ఇటలీలో గెలీలియో
అన్య ప్రపంచాల ఉనికిని ప్రకటించాడు. జోర్డానో బ్రూనో అన్య జీవన రూపాల ఉనికి మీద వ్యాఖ్యానించాడు. ఆ కారణం చేత
ఇద్దరికీ తీవ్రమైన శిక్షే పడింది.
కాని
హోలాండ్ లో ఆ ఇద్దరి సిద్ధాంతాలని
నమ్మిన క్రిస్టియన్ హైగెన్స్ కి ఘన సత్కారమే లభించింది. అతడి తండి
కాంస్టాంటిన్ హైగెన్స్ ఆ కాలంలో ఓ
గొప్ప దౌత్యాధికారి. అంతేకాక అతడొక సాహితీవేత్త, కవి, వాగ్గేయకారుడు, విద్వాంసుడు, ఇంగ్లీష్ కవి జాన్ డాన్ కి స్నేహితుడు, అతడి కవితలకి అనువాదకర్త, గొప్ప ప్రఖ్యాతి గల వంశానికి మూలకర్త. ఈ కాంస్టాంటిన్
రూబెన్స్ అనే చిత్రకారుడి సృజనని ఎంతో ఆరాధించేవాడు. రెంబ్రాంట్ వాన్ రైన్ అనే కుర్ర చిత్రకారుణ్ణి “ఆవిష్కరించాడు.” అంతేకాక రెంబ్రాంట్ చిత్రాలలో ఎన్నో సార్లు ప్రత్యక్షమయ్యాడు కూడా. అతణ్ణి మొదటి
సారి కలుసుకున్నాక అతడి గురించి ఫ్రెంచ్ తాత్వికుడు దేకార్త్ ఇలా అంటాడు – “ఒక్క మనసు అన్ని విషయాలలో లగ్నం కావడమే కాక, అన్నిట్లోను
గొప్ప కౌశలాన్ని సాధించగలదని నమ్మలేకపోయాను.” ఇతర దేశాలకి చెందిన ప్రముఖ మేధావులు అతడి ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. అలాంటి వాతావరణంలో
పెరిగిన క్రిస్టియన్ హైగెన్స్ బహుభాషా కోవిదుడు కావడమే కాక, చిత్రకళ, న్యాయశాస్త్రం, విజ్ఞానం, సాంకేతిక రంగం, గణితం, సంగీత రంగాలలో
ప్రావీణ్యం సంపాదించాడు. అతడి జీవన సూత్రాన్ని ఈ విధంగా వ్యకం
చేశాడు –“ఈ ప్రపంచమే నా
దేశం, విజ్ఞానమే నా
మతం.”
ప్రకాశం ఆ
కాలం యొక్క సారానికి అద్దం పట్టే ప్రతీక. చింతనలో, మతాచారంలో, భౌగోళిక ఆవిష్కరణలో పూర్తి స్వాతంత్ర్యానికి, మనోజన్య ప్రకాశనానికి అది చిహ్నం. ఆ కాలపు
సృజనలో ప్రతీ చోట ప్రకాశం వ్యక్తమవుతోంది. ఎన్నో వన్నెలు లాస్యం చేసే ఆ నాటి చిత్రకళలో, ముఖ్యంగా వెర్మీర్ చిత్రించిన అసమాన చిత్రాలలో తేజం తాండవించింది. అలాగే కాంతి వక్రీభవన గురించి స్నెల్ చేసిన వైజ్ఞానిక అధ్యయనాలలో కాంతి ఒక వైజ్ఞానిక లక్ష్యం అయ్యింది. లూవెన్హోక్ ఆవిష్కరించిన
మైక్రోస్కోప్ లోను, హైగెన్స్ రూపొందించిన
క్రొంగొత్త కాంతి తరంగ సిద్ధాంతంలో కూడా అదే జరిగింది. ఇవన్నీ ఒక
దాంతో ఒకటి సంబంధం వున్న ప్రయాసలు. ఆ ప్రయత్నాలు
చేసిన వారి మధ్య కూడా భావరంగంలో సత్సంబంధాలు ఉండేవి. వెర్మీర్ ఇంటి
గోడలని నౌకా సంబంధమైన కళాకృతులు, పటాలు అలంకరించేవి. ఇంటి గదులని అలంకరించే మైక్రోస్కోప్ లు అతిథుల మేధని సవాలు చేసేవి. వెర్మీర్ ఆస్తిపాస్తులకి
లూవెన్హోక్ కార్యనిర్వహణాధికారిగా ఉండేవాడు. అలాగే హోఫ్
వైక్ అనే ఊళ్లో ఉండే హైగెన్స్ ఇంటిని తరచు సందర్శిస్తూ ఉండేవాడు.
