అట్లాస్ దేవత, న్యాయ దేవత ఉన్న అంతస్థుకి ఒక అంతస్థు కిందన, మరో ఆసక్తికరమైన
విశేషం ప్రదర్శించబడి ఉంటుంది. నేలలోనే మలచిన
ఒక మ్యాపులో పశ్చిమ ఆఫ్రికా నుండి, పసిఫిక్ మహాసముద్రం
వరకు భూభాగం ప్రదర్శించబడి వుంటుంది. సమస్త ప్రపంచమూ
హోలాండ్ నౌకల విహారానికి వేదికే. ఆ మ్యాపులో
గొప్ప వినతిని ప్రదర్శిస్తూ డచ్ వారి వారి పేరు ఎక్కడ ప్రదర్శించుకోలేదు. యూరప్ వారు ఉండే ప్రాంతానికి పాత లాటిన్ పేరైన బెల్జియమ్ పేరునే ఆ పటంలో వాడారు.
ప్రతీ ఏడు
హోలాండ్ నుండి ఎన్నో నౌకలు బయల్దేరి ప్రపంచం అవతలి అంచుకి ఇంచుమించు సగం దూరం వరకు ప్రయాణించేవి. ఆఫ్రికా పశ్చిమ తీరం వెంట, వాళ్లు ఎథియోపియన్
సముద్రం అని పేరు పెట్టిన సముద్రం ద్వార, దక్షిణంగా ప్రయాణించి, ఆఫ్రికా దక్షిణ కొమ్ము చుట్టూ తిరిగి, మడగాస్కర్ జలసంధుల
ద్వార ముందుకి సాగి, ఇండియాకి దక్షిణ
కొసకి కొంత దూరంలో ప్రయాణించి, వారి వాణిజ్య గమ్యాలలో ముఖ్యమైనవి అయిన స్పయిస్ దీవులని చేరుకునేవి. ఈ స్పయిస్ దీవులు
ఆధునిక ఇండొనేషియాలో ఉన్నాయి. మరి కొన్ని
యాత్రలు అక్కడి నుండి ఇంకా ముందుకి వెళ్లి న్యూ హోలాండ్ అనే ప్రాంతానికి వెళ్లేవి. అదే నేటి
ఆస్ట్రేలియా. మరొ కొన్ని నౌకల మలక్కా జలసంధుల లోంచి సాహసించి, ఫిలిపీన్స్ దీవులని
దాటి, చైనాని చేరుకునేవి. “నెదర్లాండ్స్ సమైక్య ప్రాంతాలకి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీకి, టార్టార్ వంశాకురము, చైనాకి సామ్రాట్టు అయిన చమ్ చక్రవర్తికి మధ్య జరిగిన దౌత్యం” గురించిన వృత్తాంతాలు
ఉన్నాయి. డచ్ దూతలు, ఓడ సరంగులు చైనా రాజధాని అయిన పెకింగ్ మహానగరంలో తమకి పూర్తిగా భిన్నమైన సంస్కృతిని చూసి సంభ్రం చెంది ఉంటారు.
హోలాండ్ ప్రాబల్యం
అప్పుడు మహర్దశలో ఉండేది. అంతకు ముందు
గాని, ఆ తరువాత
గాని ఆ దేశం అంత
వైభవాన్ని రుచి చూడలేదు. చిన్న దేశం
కావడంతో దాని విదేశీ సంబంధాలలో శాంతిపరాయణత స్పష్టంగా కనిపించేది. సాంప్రదాయ విరుద్ధమైన అభిప్రాయాల పట్ల సహనవైఖరి చూపించడం వల్ల పొరుగు దేశాలలో తమ భావాల కారణంగా తీవ్రవిమర్శకు గురైన మేధావులు హోలాండ్ లో తలదాచుకునేవారు. (1930 లలో యూరప్ లో నాజీ నియంతృత్వానికి తట్టుకోలేక అక్కడి మేధావులు అమెరికాఇ వలస పోయినట్టు.) ఆ విధంగా పదిహేడవ
శతాబ్దపు హోలాండ్ దేశం స్పినోజా అనే ఓ గొప్ప జువిష్
తాత్వికుడికి ఆశ్రయం ఇచ్చింది.
