శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భూమి గుండ్రంగా ఉంది-4.

Posted by నాగప్రసాద్ Monday, May 11, 2009
రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి.

భూమి ఎలా ఉంటుంది అన్న విషయం మీద కవితలు రాయటం, కొలతలు తీయటం ఇవన్నీ ఒక ఎత్తు. భూమి గుండ్రంగా ఉంది అన్న నమ్మకం మీద ప్రాణాలొడ్డి ఏవో అజ్ఞాత సముద్రాల మీద ధ్వజం ఎత్తటం ఒక ఎత్తు. అలా ధ్వజమెత్తిన ఓ ధీరుడి పేరే కొలంబస్.

(టక్...టక్...టక్)

కొలంబస్ - (తలుపు తీస్తూ) మంత్రిగారూ మీరా? రండి రండి.
మంత్రి - అమ్మయ్య! ఇన్నాళ్లకి దొరికావయ్యా. ఎన్ని సార్లు వచ్చాననుకున్నావు. ఒకసారి వస్తే పోర్చుగల్ వెళ్లావని, మరోసారి వస్తే ఇటలీ, ఇంకోసారేమో సముద్ర యానంలో ఉన్నావని, అదే సముద్రమో నీకే తెలీదని పొరుగింటి వాళ్లన్నారు. పోన్లే ఇన్నాళ్లకి దొరికావు.
కొలంబస్ - అయ్యో! నాకోసం చాలా శ్రమ తీసుకున్నారు. రాజమందిరంలో అంతా కులాసాయే కదా?
మంత్రి - ఆఁ ‌ ఏం కులాసాలే! ఎప్పుడు చూసినా యుద్ధం యుద్ధం! రాజుగారికి, రాణిగారికి ఆ స్పానిష్ మూర్లతో యుద్ధంతోనే సరిపోతోంది. వాళ్లా ఒక పట్టాన చావరు. మనను చంపుకు తింటుంటారు. ధనాగారం ఖాళీ అయిపోతోంది. వాణిజ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒకప్పుడు ఇండియాతోను, చైనా తోను వాణిజ్యం సజావుగా సాగేది. ఇప్పుడా సిల్కు దారుల వెంట పోతే కొడతామంటున్నారు టర్కులు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. కాస్త మంచినీళ్లు ఉంటే ఇప్పిస్తావా నాయనా?
కొలంబస్ - బాబూ డీగో!
డీగో - ఆఁ! (లోపల్నుంచి కేక)
కొలంబస్ - మంత్రి గారికి కొంచెం మంచినీళ్లు తెచ్చివ్వు నాన్నా.
(డీగో తెరమాటు నుండి మంత్రిగారి కేసి చూసి, నాలుక పైకి పెట్టి వెవ్వెవ్వె అని వెక్కిరించి మాయమవుతాడు.)
కొలంబస్ - సారీ, మావాడు కొంచెం...
మంత్రి - ...చిలిపి. అర్థమయ్యిందిలే.
కొలంబస్ - ఉండండి నేను తెస్తాను.
(కొలంబస్ లోపలికి వెళ్తాడు. మంత్రి ఉష్ అంటూ నెత్తి మీద ఉన్న విగ్ తీసి బల్ల మీద పెడతాడు. ఇంతలో డీగో ఎక్కణ్ణుంచో వచ్చి ఆ విగ్ ని గద్దలా తన్నుకు పోతాడు.)
మంత్రి - అయ్యో అయ్యో నా జుట్టు ఇలా తే!.
(మంచినీళ్ల గ్లాసుతో కొలంబస్ తిరిగి వచ్చేసరికి మంత్రిగారు, డీగో బల్ల చుట్టూ పరిగెడుతూ దోబూచులాడుతుంటారు.)
కొలంబస్ - ఏయ్! డీగో. ఇలారా. తప్పునాన్నా. అలా మంత్రిగారి జుట్టు చేతిలో పట్టుకుని తిరక్కూడదు. ఇచ్చేసేయ్.
డీగో - ఊహు. ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. దీంతో నా చిలక్కి గూడు కట్టుకుంటా.
(ఓ పెద్ద బల్ల చుట్టూ పరిగెడుతూ కొలంబస్ డీగోని వెంబడిస్తుంటాడు. ఇదే అదను అనుకుని మంత్రిగారు చల్లగా జారుకుంటారు. డీగో వెంటపడుతున్న కొలంబస్ ఉన్నట్లుండి వ్యతిరేక దిశలో పరుగెత్తి డీగోని అందుకుంటాడు. డీగోని ఎలా పట్టుకున్నదీ పునరావలోకనం చేసుకుంటుంటే తన మనసులో ఏదో తళుక్కుమంటుంది.)
కొలంబస్ - యురేకా! ఇండియాకి దారి దొరికిందీ!!!
(తేరుకుని చుట్టూ తిరిగి చూసేసరికి మంత్రిగారు కనిపించరు.)
కొలంబస్ - మంత్రిగారూ! మంత్రిగారూ!

