్రస్తుతం మనకి మిగిలినది కంపుకొట్టే, చీకటి నేలమాళిగ మాత్రమే. అది గ్రంథాలయానికి
అనుబంధ విభాగమైన సెరాపియమ్ (Serapeum) కి అడుగున ఉండేది. మొదట్లో ఆ
విభాగాన్ని ఆలయంగా వాడేవారు. తదనంతరం దాన్ని
జ్ఞానసాధన కోసం అంకితం చేశారు. ప్రస్తుతం శిధిలావస్థలో
ఉన్న అరలు మాత్రమే మిగిలి ఉండొచ్చు. కాని ఒకప్పుడు
ప్రపంచంలోనే అత్యంత వైభవోపేతమైన నగరానికి మేధస్సుగా ఈ గ్రంథాలయం ఒక వెలుగు వెలిగింది. ప్రపంచ చరిత్రలో
అదే మొట్టమొదటి పరిశోధనాలయం. ఆ గ్రంథాలయంలోని పండితులు
విశాల విశ్వం (Cosmos) మొత్తాన్ని అధ్యయనం చేసేవారు.
Cosmos అనేది గ్రీకు పదం. విశ్వంలోని
క్రమానికి, సామరస్యానికి అది
సంకేతం. ఒక విధంగా
అది మరో గ్రీకు పదమైన chaos
(కల్లోలం) కి వ్యతిరేకం. విశ్వంలో అన్నిటికీ
మూలంలో వున్న ఏకత్వానికి అది ప్రతీక. విశ్వనిర్మాణంలో దాగి వున్న
సూక్ష్మమైన, సున్నితమైన సంబంధాలకి అది అద్దం పడుతుంది. భౌతిక శాస్త్రం, సాహిత్యం, వైద్యం, ఖగోళ
శాస్త్రం, భౌగోళిక శాస్త్రం, తత్వ శాస్త్రం, గణితం, జీవశాస్త్రం, సాంకేతికం – మొదలైనవన్నీ అక్కడి పండితులు అభ్యసించేవారు. విజ్ఞానం, పాండిత్యం అక్కడ
వర్ధిల్లింది. మేధస్సు అక్కడ వికాసం చెందింది. అలెగ్జాండ్రియాలోని ఆ మహాగ్రంథాలయంలో
చరిత్రలోనే మొట్టమొదటి సారిగా మనిషికి తెలిసిన విజ్ఞాన సర్వస్వాన్ని క్రోడీకరించి, క్రమబద్ధీకరించే ప్రయాస జరిగింది.
(ఇంకా
వుంది)
శ్రీనివాస చక్రవర్తి గారు,
మీ పోస్టుకు సంబంధంలేని విషయం రాస్తున్నందుకు క్షమించండి. మీ బ్లాగు చాలా సంవత్సరాల నుండి చదువుతున్నాను. మీరు రాసిన పుస్తకాలు కూడా మా పిల్లల కోసం కొన్నాను. మీరు అనువదించిన పాతాళానికి ప్రయాణం చాలా బాగుందండి. మీరు "A wrinkle in time" పుస్తకాన్ని అనువదిస్తే చదివి, మా పిల్లల చేత కూడా చదివించాలని ఉంది.
-Sneha
sir, original ide anntlugaa mee writings vuntai, thanks a lot--sri,khammam
స్నేహ గారు. మీ ప్రోత్సాహపు మాటలకి ధన్యవాదాలు. Wrinkle in time సంక్షిప్తంగా అనువదించడానికి ప్రయత్నిస్తాను. మీరు 'రాకెట్ కుర్రాళ్లు - ఇతర సైన్స్ కథలు' పుస్తకం చూశారా? మీ వద్ద లేకపోతే పంపగలను.
శ్రీనివాస చక్రవర్తి గారు,
మీరు అనువాదం చేస్తాన్నన్నందుకు ధన్యవాదాలండి.
మీరు చెప్పిన "రాకెట్ కుర్రాళ్ళు - ఇతర సైన్స్ కథలు నాదగ్గర లేదండి.
ఎక్కడ దొరుకుతుందండి?
స్నేహ