అధ్యాయం 6
యాత్రికుల
కథలు
“ఉన్నది
ఈ ఒక్క ప్రపంచమేనా, లేక అనేక ప్రపంచాలు ఉన్నాయా? ప్రకృతి అధ్యయనంలో అతి ప్రగాఢమైన,
మహోన్నతమైన ప్రశ్నలలో ఇదొకటి.” – ఆల్బస్ మాగ్నస్, పదమూడవ శతాబ్దం.
“ఈ లోకపు
తొలి దశలలో, దీవుల మీద జీవించేవాళ్లు, భూమి మీద వాళ్లు మాత్రమే జీవిస్తున్నారు అనుకునేవాళ్లు.
వారి లాగే మరెవరైనా ఉన్నా వారిని, తమని వేరు చేస్తూ ప్రగాఢ మహార్ణవాలు ఉన్నాయి కనుక
ఆ రెండు సమాజాలకి మధ్య లావాదేవీలు ఎలా సాధ్యం అవుతాయో తెలియదు. కాని తదనంతరం నౌకాయానం
కనుక్కోబడ్డాక పరిస్థితులు మారాయి… అలాగే చందమామని చేరుకోడానికి కూడా ఏదైనా సాధనం ఉంటుందేమో…
అలాంటి మహాయాత్రని తలపెట్టడానికి ఇప్పుడు డ్రేక్, కొలంబస్ వంటి వాళ్లు ఎవరూ లేరు. డేడలస్
లాగా గాల్లోకి ఎగిరే సాహసం చెయ్యగలిగే వారు లేరు. కాని ఏదో ఒక నాడు మన భావితరాల వారు
మన పూర్వీకులకి బొత్తిగా తెలియని ఎన్నో విషయాలని
కనుక్కుంటారు. మనం ఎంత కాంక్షించినా తెలుసుకోలేని మహత్తర సత్యాలని తెలుసుకుంటారు.”
-
జాన్ విల్కిన్స్, చందమామ మీద
వెలసిన లోకం, 1638.
“మనం భూమి
మీద ఎంతో ఎత్తుకు వెళ్లి, ఆ ఎత్తు నుండి భూమిని చూస్తే, ప్రకృతి తన కళాకౌశలాన్ని అంతటినీ
ఈ చిన్న మట్టి గడ్డ మీద ఎందుకు వెచ్చించిందని ప్రశ్నించవచ్చు. అప్పుడు దూరదేశాలకి ప్రయాణించే
యాత్రికులలో ఇక్కడి వస్తువుల అసలు విలువని తెలుసుకోగలుగుతాము. మన లాంటివే మరెన్నో భూములు
ఉన్నాయని తెలిస్తే, వాటి మీద కూడా జీవరాశులు ఉంటారని తెలిస్తే, గొప్ప లోకోత్తర సౌందర్యంతో
అవి వెలిగిపోతుంటాయని తెలిస్తే, ఈ లోకం ఆకాశానికి ఎత్తే విషయాలు మనకి అల్పంగా తోచవచ్చు,
మనుషులు గాఢంగా కాంక్షించే వాటి పట్ల మనకి అసహ్యం కలగవచ్చు.” క్రిస్టియన్ హైగెన్స్,
ఆకాశ లోకాల ఆవిష్కరణ, 1690.
విశ్వసముద్రం మీద
మనుషులు యాత్రలు తలపెట్టిన మహత్తర యుగమిది. కెప్లర్ లెక్కించిన
గతుల వెంట గ్రహాల దిశగా దూసుకుపోయే ఆధునిక నౌకలన్నీ మానవరహితమైనవే. అద్భుతంగా నిర్మించబడి, అంతో ఇంతో తెలివితేటలు గల రోబోల వంటి ఆ నౌకలు, అపరిచిత ప్రపంచాల అన్వేషణ మీద బయలుదేరాయి. బాహ్యసౌరమండలం గమ్యంగా బయలుదేరిన ఆ నౌకలకి దిశానిర్దేశం
అంతా భూమి మీద ఒక ప్రత్యేక కేంద్రం నుండి వెలువడుతోంది. అది కాలిఫోర్నియాలో, పాసడీనా లో ఉన్న, నాసాలో భాగమైన, ‘జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ’ (Jet Propulsion Laboratory) అనే అధునాతన ప్రయోగశాల.
1979, జూన్ 9 తొమ్మిది నాడు వాయేజర్ 2 అనే అంతరిక్ష నౌక జూపిటర్ వ్యవస్థని సమీపించింది. గ్రహాంతర శూన్యంలో అది రెండేళ్ల పాటు ప్రయాణించి అక్కడికి చేరుకుంది. ఓ మిలియన్
విడిభాగాలని ఒక దగ్గరికి చేర్చి కుదురుగా కూర్చిన సంఘటిత రాశి ఆ నౌక.
