నేనొక స్నేహితురాల్ని పలకరించినప్పుడు ఆమె నుండి ప్రతిబింబితమైన కాంతిని నేను చూస్తున్నాను. ఆ కాంతి సూర్య కాంతి కావచ్చు, ఇంటి దీపపు వెలుగు కావచ్చు. ఆమె మీద పడి వెనక్కు తుళ్లిన కిరణాలు నా కంట్లోకి ప్రవేశిస్తాయి. కాని దీని గురించి ప్రాచీనుల ఆలోచనలు వేరుగా ఉండేవి. ఈ విషయంలో యూక్లిడ్ వంటి మహానుభావులు కూడా పొరబాటు చేశారు. మన కళ్లలోంచి బయటికి ప్రసరించే ఏవో కిరణాలు బయట ప్రపంచంలో లక్ష్యాల మీద పడినప్పుడు ఆ లక్ష్యం మనకి కనిపిస్తుందని వాళ్లు భావించారు. ఇది చాలా సహజమైన ఆలోచన. ఇప్పటికీ అక్కడక్కడా మనకి తారసపడుతుంది. అయితే చీకటి గదిలో వస్తువు ఎందుకు అదృశ్యంగా ఉండిపోతాయో ఈ భావన మనకి చెప్పదు. ఈ రోజు మనం లేజర్ ని, ఫోటో సెల్ తో కలుపుతున్నాం. రేడియో ట్రాన్స్మిటర్ ని, రేడియో టెలిస్కోప్ తో కలుపుతున్నాం. ఆ విధంగా సుదూర వస్తువులని కాంతి తో స్పృశిస్తున్నాం. రాడార్ ఖగోళ శాస్త్రంలో, భూమి మీద ఉండే టెలిస్కోప్ నుండి రేడియో తరంగాలు బయటికి ప్రసారం అవుతాయి. అవి ఉదాహరణకి మన దిశగా తిరిగిన వీనస్ ఉపరితలం మీద పడి వెనక్కు చిందుతాయి. ఎన్నో తరంగ దైర్ఘ్యాల వద్ద వీనస్ మీద మబ్బులు, వాతావరణం కూడా రేడియో తరంగాలకి పారదర్శకంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఉపరితల ప్రాంతాలు రేడియో తరంగాలని గ్రహిస్తాయి. ఉపరితకం మీద కరకుగా ఉండే ప్రాంతాల మీద పడ్డప్పుడు రేడియో తరంగాలు నలుదిశలా వికీర్ణం (scatter) అవుతాయి. అలాంటి ప్రాంతాలు రేడియో తరంగాల దృష్ట్యా చీకటిగా కనిపిస్తాయి.
ఆ విధంగా వీనస్
తన అక్షం మీద తాను పరిభ్రమిస్తుంటే వీనస్ ఉపరితల విశేషాలని రేడియో టెలిస్కోప్ తో అనుసరించారు. వీనస్ ఆత్మప్రదక్షిణ చెయ్యడానికి ఎంత సమయం పడుతుందో మొట్టమొదటి సారి అప్పుడే అర్థమయ్యింది. వీనస్ తన అక్షం మీద తాను ఒక చుట్టు చుట్టడానికి 244 (భూమి) రోజులు పడుతుందని
తెలిసింది. పైగా తక్కిన
గ్రహాలన్ని ఒక దిశలో పరిభ్రమిస్తే, వీనస్ ఆత్మభ్రమణం మ మాత్రం అందుకు
వ్యతిరేక దిశలో జరుగుతుందని కూడా తెలిసింది. ఆ కారణం
చేత, వీనస్
ఉపరితలం నుండి చూస్తే, సూర్యుడు పశ్చిమంలో
ఉదయించి, తూర్పులో అస్తమిస్తాడు. వీనస్ మీద సూర్యోదయానికి, సూర్యోదయానికి మధ్య 118 భూమి రోజులు గడుస్తాయి. మరో విచిత్రం
ఏమిటంటే వీనస్ మనకి అత్యంత సన్నిహితంగా వచ్చిన ప్రతీ సారి ఇంచుమించు ఒకే ముఖాన్ని మనకి ప్రదర్శిస్తుంది. భూమి గురుత్వం మరి ఎలాగో వీనస్ ని ఈ విధంగా పృథ్వీ
సంధానమైన (Earth-locked) పరిభ్రమణ వేగంలో నిలిపింది. అది ఎలా
జరిగినా వేగంగా మాత్రం జరిగే అవకాశం లేదు. కాబట్టి వీనస్
వయసు కేవలం కొన్ని వేల సంవత్సరాలు కావడం అనేది అసాధ్యం. సౌరమండలంలో ఇతర
వస్తువుల లాగానే మరి వీనస్ కూడా పురాతని.
వీనస్ నుండి
ఎన్నో రాడార్ చిత్రాలు సేకరించబడ్డాయి. కొన్ని భూమి మీద పని చేసే రేడియో టెలిస్కోప్ ల నుండి వస్తే, మరి కొన్ని వీనస్ చుట్టూ కక్ష్యలో తిరిగే పయనీర్ వీనస్ వ్యోమనౌక పంపింది. చందమామ మీద
ఉన్నత భూములలో ఉన్న ఉల్కాబిలాల వంటివే, మరీ పెద్దవి
మరీ చిన్నవి కాని ఉల్కాబిలాలు ఎన్నో వీనస్ మీద ఉన్నాయి. వీనస్ మీద
ఉల్కాబిలాల సంఖ్య బట్టి కూడా అది పురాతన గ్రహం అని స్వయంగా చాటుకుంటోంది. అయితే వీనస్ ఉల్కాబిలాల లోతు కాస్త తక్కువ. ఆ గ్రహం
మీద అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల రాయి కరిగి జీడిపాకంలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఆ కారణం చేత
ఉల్కాబిలాల కరుకైన కొనలు, మొనలు కాలక్రమేణా
తరిగిపోతాయి. అక్కడ కొన్ని విశాలమైన పీఠభూములు ఉన్నాయి. కొన్ని టిబెటన్
పీఠభూమి కి రెండింతలు ఎత్తు గలవి ఉన్నాయి. ఎంతో లోతైన
అగాధాలు ఉన్నాయి. బృహత్తరమైన అగ్నిపర్వతాలు
ఉన్నాయి. సుమారు ఎవరెస్ట్
తో సరితూగేటంత ఎత్తయిన పర్వతాలు ఉన్నాయి. అంతవరకు మబ్బు
చాటున దాగి వున్న ప్రపంచాన్ని ఇప్పుడు రాడార్ పరికరాలు, అంతరిక్షనౌకలు బట్టబయలు
చేస్తున్నాయి.
వీనస్ ఉపరితల
ఉష్ణోగ్రత 480 డిగ్రీల సెల్షియస్ లేదా 900 డిగ్రీల ఫారెన్ హీట్ వద్ద ఉంటుంది. మనం ఇంట్లో
వాడే ఓవెన్ లోని గరిష్ఠ ఉష్ణోగ్రత కన్నా ఇది చాలా హెచ్చు. ఈ సంగతి
రేడియో ఖగోళ విజ్ఞానం వల్ల తెలిసినది, ప్రత్యక్షంగా అంతరిక్ష
పరిశీలనల వల్ల నిర్ధారించబడినది. అలాగే ఉపరితల పీడనం 90 వాతావరణాల వద్ద ఉంటుంది. అంటే భూమి
ఉపరితల పీడనానికి 90 రెట్లు అన్నమాట. సముద్రపు లోతుల్లో 1 కిలోమీటర్ నీటి మట్టానికి అడుగున ఉండే పీడనంతో ఇది సమానం. వీనస్ మీద
ఎక్కువ సమయం మనగలిగే అంతరిక్ష నౌకని ఓ రెఫ్రిజెరేటర్ లా
నిర్మించాలి. ఓ సబ్మెరిన్ లా
ధృఢంగా ఉండేలా దాని రూపకల్పన జరగాలి.
నిప్పులుకక్కే వీనస్ ఉపరితలం
వెనకటి సోవియెట్
యూనియన్ నుండి, యునైటెడ్ స్టేట్
స్ నుండి కూడా సమారు ఓ డజను అంతరిక్షనౌకలు
వీనస్ వాతావరణాన్ని ఛేదించాయి. వాటిలో కొన్ని
ఉపరితలాన్ని చేరుకున్నాక కూడా, బతికి బట్టకట్టి, ఓ
గంట సేపు పని చేశాయి.[1] సోవియెట్ వెనెరా సీరీస్ కి చెందిన రెండు అంతరిక్ష నౌకలు అక్కడ చిత్రాలు తీశాయి. ఈ ప్రప్రథమ
మిషన్ల అడుగుజాడల్లో నడిచి ఆ నవ్య ప్రపంచాన్ని
సందర్శిద్దాం.
మామూలు దృశ్యకాంతిలో
వీనస్ చుట్టూ ఆవరించిన లేత పసుపుపచ్చ మబ్బులని సులభంగా గుర్తుపట్టొచ్చు. ఆ మబ్బుల్ని ఆనాడు
గెలీలియో స్వయంగా చూశాడు. కాని అందులో
పెద్దగా విశేషాలేవీ కనిపించవు. కాని అతినీలలోహిత
కాంతితో వీనస్ ని పరిశీలిస్తే వాతావరణంలో సుడులు తిరిగే బృహత్తరమైన వాయుగుండాలు కనిపిస్తాయి. అందులో 100 మీ/సెకను
వేగంతో, అంటే
220 మైళ్లు/గం వేగంతో ప్రచండమైన గాలులు వీస్తుంటాయి. వీనస్ వాతావరణంలో 96 శాతం కార్బన్ డయాక్సయిడ్ ఉంటుంది. నైట్రోజెన్, నీటి
ఆవిరి, ఆర్గాన్, కార్బన్
మోనాక్సయిడ్ తదితర వాయువులు నామమాత్రంగా ఉంటాయి. కాని అక్కడ
ఉండే కర్బన రసాయనాలు, కార్బోహైడ్రేట్ లు మిలియన్
లో 0.1 భాగానికి మించి ఉండవు. వీనస్ మబ్బులు
అధిక శాతం సాంద్ర సల్ఫూరిక్ ఆసిడ్ మయమై ఉంటాయి. వీనస్ వాతావరణంలో, ఎంతో ఎత్తున,
చల్లని
మేఘసీమ కూడా పరమభీకరమైన ప్రదేశం అని ఒప్పుకోక తప్పదు.
వీనస్ వాయుమండలంలో
కంటికి కనిపించే మేఘవేదిక పైన, 70 కిమీల ఎత్తున, సన్నని ధూళి కణాల పొగతెర వంటిది విస్తరించి వుంటుంది. ఇక
60 కిమీల ఎత్తున, మబ్బు తెరని
ఛేదించుకుపోతే, సాంద్ర సల్ఫూరిక్ ఆమ్ల బిందువులు మనని చుట్టుముడతాయి. ఇంకా లోతుకి పోతే మబ్బుల్లోని రేణువులు మరింత పెద్దవి అవుతాయి. వాతావరణ దిగువ
ప్రాంతాల్లో సల్ఫర్ డయాక్సయిడ్ (SO2) అనే
ఘాటైన వాయులు సూక్ష్మ మోతాదుల్లో దొరుకుతుంది. ఈ వాయువే పైకెగసి, మబ్బుల్లో కలిసి, సూర్యకాంతి లోని
అతినీలలోహిత కిరణాల చేత విచ్ఛిన్నం గావించబడి, అక్కడ నీటి
ఆవిరితో కలిసి సల్ఫురిక్ ఆసిడ్ ఏర్పడుతుంది. అలా ఏర్పడ్డ ఆసిడ్ బిందువులుగా మారి, కిందికి దిగుతుంది. ఇక దిగువ ప్రాంతాల్లో మళ్లీ SO2 మరియు, నీరు
గా విచ్ఛిన్నమై, చక్రికంగా ఆ ప్రక్రియ సాగుతూ
ఉంటుంది. వీనస్ మీద
నిరంతరం సల్ఫూరిక్ ఆసిడ్ వర్షిస్తూ ఉంటుంది. కాని అందులో
ఒక్క బొట్టు కూడా ఉపరితలాన్ని చేరుకోదు.
(ఇంకా వుంది)
[1]
1978-1979 ప్రాంతంలో USA విజయవంతంగా
పంపిన ఓ మిషన్ పేరు పయనీర్ వీనస్. అందులో ఒక ఆర్బిటర్, వాతావరణంలోకి ప్రవేశించే నాలుగు
ప్రోబ్ లు (entry probes) ఉన్నాయి. వాటిలో రెండు మాత్రమే వీనస్ ఉపరితలం మీద నెలకొన్న
కఠిన పరిస్థితులకి తట్టుకున్నాయి. గ్రహాల అన్వేషణ కోసం అంతరిక్ష నౌకల వినియోగంలో ఎన్నో
సమస్యలు ఎదురవుతాయి. పయనీర్ వీనస్ ఎంట్రీ ప్రోబ్ లలో net flux radiometer అనే సాధనాలు ఉన్నాయి. వీనస్ వాతావరణంలో ప్రతీ చోట
పైకి, కిందకి ప్రవహించే పరారుణ శక్తిని కొలవడం ఈ సాధనం పని. పరారుణ కిరణాలకి పారదర్శకంగా
ఉంటూ, గట్టిగా ఉండే కిటికీ కూడా ఆ సాధనంలో ఉండాలి. ఆ ప్రయోజనం కోసం 13.5 కారట్ల వజ్రాన్ని
దిగుమతి చేసి, దానికి సానపట్టి ఆ సాధనంలో అమర్చారు. అయితే వజ్రాన్ని సరఫరా చేసిన కంట్రాక్టరు
ఇంపోర్ట్ డ్యూటీ కింది $12,000 కట్టాల్సి వచ్చింది. అయితే చివరికి అమెరికాలో కస్టమ్స్
విభాగం వాళ్లు, ఆ వజ్రం అంతరిక్షంలోకి పంపబడుతోంది కనుక, భూమి మీద వ్యాపారంలో భాగం
కాదు గనుక ఉత్పత్తి దారుడికి ఆ డ్యూటీ సొమ్ము తిరిగి ఇచ్చేశారు.