గ్రహాల
చలనాలని తెలుసుకోవడం కోసం, విశ్వసామరస్యాలని అర్థం చేసుకోవడం
కోసం, జీవితాంతం కెప్లర్
చేసిన అనన్య కృషి అతడు మరణించిన ముప్పై ఆరేళ్ల తరువాత ఐసాక్ న్యూటన్ అనే మేధావి కృషి వల్ల సాఫల్యం చెందింది.
ఐసాక్
న్యూటన్ 1642 లో క్రిస్ట్ మస్ నాడు జన్మించాడు. పుట్టిన పసికందు ఎంత చిన్నగా ఉన్నాడంటే కొన్నేళ్ల తరువాత ఆ పసికందు ఆకారాన్ని తలచుకుంటూ
వాళ్లమ్మ “ఓ చిన్న
మగ్గులో పట్టేస్తాడు” అంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులకి
దూరమై, ఎప్పుడూ అనారోగ్యంతో
బాధపడుతూ, పేచీలకోరు, సంఘవ్యతిరేకి, ఆజన్మబ్రహ్మచారి అయిన ఐసాక్ న్యూటన్ ని మించిన వైజ్ఞానిక మేధావి చరిత్రలో లేడని అంటారు.
చిన్నతనం
నుండి కూడా అంతూపొంతూ లేని ప్రశ్నలతో ఎప్పుడు అసహనంగా మసలేవాడు న్యూటన్. ఉదాహరణకి కాంతి
ఒక “ద్రవమా, ఉపద్రవమా”? శూన్యం ద్వార గురుత్వం ప్రసారం కాగలదా? క్రైస్తవ సాంప్రదాయంలో
త్రిమూర్తులు అన్న భావన మతగ్రంథాలని తప్పుగా అన్వయించడం వల్ల పుట్టింది అని న్యూటన్ చిన్ననాడే నిశ్చయించుకున్నాడు. ఆ
విషయం గురించి అతడి జీవితచరిత్రకారుడు జాన్ మేయినార్డ్ కెయిన్స్ ఇలా అంటాడు –
“అతడు
మైమొనీడిస్ సాంప్రదాయానికి చెందిన జుడాయిక్ అద్వైత వాదాన్ని ఆశ్రయించాడు. అయితే అది హేతువాదం మూలంగానో, శాస్త్రీయ దృక్పథం
వల్ల పుట్టిన నిర్ణయమో కాదు. ప్రాచీన గ్రంథాలని
అతడు సొంతంగా అన్వయించుకుని ఆ నిర్ణయం తీసుకున్నాడు. త్రిమూర్తి
వాదాన్ని సమర్ధించే ఆధారాలేవీ ప్రాచీన గ్రంథాలలో లేవని, అవన్నీ అర్వాచీన
కాలంలో చేరిన కల్లలేనని అతడు నమ్మాడు. మొట్టమొదట
ప్రకటితమైన దైవం అనన్య దైవం. కాని ఈ
రహస్యాన్ని ఎంతో కష్టపడి జీవితాంతం దాచడం కోసం న్యూటన్ ప్రయత్నించాడు.””
కెప్లర్
లాగానే న్యూటన్ కి కూడా ఆ కాలపు మూడనమ్మకాల
వాసన అంతో ఇంతో సోకింది. అతడికి అధ్యాత్మికతతో
కూడా అంతో ఇంతో పరిచయం వుంది.
న్యూటన్
యొక్క మనోవికాసానికి నేపథ్యంలో ఎప్పుడూ హేతువాదానికి, అధ్యాత్మికతకి మధ్య సంఘర్షణ ఉండేది. 1663 లో, ఇరవై
ఏళ్ల వయసులో, స్టూర్ బ్రిడ్జ్
సంతలో “అదేంటో తెలుసుకోవాలన్న
ఉత్సుకత కొద్దీ” జ్యోతిష్యం మీద
ఓ పుస్తకం కొనుక్కున్నాడు. ఆ పుస్తకం చదువుతుంటే
ఒక చోట అందులోని ఒక చిత్రం అర్థం కాలేదు. ఎందుకంటే అది
అర్థం కావడానికి త్రికోణమితి (trigonometry) తెలియాలి. కాబట్టి త్రికోణమితి మీద ఒక పుస్తకం కొనుక్కుని చదవడం మొదలెట్టాడు. కాని అందులో ఒక చోట జ్యామితికి చెందిన కొన్ని వాదనలు అతడికి అర్థం కాలేదు. కాబట్టి జ్యామితి
నేర్చుకోవడం కోసం యూక్లిడ్ రాసిన Elements of Geometry (జ్యామితి మూలాలు)
అనే పుస్తకం తెచ్చి చదవడం మొదలెట్టాడు. అది చదివిన రెండేళ్ల తరువాత అవకలన కాల్క్యులస్ (differential calculus) కనిపెట్టాడు.