స్పినోజా
ని ఐన్స్టయిన్ కూడా అభిమానించేవాడు. అలాగే పాశ్చాత్య గణిత, తాత్విక చరిత్రలో
ఓ కీలకస్థానంలో వున్న
దే కార్త్, రాజకీయ శాస్త్రవేత్త
అయిన జాన్ లాక్ కూడా హోలాండ్ లో తలదాచుకున్నారు. తదనంతర కాలంలో పెయిన్, హామిల్టన్, ఆడమ్స్, ఫ్రాంక్లిన్, జెఫర్సన్ మొదలైన రాజకీయ మేధావులు జాన్ లాక్ ప్రభావానికి లోనయ్యారు. ఆ విధంగా
ఖండం నలుమూలల నుండి అసమాన ప్రతిభ గల కళాకారులు, శాస్త్రవేత్తలు, తాత్వికులు, గణితవేత్తలు హోలాండ్ సాంస్కృతిక వేదికకి వన్నె తెచ్చారు. రెంబ్రాంట్, వెర్మీర్, ఫ్రాన్జ్ హాల్స్ వంటి చిత్రకళాకారులు, మైక్రోస్కోప్ ని కనిపెట్టిన లీవెన్హోక్, అంతర్జాతీయ చట్టవిధులని స్థాపించిన గ్రోటియస్, కాంతి వక్రీభవన
ధర్మాన్ని కనుక్కున్న విలెబ్రోర్డ్ స్నిలియస్
- మొదలైన
ప్రముఖులు డచ్ మేధోరంగానికి హంగు కూర్చారు.
మేధోరంగంలో గొప్ప
స్వేచ్ఛ నిచ్చే డచ్ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ లైడెన్ విశ్వవిద్యాలయం ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియోకి ఆచార్యపదవిని అందించింది. భూమి
సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుందని, సూర్యుడు భూమి చుట్టూ కాదనే మతవిరుద్ధమైన సిద్ధాంతాన్ని బోధించే గెలీలియోని ఆ సిద్ధాంతాన్ని వెనక్కు
తీసుకోమని, లేదంటే మరణదండన
తప్పదని కాథొలిక్ చర్చ్ గెలీలియోని హెచ్చరించింది. గెలీలియోకి ఆ రోజుల్లో హోలాండ్
తో సన్నిహిత సంబంధాలు ఉండేవి. అతడు వాడిన
మొట్టమొదటి ఖగోళ టెలిస్కోప్ ఆ రోజుల్లో హోలాండ్
లో వాడుకలో ఉండే ఓ పరికరం యొక్క
రూపాంతరమే. ఆ టెలిస్కోప్
ని వాడి గెలీలియో సూర్యబిందువులని (sunspots), వీనస్ దశలని, చందమామ మీద
ఉల్కాబిలాలని, జూపిటర్ కి చెందిన నాలుగు పెద్ద చందమామలని కనుక్కున్నాడు. ఆ చందమామలని నేడు
గెలీలియో పేరు జోడించి గెలీలియన్ చందమామలు అని పిలుస్తారు. మత వ్యవస్థతో గెలీలియో ఎదుర్కున్న సమస్యల గురించి 1615 లో అతడు గ్రాండ్ డచెస్ క్రిస్టీనాకి తాసిన ఉత్తరంలో వివరంగా వర్ణిస్తాడు.
