అభిఘాత బిలాలు
చందమామకే పరిమితం కాదు. అంతర సౌరమండలం
అంతా అవి కనిపిస్తాయి. సూర్యుడికి అతి దగ్గరి గ్రహమైన మెర్క్యురీ మీదను, మేఘావృతమైన వీనస్
మీదను, మార్స్ మీద, దాని ఉపగ్రహాలైన ఫోబోస్, డెయిమోస్ ల
మీదను కూడా కనిపిస్తాయి. ఇవన్నీ ధరాగత గ్రహాలు, మన పరివారానికి
చెందిన ప్రపంచాలు. కొద్దో గొప్పో
భూమిని పోలిన లోకాలు. వాటి ఉపరితలం
కఠినంగా ఉంటుంది. అంతరంగం రాతితోను, ఇనుముతోను కూడుకుని ఉంటుంది. వాటి వాతావరణ
పరిస్థితులు ఇంచుమించు శూన్య స్థాయి దగ్గర్నుండి, భూమి మీద పీడనానికి తొంభై రెట్లు అధిక పీడనం వరకు కూడా కలిగి ఉంటాయి. చలిమంట కాచుకునే
బాటసారులలా అవన్నీ ఉష్ణం కోసం, ఉజ్వల కాంతి
కోసం సూర్యుడి చుట్టూ గుమిగూడుతాయి. గ్రహాలన్నిటి వయసు సుమారు 4.6 బిలియన్ల సంవత్సరాలు ఉంటుంది. సౌరమండలపు తొలిదశలకి
చెందిన ప్రళయ భీషణ పరిస్థితులకి గ్రహాలన్నీ ప్రత్యక్ష సాక్ష్యులు.
మార్స్ ని
దాటి ఇంకా దూరంగా పోతే బాగా భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. జూపిటర్ తదితర బృహద్ గ్రహాల సీమలోకి అడుగుపెడతాం. ఇవన్నీ విశాలమైన ప్రపంచాలు. అధికశాతం హైడ్రోజెన్, హీలియమ్ వాయువులు కలిగి వుంటాయి. కాస్త తక్కువ
స్థాయిలో హైడ్రోజెన్ అధికంగా గల మీథేన్, అమోనియా, నీరు
మొదలైన పదార్థాలు ఉంటాయి. ఇక్కడ కఠిన
తలాలు తారసపడవు. రంగురంగుల మబ్బులు
కల వాతావరణాలే ఉంటాయి. అవన్నీ అసలు
సిసలైన గ్రహాలు. భూమి లాంటి
పిల్లలోకాలు కావు. ఒక్క జూపిటర్
లో వెయ్యి భూములు పడతాయి. జూపిటర్ వాతావరణం
మీద ఉల్కాశకలం పడితే కింద రంధ్రం ఏర్పడదు. కాసిన్ని మేఘాలు
కాసేపు చెల్లాచెదరు అవుతాయంతే. అయితే బాహిర
సౌరమండలంలో కూడా కొన్ని బిలియన్ల సంవత్సరాల అభిఘాత చరిత్ర ఉందని మనకి తెలుసు. ఎందుకంటే జూపిటర్
చుట్టూ ఓ అద్భుతమైన ఉపగ్రహ
వ్యవస్థ వుంది. అందులో ఓ
డజనుకి పైగా ఉపగ్రహాలు ఉన్నాయి. వాటిలో ఐదింటిని
వాయేజర్ నౌక దగ్గరి నుండి పరిక్షించింది. ఇక్కడ కూడా గతంలో జరిగిన ఉపద్రవాల ఆధారాలు కనిపించాయి. సౌరమండలం మొత్తాన్ని శోధిస్తే మెర్క్యురీ నుండి, ప్లూటో వరకు, మొత్తం తొమ్మిది ప్రపంచాల మీద, వాటి
ఉపగ్రహాల మీద, తోకచుక్కల
మీద కూడా అలాంటి ఉపద్రవాత్మక అభిఘాతాల ఆధారాలు కొల్లలుగా కనిపిస్తాయేమో.
చందమామకి ఇవతలి
పక్క (near side) 10,000 వరకు ఉల్కాబిలాలు
ఉన్నాయి. వీటిని భూమి
నుండి టెలిస్కోప్ లతో చూడొచ్చు. అవన్నీ ఎక్కువగా
చందమామ మీద ఎత్తయిన పర్వత ప్రాంతాలలోనే కనిపిస్తాయి. గ్రహాంతర సీమలో విస్తరించిన ఆదిమ పదార్థం నుండి చందమామ ఏర్పడ్డ తొలిదశలకి చెందిన బిలాలవి. చందమామ మీద
మరియా (Maria)
అనే ప్రాంతంలో ఒక కిలోమీటర్ కన్నా పెద్ద ఉల్కాబిలాలు వెయ్యికి పైగా ఉంటాయి.
ఈ మరియా ఒక దిగువ ప్రాంతం. చందమామ ఏర్పడుతున్న
కొత్తల్లో ఈ ప్రాంతం మీద
లావా వరదలై పారి అంతకు ముందున్న బిలాలని కప్పేసింది. చందమామ మీద ఉల్కాబిలాలు ఏర్పడే వేగం 10^9 సంవత్సరాలు/10^4 ఉల్కాబిలాలు = 10^5 సంవత్సరాలు/ఉల్కాబిలం కావాలి. అంటే రెండు
ఉల్కాబిలాలకి మధ్య ఓ లక్ష సంవత్సరాలు
గడుస్తాయన్నమాట. నేటి కన్నా కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం గ్రహాంతర సీమలో మరింత పెద్ద ఎత్తున వ్యర్థ పదార్థాలు నిండి ఉండేవి కనుక, ప్రస్తుతం చందమామ
మీద ఉల్కాబిలం ఏర్పడే ఘటన చూడాలంటే లక్ష సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం ఎదురుచూడాలేమో. చందమామ కన్నా మన భూమి చాలా పెద్దది కనుక భూమి మీద ఓ కిలోమీటర్ వ్యాసం
గల ఉల్కాబిలం ఏర్పడే ఘటన చూడాలంటే పదివేల సంవత్సరాలు ఎదురు చూడాలేమో. అమెరికాలోని ఆరిజోనా
రాష్ట్రంలో ఉన్న పెద్ద ఉల్కాబిలం సుమారు ఇరవై, ముప్పై ఏళ్ల
నాటిది అని అంచనాలు చెప్తున్నాయి. కాబట్టి ఇందాక మనం చేసిన అంచనాలతో ఈ లెక్కలు సరిపోతున్నాయి.
ఓ ఉల్కగాని, తోకచుక్క గాని నిజంగానే చందమామతో ఢీకొన్నప్పుడు జరిగే విస్ఫోటంలో పుట్టిన కాంతి భూమి నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ లక్ష ఏళ్ల
క్రితమో మన పూర్వీకులు ఒక రాత్రి మామూలుగా ఎప్పట్లాగే చందమామ కేసి తదేకంగా చూస్తున్న సమయంలో, దాని చీకటి
పార్శ్వాన ఏదో కాంతి తళుక్కు మనడం చూసి ఆశ్చర్యపోయి ఉంటారు. చుట్టూ చీకటిగా
ఉన్న చంద్రమండల ప్రాంతంలో ఒక్క చోట మాత్రం సూర్యకిరణాలు ఎలా పడ్డాయబ్బా అని విస్మయం చెంది ఉంటారు. కాని మరింత
అర్వాచీన కాలంలో, అంటే చారిత్రక
యుగంలో అలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించం. అలాంటిది జరిగే
ఆవకాశం ఒకట్లో నూరోవంతు ఉంటుంది.
కాని
ఒక ఉల్కాశకలంతో చందమామ అభిఘాతాన్ని భూమి నుండి మానవుడు కళ్లార చూసినట్టు ఒక చారిత్రక వృత్తాంతం లేకపోలేదు. క్రీ.శ. 1178 జూన్
25 నాడు, ఐదు మంది బ్రిటిష్ సాధువులు ఓ అసామాన్యమైన సంఘటన
జరిగినట్టు వర్ణించారు. కాంటర్బరీకి చెందిన గెర్వాజ్ అనే వ్యక్తి ఆ సంగతి నమోదు
చేశాడు. ఆనాటి రాజకీయ, సాంస్కృతిక సంఘటనలని
విశ్వసనీయంగా
నమోదు చేసేవాడని ప్రతీతి. ఈ వ్యక్తి
ఆ ఐదుగురు సాక్ష్యులని
కలుసుకుని ముఖాముఖి ద్వార ఎన్నో సంగతులు రాబట్టాడు.
“అమావాస్య గడిచాక సన్నని అర్థచంద్రాకారం ఆకాశంలో మెరుస్తూ కనిపించింది. చంద్రుడి రెండు కొమ్ములు ఎప్పట్లాగానే తూర్పు వైపు తిరిగి వున్నాయి. ఉన్నట్లుండి పై
కొమ్ము రెండుగా చీలింది. ఆ చీలిక
మధ్యబిందువు లోంచి ఓ బ్రహ్మాండమైన జ్వాల
ఎగజిమ్మింది. రగిలే రవ్వలు, నిప్పు కణికలు
వెళ్లగక్కింది.”
డెరల్ మల్హోలాండ్
(Derral Mulholand), ఓడైల్
కలేమ్ (Odile Calame) అనే
ఇద్దరు ఖగోళవేత్తలు ఈ విషయం మీద
కొన్ని లెక్కలు వేశారు. చందమామ మీద
అభిఘాతం వల్ల చంద్రోపరితలం మీద పెద్ద ధూళి మేఘం పైకి లేస్తుందని, కాంటర్బరీ సాధువులు చేసిన వర్ణనతో ఆ మేఘపు రూపురేఖలు
చక్కగా సరిపోతాయని ఆ గణనాల సహాయంతో
వాళ్లు సూచించారు.
ఆ అభిఘాతం
కేవలం 800 ఏళ్ల క్రితమే జరిగి వుంటే అప్పుడు పుట్టిన ఉల్కాబిలం ఇప్పటికీ ఉంటుంది. చందమామ మీద
గాలి, నీరు లేవు
కనుక అక్కడ ఉపరితలం యొక్క ఒరిపిడి చాలా తక్కువ. కొన్ని బిలియన్ల
సంవత్సరాల క్రితం పుట్టిన చిన్నపాటి ఉల్కాబిలాలు కూడా ఇప్పటికీ సుస్థిరంగా ఉంటాయి. గెర్వాజ్ ఇచ్చిన
వివరాల బట్టి ఆ సంఘటన చందమామ
మీద ఎక్కడ జరిగి వుంటుందో తేల్చి చెప్పడానికి వీలవుతుంది. అభిఘాతం జరిగినప్పుడు ఏర్పడ్డ విస్ఫోటం లోంచి ఎగజిమ్మబడ్డ ధుమ్ము పరిసర ప్రాంతాల్లో సన్నని, తిన్నని బాటలు
గా ఏర్పడుతుంది. ఇంకా యవ్వనంలో ఉన్న ఉల్కాబిలాల చుట్టూ అలాంటి బాటలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకి అరిస్టార్కస్, కోపర్నికస్, కెప్లర్ తదితరుల పేర్లు పెట్టిన ఉల్కాబిలాల చుట్టూ అలాంటి విశేషాలు కనిపిస్తాయి. అయితే ఒరిపిడి ప్రభావానికి ఉల్కాబిలాలు తట్టుకున్నా చుట్టూ ఏర్పడ్డ రేఖలు మాత్రం సన్నగా ఉండడం చేత కాలక్రమేణా చెరిగిపోతాయి. కాబట్టి అభిఘాతం ఇటీవలి కాలంలో జరిగింది అనడానికి ఆ రేఖలు చక్కని
ఆధారాలు.
(ఇంకా వుంది)
చందమామ మీద 'కొపెర్నికస్ ఉల్కాబిలం'
0 comments