అలా విశ్వం పట్ల రెండు విరుద్ధ సిద్ధాంతాల (ఒకటి సూర్య కేంద్రక సిద్ధాంతం, రెండవది పృథ్వీ
కేంద్రక సిద్ధాంతం) మధ్య విరోధం
పదహారు, పదిహేడవ శాతాబ్దాలలో
తారస్థాయికి చేరుకుంది. ఆ వివాదానికి
ఒక వ్యక్తి ప్రతినిధిగా నిలిచాడు. వృత్తి రీత్యా
అతడు కూడా, టోలెమీ
లాగానే, ఖగోళశాస్త్రవేత్త
మాత్రమే కాక జోస్యుడు కూడా. మానవాత్మ నిర్బంధించబడి, బుద్ధికి సంకెళ్లు వేయబడ్డ దయనీయమైన పరిస్థితుల్లో అతడు జీవించాడు. ఒకటి రెండు
సహస్రాబ్దాలుగా వైజ్ఞానిక విషయాల మీద మతం చేస్తున్న అనాధారిత ప్రవచనాలని, ప్రాచీనులకి బొత్తిగా తెలియని ఆధునిక వైజ్ఞానిక పద్ధతులు చెప్పే సాక్ష్యాధారాల కన్నా విశ్వసనీయంగా తీసుకునే దుర్గతి నెలకొన్న రోజులవి. కాథలిక్, ప్రొటెస్టంట్
మొదలైన క్రైస్తవ వర్గాలకి చెందిన ఎలాంటి ప్రవచనాన్నయినా విభేదిస్తూ ఏ కాస్త ప్రకటన
చేసినా అందుకు శిక్షగా నింద, పన్ను,దేశబహిష్కరణ, చిత్రహింస, మరణదండన మొదలైన
శిక్షలు తప్పేవి కావు. గ్రహాలు సంచరించే
గోళాలని భగవంతుడు తన స్వహస్తాలతో అదిలిస్తూ ఉంటే, దేవతలు, రాక్షసులు అతడి సృష్టిలో సర్వత్ర నివస్తిస్తూ ఉంటారు. భౌతిక శాస్త్ర
ధర్మాలే ప్రకృతి ధర్మాలని వివరిస్తాయి అన్న భావన ఆనాడు లోపించింది. ఈ ధీమంతుడు, ధైర్యవంతుడు
చేసిన కృషి వల్ల ఆధునిక వైజ్ఞానిక విప్లవం మొదలయ్యింది.
యోహానెస్
కెప్లర్ జర్మనీలో 1571 లో పుట్టాడు. మాల్ బ్రాన్
అనే ఊళ్లో ఒక ప్రొటెస్టంట్ సెమినరీ బడిలో చదువుకున్నాడు. ఆ బళ్లో రోమన్
కాథలిక్ సాంప్రదాయానికి విరుద్ధంగా, ప్రొటెస్టంట్ సాంప్రదాయంలో అర్చకుడు కావడానికి తగిన శిక్షణ నిస్తారు. కెప్లర్ చిన్నప్పట్నుండి
స్వతహాగా మొండివాడు. పదునైన బుద్ధి, గాఢమైన స్వతంత్రతా భావం దానికి తోడయ్యాయి. ఈ లక్షణాల
కారణంగా మాల్ బ్రాన్ లో అతడికి ఎక్కువమంది స్నేహితులు కాలేదు. అలా రెండేళ్లు
ఒంటరిగా గడిపాడు. ఎందుకో తన
మీద దేవుడి కృపాకటాక్షాలు పడలేదన్న అపరాధ భావం పిల్లవాడిలో క్రమంగా బలపడసాగింది. పతితుడైన
తనని ఇలా ఒంటరితనంతో దేవుడు శిక్షిస్తున్నాడన్న భావన పెరిగింది. తన లాంటి
పాపికి ఈ జన్మకి విమోచనం
అంటూ ఉంటుందా అనే ఆలోచన అతణ్ణి కృంగదీయసాగింది.
అయితే
కెప్లర్ జీవులని హింసించి వారి విధేయతను సాధించే ఒక నియంతగా మాత్రమే దేవుణ్ణి ఊహించుకోలేదు. అతడి దృష్టిలో దైవం ఈ అద్భుతమైన విశ్వాన్ని
సృష్టించిన ఓ సృజనాత్మక శక్తి. అలా ఆ పిల్లవాడిలో అంకురించిన
ఉత్సుకత, జ్ఞాన పిపాస, అతడి మనసుని కలచివేస్తున్న భయాన్ని తుడిచివేసింది. జనన మరణాల గురించి చెప్పే మతబోధనలన్నీ క్షుణ్ణంగా చదివాడు. భగవంతుడి మనసు
తెలుసుకోవాలని ఉవ్విళ్లూరాడు. ఆ తపనలు అతణ్ణి
జీవితాంతం వదిలిపోలేదు. అలా ఆ పిల్లవాడిలో గాఢంగా
నాటుకున్న దైవచింతన మధ్యయుగపు యూరప్ ని అజ్ఞానపు చీకటి గుయ్యారం లోంచి బయటకి ఈడ్చింది.
