1950 లో వెలువడ్డ Worlds in Collision (ఢీకొంటున్న ప్రపంచాలు) అనే పుస్తకంలో సాటర్న్ కి, వీనస్ కి మధ్య ఇటీవల కాలంలోనే అభిఘాతాలు జరిగియాని ప్రతిపాదించబడింది. ఆ పుస్తకం రాసిన వాడు ఇమాన్యుయెల్ వెలికోవ్స్కీ అనే మనస్తత్వ శాస్త్రవేత్త. ఆ పుస్తకంలో ఇవ్వబడ్డ సిద్ధాంతం ప్రకారం ఓ గ్రహం పరిమాణం గల ఓ వస్తువు (అదొక తోకచుక్క అంటాడు రచయిత) జూపిటర్ సమీపంలో ఎక్కడో పుట్టింది. సుమారు 3,500 ఏళ్ల క్రితం అది అంతర సౌరమండలం దిక్కుగా కదిలి, భూమిని, మార్స్ ని పదే పదే సమీపించింది. భూమిని సమీపించినప్పుడు ఇక్కడ ఎన్నో సంచలనాత్మక పరిణామాలు జరిగాయి. వాటిలో కొన్ని ఎర్ర సముద్రం మధ్యలోకి విడిపోవడం, ఆ విధంగా మోజెస్ ఇజ్రాయిలీలని ఫారో నుండీ రక్షించగలగడం, జోషువా ఆజ్ఞ మీదట భూమి కాసేపు స్తంభించిపోవడం మొదలైనవి ఉన్నాయి. ఆ సమాగమం వల్ల భూమి మీద విస్తృతంగా వరదలు, అగ్నిపర్వత విస్ఫోటాలు జరిగాయంటాడు రచయిత.[1] ఆ విధంగా సౌరమండలంలోని గ్రహాలన్నిటితో చాలా కాలం చాలా రకాలుగా బంతాటాడిన ఆ తోకచుక్క చివరికి విసిగి, వేసారి సూర్యుడి చుట్టూ స్థిర కక్ష్యలో కుదురుకుందట. అలా కుదురుకున్న గ్రహమే వీనస్. అసలు అంతకు ముందు వీనస్ అనే గ్రహమే లేదంటాడు రచయిత.
ఈ వాదనలన్నీ
మరో చోట విపులంగా చర్చించాను. ఆ భావాలు చాలా
మటుకు శుద్ధ తప్పు. సౌరమండలంలో పెద్ద
పెద్ద అభిఘాతాలు జరిగాయి అన్న వాదనని ఖగోళవేత్తలు తిరస్కరించరు. అవి ఇటీవల కాలంలో జరిగాయి అంటేనే వస్తుంది చిక్కు. సౌరమండలం యొక్క
నమూనాని ప్రదర్శించేటప్పుడు అందులో గ్రహాలని వాటి అసలు స్థాయి కన్నా చాలా పెద్దగా ఉన్నట్టు ప్రదర్శిస్తుఆరు. అలా కాఉండా గ్రహాల పరిమాణాన్ని, గ్రహకక్ష్యల పరిమాణాన్ని ఒకే స్థాయిలో ప్రదర్శిస్తే, ఆ నమూనాలో గ్రహాలు
కనీకనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో
ఓ ప్రత్యేక తోకచుక్క
కొన్ని వేల ఏళ్ల కాలంలోనే భూమిని ఢీకొనే ఆస్కారం చాలా తక్కువ అని సులభంగా గుర్తించొచ్చు. పైగా వీనస్ కఠిన, హైడ్రోజెన్ బాగా
తక్కువగా ఉన్న, లోహమయమైన గ్రహం. అందుకు భిన్నంగా జూపిటర్ హైడ్రోజెన్ పూర్ణమైన గ్రహం. అలాంటి గ్రహం