ఒకటి విఫలమైనా, మరి కొన్ని రంగంలోకి దిగి దాని స్థానాన్ని ఆక్రమించేలా ఆ నౌక నిర్మించబడింది. ఆ నౌక బరువు 0.9
టన్నులు. ఓ పెద్ద
గదిని నింపేస్తుంది. దాని మిషన్ లక్ష్యాల ప్రకారం, అది సూర్యుడి
నుండి ఎంత దూరంగా పోవాలంటే, ఇతర నౌకలో
చేసినట్టు సౌరశక్తిని అందులో ఇంధనంగా వాడలేము. దానికి కావలసిన
శక్తి అందులోనే వున్న ఓ చిన్న కేంద్రక
శక్తి కేంద్రం నుండి వస్తుంది. ఓ చిటికెడు
ప్లూటోనియమ్ లో జరిగే రేడియోధార్మిక క్షయ
నుండి పుట్టే కొన్ని వందల వాట్ల విద్యుత్తు మీద అది పనిచేస్తుంది. నౌక దేహంలో భాగాలైన మూడు కంప్యూటర్లు, నౌకలోని దినసరి క్రియలని శాసించే వ్యవస్థ (ఉదాహరణకి దాని
ఉష్ణోగ్రతని నియంత్రించే వ్యవస్థ) మొదలైనవి దాని
నడి మధ్యలోనే ఉన్నాయి. దానికి భూమి
నుండి సందేశాలు వస్తాయి. అది కనుక్కున్న
విషయాలని 3.7 మీటర్ల వ్యాసం గల ఓ పెద్ద ఆంటెన్నా
ద్వార తిరిగి భూమికి పంపిస్తుంది. అందులోని వైజ్ఞానిక పరికరాలన్నీ ఓ పరిశీలనా వేదికపై
(scan platform) వున్నాయి. జూపిటర్ పక్క నుండి దూసుకుపోతూ అది జూపిటర్ చందమామలో ఒక దాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. అందులో ఎన్నో పరికరాలు ఉన్నాయి. అతినీలలోహిత, పరారుణ
వర్ణమానినులు, జూపిటర్ నుండి వెలువడే విద్యుదావేశాలని, అయస్కాంత క్షేత్రాలని, రేడియో తరంగాలని కొలిచే పరికరాలు మొదలైనవి. కాని వీటన్నిటికన్నా
ఫలదాయకమైన పరికరాలు రెండు ఉన్నాయి. నౌకలో స్థాపించబడ్డ
రెండు టీవీ కెమేరాలు బాహిర సౌరమండలంలో దీవుల్లా విలసిల్లే ఆ సుదూర గ్రహాలని
కొన్ని పదుల వేల ఫోటోలు తీసి ఎప్పటికప్పుడు భూమికి పంపుతూ ఉంటాయి.
అధిక శక్తి
గల విద్యుదావేశ కణాలు జూపిటర్ చుట్టూ కవచంలా విస్తరించి ఉంటాయి. అవి అదృశ్యంగా
ఉన్నా అత్యంత ప్రమాదకరమైనవి. జూపిటర్ ని, దాని
చందమామలని దగ్గరి నుండి చూడాలంటే ఆ కిరణకవచపు అంచు
మీదుగా ప్రయాణిస్తూ, జూపిటర్ వ్యవస్థని దాటి మిషన్ లక్ష్యాల అనుసారం సాటర్న్ దిశగా సాగిపోవాలి. కాని ఆ విద్యుదావేశ కణాలు
జూపిటర్ మీద పరికరాలని ని ధ్వంసం చేసి, దాని ఎలక్ట్రానిక్స్
ని మాడ్చి మసిచెయ్యగలవు. జూపిటర్ చుట్టూ ఘనరూపంలో ఉన్న వ్యర్థపదార్థాలు వలయంలా ఏర్పడి ఆ గ్రహం చుట్టూ
పరిభ్రమిస్తూ ఉంటాయి. అలాంటిది ఒకటి
వుందని అప్పటికి నాలుగు నెలల క్రితమే వాయేజర్ 1 నౌక కనుక్కుని తెలిపింది. ఆ వలయాన్ని
దాటుకుని వాయేజర్ 2 నౌక సురక్షితంగా ముందుకు సాగాలి. ఓ చిన్నపాటి
శిల నౌకని ఢీకొన్నా, నౌక పూర్తిగా
అదుపు తప్పి, భూమి దిశగా
దాని ఆంటెన్నాని స్థిరంగా గురిపెట్టలేకపోతుంది. అది
సేకరించే సమాచారం శాశ్వతంగా మన చేజారిపోతుంది. జూపిటర్ తో సమాగమం సమీపిస్తుంటే భూమి మీద సిబ్బంది చాలా కలవరపడ్డారు. కాని భూమి మీద మనుషుల సమిష్టి ప్రతిభ సూచనలిస్తుంటే, అంతరిక్షంలో ఆ రోబో విధేయంగా
అనుసరించడం వల్ల, ప్రమాదం నివారించబడింది.
(ఇంకా వుంది)
0 comments