(మంత్రిగార్ని వెదుక్కుంటూ కొలంబస్ బయటికి పరుగెడతాడు. "డాడీ, డాడీ" అని అరుస్తూ డీగో అతణ్ణి అనుసరిస్తాడు.)

(నిండు సభలో స్పానిష్ రాజు ఫెర్డినాండ్, రాణి ఇసాబెల్ కొలువు తీరి ఉంటారు. జయజయధ్వానాలు వినిపిస్తుంటాయి.)
మహారాణి ఇసబెల్ కి జయహో! జయహో!
(ఆమె ప్రసన్నంగా నవ్వుతుంది.)
మహారాజు ఫెర్డినాండ్ కి జయహో!జయహో!
(ఆయన కూడా ప్రసన్నంగా నవ్వబోతాడు, కాని రాణి చూసిన చూపుకి మానుకుంటాడు.)
(ఇంతలో మంత్రిగార్ని వెదుక్కుంటూ కొలంబస్ ప్రవేశిస్తాడు.)
కొలంబస్ - మంత్రిగారూ! మంత్రిగారూ! ఇండియాకి దారి తెలిసింది! (మంత్రిగారి భుజాలు పట్టుకుని కుదిపేస్తూ). ఎలాగో చెప్పనా? ఇప్పుడు మీరు ఇలా రండి... ఇక్కడ ఇలా నించోండి. ఒరే డీగో, నువ్విలా నించో.
(రాణికి ఒళ్లు మండిపోతుంది).
రాణి - ఎవడీ వెర్రివాడు? నిండు సభలో ఈ ఆటలేంటి? ఎవరక్కడ? ఇద్దరినీ పట్టుకోండి!
మంత్రి - అయ్యో! మహారాణీ! ఇతగాడు పిచ్చివాడు కాడు. కొలంబస్ అని గొప్ప నావికుడు. ఇండియాకి ఏదో దారి చెబుతాను అంటున్నాడు పాపం!
రాణి - ఇండియాకి దారి కొత్తగా చెప్పేదేముంది? ఉందిగా పట్టు దారి. ఆ పట్టు దారి వెంబడి పన్నులు కట్టుకుంటూ పోతే తిరిగి ఇంటికి వచ్చేసరికి పట్టుమని నూరోవంతు లాభం కూడా రాదు.
కొలంబస్ - అందుకే మరో దారి ఉందని అంటున్నాను మహారాణీ!
రాణి - ఏదీ? ఆఫ్రికా చుట్టూనా?
కొలంబస్ - ఊహు. అది కూడా కాదు.
రాణి - (విస్తుబోయి రాజు కేసి చూస్తుంది. రాజు "నాకేసి చూస్తావేంటి" అన్నట్టు విస్తుబోయి రాణి కేసి చూస్తాడు).
(కొలంబస్ కేసి చూసి) ఏంటా దారి?