విద్యార్థి
దశ నుండి కూడా న్యూటన్ కి కాంతి అంటే ఏదో చెప్పలేని విస్మయం ఉండేది. సూర్యుడి పక్క
తదేకంగా చూసే అలవాటు ఉండేది. అద్దంలో సూర్యుణ్ణి
తదేకంగా చూసే ప్రమాదకరమైన అలవాటు కూడా ఉండేది.
“అలా
కొన్ని గంటలు చూసిన తరువాత నా కళ్లు ఎలాంటి స్థితికి వచ్చాయంటే ఇక ఏ వస్తువుని చూడడం
సాధ్యపడలేదు. ఎటు చూసినా ఆ ప్రకాశవంతమైన సూర్యబింబమే
కనిపించేది. కాబట్టి ఇక చదవడం, రాయడం వంటివేవీ
చెయ్యలేకపోయాను. ఈ దుస్థితి నుండి
తప్పించుకోవడం కోసం మూడు రోజులు నా గదిలో, చీకట్లో నన్ను
నేనే బంధించుకున్నాను. ఆ సూర్యబింబాన్ని తలచుకోను కూడా
తలచుకోకుండా జాగ్రత్తపడ్డాను. ఎందుకంటే సూర్యుణ్ణి తలచుకుంటే చాలు, చుట్టూ చీకటి
వున్నా, నా దృష్టి
మాత్రం పూర్తిగా సూర్యతేజంతో నిండిపోయేది.”
1666 లో
ఇరవై మూడేళ్ల న్యూటన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బీయస్.సీ.
చదువులో చేరాడు. అదే సమయంలో
దురదృష్టవశాత్తు లండన్ లో ప్లేగు వ్యాధి భయంకరంగా ప్రబలిపోయింది. కళాశాల మూసి విద్యార్థులని ఇళ్లకి పంపేశారు. ఆ విధంగా
న్యూటన్ తన స్వగ్రామం అయిన వూల్స్ థార్ప్ లో ఓ ఏడాది ఏకంతంలో
గడపాల్సి వచ్చింది.
ఆ కాలంలోనే న్యూటన్ అవకలన (differential), సంకలన (integral) క్యాల్కులస్ (calculus) లు కనిపెట్టాడు. అదే సమయంలో కాంతి యొక్క తత్వం గురించి ఎన్నో ముఖ్యమైన అధ్యయనాలు చేశాడు. విశ్వజనీన గురుత్వ
సిద్ధాంతానికి పునాదులు వేశాడు. ఆ ఒక్క
సంవత్సరం ఒంటరిగా ఆ చిన్న పల్లెలో
కృషి చేస్తూ ఓ వైజ్ఞానిక విప్లవాన్నే
సాధించాడు న్యూటన్. భౌతికశాస్త్ర చరిత్రలో
దీన్ని పోలిన మరో సన్నివేశం ఐన్ స్టయిన్ జీవితంలో వస్తుంది. 1905 ని ‘’మహిమాన్విత సంవత్సరం’’ అంటారు. అలాంటి అద్భుతమైన
ఆవిష్కరణలు ఎలా చేశావని ఎవరో అడిగితే దానికి న్యూటన్ క్లుప్తంగా “వాటి గురించి ఆలోచించి,” అని సమాధానం చెప్పాడు. కేంబ్రిడ్జ్ లో
న్యూటన్ సాధించిన వైజ్ఞానిక విజయం ఎంత గొప్పదంటే అతడు కేంబ్రిడ్జ్ కి తిరిగి వచ్చిన ఐదేళ్ల తరువాత అతడి ఆచార్యుడైన ఐసాక్ బారో గణితవిభాగంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆ పదవిని న్యూటన్
కి అప్పగించాడు.
నలభై
లలో ఉన్న న్యూటన్ ని అతడి వద్ద పని చేసిన ఓ వ్యక్తి ఇలా
వర్ణిస్తాడు –
“మనోల్లాసం
కోసం వ్యాహ్యాళికి వెళ్లడమో, గుర్రపు స్వారీ
చెయ్యడమో, బంతాట ఆడుకోవడమో
మొదలైనవి ఏవీ ఆయన చెయ్యడం నేను ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడూ తన
గదిలో అధ్యయనంలో మునిగిపోయి ఉండేవాడు. లేదంటే ఆలోచనల్లో
మునిగిపోయి ఉండేవాడు. కాలేజి పని
చేసే రోజుల్లో…
[ఉపన్యాసాల
కోసం మాత్రం] తన గదివిడిచి
బయటికి వెళ్లేవాడు. ఆ ఉపన్యాసాలకి చాలా
తక్కువ మంది హాజరు అయ్యేవారు. ఇంకా తక్కువ
మంది వాటిని అర్థం చేసుకునేవారు. ఇక కొన్ని సార్లు శ్రోతలు లేకపోతే తనదైన ఫక్కీలో గోడలకి పాఠం చెప్పుకునేవాడు.”
కెప్లర్
విషయంలో లాగానే, న్యూటన్ విషయంలో
కూడా విద్యార్థులకి వాళ్లు ఏం కోల్పోతున్నారో ఎప్పుడూ అర్థం కాలేదు.
(ఇంకా వుంది)
చాలా బావుంది సర్