కాని
ఆధునిక జోస్యులు విషువత్ చలనం (precession of equinoxes) గురించి
మర్చిపోయారు. కాని టోలెమీకి దాని గురించి బాగా తెలుసు. అలాగే ఆధునికులు
వాయుమండలంలో కాంతి వక్రీభవనాన్ని పట్టించుకోలేదు. ఆ సంగతి కూడా
టోలెమీ రాశాడు. అలాగే టోలెమీ
కాలం నుండి ఇప్పటి వరకు కనుక్కోబడ్డ గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహశకలాలు
(asteroids), తోకచుక్కలు
(comets), క్వేజార్
లు, పల్సార్
లు, బద్దలవుతున్న
గెలాక్సీలు, సహజీవన తారలు, ఉపద్రవాత్మక చలరాశులు, ఎక్స్-రే మూలాలు
మొదలైన విషయాలని ఆధునిక జోస్యులు లెక్క చెయ్యరు. ఖగోళ శాస్త్రం
ఒక శాస్త్రం
- విశ్వం
యొక్క వాస్తవ రూపాన్ని అది అధ్యయనం చేస్తుంది. జ్యోతిష్యం ఒక
కుహనాశాస్త్రం – ఇతర గ్రహాలు మన జీవితాల మీద ప్రభావం చూపిస్తాయనే ఓ గుడ్డి నమ్మకం
మీద ఆధారపడి, ఏ సాక్ష్యాధారాలు
లేని బూటకం. టోలెమీ కాలంలో
ఖగోళశాస్త్రానికి, జ్యోతిష్యానికి మధ్య తేడా ఉండేది కాదు. కాని ఆ
తేడా ఇప్పుడు ఉంది.
ఒక ఖగోళవేత్తగా టోలెమీ ఎన్నో తారలకి పేర్లు పెట్టాడు. వాటి ప్రకాశాన్ని
నమోదు చేశాడు. భూమి గోళాకారంలో
ఉంటుందనడానికి ఎన్నో కారణాలు పేర్కొన్నాడు. గ్రహణాల రాకని నిర్ణయించడానికి సూత్రాలు వర్ణించాడు. వీటన్నిటి కన్నా ముఖ్యంగా స్థిరతారల నేపథ్యం మీద గ్రహ చలనాలు ప్రదర్శించే వింతైన గతిని అర్థం చేసుకోడానికి ప్రయత్నించాడు. గ్రహచలనాలని ముందే నిర్ణయించడానికి ఒక గణితనమూనా తయారుచేసి నింగిని దాగిన రహస్య సంకేతాలని ఛేదించే ప్రయత్నం చేశాడు. ఆకాశాన్ని అధ్యయనం
చేసే వ్యాపకం టోలెమీకి అపరిమితానందాన్ని ఇచ్చేది. “నేను కేవలం ఒక మర్త్య మానవుణ్ణి,” అని ఒక చోట రాసుకున్నాడు టోలెమీ. “ఒక రోజు బతికి రాలిపోయే మానవుణ్ణి. కాని చీకటి
ఆకాశంలో తారల వలయాకారపు గతుల పరంపరని పరమానందంగా ధ్యానిస్తున్నంత సేపు, నా పాదాలు
ఇక నేల మీద ఆనవు.”
పుడమే
విశ్వానికి కేంద్రం అని నమ్మాడు టోలెమీ. చంద్రుడు, ఇతర
గ్రహాలు, తారలు అన్నీ
భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ప్రపంచంలోనే ఇది చాలా సహజమైన భావన. భూమి స్థిరంగా, ఘనంగా, నిశ్చలంగా తోచుతుంది. ఆకాశంలోని వస్తువులు అస్తమానమూ అస్తమిస్తూ, ఉదయిస్తూ కనిపిస్తాయి. పృథ్వీ కేంద్ర సిద్ధాంతాన్ని ఎన్నో సంస్కృతులు ఆహ్వానించాయి. ఆ విషయం మీద
యోహానెస్ కెప్లర్ ఇలా అంటాడు – “హేతువు దృష్టిలో ఇలాంటి విశ్వదర్శనం తప్ప మరొకటి కనిపిస్తుందని అనుకోవడం అసంభవం. ఆ దర్శనం
ప్రకారం భూమి ఓ పెద్ద ఇల్లు
లాంటిది. ఆ ఇంటి
పైన ఆకాశం కదలకుండా, కుదురుగా కూర్చుంది. అలా
నిశ్చలంగా ఉన్న ఆకాశంలో ఇంత చిన్ని పరిమాణం గల సూర్యుడు, గాలిలో పులుగులా
ఒక చోటి నుండి మరో చోటికి కదులుతున్నాడు.” కాని గ్రహాల వ్యక్తగతిని (apparent motion) వర్ణించేదెలా? ఉదాహరణకి టోలెమీ కాలానికి కొన్ని వేల ఏళ్ల క్రితం నుండి తెలిసిన మార్స్ చలనాన్నే తీసుకుందాం. (మార్స్ గ్రహానికి ప్రాచీన ఈజిప్షియన్లు ఇచ్చిన నామధేయాల్లో ఒకటి ‘సెక్ డెడ్
ఎఫ్ ఎమ్ ఖెట్ ఖెట్’. అంటే వెనక్కు నడిచేవాడు అని అర్థం.) మార్స్ యొక్క తిరోగమనాన్ని (retrograde motion), ఒక సారి చుట్టు చుట్టి మళ్లీ ముందుకు సాగే దాని విచిత్ర చలనాన్ని, అది సూచిస్తోంది.
టోలెమీ
రూపొందించిన గ్రహ చలనాల నమూనాని ఒక చిన్ని యంత్రంలో మూర్తీభవింపజేయొచ్చు. గ్రహచలనాలని ప్రదర్శించే యంత్రాలు టోలెమీ కాలానికే ఉన్నాయి. భూమిని వదిలి, పై నుండి, అంటే ఆకాశం
నుండి చూసినప్పుడు కనిపించే గ్రహాల “అసలు”
చలనాలకి ఆ యంత్రం అద్దం
పట్టాలి. అలాంటి చలనాలని
తెలుసుకోవడం అప్పుడొక పెద్ద సమస్యగా ఉండేది. అలాంటి యంత్రాన్ని
ఉపయోగించి భూమి నుండి, అంటే ఇక్కడ
లోపలి నుండి చూసినప్పుడు కనిపించే గ్రహాల వ్యక్తగతని (apparent motion) వివరించగలగాలి.
చక్కని
పారదర్శక గాజు గోళాలలో గ్రహాలు పొదగబడి ఉన్నాయని ఆ రోజుల్లో ఊహించుకునేవారు. భూమి కేంద్రంగా ఆ గోళాలు పరిభ్రమిస్తుంటే ఆ గ్రహాలు భూమి
చుట్టూ కదులుతుంటాయి. అయితే ఆ గ్రహాలు ఏకంగా
ఆ గోళాల గోడలలో
స్థాపించబడి లేవు. గోళాల గోడలు
కేంద్రంగా కొన్ని చిన్న చక్రాలు ఉన్నాయట. ఆ చక్రాల
అంచు మీద గోళాలు కదులుతున్నాయి. గోళంతో పాటు ఆ చిన్న చక్రాలు
కూడా కదులుతూ ఉంటాయి. అప్పుడే భూమి
నుండీ చూసినప్పుడు మార్స్ వలయాకారంలో ఓ సారి చుట్టు
చుట్టి ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి నమూనా సహాయంతో గ్రహగతులని అంతో ఇంతో నిర్దుష్టతతో నిర్ణయించడానికి వీలయ్యింది. టోలెమీ కాలంలో లభ్యమైన కొలతలని వివరించడానికి ఆ నమూనా సరిపోయేది. తరువాత ఎన్నో శతాబ్దాల పాటు కూడా ఆ నమూనాయే వాడబడుతూ
వచ్చింది.