కొలంబస్ - నన్నొకసారి విడిచిపెడితే...
రాణి - అతణ్ణి విడిచిపెట్టండి!
(కొలంబస్ సింహాసనానికి కుడి కొస వద్దకి పోయి అక్కడ నించుంటాడు.)
కొలంబస్ - ఇప్పుడు నేను స్పెయిన్ దేశాన్ని అనుకుందాం!
రాజు (ఉక్రోషంతో) ఏయ్! స్పెయిన్ ని నేనూ!
(రాణి రాజు కేసి కొర కొర చూస్తుంది)
రాజు - కాదు ఈవిడా!
రాణి - నువ్వు కానీ కొలంబస్.
(భటులని పిలిచి వరుసగా తన పక్కన నించోమంటాడు.)
కొలంబస్ - ఇతగాడు ఫ్రాన్స్. ఇతడు ఇటలీ. ఇతడు రొమానియా, ఇతడు టర్కీ. ఇతడు పర్షియా. ఇతడు కందహార్.
ఏయ్ డీగో, ఇలా రా! వీడు ఇండియా. ఇప్పుడు స్పెయిన్ నుండి ఇండియా చాలా దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. భూమి బల్లపరుపుగా ఉంది అనుకుంటే అది నిజమే. కాని భూమి గుండ్రంగా ఉంది. డీగో ఇలా వెనక్కురా! (కొద్దిగా జరిగి డీగో చేయి అందుకుంటాడు.) కనుక ఒక దారి వెంట చాలా దూరంలో ఉన్న ఇండియా మరో దారి వెంట అతి దగ్గరలో ఉంది. చేయి చాచితే అందేంత దగ్గర్లో ఉంది.
రాణి - ఇంతకీ ఏంటా దారి కొలంబస్?
కొలంబస్ - మహాసముద్రం మీద పశ్చిమ దిశగా ప్రయాణం.
మంత్రి - మహాసముద్రం మీద ప్రయాణమా? ప్రాణాలతో తిరిగి వద్దామనేనా?
ఓ సభ్యుడు -(కోపంగా) పశ్చిమంగా ప్రయాణిస్తే చేరేది ఇండియా కాదు. నరకానికి.
రాజు - అవునవును. పశ్చిమంగా ప్రయాణించే ఓడలు ప్రపంచం అంచుని చేరి అవతల అగాధంలో పడిపోతాయట. నన్ను పెంచిన ఆయా చెప్పింది. (కళ్లింత చేసి భయంగా అంటాడు.)
కొలంబస్ - పశ్చిమంగా సాగితే ధైర్యం ఉన్నవాడికి ధనం, అర్భకులకి అగాధం ఎదురవుతుంది. కొద్దిపాటి సముద్రం దాటితే వచ్చేది ఇండియా, కాథే మొదలైన సంపన్న దేశాలు. దమ్ముంటే ఒక్క అంగలో కడలి దాటి ఆ ఐశ్వర్యాన్ని సొంతం చేసుకోవాలి. నరకం ఎక్కడో లేదు. ఊహకి సంకెళ్లు వేసే మీ మూఢత్వమే నరకం. మీ కళ్లకి కమ్మిన చీకటే అగాధం.
రాణి - కాని గతంలో సముద్ర యాత్రలు చేసిన నావికులు అంతా తీరాన్ని అంటిపెట్టుకుని పోయిన వారేగాని మహాసముద్రాన్ని ఎదురొడ్డిన వారు లేరు కదా కొలంబస్?
కొలంబస్ - మొట్టమొదట ఎవరో ఒకరు సాహసించి సాధించకపోతే మనుష్య జాతి ఇంత దూరం వచ్చేదా చెప్పండి రాణీ? హృదయంలో తెగువ లేని వారికి ఎన్ని మాటలు చెప్పినా వృధాయే అని నాకు తెలుసు. దయచేసి సెలవు ఇప్పించండి.(నిష్క్రమించబోతాడు)
రాణి - ఆగు కొలంబస్! నీ ప్రయాణానికి కావలసిన వసతులు నేను అనుగ్రహిస్తాను. తక్షణమే బయల్దేరు.
కొలంబస్ - ధన్యుణ్ణి రాణీ! ధన్యుణ్ణి!


(1492 లో ఆగష్టు నెలలో సాంటా మరియా, నీనా, పింటా అనే మూడు ఓడలతో బయలుదేరుతాడు కొలంబస్. వాళ్ల ఓడలు ప్రపంచం అంచున అగాధంలో పడిపోలేదు. 12 అక్టోబర్ నాడు ఓ కొత్త భూమి కనిపించింది. అదే ఇండియా
అని భ్రమించాడు కొలంబస్. ఆ భ్రమ జీవితాంతం అతణ్ణి విడిచి పెట్టలేదు. కొలంబస్ కనుక్కున్నది ప్రస్తుతం మనం వెస్ట్ ఇండీస్ అనుకునే ద్వీపమాలిక. కొలంబస్ యాత్రలని ఆధారంగా చేసుకుని మరి కాస్త ముందుకి సాగిన అమెరిగో వెస్పుసీ అనే నావికుడు అమెరికా ఖండాన్ని కనుక్కున్నాడు.

భూమి విస్తృతి గురించి అసలేమీ తెలీని రోజుల్లో కూడా భూమి గుండ్రంగా ఉంది అన్న నమ్మకానికి తన జీవితాన్ని పణంగా పెట్టిన గొప్ప శాస్త్రవేత్త కొలంబస్. తన యాత్రలు ఆ నమ్మకాన్ని నిజం చేశాయి అనలేం. ఆ నమ్మకానికి ఆయువు పెంచాయి అని మాత్రం నిశ్చయంగా చెప్పొచ్చు.)

కొలంబస్ యాత్రలు భూమి గుండ్రంగా ఉందా లేదా అన్న విషయాన్ని ఎటూ తేల్చలేకపోయాయి. ఆ మహాకార్యాన్ని తలపెట్టిన మరో నావికుడు ఉన్నాడు. అతడే మెగాలెన్.

మరికొంత వచ్చే టపాలో...

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts