శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భారత దేశంలో హరిత నగరాలు సాధ్యమా (?)

Posted by V Srinivasa Chakravarthy Wednesday, July 1, 2020



స్వఛ్ భారత్ మిషన్ కారణంగా మన దేశంలో నగరాలు అందంగా, పరిశుభ్రంగా ఉండాలన్న ఆశయం నెమ్మదిగా ప్రజల మనసుల్లో స్థిరంగా చోటుచేసుకుంటోంది. పరిశుభ్రత దృష్ట్యా నగరాలకి ర్యాంకులు ఇవ్వడం వల్ల, ఈ పరిశుభ్రతా ఉద్యమంలో తన నగరాలు గెలవాలని, ఉన్నతమైన ర్యాంకులు సంపాదించాలని ఆయా నగరాలు పౌరులు కూడా ఉద్యమంలో పాల్గొంటూ తమ వంతు ప్రయత్నం చెయ్యడానికి ముందుకు రావడం హర్షనీయం.

పాశ్చాత్య ప్రపంచంలోనే కాక, ప్రథమ ప్రపంచం (first world)  కి చెందిన మహానగరాలే కాక, గ్రామాలు కూడా ఎంతో పరిశుభ్రంగా, అందంగా సందర్శకులకి ఆనందం కలిగిస్తుంటాయి.  విదేశీయాత్రలకి ఆలవాటు పడ్డ నేటి భారతీయులు నేడు ఆ వాస్తవాన్ని తరచుగా  అనుభూతి చెందుతున్నారు. మన ఊళ్లు కూడా అలాగే అందంగా, ఇంపుగా, సౌకర్యంగా ఎందుకు ఉండవు, అలా ఉండాలంటే ఏం చెయ్యాలి అన్న చింతన సామాన్య పౌరుల మనసుల్లో క్రమంగా వికాసం చెందుతోంది.

అయితే ఇప్పుడు ముగ్ధ మనోహరంగా కనిపించే ఎన్నో పాశ్చాత్య పట్టణాలు కూడా ఒకప్పుడు ఎంతో చీకటి గతాన్ని చవిచూసినవే. ఉదాహరణకి 19 వ శతాబ్దంలో, పారిశ్రామిక ఉద్యమం జరుగుతున్న కాలంలో, బొగ్గు వినియోగం అతిగా పెరగడం వలన, మరెన్నో ఇతర కారణాల వలన, బ్రిటన్ లో నగరాలలో పరిశుభ్రతా  ప్రమాణాలు దయనీయంగా ఉండేవి.

(ఆ విషయం గురించి మరో చోట చర్చించాను.

 అలాంటి పరిస్థితుల్లో ఎబెనెజర్ హవర్డ్ అనే urban planner  కి మురిగివాడల సమూహాలుగా మారిన బ్రిటిష్ నగరాల పరిస్థితి ససేమిరా నచ్చలేదు.  ఆధునిక నగరాలలో వచ్చిన ఈ కొత్త పరిణామాల కారణాలు వెతకడం ఆరంభించాడు.





ఎబెనెజర్ హవర్డ్ (1850 - 1928)

 నగరాలకి, గ్రామాలకి మధ్య ఒక మౌలికమైన వైరుధ్యం, విభజన ఉందని హవర్డ్ గుర్తించాడు. నగరాలు ఉద్యోగావకాశాలు అందిస్తాయి. కాని జీవన పరిస్థితులు అల్లకల్లోలంగా, దుర్భరంగా ఉంటాయి. గ్రామాలలో పరిస్థితులు మనోహరంగా, ప్రశాంతంగా ఉంటాయి. కాని ఉద్యోగావకాశాలు ఉండవు. కాబట్టి నగరాలలోను, గ్రామాలలోను పరిపూరకమైన పరిస్థితులు ఉంటాయి. ఈ రెండు రకాల పరిస్థితులని అందించగలిగే కొత్త రకమైన నగరాలని రూపొందించొచ్చు అని హవర్డ్ ఆలోచించాడు. ఆ ఆలోచనలో నుండి పుట్టినదే హరితనగరాల ఉద్యమం (Garden city movement).