ఒకప్పుడు బట్ట
నాణ్యత తెలుసుకోవడానికి వస్త్రకారులు భూతద్దాలు వాడేవారు. అలాంటి భూతద్దాల
నుండి లూవెన్హోక్ రూపొందించిన మైక్రోస్కోప్ ఆవిర్భవించింది. దాంతో అతడు ఓ నీటి బొట్టులో
దాగిన అద్భుత విశ్వాన్ని కనుక్కున్నాడు. అందులో కిటకిటలాడుతూ సంచలనంగా మసలే క్రిములని అతడు ‘ఆనిమాల్ క్యూల్స్’
(animalcules) అని పిలిచాడు. “ముద్దు”గా ఉన్నాయని
మురిసిపోయాడు. లూవెన్హోక్, హైగెన్స్ లు మానవ పునరుత్పత్తికి ఆధారమైన శుక్రకణాలని కళ్లార చూసిన మొదటి వారు. మరిగించి క్రిమిరహితం
చేసిన నీట్లో కూడా క్రిములు మళ్లీ మెల్లగా ఎలా పుట్టుకొస్తాయో ఆలోచించాడు హైగెన్స్. ఆ క్రిములు
గాల్లో తేలుతూ ఉంటాయని, చల్లారిన నీటి
మీద నెమ్మదిగా వాలి మళ్లీ పునరుత్పత్తి చేత వృద్ధి చెందుతాయని ప్రతిపాదించాడు.ఆ విధంగా అప్పటి
వరకు చలామణిలో ఉన్న అప్రయత్న జననం (spontaneous generation) అనే
సిద్ధాంతానికి మార్గాంతరాన్ని సూచించాడు. మురుగుతున్న పళ్లరసంలో
గాని, కుళ్లుతున్న మాంసంలో
గాని క్రిములు అప్రయత్నంగా పుట్టుకొస్తాయని ‘అప్రయత్న జనన’ సిద్ధాంతం
చెప్తుంది. ఆ సిద్ధాంతాన్ని
సవరణ సూచించాడు హైగెన్స్. అయితే మరో
రెండు శతాబ్దాల తరువాత, హైగెన్స్ సూచించిన
సిద్ధాంతం నిజమని లూయీ పాశ్చర్ నిరూపించాడు. మార్స్ మీద వైకింగ్ చేసిన జీవాన్వేషణకి మూలాలు ఒక విధంగా లూవెన్హోక్, హైగెన్స్ ల కృషిలో ఉన్నాయని
వాదించొచ్చు. క్రిమి జన్య రోగ సిద్ధాంతానికి, ఆధునిక వైద్యంలో మూల భావనలకి ఒక విధంగా వాళ్లే పితామహులు. అయితే వాళ్లకి
తమ భావాలకి వినియుక్త రూపాన్ని ఇచ్చే ఉద్దేశం లేకపోయింది. వైజ్ఞానిక పరికరాలతో, సిద్ధాంతాలతో సరదాగా
వినోదించే క్రీడాకారులు వాళ్లు.
మైక్రోస్కోప్, టెలిస్కోప్
లు రెండూ పదిహేడవ శతాబ్దపు తొలిదశలలో హోలండ్ లో రూపొందించబడ్డ పరికరాలు. సూక్ష్మ స్థాయి
ప్రపంచాన్ని, బృహత్ స్థాయి ప్రపంచాన్ని మరింత వివరంగా చూడడం కోసం నిర్మించబడ్డ పరికరాలవి. అణువులని, అండపిండ
బ్రహ్మాండాన్ని మరింత దగ్గరి నుండి చూసే ప్రయత్నం అప్పుడే, అక్కడే మొదలయ్యింది. కటకాలని (lenses) నునుపుగా రుద్ది, పరిపూర్ణంగా రూపొందించడంలో
క్రిస్టియన్ హైగెన్స్ ది అందెవేసిన చెయ్యి. తన నైపుణ్యాన్ని
ఉపయోగించి ఐదు మీటర్ల పొడవు ఉన్న టెలిస్కోప్ ని నిర్మించాడు. టెలిస్కోప్ తో అతడు చేసిన అధ్యయనాలే వైజ్ఞానిక చరిత్రలో అతడికి శాశ్వత స్థానాన్ని సంపాదించి పెట్టేవి. ఎరొటోస్తినిస్ అడుగుజాడల్లో
నడిచిన అతడు, మరో గ్రహం
యొక్క పరిమాణాన్ని కొలిచిన మొదటి వ్యక్తి అయ్యాడు. వీనస్ గ్రహమంతా
మేఘావృతం అయ్యుంటుందని ఊహించిన మొదటి వాడు కూడా అతడే. మార్స్ గ్రహం