ప్రాచీన
కాలానికి చెందిన శాస్త్రాలన్నీ వెయ్యేళ్ల క్రితమే మట్టిగొట్టుకుపోయాయి. కాని మధ్య యుగపు చివరి దశలలో కొన్ని కొత్త గొంతుకలు గళం విప్పాయి. ఆరిపోతున్న వైజ్ఞానిక
దివ్వెలకి దోసిలి పట్టే కొత్త చేతులు ముందుకు వచ్చాయి. అరబ్ పండితులు
పదిలంగా ఉంచిన పరిజ్ఞానం రహస్యంగా యూరప్ లోని విద్యాప్రణాళిక లోకి ప్రవేశించడం మొదలెట్టింది. మాల్ బ్రాన్ లో కూడా ఆ మహత్తర పరిణామాల ప్రతిధ్వనులు కొన్ని
కెప్లర్ ని చేరుకున్నాయి. మతవిద్యతో పాటు గ్రీకు, లాటిన్ భాషలు, సంగీతం, గణితం కూడా
చదువుకునే అవకాశం దొరికింది. విశ్వవైభవంలోని అంతరార్థం అంతా
అతడికి పరిపూర్ణంగా యూక్లిడ్ బోధించిన జ్యామితిలో (geometry) దర్శనమిచ్చింది. ఆ
విషయం గురించి కెప్లర్ ఒక చోట ఇలా రాస్తాడు -
“సృష్టికి
పూర్వమే జ్యామితి ఉండేది…భగవంతుడి మానసం
లాగే అది కూడా శాశ్వతమైనది… జ్యామితిని ఆధారంగా చేసుకుని భగవంతుడు సృష్టి రచన చేశాడు…. జ్యామితి సాక్షాత్తు భగవంతుడే.”
ఆ విధంగా కెప్లర్ తన అంతరంగంలో గణిత సౌందర్యాన్ని తలచుకుని ఎంత మురిసిపోతున్నా, నాగరిక ప్రపంచానికి దూరంగా ఎంత ప్రశాంత ఆశ్రమ జీవనాన్ని గడుపుతున్నా, జీవన సమస్యల నీలి నీడలు అతడి మనసుని అడపాదపా వేధిస్తూనే ఉన్నాయి. వాస్తవ ప్రపంచం
అతడి వ్యక్తిత్వం మీద ప్రభావం చూపిస్తూనే వుంది. క్షామం, సమరం
ఇలా ఎప్పుడూ ఏదో ఒక పీడ సమాజాన్ని పట్టిపీడించే ఆ
చీకటి యుగంలో మనుషులు ఊరట కోసం ఏవో మూడనమ్మకాలని ఆశ్రయించేవారు. ఉక్కిరిబిక్కిరి చేసే సమస్యల నుండి తారలే కడతేర్చాలి, గ్రహాలే అనుగ్రహించాలి. మనుషుల్లో ఈ బలహీనతని అదనుగా
చేసుకున్న జోస్యుల పెత్తనం బాగా ప్రబలిపోయింది. పాలకుల సమావేశాల్లోను, పానశాలల్లో కూడా ఖగోళం తెలిసిన వాడి గుప్పిట్లోకి భూగోళం వచ్చేసినట్టే. కాని జ్యోతిష్యం గురించి కెప్లర్ మనసులో నక్కి వున్న సంధిగ్ధం జీవితం అంతా అతణ్ణి విడిచిపెట్టలేదు. బాహ్య ప్రపంచం అంతా ఆవరించిన ఈ కల్లోలం మాటున
నిశ్చల విన్యాసాలు నిజంగానే ఒదిగి వున్నాయేమో? ఆ వివరాలన్నీ తారలలో
దాగి వున్నాయేమో? ఈ లోకాన్ని భగవంతుడే
మలచినట్లయితే నిశ్చయంగా దాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించాలి. భగవంతుడి మానసంలోని దివ్యలయలే ఈ విశ్వమంతా అభివ్యక్తం
అవుతున్నాయి కదా? ప్రకృతి
పుస్తకాన్ని చదవగలిగిన పాఠకుడి కోసం ఒక సహస్రాబ్ద కాలం ఎదురుచూడాల్సి వచ్చింది.
(ఇంకా వుంది)
0 comments