హవర్డ్ తన భావజాలంలో మూడు రకాల  “అయస్కాంతాల”  గురించి ప్రస్తావిస్తాడు. మొదటిది “పట్టణ అయస్కాతం”. ఇది ఉద్యోగావకాశాలతో “ఆకర్షిస్తుంది.” రెండవది గ్రామీణ అయస్కాంతం. ప్రశాంతమైన, ఆరోగ్యవంతమైన వాతావరణంతో ఇది ఆకర్షిస్తుంది. ఈ రెండిటినీ సమన్వయపరచేదే మూడవ అయస్కాంతం. ఇదే “పట్టణ – గ్రామ అయస్కాంతం.”  అలా ఏర్పడ్డ భావనకే “హరిత నగరాలు” అని పేరు.




ఈ హరిత నగరాలు “స్వయం ప్రతిపత్తి కలిగి, హరిత హారాలతో పరివేష్టితమై, మానవావాసాలు, పారిశ్రామిక ప్రాంతాలు, సేద్య భూములు సమపాళ్లలో కలిగిన ప్రాంతాలు.” (వికీ)



ఉండేవి ఎబెనెజర్ హవర్డ్ రూపొందించిన మొదటి పథకం ప్రకారం, కేంద్రంలో 12,000 ఎకరాల విస్తీర్ణత గల నగరం ఉంటుంది. అందులో సుమారు 58,000 జనాభా జీవిస్తారు. ఆ నగరం గరిష్ఠ జనాభా సాంద్రతను చేరుకున్నాక దాని చుట్టూ, అల్లంత దూరంలో కొత్త నగరాలు పుట్టుకొస్తాయి. ఆరు కొత్త నగాలు చుట్టు పుట్టుకొచ్చి షడ్భుజి ఆకారంలో ఏర్పడతాయి. కేంద్ర నగానికి, దాని చుట్టూ కొత్తగా ఏర్పడ్డ నగరాలకి మధ్య తగినంత విస్తీర్ణత గల హరిత హారం (green belt)  ఉంటుంది. ఆ ఆరు నగరాలని, కేంద్ర నగరంతో కలుపుతూ రోడ్డు, రైలు రవాణా సదుపాయాలు ఉంటాయి.




ఆ విధంగా ఏర్పడ్డ 7 నగరాల కూటమి (1 కేంద్ర నగరం + 6 ఉపనగరాలు) యొక్క మొత్తం జనాభా2,50,00 స్థాయిలో ఉంటుంది. ఆ జనాభా 66,000 ఎకరాల విస్తీర్ణత గల భూమి మీద జీవిస్తారు.

ఉండేవి అలా ఏర్పడ్డ నగరాల కూటమి దాని జనాభా పరిమితిని చేరుకోగానే, ఇక కొత్త నగరం యొక్క నిర్మాణం మొదలవుతుంది అంటాడు హవర్డ్. ఈ పద్ధతిలో జనాభా సాంద్రత ఎప్పుడూ ఒక విలువని మించి పోదు. ఆ జనాభా సాంద్రత పరిమితి ఎంతో ఒక సారి లెక్కించి, ప్రస్తుతం మన దేశంలో మహానగరాలలో జనాభా సాంద్రత విలువలతో పోల్చుదాము.

66,000 acres = 267.09 sq km.
 కాబట్టి,
250,000/267.09 = 936 /sq km


మన దేశంలో ప్రస్తుత సగటు జనాభా సాంద్రత = 460/sqkm

కాబట్టి ఇది మన దేశపు జనాభా సాంద్రతకి రెండు రెట్లు కన్నా ఎక్కువ.

కాబట్టి అంటే ప్రస్తుతం మన దేశపు మొత్తం జనాభాని ఇలాంటి అద్భుత హరిత నగరాలలో విస్తరింపజేసినా దేశ విస్తీర్ణతలో సగభాగం మాత్రమే ఆక్రమించినట్టు అవుతుంది.

కాబట్టి అయితే ఇలాంటి లెక్క కాస్త అమాయకపు అంచనాయే అవుతుంది అని సులభంగా గుర్తించొచ్చు. దేశంలో సగం భాగం నగరాలే నెలకొంటే ఇక పంటలు పండించే సస్యభూములకి చోటెక్కడ ఉంతుంది?  ఇది కాక పర్వతాలు, నదులు, తదితర భౌగోళిక విశేషాలు ఉండడం వల్ల మానవ నివాస యోగ్యమైన భూమి మరింత తక్కువ అవుతుంది.

 కాబట్టి “హరిత నగరాల” పద్ధతి ప్రకారం జరిగే నగర నిర్మాణం ఆచరణయోగ్యం కాదనిపిస్తుంది. పైగా హరిత నగరాల పద్ధతి గురించి కొన్ని మౌలికమైన అభ్యంతరాలు ఉన్నాయి.

హరితనగరాల ఉద్యమం ఎన్నో ప్రపంచ నగరాల నిర్మాణానికి స్ఫూర్తి నిచ్చింది. గ్రామీణ వాతావరణాన్ని తలపించే పరిసరాలలో మానవ నివాసాలు ఉండాలనే వాదన బలపడడంతో మహానగరాలలో ఒక రకమైన విభజన తత్వం చోటుచేసుకుంది. ఆ తత్వం ప్రకారం నగరానికి కేంద్రం వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, కార్యాలయాలు ఉండాలి. దీన్నే downtown  అంటారు. మనుషులు గ్రామీణ వాతావరణం కలిగిన suburban ప్రాంతాలలో విశాల నివాసాలలో హాయిగా జీవిస్తుంటారు. అక్కడి నుండి రోజూ ఉద్యోగాల కోసం నగరపు కేంద్రాల వరకు ప్రయాణిస్తుంటారు. ఆ విధంగా మహానగరాలలో కేంద్రంలో వాణిజ్య కార్యాలయాలు, చుట్టూ దూరాన మానవ నివాసాలు ఉన్న ద్వైపాక్షిక పౌరవ్యవస్థ ఏర్పడింది. దీని వల్ల ఉద్యోగుల రోజూవారి రవాణా (daily commute) బోలెడంత వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. ఇలాంటి అవాంఛనీయ పరిస్థితులనే urban sprawl (పట్టణ అతివ్యాప్తి) అంటారు. ఈ రకమైన పట్టణ నిర్మాణా సాంప్రదాయాలు అసుస్థిరమైన అభివృద్ధికి (unsustainable development) దారితీస్తాయని  నేడు పట్టణ వ్యవస్థాపకులు  గుర్తిస్తున్నారు.

అయితే పట్టణ అతివ్యాప్తి హరిత నగర విధానాన్ని అనుసరించడం వల్ల వచ్చిన పరిణామం కాదు. నగర నిర్మాణంలో ఏ పొరబాటు అయితే జరగ కూడదని హవర్డ్ వాదిస్తూ వచ్చాడో అదే పొరబాటు వల్ల పట్టణ అతివ్యాప్తి జరిగింది. నిజానికి  హరిత నగర విధానానికి, ఆధునిక మహానగరాలలో కనిపించే “డౌంటౌన్ + సబర్బన్” పూర్తిగా చుక్కెదురు. ‘డౌంటౌన్ + సబర్బ్’ పద్ధతిలో కేవలం గ్రామాన్ని పట్టణానికి మరి కాస్త దగ్గరిగా జరిపి, దానికి సబర్బ్ అని కొత్త పేరు పెట్టినట్టు అయ్యింది.

ది హవర్డ్ ఊహించిన హరిత నగరాలు మరింత ప్రకృతి సజీవమైనవి, కణ్వమైనవి (cellular), కాబట్టి మరింత సహజమైనవి. జీవ ప్రపంచంలో ప్రతీ శరీరం కొన్ని కోట్ల కణాల సముదాయం. దేహమనే నిర్మాణంలోని ఇటుకల వంటివి కణాలు. దేహం ఎదుగుతున్నప్పుడు, అందులోని వ్యక్తిగత కణం అపరిమితంగా ఎదుగుతూ పోదు.  కణం ఎదుగుతూ, పరిణతి చెందుతున్నప్పుడు, ఒక దశలో, అది విభజన చెంది రెండు ఇంచుమించు సరిసమానమైన కణాలుగా విడిపోతుంది.















పైగా ఒకే పెద్ద కేంద్రకణం చుట్టూ ఎన్నో చిన్న కణాలు గుమిగూడవు.


కాని ఆధునిక నగరాలు విస్తరించే విధానం చూస్తుంటే సరిగ్గా అదే పద్ధతి కనిపిస్తుంది.
ఈ కింది వ్యాసం ప్రకారం చెన్నై నగరం యొక్క అభివృద్ధి విధానాన్ని గమనిస్తే సరిగ్గా ఆ పొరబాటే  జరుగుతున్నట్టు కనిపిస్తుంది.