లోంచి వచ్చిన వస్తువు వీనస్ గా ఎలా మారిందో అర్థం కావడం లేదు. జూపిటర్ నుండి
ఓ తోకచుక్కని గాని, ఓ గ్రహం అంత
పెద్ద వస్తువుని గాని పైకి ఎగజిమ్మడానికి అవసరమైన శక్తి మూలాలు ఆ గ్రహంలో లేవు. పోనీ అలా పుట్టిన వస్తువు భూమి పక్క నుండి పోయినా, అది భూమి
పరిభ్రమణాన్ని “ఆపే” ప్రసక్తే
లేదు. ఆపి మళ్లీ
కదిలించే ప్రసక్తి అసలే రాదు. పైగా భూమి
మీద 3,500 ఏళ్ల క్రితం
ప్రత్యేక తీవ్రతతో వరదలు, అగ్నిపర్వత విస్ఫోటాలు
జరిగినట్టు ఆధారాలేవీ లేవు. ప్రాచీన మెసొపొటోమియాలో
తవ్వకాల్లో దొరికిన శిలాశాసనాల్లో వీనస్ ప్రస్తావన వస్తుంది. తోకచుక్క వీనస్
గ్రహంగా మారడానికి వెలికోవ్స్కీ సూచించిన తేదీ కన్నా ఆ శిలాశాసనాల్లో ఇవ్వబడ్డ
తేదీ మరింత ప్రాచీనమైనది.[2] ఇవన్నీ అటుంచితే మరో సమస్య కూడా వుంది. జూపిటర్ నుండి
అంతర సౌరమండలం లోకి దూసుకొచ్చే వస్తువుకి బాగా దీర్ఘవృత్తీయమైన కక్ష్య ఉంటుంది. అలాంటి కక్ష్య
నుండి ప్రస్తుతం వీనస్ కి ఉన్నటువంటి వృత్తాకార కక్ష్యలోకి మారడం సామాన్యమైన విషయం కాదు. ఇలా ఎన్నో
అభ్యంతరాలు చెప్పొచ్చు.
సామాన్యులే కాక
శాస్త్రవేత్తలు చెప్పే సిద్ధాంతాలలో కూడా ఎన్నో తప్పని తేలుతాయి. కాని విజ్ఞానం
ఎప్పటికప్పుడు దానినది సరిదిద్దుకునే వ్యవహారం. నవ్య భావాలు
స్వీకరింపబడాలంటే వాటిని నిర్దిష్టమైన ఆధారాలు ఉండాలి. వెలికోవ్స్కీ వ్యవహారంలో
అన్నిటికన్నా దారుణమైన విషయం ఆ సిద్ధాంతం అంతా
తప్పుల తడకలుగా ఉండడమో, స్థిరమైన వైజ్ఞానిక
వాస్తవాలకి విరుద్ధంగా ఉండడమో కాదు. తాము శాస్త్రవేత్తలమని చెప్పుకునే
కొంత మంది వెలికోవ్స్కీ రచనలు పైకి రాకుండా ప్రయత్నించడం అతి దారుణమైన విషయం. సైన్స్ అనేది
పూర్తిగా స్వేచ్ఛాయుతమైన శోధనతో కూడిన ప్రయాస. ఎంత విడ్డూరమైన
ప్రతిపాదననైనా, సిద్ధాంతాన్నయినా, అందులో నిజానిజాలని శుద్ధ వైజ్ఞానిక పద్ధతులతో పరీక్షించే స్వాతంత్రం ఉండాలి. మనకి నచ్చని
భావాలని అణగదొక్కడం మతంలోనో, రాజకీయంలోనో పరిపాటిగా
జరగొచ్చు గాక. కాని
సత్యాన్వేషణలో అలాంటి ధోరణులకి స్థానం లేదు. వైజ్ఞానిక మార్గంలో
అలాంటివాటికి చోటు లేదు. గొప్ప ప్రగాఢ, విప్లవాత్మక భావాలు ఎవరి మనసుల్లో అంకురిస్తాయో ముందే చెప్పడం చాలా కష్టం.
ద్రవ్యరాశిలోను, పరిమాణంలోను, సాంద్రత లోను వీనస్ ఇంచుమించు భూమికి సన్నిహితంగా ఉంటుంది. [3]మనకి అతి దగ్గరి గ్రహం కనుక ఎన్నో శతాబ్దాలుగా మనకి సోదరీ గ్రహంగా దాన్ని పరిగణిస్తూ వచ్చారు. ఇంతకీ మన
సోదరీ గ్రహం ఎలా ఉంటుంది? సూర్యుడికి మరి
కాస్త దగ్గరిగా ఉంటుంది కనుక మన కన్నా మరి కాస్త వెచ్చగా ఉంటుందేమో? అక్కడ కూడా
ఉల్కాబిలాలు ఉంటాయా? లేక అవన్నీ
ఒరిపిడి వల్ల మాయమైపోయాయా? అక్కడ కూడా అగ్నిపర్వతాలు, కొండలు, సముద్రాలు… జీవరాశులు
ఉంటాయా?
వీనస్ ని
టెలిస్కోప్ లోంచి చూసిన ఘట్టం 1609 లో జరిగింది. అది చేసిన
వాడు గెలీలియో. ఏ ప్రత్యేక
వన్నెలు చిన్నెలు లేని పళ్లెం లాంటి ఆకారం కనిపించింది అతనికి. చంమామ లాగానే
వీనస్ కి కూడా దశలు ఉంటాయని గమనించాడు గెలీలియో. నెలవంక లాంటి
ఆకారం నుండి పూర్ణబింబం వంటి ఆకారం వరకు వీనస్ దశలు కనిపిస్తాయి. చంద్రదశలకి కారణాలే వీనస్ దశలకీ కారణాలు అవుతాయి. ఎందుకంటే కొన్ని
సార్లు మనం వీనస్ ని చీకటి వైపు చూస్తాము, కొన్ని సార్లు
పగటి వైపు చూస్తాము. దీన్ని బట్టి
సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని, భూమి చుట్టూ సూర్యుడు తిరగడం లేదని మరో సారి నిరూపించబడుతోంది. దృశ్య టెలిస్కోప్ లు
(optical telescopes) పెద్దవి
అవుతున్న కొద్ది, వాటి సునిశితత్వం
(resolution) మెరుగు
అవుతున్న కొద్ది, వాటిని పదే
పదే వీనస్ కేసి గురిపెడుతూ వచ్చారు. కాని గెలిలీయోకి
కనిపించిన దాని కన్నా మిన్నగా అందులో ఏమీ కనిపించలేదు. వీనస్ ఉపరితలాన్ని గుట్టుగా ఉంచే దట్టమైన మబ్బు తెర ఆ గ్రహాన్ని ఆవరించి
వుంది. పగటి పూట
గాని, సంధ్యాకాశంలో గాని
వీనస్ ని మనం చూస్తున్నప్పుడు ఆ మబ్బులు ప్రతిబింబిస్తున్న
కాంతిని మనం చూస్తున్నాం. అయితే ఆ మబ్బులని కనుక్కున్న
కొన్ని శతాబ్దాల వరకు కూడా వాటి తీరుతెన్నులు రహస్యంగానే ఉండిపోయాయి.
(ఇంకా వుంది)
[1] బైబిల్ లో నోవా చెప్పిన వరదకి కారణం ‘’ఉల్కాపాతం’’
అని ఎడ్మండ్ హాలీ ప్రతిపాదించాడు. ఒక చారిత్రక ఘటనకి, మతపరమైన వివరణలు కాకుండా, భౌతికంగా,
ఉల్కల పరంగా ఇవ్వబడ్డ వివరణల్లో ఇది మొదటి సందర్భం కావచ్చు.
[2] క్రీపూ మూడవ సహస్రాబ్దం నుండి వచ్చిన శిలాశాసనం
ఇనన్నాని, వీనస్ దేవతని, వేగుచుక్కని, బాబిలోన్ కి చెందిన ఇష్టార్ యొక్క పూర్వరూపాన్ని
ప్రదర్శిస్తుంది.
[3] మనకి తెలిసిన అతి పెద్ద తోకచుక్కల కన్నా
30 మిలియన్ల రెట్లు బరువైనది వీనస్.
0 comments