టోలెమీ
విశ్వనమూనా లోని ఊహా గోళాలు మధ్యయుగాలలో స్ఫటికతో నిర్మించబడి వుండేవని అనుకునేవారు.[1] ఇప్పటికీ మనం ఏడవ స్వర్గం గురించి ప్రస్తావిస్తాం (చంద్రుడు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శని తరువాత తారలతో కూడిన స్వర్గమే ఏడవ స్వర్గం). అలాగే విశ్వగోళాల సంగీతం గురించి మాట్లాడతాం. విశ్వానికి కేంద్రం భూమి అని నమ్మినతరువాత, సృష్టి మొత్తం ధరాగత సంఘటనల మీదే ఆధారపడి ఉన్నట్టు భావించిన తరువాత, పైనున్న స్వర్గ
సీమ అంతా పూర్తిగా అలౌకిక మైన ధర్మాల మీద పని చేసుస్తుందని తలపోసిన తరువాత, ఇక ఖగోళ
పరిశీలనలు చెయ్యాల్సిన అవసరమే కనిపించలేదు. చర్చి ఇచ్చిన సమర్ధింపుతో చీకటి యుగాల్లో కూడా ఒక సహస్రాబ్ద కాలం పాటు ఖగోళ విజ్ఞానం పురోగమించకుండా టోలెమీ నమూనా అడ్డుపడింది. ఇలా ఉండగా 1543 లో గ్రహాల వ్యక్తగతిని వివరించడానికి ఓ సరికొత్త ప్రతిపాదన
ప్రచురించబడింది. ఆ ప్రతిపాదన చేసిన
వాడు పోలండ్ కి చెందిన కాథలిక్ అర్చకుడు. అతడి పేరు
నికొలాస్ కోపర్నికస్. విశ్వానికి కేంద్రం సూర్యుడని, భూమి కాదని
ఆ ప్రతిపాదన ధైర్యంగా
ప్రకటించింది. భూమి గ్రహాలలో ఒక గ్రహం అనే స్థాయికి దించబడింది. సూర్యుడి నుండి మూడవ గ్రహమైన భూమి పూర్ణ వృత్తాకార కక్ష్యలో సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. టోలెమీ కూడా అలాంటి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని పరిగణించినా వెంటనే దాన్ని త్రోసిపుచ్చాడు. అలాంటి సిద్ధాంతం ప్రకారం భూమి ప్రచండ వేగంతో కదులుతోందని ఒప్పుకోవలసి ఉంటుంది కనుక, అరిస్టాటిల్ బోధించిన (తప్పుడు) భౌతిక శాస్త్రం
దృష్ట్యా అలాంటి చలనం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి కనుక, వెంటనే ఆ భావనని తిరస్కరించాడు
టోలెమీ.
టోలెమీ
ప్రతిపాదించిన విశ్వగోళాల సమూనా లాగానే ఇది కూడా గ్రహాల apparent చలనాలకి
సంబంధించిన సమాచారాన్ని చక్కగా వివరించగలిగింది. కాని ఈ కొత్త సిద్ధాంతం
ఎంతో మందికి కోపం తెప్పించింది. 1616 లో కాథలిక్ చర్చి కోపరికస్ రాసిన పుస్తకాన్ని నిషిద్ధ పుస్తకాల జాబితా లోకి చేర్చింది. స్థానిక మతసంబంధమైన
విమర్శకులు దాన్ని “సరిదిద్దినంత వరకు” ఆ నిషిద్ధ ఉంటుందని
చర్చి ప్రకటించింది. చివరికి ఆ నిషిద్ధం 1835 వరకు
కొనసాగింది.[2] మార్టిన్ లూథర్ అతణ్ణి ఇలా వర్ణించాడు. ‘వదరుబోతు జోస్యుడు… మొత్తం ఖగోళ విజ్ఞానాన్ని
తిరగరాయాలనుకునే మూర్ఖుడు. కాని జోషువా
నిశ్చలంగా ఉండమన్నది సూర్యుణ్ణి అని, భూమిని
కాదని పవిత్ర గ్రంథాలు చెప్తున్నాయి.” కోపర్నికస్ శ్రేయోభిలాషులు కూడా, కోపర్నికస్ నిజంగా
విశ్వానికి కేంద్రం సూర్యుడని నమ్మడం లేదని, అలా అనుకుంటే
గ్రహాల చలనాలు గణించడం మరింత సులభం అవుతుంది కనుక అలా అంటున్నాడని వాదించారు.
(ఇంకా వుంది)
[1] నాలుగు శతాబ్దాలకి ముందు ఆర్కిమీడిస్ అలాంటి
యంత్రాన్నే నిర్మించాడు. రోమ్ లో సిసిరో అలాంటి యంత్రాన్ని పరిశీలించి, వర్ణించాడు.
అక్కడే రోమన్ సేనాపతి మార్సెలస్ దాన్ని మోసుకుపోయాడు. ఆ మార్సెలస్ సేనలోని ఓ సైనికుడే,
దుడుకుగా, ఆజ్ఞలకి విరుద్ధంగా, సిరక్యూస్ దండయాత్ర సమయంలో, డెబ్బై ఏళ్ల వృద్ధ శాస్త్రవేత్తని
చంపేశాడు.
[2] పదహారవ శతాబ్దం నాటి కోపర్నికస్ పుస్తకం
యొక్క లభ్యమైన ప్రతులన్నిటినీ ఇటీవలి కాలంలో ఓవెన్ గెంగెరిచ్ సేకరించి, పరీక్షించాడు.
ఆ పరీక్షల బట్టి ఆ నాటి కత్తిరింపు ప్రయత్నాలు విఫలమైనట్టు తెలుస్తోంది. ఇటలీలో దొరికిన
ప్రతులలో 60% మాత్రమే ‘సవరించబడ్డాయి.’ ఐబీరియాలో దొరికిన వాటిలో ఒక్కటి కూడా మార్చబడలేదు.
0 comments