అన్యధరా జీవులు ఎలా ఉంటారో నేను చెప్పే స్థితిలో లేను. నాకు తెలిసిన జీవం ఒక్కటే. అది భూమి మీద కనిపించే జీవం. నాకు కనిపిస్తున్నది నా ఊహకి కళ్లెం వేస్తోంది. కొంతమంది (సైఫై రచయితలు, కళాకారులు వంటివారు) ఇతర ప్రపంచాల మీద జీవులు ఎలా ఉంటారో ఊహించారు. అలాంటి అన్యధరా ఊహాగానాల పట్ల నాకు కొంచెం సందేహమే. ఆ ఊహలన్నీ మనం ప్రస్తుతం తెలిసిన జీవన ఆకృతుల మీద అతిగా ఆధారపడి ఉన్నాయి. ప్రతీ జీవరాశి వెనుక వ్యక్తిగతంగా అసాధారణమైన ఎన్నో పరిణామాల పరంపర ఉంటుంది. నన్నడిగితే ఇతర ప్రపంచాల మీద జీవరాశులు పాముల లాగానో, పురుగుల లాగానో, మనుషుల లాగానో ఉండవంటాను. ఆకుపచ్చని చర్మం, కూసైన చెవులు, పొడవాటి కొండేలు మొదలైన వికారమైన హంగులు కూర్చినంత మాత్రాన సరిపోదు. మీరు మరీ పట్టుపడితే మరి కాస్త భిన్నమైన జీవాకృతులని ఊహించడానికి ప్రయత్నిస్తాను.
జూపిటర్ లాంటి మహాగ్రహం మీది వాతావరణంలో హైడ్రోజెన్, హీలియమ్, మీథేన్, నీరు, అమోనియా వంటి వాయువులు పుష్కలంగా ఉంటాయి గాని వాటి అడుగున కఠినమైన నేల ఉండదు. దట్టమైన మేఘావృతమైన వాయుమండలంలో కర్బన రసాయన అణువులు, మన ప్రయోగశాలలో పుట్టే ఉత్పత్తులలా, ఆకాశం నుండి వరాలవానలా రాలుతూ ఉంటాయి. కాని అలాంటి గ్రహం మీద జీవనానికి ఓ ముఖ్యమైన అవరోధం వుంది. అక్కడి వాతావరణం అతలాకుతలంగా, అతి వేడిగా రగిలిపోతూ ఉంటుంది.
అలా మన కన్నా బాగా భిన్నమైన పరిస్థితులు గల గ్రహం మీద కూడా జీవం ఆవిర్భవించడం అసంభవం కాదని నిరూపించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయంలో పని చేసే ఓ సహోద్యోగి ఈ.ఈ. సాల్పీటర్, నేను కలిసి కొన్ని అంచనాలు వేశాము. అలాంటి ప్రదేశంలో జీవం అంటూ ఉంటే అది ఎలా ఉంటుందో చెప్పడం కష్టమే. కాని మనకి తెలిసిన భౌతిక రసాయన ధర్మాలని వర్తింపజేసి, ఇలాంటి ప్రపంచం మీద కూడా జీవం మనగలదని నిరూపించాలని మా ప్రయత్నం.
అలాంటి విపరీత పరిస్థితుల్లో జీవం మనగలగాలంటే, జీవి ఆ వేడికి మలమల మాడిపోయేలోపు పునరుత్పత్తి చెందాలి. అప్పుడు అలా పుట్టిన సంతతిని వాతావరణంలోని సంవహన తరంగాలు (convection currents) వాయుమండలంలో పైపైకి తీసుకుపోయి, పైన మరింత చల్లని పొరల వద్దకి చేర్చే అవకాశం వుంది. అలాంటి జీవాలు పరిమాణంలో చాలా చిన్నవి కావచ్చు. వాటికి మేము ‘మునకజీవులు’ (sinkers) అని పేరు పెట్టాం. ఇవి కాకుండా ‘తేలే జీవులు’ (floaters) అని మరో రకం జీవాలని కూడా ఊహించుకోవచ్చు. ఇవి పిల్లలు ఆడుకునే హైడ్రోజెన్ బుడగల వంటివి. బుడగల లాంటి ఈ జీవాల అంతరాళం లోంచి హీలియమ్, తదితర మరింత భారీ వాయువులు బయటకి వెలువరించబడతాయి. తేలికైన హైడ్రోజెన్ మాత్రం లోపల మిగులుతుంది. దాని వల్ల ఆ తేలేజీవి పైపైకి తేలి కింద వేడిని తప్పించుకుంటుంది. లేదా అవి ఇక్కడ మనం వాడే వేడిగాలి బుడగలలా పని చేయొచ్చు కూడా. అది భుజించే ఆహారం నుండి పుట్టే శక్తిని ఉపయోగించి తన అంతరంగం వెచ్చగా ఉండేలా చేసుకుంటూ, గాల్లో తేలుతూ ఉండొచ్చు. ఈ తేలేజీవులు ముందే ఏర్పడ్డ కర్బన రసాయనాలని భక్షిస్తాయేమో. లేదా భూమి మీద మొక్కలు చేసినట్టు సూర్యకాంతిని, గాలిని వాడుకుని కర్బన రసాయనాలు చేసుకోవచ్చు. ఒక పరిమాణం వరకు ఈ తేలేజీవి ఎంత పెద్దది అయితే అంత సమర్థవంతంగా జీవించగలుగుతుంది. ఈ తేలేజీవులు కొన్ని కిలోమీటర్ల పరిమాణం కలిగి ఉంటాయని సాల్పీటర్, నేను ఊహించుకున్నాం. అంటే భూమి మీద మనకి తెలిసిన అతి పెద్ద జీవాలైన తిమింగలాల కన్నా కూడా చాలా పెద్దవి. వీటిని తేలే నగరాలలా ఊహించుకోవచ్చేమో.
ఈ తేలేజీవులు గ్రహం మీద ఉండే వాయుమండలంలో బలమైన ఝంఝానిలాలని బయటికి ఊదుతూ, జెట్ విమానాలలా ముందుకు ప్రయాణిస్తాయేమో. ఇలాంటి బృహత్తర జీవులు దండులు దండులుగా, బృహస్పతి ఆకాశంలో బద్ధకంగా బారులు తీరి విశ్రమిస్తూ ఉండే దృశ్యాన్ని ఊహించుకోవచ్చు.
వాటి చర్మాల మీద ఇంపైన మచ్చలు ఎండలో మెరుస్తుంటాయి. అవి కూడా ఆత్మరక్షణ కోసం ప్రచ్ఛన్నాకారపు (camouflage) పధకాలు వినియోగిస్తాయి అన్నమాట. జూపిటర్ మీద కూడా జీవనపోరాటం తప్పదు మరి. అలాంటి పర్యవరణ వ్యవస్థలో మరో రకం జీవనం కూడా సాధ్యం కావచ్చు. అది వేటాడి పొట్టపోసుకోవడం. ఈ మూడో రకం జీవాలని వేటజీవులు (hunters) అని పిలుద్దాం. ఇవి వేగంగా, ఒడుపుగా ఎగరగలుగుతాయి. ఇవి తేలేజీవులని తిని బతుకుతాయి. వాటిలో ఈ వేటజీవులకి కావలసింది కర్బన రసాయనాలు, హైడ్రోజెన్. డొల్లగా ఉండే మునకజీవులు తేలేజీవులుగా పరిణామం చెంది ఉండొచ్చు. స్వయంచోదక లక్షణాన్ని సాధించిన తేలేజీవులు వేటజీవులుగా పరిణమించి ఉండొచ్చు. వేటజీవుల సంఖ్య మరీ పెద్దగా ఉండే అవకాశం లేదు. అవి మరీ ఎక్కువైతే, తేలేజీవుల మీదపడి అతిగా భక్షిస్తే వాటి అస్తిత్వానికే ముప్పు.
భౌతిక, రసాయన శాస్త్రాలు అలాంటి జీవుల ఉనికిని ఆమోదిస్తాయి. కాస్తంత కళాదృష్టిని చొప్పిస్తే వాటిని అందంగా ఊహలలో మలచుకోవచ్చు. కాని మన విశృంఖల ఊహాగానాలని ప్రకృతి అనుమతించాల్సిన, అనుసరించాల్సిన అవసరం లేదు. అయితే పాలపుంత గెలాక్సీ మొత్తం మీద కోటానుకోట్ల ప్రపంచాలు విలసిల్లి ఉన్నట్లయితే, వాటిలో కొన్నిటి మీదనైనా మన ఊహ జీవం పోసిన మునకజీవులు, తేలే జీవులు, వేటజీవులు సజీవంగా ఉంటాయని ఆశించొచ్చు.
భౌతికశాస్త్రం కన్నా చరిత్రకి సన్నిహితంగా ఉంటుంది జీవశాస్త్రం. వర్తమానం తెలియాలంటే గతం అర్థం కావాలి. ఊరికే పైపైన అర్థమైతే సరిపోదు. గతం క్షుణ్ణంగా, సవివరంగా తెలియాలి. ఎలాగైతే చరిత్రలో ముందు ఏం జరుగుతుందో చెప్పే సిద్ధాంతం ఇంకా పుట్టలేదో, జీవశాస్త్రంలో కూడా ముందు ఏం జరగబోతుందో చెప్పే సిద్ధాంతం ఇంకా రాలేదు. రెండు సందర్భాలలోను కారణాలు ఒక్కటే. మన దృష్టిలో రెండూ చాలా సంక్లిష్టమైన రంగాలు. ఇతర జీవరాశులని అర్థం చేసుకుంటున్న కొద్ది మన గురించి మన అవగాహన మరింత బలపడుతూ వస్తుంది. అన్యధరా జీవనానికి చెందిన ఒక్క తార్కాణాన్ని అధ్యయనం చేసినా చాలు, జీవశాస్త్రం నుండి ప్రాంతీయతా వాసనలు తుడిచిపెట్టుకుపోతాయి. అప్పుడు జీవశాస్త్రవేత్తలు మొట్టమొదటి సారిగా అన్య ప్రపంచాల మీద ఎలాంటి జీవం దొరుకుతుందో తెలుసుకుంటారు. అన్య ప్రపంచాలలో జీవం కోసం అన్వేషణ ముఖ్యం అంటున్నాం గాని, దాన్ని కనిపెట్టడం సులభం అని మాత్రం అనడం లేదు. సులభంగా కాకపోయినా ఎంత ప్రయాస అయినా పడి తెలుసుకోవలసినంత అమూల్యమైన విషయం.
ఇంతవరకు మనం ఓ చిన్న లోకం మీదే వినిపించే జీవనస్వరాలు విన్నాము. విశ్వసంగీతంలో ఇతర గొంతికలు కూడా ఇప్పుడిప్పుడే వినడం మొదలెట్టాము.
0 comments