వీనస్ మీద
ఎంత తరచి చూసినా ఏమీ కనిపించకపోయే సరికి, అదంతా ఓ
పెద్ద చిత్తడి నేల అని శాస్త్రవేత్తలు నమ్మడం మొదలెట్టారు. కార్బొనీఫెరస్ యుగంలో (Carboniferous period) భూమి ఉపరితలాన్ని పోలిన పరిస్థితి అన్నమాట. దానికి సంబంధించిన
వాదన (అసలు దాన్ని
వాదన అని అనగలిగితే!) ఇలా ఉండేది –
“వీనస్ మీద నాకేమీ కనిపించడం లేదే.”
“ఎందుకు కనిపించడం లేదు?”
“ఎందుకంటే అదంతా ఏదో మబ్బులతో కప్పబడింది.”
“మరి ఆ మబ్బుల్లో ఏవుందో?”
“నీరే. ఇంకేవుంటుంది?”
“అలాంటప్పుడు భూమి మీద మబ్బుల కన్నా వీనస్ మబ్బులు అంత దట్టంగా ఎందుకున్నాయి?”
“ఎందుకంటే అక్కడ ఇంకా ఎక్కువ నీరు ఉందిగనుక.”
“మరి మబ్బుల్లో ఎక్కువ నీరు ఉంటే, నేల మీద
కూడా ఎక్కువ నీరు ఉండాలిగా? బాగా తడిగా
ఉండే నేలని ఏమంటారు?”
“చిత్తడి నేల.”
అదీ వరస. వీనస్ మీద చిత్తడి నేలే ఉంటే ఇక సయాకాడ్ లు (cyacads), తూనీగలు, అంతెందుకు డైనోసార్లు
కూడా వీనస్ మీద ఉంటాయేమో? ఆ విధంగా “వీనస్ మీద ఏమీ కనిపించడం లేదు” అనే పరిశీలనకి
సమాధానంగా “వీనస్ మీద
జీవరాశులు ఉన్నాయి” అన్న నిర్ణయానికి
వచ్చారు మన శాస్త్రవేత్తలు. మనం సజీవంగా ఉన్నాం కనుక విశ్వంలో ప్రతీ చోట జీవం ఉందన్న భావన మనకి రుచిస్తుంది. కాని ఎంతో శ్రద్ధగా, ఓపిగ్గా, కచ్చితంగా
ఆధారాలు పోగు చేసి విశ్లేషిస్తే తప్ప ఒక ప్రపంచంలో జీవరాశులు ఉన్నాయో లేదో తెలుసుకోలేము. మన మూడనమ్మకాలకి వత్తాసుపలకడం కోసం వీనస్ గ్రహం కాచుకుకూర్చోలేదు.
వీనస్ గుట్టు
ఓ ప్రత్యేకమైన గాజుతో
చేసిన పట్టకాన్ని (prism) వాడి చేసిన పరిశోధనల్లో బయటపడింది. ఆ పట్టకం
యొక్క ముఖం మీద సన్నని, సమమైన నిలువు
గాట్లు గల గాజు తలం ఉంటుంది. ఆ తలాన్నే డైఫ్రాక్షన్
గ్రేటింగ్ (diffraction grating) అంటారు. తెల్లని తీక్షణమైన
కాంతి ఓ సన్నని చీలిక
(slit) లోంచి ప్రసరించి ఆ తరువాత ఆ
పట్టకం లోంచి ప్రసరించినప్పుడు, ఆ కాంతి అందులోని
పలువర్ణాలుగా చీలిపోతుంది. అలా ఏర్పడ్డ పలువన్నెల కాంతినే వర్ణమాల (spectrum) అంటారు. ఆ వర్ణమాలలో
దృశ్యకాంతికి చెందిన ఉన్నత పౌనఃపున్యాల (frequencies) దగ్గరి
నుండి నిమ్న పౌనఃపున్యాల వరకు ఉంటాయి (వయొలెట్, నీలం, ఆకుపచ్చ, పసుపు, నారింజ, ఎరుపు రంగులు). [1] మనకి కనిపించే రంగులు ఇలా ఉంటే మనకి కనిపించనవి మరెన్నో ఉన్నాయి. వయొలెట్ కన్నా
ఉన్నత పౌనఃపున్యాల ఉండే అతినీలలోహిత కాంతికి (ultraviolet) క్రిమిసంహారక
లక్షణాలు ఉంటాయి. అది మనకు
కనిపించదు గాని తేనెటీగలు దాన్ని గుర్తించగలుగుతాయి. అలాగే కాంతివిద్యుత్ ఘటాలు (photoelectric cells) కూడా
దీనికి స్పందిస్తాయి. మనం చూడగలిగే దాని కన్నా ప్రపంచంలో మరెంతో వుంది. అతినీలలోహిత కాంతికి
అవతల ఎక్స్-రే కిరణాలు
ఉంటాయి. ఎక్స్-రే
లకి అవతల గామా కిరణాలు ఉంటాయి. ఇక నిమ్న
పౌనఃపున్యాల వద్దకి వస్తే ఎరుపుకి కిందన వర్ణమాలలో పరారుణ కాంతి (infrared) ఉంటుంది. దీన్ని మొట్టమొదట
ఓ చక్కని ప్రయోగం
చేసి కనుక్కున్నారు. కళ్లకి ఏమీ కనిపించని చీకట్లో, పరారుణ కాంతి
ప్రసరించే చోట ఓ థర్మామీటరు పెట్టారు. వెంటనే ఉష్ణోగ్రత పెరిగింది. రాటిల్ పాములు
(rattlesnakes) పరారుణ
కాంతిని గుర్తుపడతాయి. అలాగే డోపింగ్ చేసిన సెమీకండక్టర్లు కూడా
ఆ కాంతికి స్పందిస్తాయి. పరారుణ కాంతికి దిగువన రేడియో తరంగాలతో కూడుకున్న విస్తారమైన వర్ణమాలా ప్రాంతం ఉంటుంది. గామా కిరణాల
నుండి రేడియో తరంగాల నుండి అన్నీ కాంతిలో భేదాలే. ఖగోళశాస్త్రంలో అవన్నీ ఉపయోగపడతాయి. మన కళ్లకి ఉండే పరిమితుల వల్ల కంటికి కనిపించే హరివింటి రంగుల పరంగానే ప్రపంచాన్ని చూస్తుంటాము. ఆ కారణం చేత
ప్రపంచంలో ఎంతో భాగం మనకి అదృశ్యంగా ఉండిపోతుంది.
1844 లో ఆగస్త్ కోమ్తే అనే తాత్వికుడు కొన్ని రకాల జ్ఞానం ఎప్పటికీ గుప్తంగా ఉండిపోతుంది అని సూచించాడు. అలాంటి జ్ఞానానికి
తార్కాణంగా దూరాన ఉండే తారల, గ్రహాల అంతరంగ
విన్యాసానికి సంబంధించిన జ్ఞానాన్ని పేర్కొన్నాడు. వాటిని ఎప్పటికీ చేరుకోలేం కనుక, వాటిలోని పదార్థం
మనకి ఎప్పటికీ అందదు కనుక, వాటిలోని పదార్థాన్ని
గురించిన జ్ఞానం మనకి ఎప్పటికీ తెలియదు అని అతడి వాదన. కాని కోమ్తే
మరణించిన మూడేళ్లలోపు వర్ణమాల సహాయంతో దూరాన ఉన్న వస్తువుల రసాయనిక ధర్మాల గురించి తెలుసుకోవచ్చని తెలుసుకున్నారు. వివిధ అణువులు, లేదా వివిధ
రసాయనాలు కాంతిలోని వివిధ రంగులని లోనికి గ్రహిస్తాయి. కొన్ని సార్లు దృశ్య వర్ణమాల లోని రంగులని గ్రహిస్తే, కొన్ని సార్లు
ఆ వర్ణమాలకి అవతల
ఉండే పౌనఃపున్యాలని గ్రహిస్తాయి. ఒక గ్రహం నుండీ వచ్చే కాంతి యొక్క వర్ణమాలలో ఓ నల్లని గీత
కనిపిస్తే, ఆ గీతకి
సంబంధించిన రంగు గల కాంతిని ఆ గ్రహం యొక్క
వాతావరణం లోనికి గ్రహించిందని అర్థం. అలా ఏర్పడ్డ
ప్రతీ గీత వెనుక ఓ అణువు ఉంటుంది. ఆ అణువే ఆ
ప్రత్యేకమైన రంగుని లోనికి గ్రహిస్తుంది. ఆ విధంగా ప్రతీ
పదార్థానికి దాని ప్రత్యేకమైన వర్ణమాలా సంతకం ఉంటుంది. వీనస్ మీద
వాయువులని 60 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వున్న మనం భూమి నుండీ చూసి కనిపెట్టగలం. సూర్యుడిలోని మూలకాల మిశ్రమాన్ని కనుక్కోగలం (సూర్యుడిలో కనుక్కోబడ్డ హీలియమ్ వాయువు పేరు గ్రీకుల సూర్యదేవత పేరు హీలియోస్ నుండీ వచ్చింది). మాగ్నెటిక్ A రకం
తారలలో యూరోపియమ్ అనే మూలకం వుందని తెలుసుకోగలం. సుదూర గెలాక్సీలలో కోటానుకోట్ల తారల నుండీ వెలువడే కాంతిని బట్టి ఆ గెలాక్సీలో పదార్థ
సంయోగాన్ని గురించి తెలుసుకోగలం. ఖగోళ శాస్త్రంలో సుదూర వస్తువుల వర్ణమాలని తెలియజెప్పే వర్ణమాలా దర్శిని (spectroscopy) నిజంగా ఓ మహత్తరమైన విధానం
అని చెప్పుకోవచ్చు. దాని గురించి ఎప్పుడు తలచుకున్నా ఆశ్చర్యం కలుగుతుంది. అగస్త్ కోమ్తే పాపం తప్పుడు ఉదాహరణ తీసుకుని పొరబడ్డాడు.
వీనస్ నిజంగానే తడిసి
ముద్దయిన స్థితిలో ఉంటే, వర్ణమాలలో నీటి
ఆవిరికి సంబంధించిన గీతలు కనిపించేవి. స్పెక్ట్రోస్కొపీ ఆధారంగా చేసిన వీనస్ అధ్యయనాలు మొట్టమొదట మౌంట్ విల్సన్ నక్షత్రశాలలో 1905 లో జరిగాయి. వీనస్ ని
కప్పిన మబ్బు పొరలో నీటి ఆనవాళ్లు రవ్వంత కూడా కనిపించలేదు. సన్నని సిలికేట్ ధూళితో కూడుకున్న మబ్బుల చేత కప్పబడ్డ నిర్జలమైన, మోడువారిన ఎడారి
భూమి వీనస్ అని ఆ అధ్యయనాల వల్ల
తెలిసింది. మరింత లోతుగా
చేసిన అధ్యయనాల వల్ల వీనస్ వాతావరణంలో పుష్కంగా కార్బన్ డయాక్సయిడ్ ఉన్నట్లు తెలిసింది. దీన్ని బట్టి
ఆ గ్రహం మీద
నీరంతా కర్బనరసాయనాలతో కలిసి కార్బన్ డయాక్సయిడ్ గా మరిందని కొంతమంది శాస్త్రవేత్తలు అర్థం చేసుకున్నారు. అంటే ఆ గ్రహం మొత్తం
చమురు బావుల మయమై ఉంటుంది. వీనస్ ఉపరితలం
అంతా ఓ విశాల పెట్రోల్
సముద్రం విస్తరించి వుంటుంది. వీనస్ మబ్బుల్లో
నీటి ఆవిరి లేకపోవడానికి మరో కారణాన్ని కూడా ఊహించారు. వీనస్ మబ్బుల్లో
ఉష్ణోగ్రత చాలా తక్కువ కనుక అక్కడ నీరు ఆవిరి రూపంలో కాక, మంచు
కణికల రూపంలో వుంది కనుక, మంచు కణికల
వర్ణమాల ఆవిరి వర్ణమాల కన్నా చాలా భిన్నంగా ఉంటుంది కనుక వీనస్ మీద నీటిని గురించలేకపోయాము అని మరి కొందరి వాదన. దీన్ని బట్టీ
ఏదో అక్కడక్కడ డోవర్ కొండల్లా కనిపించే సున్నపు రాతి దీవులు తప్ప గ్రహం మొత్తం జలమై ఉంటుందని ఊహించుకోవలసి ఉంటుంది. అయితే వాతావరణంలో
కార్బన్ డయాక్సయిడ్ పుష్కలంగా ఉండి కనుక, అక్కడి సముద్రాలలో మామూలు
నీరు ఉండే అవకాశం తక్కువ. దానికి బదులు
అక్కడ కడలిలో కర్బనీకృత నీరు ఉండి ఉండాలి. వీనస్ అంతా
నురగలు కక్కే బిస్లరీ సోడా సాగరాలు ఉంటాయని కలలు కన్నారు.
వీనస్ మీద
అసలు పరిస్థితికి సంబంధించిన సమాచారం స్పెక్ట్రోస్కొపీ
(spectroscopy) అధ్యయనాల
నుండే వచ్చింది. అయితే అవి
వర్ణమాలలో దృశ్య ప్రాంతం నుండో, పరారుణ ప్రాంతం
నుండో రాలేదు. రేడియా తరంగాల
ప్రాంతం నుండి వచ్చింది. రేడియో టెలిస్కోప్
కెమేరాలా పని చెయ్యదు. దానినొక కాంతి
కొలబద్ద అనుకోవాలేమో. దాన్ని ఆకాశంలో ఓ విశాలమైన ప్రాంతం
దిక్కుగా గురిపెడితే, ఆ దిశ నుండి
ఒక ప్రత్యేక రేడియో పౌనఃపున్యాల వద్ద ఎంత శక్తి వస్తోందో అది చెప్తుంది. కొన్ని రకాల
ప్రజ్ఞగల జీవరాశుల నుండి వెలువడే రేడియో తరంగాల గురించి మనకి తెలుసు. ఆ జీవరాశులు
ఎవరో కాదు. రేడియో కేంద్రాలు, టీవీ కేంద్రాలు నడిపేవాళ్లు! కాని ఎన్నో ప్రకృత గత వస్తువులు కూడా రేడియో తరంగాలు వెలువరిస్తాయి. దానికి ఒక కారణం అవి వేడిగా ఉండడం.
1956 లో అప్పుడే రేడియో టెలిస్కోప్ లు వస్తున్న తొలిదశలలో ఆ టేలిస్కోప్ లని
వీనస్ వైపు గురి పెట్టినప్పుడు, ఆ గ్రహం రేడియో
తరంగాలని వెలువరిస్తోందని తెలిసింది. అంటే వీనస్
ఎంతో వేడిగా ఉంటుంది అన్నమాట. కాని వీనస్
అదిరిపోయేటంత వేడిగా ఉంటుందని మొట్టమొదట సోవియెట్ అంతరిక్షనౌక వెనెరా పంపిన పరిశీలనల నుండి తెలిసింది. ఆ అంతరిక్షనౌక
వీనస్ ఉపరితలం మీద వాలి అక్కడి నుండి ప్రత్యక్షంగా చేసిన పరిశీలనల సమాచారాన్ని భూమికి పంపింది. వీనస్ గ్రహం
వెచ్చగానో, వేడిగానో ఉండడం
కాక, నిప్పులు
చెరుగుతోందని అప్పుడు అర్థమయ్యింది. అంతవరకు ఆశపడ్డట్టు అక్కడ చిత్తడి నేలలు, చమురు బావులు, సోడా సాగరాలు – ఇవేవీ లేవు. చాలీచాలని సమాచారంతో
పప్పులో కాలెయ్యడం చాలా
సులభం.
(ఇంకా వుంది)
[1] కాంతి ఒక కదిలే తరంగం. రెటినా వంటి తలం మీద
కాంతి పడినప్పుడు, ఒక సెకనుకు ఎన్ని శృంగాలు (crests) పడతాయో అదే ఆ కాంతి యొక్క పౌనఃపున్యం లేదా ఫ్రీక్వెన్సీ.
ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువైతే ఆ కాంతి అంత శక్తివంతమైనది.
0 comments