ఒక తోకచుక్క
గ్రహంతో ఢీకొన్ని ఘటన ఆ గ్రహం మీద
గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని గ్రహ శాస్త్రవేత్తలు వాదిస్తుంటారు. ఉదాహరణకి మార్స్ వాతావరణంలో నేడు
కనిపించే నీటికి మూలం ఇటీవలి కాలంలో ఆ గ్రహాన్ని ఢీకొన్న
ఒక చిన్న తోకచుక్కే అని నిరూపించొచ్చు. తోకచుక్కల తోకల్లో ఉండే పదార్థం మెల్ల మెల్లగా అంతరిక్షంలోకి ఎగజిమ్మబడుతుందని, అలా ఎగజిమ్మబడ్డ పదార్థం క్రమంగా ఇరుగుపొరుగు గ్రహాల గురుత్వాకర్షణకి గురవుతుందని న్యూటన్ కూడా గుర్తించాడు. అలాగే భూమి మీద ఉండే ద్రవాలన్నీ క్రమంగా వినష్టమవుతూ ఉంటాయని భావించాడు. “వృక్షరాసి చేత హరించబడి, కుళ్లిన జీవపదార్థంలో
విలీనమై, చివరికి ఎండు
నేలగా మారిపోతుంది… ద్రవాలని బయటి నుండి ఎప్పటికప్పుడు సరఫరా చేస్తూ ఉండకపోతే, అవి క్రమంగా
తరిగి హరించుకుపోతాయి,” అంటాడు న్యూటన్. భూమి మీద
సముద్రాలకి మూలం తోకచుక్కలేనని, తోకచుక్కల లోని పదార్థం భూమి మీద పడడం వల్లనే జీవం ఆవిర్భవించిందని న్యూటన్ ఆలోచన. ఆ ఆలోచనా
ధోరణి ఒక సందర్భంలో అధ్యాత్మిక పుంతలు తొక్కుతోంది. ఇలా – “ఆత్మకి మూలం
కూడా తోకచుక్కలే నేమో అని నా సందేహం. ఎందుకంటే గాల్లో
అతి సూక్ష్మమైన అంశం ఆత్మే. దాని వల్లనే
మన చుట్టూ కనిపించే జీవరాశి మనగలుగుతోంది.”
1868 లో విలియమ్ హగ్గిన్స్ అనే ఖగోళవేత్త తోకచుక్క యొక్క వర్ణపటానికి (spectrum), సహజ (“olefient”) వాయువు యొక్క వర్ణపటానికి మధ్య పోలిక గమనించాడు. ఆ విధంగా
తోకచుక్కల మీద కర్బన రసాయనాలు ఉన్నాయని గుర్తించాడు హగ్గిన్స్. తదనంతర కాలంలో
సయనోజెన్ (cyanogen, CN) అనే అణువు తోకచుక్కల తోకల్లో ఉన్నట్టు కనిపించింది. ఇందులో ఒక కార్బన్ పరమాణువు, ఒక నైట్రోజెన్
పరమాణువు ఉంటాయి. సయనైడ్ లలోని
ఒక అణ్వంశం ఇదే. ఆ
కారణం చేత 1910 లో భూమి
హాలీ తోకచుక్క తోక లోంచి ప్రయాణిస్తోంది అని తెలియగానే జనం ఆందోళన చెందారు.
వారికి
తెలియని విషయం ఏమిటంటే తోకచుక్క తోకలోని పదార్థం చాలా పలచగా ఉంటుంది. తోకచుక్క తోకలోని
విషపదార్థాల కన్నా పెద్ద నగరాల్లో పారిశ్రామిక కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదం ఇంకా పెద్దది.
ఈ విషయాలన్నీ
తెలిసినా జనం ఆందోళన తగ్గలేదు. 1910, మే 15 వ తేదీ
నాడు సాన్ ఫ్రాన్సిస్కో వార్తా పత్రికలో పడ్డ ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి – “తోకచుక్క కెమేరా, ఇల్లంత పెద్దది,” “న్యూయార్క్ నగరంలో వేలం వెర్రిగా తోకచుక్క విందులు.”
లాస్
ఏంజిలిస్ ఎగ్సామినర్ అనే పత్రికలో వార్తలు ఇంకా పసందుగా ఉన్నాయి. “ఏవయ్యా? తోకచుక్క ఇంకా
నీకు సైనోజెన్ పూత వెయ్యలా?... మానవ జాతి మొత్తానికి సైనోజెన్ స్నానం తప్పదు.” “పారాహుషార్! అయిపో పరార్!”, “ఇప్పటికే
సైనో‘జనం’
మత్తులో జనం.” “క్షతగాత్రుడు పాపం
తాటి చెట్టెక్కి తోకచుక్కకి ఫోన్ చేశాట్ట!” 1910లో సైనోజెన్ విషప్రభావం వల్ల మానవజాతి నాశనం అవుతుందన్న పుకారు జనం మనసుల్లో బలంగా నాటుకుంది. ఇక నేడో
రేపో అని జనం యుగాంతం కోసం సిద్ధమయ్యారు. ఇక మిగిలిన కాసిన్ని మాసాలు విందులు విలాసాల్లో సరదాగా గడపాలనుకున్నారు. తోకచుక్క బారిన పడకుండా కాపడే మందులు అమ్మారు దొంగవ్యాపారులు. గ్యాస్ మాస్కులు వేడి వేడి రస్కుల్లా అమ్ముడుపోయాయి. మొదటి ప్రపంచ యుద్ధ నేపథ్యాన్ని తలపించాయి అమెరికన్ నగరాలు.
1910 వచ్చి వెళ్లింది. లోకానికేం కాలేదు. అయినా ఆ తరువాత కూడా తోకచుక్కకి
సంబంధించిన ఎన్నో అపోహలు మనుషుల మనసుల్ని విడిచిపెట్టలేదు. అది 1957 సంవత్సరం. అప్పటికి నేను
యూనివర్సిటీ ఆఫ్ షికాగో కి చెందిన యెర్కెస్ నక్షత్రశాలలో పీ.హెచ్.డీ. చేస్తున్నాను. ఓ రోజు అర్థ
రాత్రి నక్షత్రశాలలో ఒంటరిగా పని చేసుకుంటున్న సమయంలో ఫోన్ పదే పదే రింగ్ అయ్యింది.
ఫోన్ తీసి
హలో అన్నాను.
“ఏవయ్యా! అక్కడ యవడైనా
ఖగోళ వేత్త వ్వున్నాడా?...” మాటలో మత్తు ఇంకా వదిలినట్టు లేదు.
“ఏం కావాలండీ మీకు?” కాస్త విసుగ్గా అడిగాను.
“ఇదుగో చూడుబాబూ. ఇక్కడ మేం
విల్మెట్ లో ఆరుబయట మాంచి విందు చేసుకుంటున్నాం. చూడబోతే ఆకాశంలో ఏదో చిన్న చుక్క లాంటిది కనిపిస్తోంది. అయితే యిచిత్రం ఏంటంటే, సూటిగా చూస్తే
టక్కున మాయమైపోతాది. చూడకపోతే చటుక్కున కనిపిస్తాది.”
మన కంట్లోని
రెటీనాలోని అత్యంత సునిశితమైన ప్రాంతం మన దృష్టి క్షేత్రానికి కేంద్రంలో లేదు. కేంద్రానికి కాస్త
పక్కగా ఉంది. కాబట్టి కాస్త
బలహీనమైన తారలని సూటిగా కాకుండా, కొంచెం పక్కగా
చూస్తే కనిపిస్తాయి. ఆ రోజుల్లో ఆ
మధ్యనే కనుక్కోబడ్డ ఆరెండ్-రోలాండ్ అనే
ఓ కొత్త తోకచుక్క
ఆకాశంలో కనిపిస్తోందని నాకు తెలుసు. బహుశా మీరు
ఓ తోకచుక్కని చూస్తూ
ఉండొచ్చని సూచించాను.
కాసేపు అవతలి
నుండి మాట రాలేదు.
“”తోక’చుక్కా’? …అదేం ‘చుక్క’బ్బా?” అన్నాడు అవతలి వ్యక్తి.
“తోకచుక్క అంటే అదో పెద్ద మంచుబంతి లాంటిది,” వివరించడానికి ప్రయత్నించాను. “ఓ మైలు పొడవుంటుంది.”
మళ్లీ చాలా
సేపు నిశ్శబ్దం.
“ఏం బాబూ! ఇంట్లో పెద్దాళ్ళెవరూ
లేరా?”
హాలీ తోకచుక్క
మళ్లీ 1986 లో కనిపించబోతోంది. ఆ సందర్భంలో ఇక
మన అయోమయపు నేతలు ఇంకెన్ని విచిత్రమైన పోకళ్లు పోతారో? మన అమాయకపు
జనం ఇంకెంత గంగవెర్రు లెత్తిపోతారో?
(ఇంకా వుంది)
0 comments