“మహారాణీ! ఈ విషయం
తమకి ఇంతకు ముందు విన్నవించుకున్న మాట మీరు జ్ఞాపకం ఉండే ఉంటుంది. కొన్నేళ్ల క్రితం
నేను మన కాలంలో తెలియని, దివిసీమకి చెందిన
కొన్ని నిజాలని కనుక్కోవడం జరిగింది. ఆ సత్యాల
కొత్తదనం వల్లనైతేనేమి, వాటి పర్యవసానాలు కొన్ని సామాన్యంగా పండితులు బోధించే భౌతిక సత్యాలని వ్యతిరేకించిన వైఖరి వల్లనైతేనేమి, ఎంతో మంది మేధావుల [వారిలో చాలా
మంది మతాధికారులే] అభిప్రాయాలు నాకు ప్రతికూలంగా మారాయి. ఆ విషయాలన్నిటినీ
ఏదో నేనే స్వహస్తాలతో ఆకాశంలో పెట్టి, ప్రకృతి క్రమాన్ని
భంగపరచినట్టు, వైజ్ఞానిక సత్యాలని వమ్ముచేసినట్టు. మనకి తెలిసిన సత్యసంపద వృద్ధి చెందినప్పుడు, అది ఎంతో నూతన పరిశోధనకి, కళాభివృద్ధికి దారి
తీస్తుంది అన్న విషయం వాళ్లు విస్మరిస్తున్నారు.”
హోలాండ్ విషయంలో
అన్వేషణా రంగంలో దాని ప్రాబల్యానికి, మనోజన్య, సాంస్కృతిక రంగాలలో
దాని ప్రాబల్యానికి మధ్య గాఢమైన సంబంధం వుంది. నౌకా నిర్మాణంలో
జరిగిన అభివృద్ధి మరెంతో సాంకేతిక పురోగతికి దారి తీసింది. చేతులతో చేసే
భౌతిక పరిశ్రమ పట్ల జనం మక్కువ చూపడం మొదలెట్టారు. కొత్త ఆవిష్కరణల మీద బహుమానాల వర్షం కురిసేది. సాంకేతిక పురోగతి
జరగాలంటే వైజ్ఞానిక శోధన స్వేచ్ఛగా, నిరాటంకంగా జరగాలి. ఆ కారణం చేత
పుస్తకాల ప్రచురణలో, విక్రయంలో మొత్తం
యూరప్ లోనే హోలాండ్ అగ్రస్థానంలో ఉండేది. ఇతర భాషల్లో
అచ్చయిన పుస్తకాలు ఇక్కడ తర్జుమా చెయ్యబడేవి. ఇతర ప్రాంతాలలో నిషిద్ధమైన పుస్తకాలు ఇక్కడ ప్రచురణ భాగ్యానికి నోచుకునేవి. అపరిచిత భూముల సందర్శనం, అజ్ఞాత సమాజాలతో
సమాగమం అలసత్వాన్ని ధ్వంసం చేసింది. ప్రస్తుత పరిజ్ఞానంలోని
లోపాలని ఎత్తి చూపి మేధావులని తట్టిలేపింది. వేల సంవత్సరాలుగా చలామణి అవుతున్న భావసౌధాలని కూలదోసింది. ముఖ్యంగా భౌగోళిక అవగాహనలో ఎన్నో దోషాలు పైకితేలాయి. ప్రప్రంచంలో ఎన్నో చోట్ల రాజులు, చక్రవర్తులు రాజ్యం
చేసే ఆ కాలంలో, డచ్
గణతంత్ర రాజ్యంలో మాత్రం ప్రజలే రాజ్యం చేసే వాళ్లు. ఆ విధంగా
బుద్ధి వికాస వ్యవహారాలలో డచ్ సమాజం చూపిన ఆసక్తి, దాని అసమాన
సిరిసంపదలు, కొత్త ప్రాంతాల అన్వేషణలో సద్వినియోగంలో అది చూపిన అపారమైన శ్రద్ధ మొదలైన లక్షణాలన్నీ మానవ ప్రయాస పట్ల, జీవనోద్యమం పట్ల
విశ్వాసాన్ని పెంచాయి.
(ఇంకా వుంది)
0 comments