మీద కనిపించే ఓ ముఖ్యమైన భౌగోళిక
విశేషాన్ని చూసి చిత్రించిన మొదటి వాడు. (అది సిర్టిసి మేజర్ (Syrtis Major) అనే
ఓ నల్లని, సువిస్తారమైన
వాలుతలం.) గ్రహం పరిభ్రమిస్తున్నప్పుడు ఆ విశేషం పదే
పదే కనిపించి మాయం కావడం చూసిన హైగెన్స్ మార్స్ గ్రహం యొక్క పరిభ్రమణ కాలం 22 గంటలు అని కనుక్కున్నాడు. సాటర్న్ గ్రహం చుట్టూ వలయాలు ఉంటాయని, అవి ఆ
గ్రహాన్ని ఎక్కడా తాకవని కూడా గుర్తించిన మొదటివాడు. సాటర్న్ చందమామలలో
అతి పెద్దది మాత్రమే కాక, మొత్తం
సౌరమండలంలో కూడా అతి పెద్ద చందమామ అయిన టైటన్ ని కనుక్కున్నవాడు కూడా అతడే. ఈ అధ్యయనాలన్నీ
అతడు తన ఇరవైలలో చేశాడు. జ్యోతిష్యం ఓ
అర్థం లేని శాస్త్రం అని కూడా అతడు భావించాడు.
హైగెన్స్ మరెన్నో
సాధించాడు. ఆ రోజుల్లో
సముద్రయానంలో ఓ పెద్ద సమస్య
రేఖాంశాన్ని (longitude) ని
నిర్ణయించడం. అక్షాంశాన్ని (latitude) నిర్ణయించడం మరింత సులభం. ఎంత దక్షిణంగా
పోతే అంత మేరకు దక్షిణాది తారారాశులని మాత్రమే చూడగలం. కాని రేఖాంశాన్ని
నిర్ణయించగలగాలంటే కచ్చితంగా కాలనిర్ణయం చెయ్యగలగాలి. ఓడలో
ఉండే గడియారం ఓడ ఏ రేవు వద్ద
నుండి అయితే బయల్దేరిందో, అక్కడి సమయం కచ్చితంగా చెప్పగలుగుతుంది. కాని సూర్యుడు, తారల ఉదయాస్తమాయల
బట్టి ఓడలో స్థానిక కాలాన్ని చెప్పడానికి వీలవుతుంది. ఈ రెండు కాలాల
భేదాన్ని బట్టి రేఖాంశాన్ని నిర్ణయించడానికి వీలవుతుంది. హైగెన్స్ లోలకం గడియారాన్ని రూపొందించాడు. (అది పని చేసే సూత్రాన్ని అంతకు ముందే గెలీలియో కనుక్కున్నాడు.) ఆ గడియారాన్ని సముద్రం
మీద కాల నిర్ణయం కోసం ఉపయోగించడం మొదలెట్టారు. అయితే ఆ ప్రయత్నం పూర్తి
ఫలితాలని ఇవ్వలేదు. ఇతడి కృషి
వల్ల ఖగోళ గడియారాలలో, నౌకా గడియారాలలో మునుపెన్నడూ లేని గొప్ప నిర్దుష్టత ఏర్పడింది. సర్పిలాకార తులనాత్మక
స్ప్రింగ్ (spiral balance spring) ని
కనిపెట్టింది కూడా ఇతడే. నేటికీ కొన్ని
గడియారాలలో ఆ స్ప్రింగ్ ని
వాడుతారు. యంత్రశాస్త్రంలో (mechanics)
ఎంతో
మౌలికమైన కృషి చేశాడు. అపకేంద్ర బలాన్ని
(centrifugal force) లెక్కించడానికి సూత్రాన్ని కనిపెట్టాడు. పాచికలాట ద్వార సంభావ్యతా సిద్ధాంతానికి పునాదులు వేశాడు. గాలిపంపు పని
తీరుకి మెరుగులు దిద్ది గనుల పరిశ్రమలో విప్లవం తెచ్చాడు. ఆధునిక స్లయిడ్
ప్రొజెక్టర్ (slide projector) కి పూర్వ రూపమైన ‘మాయా లాంతరు’
(magic lantern) ని రూపొందించాడు. ఓ విచిత్రమైన యంత్రాన్ని
కనిపెట్టి దానికి ‘మందుగుండు యంత్రం’
(gunpowder engine) అని పేరు పెట్టాడు. దాని లోంచే
తదనంతరం ఆవిరి యంత్రం పుట్టింది.
(ఇంకా వుంది)
0 comments