సాంప్రదాయక నగరాల అభివృద్ధి మార్గంలోనే చెన్నై అభివృద్ధి విధానాన్ని కూడా రూపొందించారు దాని వ్యవస్థాపకులు. ఆ విధానం ప్రకారం ఒక స్థిరమైన కేంద్రభాగం నుండి నగరం అన్ని దిశలలోను విస్తరిస్తూ పోతుంది. ఆ పథకాల ప్రకారం నగరాన్ని కేంద్రం, పరిసర ప్రాంతాలు అని రెండుగా విభజన చెయ్యడం జరుగుతోంది. ఆ కేంద్రమే అనన్యమైన ప్రాముఖ్యతను సంతరించుకున్న అభికేంద్రం (epicenter). అది పొంగిపొరలగా ఏర్పడ్డవే పరిసర ప్రాంతాలు.”

కాని  చెన్నై విషయాన్నే తీసుకుంటే ఆ “అనన్య ప్రాముఖ్యత గల అభికేంద్రం” ఎక్కడుందో అర్థం కాదు. ప్రపంచ మహానగరాలలో డౌంటౌన్ లు నింగిని తాకే ఆకాశసౌధాలతో, త్రిమితీయ స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ, విస్తృతమైన మెట్రో వ్యవస్థ, ఫ్రీవేల వ్యవస్థ తదితర ఆధునిక పౌరవ్యవస్థలతో,  పరిమిత భూభాగంలో కూడా అపారమైన జనసాంద్రతని భరించే విధంగా రూపొందించబడి ఉంటాయి.

కాని దురదృష్ట వశాత్తు చెన్నై జనాభా సాంద్రత 26,500 /sqkm అయితే, న్యూ యార్క్ లో మన్హాటన్ జనాభా సాంద్రత కూడా 25,800 /sqkm ఆ స్థాయిలోనే ఉందని గుర్తించగలము. అయితే ఆ రెండు నగరాలలో లభ్యమయ్యే పౌరవ్యవస్థలలో పోలికే లేదని కూడా గుర్తుంచుకోవాలి.

 మరి మన మహానగరాలలో తగినంత సమర్థత గలిగిన పౌరవ్యవస్థలని స్థాపించకుండానే, జనాభా సాంద్రతను అలవికాని స్థాయి వరకు ఎందుకు పెరగనిస్తున్నారు? దానికి కారణం మన దేశంలో స్వతంత్ర భారతంలో ఇంతవరకు అనుసరించబడుతున్న  విచిత్రమైన (అసమర్థమైన) పట్టణ అభివృద్ధి విధానాలే నంటాడు “Wasted” అనే అద్భుతమైన పుస్తకాన్ని రాసిన అంకుర్ బిసెన్.





చెన్నై గురించిన అదే వ్యాసంలో, మహానగరాల అభివృద్ధిలో మరి ఏది సరైన విధానం అన్న ప్రశ్నకి సమాధానం ఈ విధంగా వుంది. “కేంద్రం – పరిసరం” అనే మాతృకని విడనాడి, “బహుళ కేంద్రక” మాతృకని స్వీకరించాలి. ప్రస్తుతం “పరిసరాలు” గా భావింపబడే ప్రాంతాలలో స్వతంత్ర నగరాలుగా ఏర్పడే అవకాశాలు ఉన్న ప్రాంతాలుగా గుర్తించి, వాటిని స్వతంత్ర నగరాలుగానే తీర్చి దిద్దాలి. మూల నగరానికి వాటిని మధ్య ఉండే సంబంధాన్ని బలపరచాలి. అలా కొత్తగా ఏర్పడ్డ నవ్యనగరాలు స్వయంప్రతిపత్తి లక్ష్యంగా  ఎదగాలి. డచ్ పట్టణ వ్యవస్థాపకులు సరిగ్గా ఈ రకమైన తత్వాన్నే స్వీకరిస్తారు. “కేంద్రం నుండి బయటకు” అనే పద్ధతికి విరుద్ధంగా, “బయటి నుండి కేంద్రానికి” అనే విధానాన్ని అవలంబిస్తారు, అంటుందా వ్యాసం.

 జాగ్రత్తగా ఆలోచిస్తే ఎబెనెజర్ హవర్డ్ సూచించిన ‘హరిత నగరాల’ వెనుక ముఖ్యోద్దేశం అదే. ప్రతీ నగరం స్వయం ప్రతిపత్తి కలిగి వ్యాపార, ఉత్పత్తి, విద్య, నివాస ప్రాంతాలకి ప్రత్యేక ప్రాంతాలు కేటాయించబడాలి. ఈ ప్రాంతాలన్నీ దట్టమైన హరిత హారంలో ఇమిడి వుంటూ, గ్రామీణ ప్రాంతాలని తలపించేలా ఉండాలి. నగరం యొక్క జనాభా ఒక పరిమితిని చేరగానే, నగరం యొక్క వ్యాప్తిని నిలిపివేసి, మూల నగరానికి నియత దూరంలో ఓ  కొత్త నగరాన్ని, లేదా పలు కొత్తనగరాలని, నిర్మించడం మొదలెట్టాలి. మూల నగరాలకి, నూతన నగరాలకి మధ్య దట్టమైన హరిత హారం ఉండాలి.

 కాని ఇలాంటి పట్టణ అభివృద్ధి వల్ల ఒక సమస్య ఏర్పడుతుందని సులభంగా గుర్తించొచ్చు. దీని వల్ల జనాభా సాంద్రత పలచగా గల నగరాలు కోకొల్లలుగా ఉత్పన్నమవుతాయి. ఉండడానికి బాగానే ఉంటాయేమో గాని అవి ఆర్థికంగా లాభదాయకం కావు. ఎందుకంటే హరిత నగరం యొక్క మూల భావన ప్రకారం జనాభా సాంద్రత 1000 /sqkm కన్నా తక్కువగా ఉండాలి. కాని ఒక ఆధునిక నగరం యొక్క జనాభా సాంద్రత పరిమితి ఎంత వరకు ఉండొచ్చు? పట్టణ అభివృద్ధి రంగంలో ఇది చాలా కీలకమైన ప్రశ్న. వ్యవస్థాపకులు ఈ సంఖ్య గురించి ఏకాభిప్రాయానికి రాలేక తర్జనభర్జనలు పడుతుంటారు.

ఈ విషయంలో మచ్చుకి రెండు చక్కని ప్రపంచ నగరాలని పరిగణిద్దాం.

పట్టణ అభివృద్ధి రంగంలో హోలాండ్ కి చెందిన వ్యవస్థాపకులకి మంచి పేరుంది. కాబట్టి హోలాండ్ రాజధానికి అయిన ఆమ్స్టర్డామ్ ని తీసుకుంటే దాని జనాభా సాంద్రత 4439 /sqkm.

అలాగే అద్భుతంగా వ్యవస్థీకరించబడ్డ నగరంగా చారిత్రక నగరమైన లండన్ కి కూడా గొప్ప పేరుంది. దాని (Greater London) జనాభా సాంద్రత 4542 /sqkm.

కాబట్టి సుమారు 4,500 /sqkm  జన సాంద్రత గల హరిత నగరాలని నిర్మించినా అది మన దేశంలో  ప్రస్తుత జనాభా సాంద్రతకి పది రెట్లు ఎక్కువ. అంటే అంత తక్కువ జన సాంద్రతతో నిర్మించినా దేశ విస్తీర్ణతలో పదో వంతు మాత్రమే వినియోగించబడి, తక్కిన భూమి అంతా ప్రకృతికే వదిలిపెట్టబడుతుంది.

మన దేశ జనాభా 2060 కల్లా 1.6 బిలియన్ సంఖ్యని చేరుకుంటుందని అంచనా. అంత జనాభా ఉన్నా కూడా మన ఈ ఊహా నగరాలలో జనాభా సాంద్రత 5,600 /sqkm  స్థాయిలోనే ఉంటుంది.
 
అస్తవ్యస్తమై, అందవిహీనమై, భరించరాని వాయు, జల కాలుష్యంతో, ఉక్కిరిబిక్కిరి చేసే మన ప్రస్తుత మెట్రోల కన్నా అలాంటి భావి హరిత నగరాలలో జీవన పరిస్థితులు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశించవచ్చు.
హ్లాదనీయమైన హరిత నగరాల సమాహారంతో అలంకృతమైన భావిభారత నమూనాని కింద చిత్రంలో చూడొచ్చు.






















(ఈ వ్యాసానికి నేను రాసిన ఆంగ్ల మూలం ఇక్కడ
)




0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts