సోమ్నియమ్
నవలలో ఎన్నో అంశాలు కెప్లర్ జీవన ఘట్టాలే. అందులో కథానాయకుడు
టైకో బ్రాహేని సందర్శిస్తాడు. అతడి తల్లిదండ్రులు మత్తుపదార్థాలు అమ్ముకుంటారు. అతడి తల్లి దెయ్యాలతో, భూతాలతో మాట్లాడుతూ
ఉంటుంది. చివరికి ఆ
దెయ్యాలలో ఒక దాని వల్లనే చందమామకి ప్రయాణించడానికి వీలవుతుంది. సోమ్నియమ్ మనకి ఒక విషయం స్పష్టం చేస్తుంది. ఆ విషయం
కెప్లర్ సమకాలీనులకి పెద్దగా నచ్చకపోవచ్చు. అది వేరే విషయం. “బాహ్య ప్రపంచంలో లేని, ఇంద్రియాలకి చిక్కని
వస్తువులని కనీసం కలలోనైనా అప్పుడప్పుడు ఊహించుకునే స్వాతంత్రం మనిషికి ఉండాలి.” ముప్పై ఏళ్ల యుద్ధం చెలరేగుతున్న దారుణ నేపథ్యంలో కాల్పనిక విజ్ఞానం సమాజానికి మింగుడు పడలేదు.
కెప్లర్
పుస్తకం అతడి తల్లి మంత్రగత్తె అని నిరూపించడానికి సాక్ష్యం గా పరిగణించబడింది.
ఒక పక్క వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతున్న పరిస్థితుల్లో, కారాగార నిర్బంధంలో వున్న తన డెబ్బై నాలుగేళ్ల తల్లిని సందర్శించడానికి వెళ్లాడు కెప్లర్. ప్రొటెస్టంట్ ల
నేలమాళిగ జైల్లో ఆమెకి శృంఖలాలు వేసి బంధించారు. గెలీలియోని
కూడా అదే విధంగా కాథలిక్కులు తమ నేలమాళిగ జైల్లో నిర్బంధించారు. ఆమె మంత్రగత్తె అన్న అభియోగానికి కారణమైన సంఘటనలని క్రమబద్ధంగా, ఒక శాస్త్రవేత్తలా విశ్లేషించి, వాటికి శాస్త్రీయ వివరణలు ఇస్తూ వచ్చాడు కెప్లర్. అతడి విశ్లేషణ
జయించింది. శాస్త్ర దృక్పథం
మూడ నమ్మకంపై విజయం సాధించింది. కెప్లర్ జీవితమంతా ఇలాంటి విజయానికి తార్కాణాలు ఎన్నో కనిపిస్తాయి. కెప్లర్ తల్లిని విడుదల చేశారు గాని వూర్టెంబర్గ్ ఊరి నుండి వెలివేశారు. మళ్లీ ఆ ఊళ్లో అడుగుపెడితే
మరణ దండన తప్పదని హెచ్చరించి విడిచిపెట్టారు. కెప్లర్ చేసిన శాస్త్రీయ విశ్లేషణ చూసిన ఆ ప్రాంతపు డ్యూక్
ఒక కొత్త చట్టాన్ని జారీ చేశాడు. పలచని సాక్ష్యాల
ఆధారంగా, మంత్రప్రయోగం చేస్తున్నారన్న
అభియోగం మీద వ్యక్తులని న్యాయవిచారణ చేసే విధానాన్ని ఆ చట్టం నిషేధించింది.
యుద్ధం
చేస్తున్న విలయతాండవం వల్ల కెప్లర్ కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయింది. ధనసహాయం కోసం దాతలని చేయి చాచి యాచించుకుంటూ తన జీవితంలో చివరి దశలు దుర్భరంగా సాగాయి. లోగడ రడోల్ఫ్-II చక్రవర్తికి
చేసినట్టే, చివరి రోజుల్లో
వాలెన్ స్టయిన్ కి చెందిన డ్యూక్ కి జోస్యం చెప్పుకుంటూ పొట్టపోసుకున్నాడు. వాలెన్ స్టయిన్ ప్రాంతంలోని సాగన్ అనే ఊళ్లో తన చివరి రోజులు గడిపాడు. తన సమాధి
మీద చెక్కబడ్డ చరమ శ్లోకాన్ని తనే రాసుకున్నాడు:
“నీలాకాశాన్ని
కొలిచాను,
నీడలలో
కరిగిపోయాను.
దివిని
తాకింది మానసం,
భువిలో
కలిసింది దేహం.”
కాని
ముప్పై ఏళ్ల యుద్ధం ఆ సమాధి ఆనవాళ్లు
కూడా లేకుండా తుడిచేసింది. ఆ స్థలంలో ఇప్పుడు
ఒక స్మారక చిహ్నాన్ని గాని స్థాపించినట్లయితే దాని మీద ఒక శాస్త్రవేత్తగా అతడి ధైర్యానికి మన్ననగా ఈ వాక్యాన్ని చెక్కాలేమో –
“అత్యంత
ప్రియమైన భ్రాంతులని కూడా త్రోసిపుచ్చి, ఎప్పుడూ పచ్చి నిజాన్నే కాంక్షించిన ఘనుడు.”
ఏదో ఒకనాడు “దివి పవనాల ప్రోద్బలం మీద నడిచే ఆకాశనౌకలు” వస్తాయని నమ్మాడు
యోహానెస్ కెప్లర్. “అంతరిక్షపు బృహత్తుకి వెరవని” అన్వేషులతో ఆకాశమంతా
నిండిపోతుంది అని ఊహించాడు. కెప్లర్ తన
జీవితాంతం ఎన్నో అష్టకష్టాలకోర్చి కనిపెట్టిన మూడు గ్రహచలన నియమాలని ఆధారంగా చేసుకుని నేడు ఆ అన్వేషులు (వాళ్లు
మనుషులైనా కావచ్చు, రోబోలైనా కావచ్చు) వినువీధుల
వెంట దూసుకుపోతూ విశ్వాన్ని శోధిస్తున్నారు.
(ఇంకా వుంది)
0 comments