రచయిత: వి. శ్రీనివాస చక్రవర్తి
కొలంబస్ యాత్రలు భూమి గుండ్రంగా ఉందా లేదా అన్న విషయాన్ని ఎటూ తేల్చలేకపోయాయి. ఆ మహాకార్యాన్ని తలపెట్టిన మరో నావికుడు ఉన్నాడు. అతడే మెగాలెన్.
(స్పానిష్ రాజు ఐదవ కింగ్ చార్లెస్ సభలో)
చార్లెస్ - నేల మీద ఇండియా చేరుకోవడానికి సిల్కు దార్లు ఎప్పుడో మూసుకున్నాయి. ఇండియా కోసం వెదుక్కుంటూ వెళ్లిన కొలంబస్ మరేవో ప్రాంతాలని కనుక్కున్నాడు. అదసలు ఇండియానే కాదని పండితుల అభిప్రాయం. ఆ తరువాత వాస్కో ద గామా ఆఫ్రికా చుట్టూ ఇండియా చేరే పద్ధతి కనుక్కున్నాడు. కాని టోర్దెసీలాస్ ఒప్పందం ప్రకారం ఆ సముద్రపు దార్లు పోర్చుగల్ కే స్వంతం. ఇండియా చేరుకోవడానికి నీ వద్ద ఇంకేదో పథకం ఉందని విన్నాను. ఏమిటది కొంచెం వివరించు మెగాలెన్!.
మెగాలెన్ - అవును మహారాజా! కొలంబస్ కనుక్కున్నది ఇండియా కాదన్నది నిజం. ఆయన కనుక్కున్నది వెస్ట్ ఇండీస్ అనబడే ఓ ద్వీపమాలిక. వాటి వెనుక అమెరిగో వెస్పుసీ కనుక్కున్న అమెరికా అనబడే ఓ మహా ఖండం ఉంది. ఇంకా దాని వెనుక బల్బోవా చూచాయగా చూసిన మరో మహాసముద్రం కూడా ఉంది. ఆ మహా సముద్రానికి అవతల చైనా, ఇండియా ఉన్నాయి.
రాజు - మరి అంత దూరం ప్రయాణించేదెలా?
మెగాలెన్ - కొలంబస్ అనుసరించిన మార్గంలోనే సాగాలి. కాని ఇంకా దూరం పోవాలి. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి దక్షిణ అమెరికా తూర్పు తీరం వెంట దక్షిణ కొమ్మును చేరుకోవాలి. అక్కణ్ణించి ఇంకా పశ్చిమంగా ప్రయాణిస్తే స్పైస్ ద్వీపాలు వస్తాయి. స్పైస్ ద్వీపాలు ఎంతో సుభిక్షమైన ప్రాంతాలు. వాటితో వ్యాపారం స్పెయిన్ కి ఎంతో లాభదాయకం.
రాజు - చాలా సాహసం చేస్తున్నావ్ మెగాలెన్! అయిదు ఓడలను తీసుకుని తక్షణమే బయల్దేరు. విజయోస్తు!
(1519 సెప్టెంబర్ 20 నాడు 5 ఓడలు 270 మంది సిబ్బందితో బయలుదేరాడు మెగాలెన్. డిసెంబర్ 13 నాడు ఓ కొత్తతీరం ఏదో కనిపించింది.)
నావికుడు1 - ఇండియా కనిపించింది. అయ్యగారూ! ఇండియా కనిపించింది!.
మెగాలెన్ - అప్పుడే ఇండియా రావడమేమిటి? పొరబడుతున్నావు. ఆ అవకాశమే లేదు.
నావికుడు1- లేదయ్యగారూ. అదుగో తీరం మీద ఎవరో ఉన్నారు. అడుగుదాం.
(తీరం మీది మనిషి వైపు తిరిగి) ఇదుగో అబ్బాయ్. ఇది ఇండియానే కదా?
తీరం మనిషి - నో ఇండియా. రియో ద జనేరో!
నావికుడు1 - (ఏడుపు ముఖంతో) ఇంత దూరం వచ్చినా ఇంకా ఇండియా రాలేదా? అయినా సరే ఇంక ముందుకు పోయేదే లేదు. ఇంక చాల్లేండి అయ్యగారూ, ఇక్కడే ఆగిపోదాం.
మెగాలెన్ - పోనీలే. నావికులంతా అలసిపోయి ఉన్నారు. కొన్నాళ్ళాగి బయలుదేరుదాం.
(కొన్నాళ్లయ్యాక ప్రయాణం మళ్లీ కొనసాగింది. కొంత కాలం తరువాత మరేదో తీరం కనిపించింది.)
నావికుడు1 - అయ్యగారూ! అయ్యగారు! ఈ సారి నిజంగా ఇండియానే రండి, చూడండి!
మెగాలెన్ - అప్పుడే ఇండియానా? పోయి కనుక్కుని రా!
(పోయి తిరిగి వచ్చి...)
నావికుడు1 - నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను. వాడెవడో పిచ్చోడు. వాడెక్కడున్నాడో వాడికే తెలీదు. ఇది ఇండియా కాదట. అదేంటబ్బా...రియో ద ప్లాటా అట.
మెగాలెన్ - మరి నే చెప్తే విన్లేదు. లంగరెత్తు. బయలుదేరుదాం.
నావికుడు1 - కుదరదంటే కుదరదు. ఇంచక్కా ఇక్కడే ఉండిపోదాం. ప్లీజ్ అయ్యగారూ!
(సిబ్బంది పోరు పడలేక మెగాలెన్ ఒప్పుకున్నాడు. అక్కడే రెండు నెలలు ఉండి "సాన్ జూలియాన్" అనే సిబిరం కూడా నిర్మించుకున్నారు. ఎంతో కష్టం మీద సిబ్బందిని మళ్లీ ఉత్తేజితం చేసి లక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తాడు మెగాలెన్. ప్రయాణం మళ్ళీ కొనసాగింది. కాని ఈ సారి నిరసన నిష్ఠూరంగా మారింది. ఇద్దరు కెప్టెన్లు తప్పించుకుని పారిపోబోతూ పట్టుబడ్డారు.)
నావికుడు1 - దొరా! దొరా! ఈ యదవలిద్దరూ పారిపోతుంటే పట్టుకున్నాం. ఈళ్లకి తగిన శిచ్చ యిధించండి దొరా.
మెగాలెన్ - ఏం సెబాస్టియన్ ఎందుకు చేశావీపని? ఈ అన్వేషణ, పర్యటన ఓ యుద్ధం లాంటిది. యుద్ధంలో వెన్ను చూపించి పారిపోయేవారికి శిక్షేమిటో నీకు తెలుసుగా?
సెబాస్టియన్ - తప్పయిపోయింది మెగాలెన్! దయచేసి ఈ ఒక్క సారికి క్షమించు. బుద్ధి గడ్డి తిని వీళ్లతో చేయి కలిపాను. మళ్ళీ నా వల్ల ఇలాంటి తప్పు జరగదు.
మెగాలెన్ - ఏం గాస్పర్? నీ సంగతేంటి? జరిగిన దానికి ఏం సంజాయిషీ చెబుతావు?
గాస్పర్ - అన్వేషణ, పర్యటన, యుద్ధం...(హహహ) ఇది అన్వేషణ కాదు. ఆత్మహత్య. సామూహిక ఆత్మహత్య. ఇలాగే పోతూ ఉంటే ఏదో రోజు అందరం నడి సముద్రంలో దిక్కుమాలిన చావు చస్తాం. భూమి గుండ్రంగా ఉందట! దిక్కు తెలీకుండా ఏళ్ల తరబడి పడమటి దిక్కుగా పోతే తూర్పు వస్తుందట. ఇంత కన్నా వెర్రితనం ఎక్కడైనా ఉందా? మెగాలెన్! ఇదంతా కేవలం నీ భ్రాంతి. నీ వెర్రితనానికి ఇంత మంది ప్రాణాలని ఎందుకు బలి తీసుకుంటావ్?
(అందరి వైపు తిరిగి) వీడి మాటలు నమ్మకండి! ఇలాగే ఇంకా ముందుకు పోతే వచ్చేది ఇండియా కాదు. లోకం అంచుకి వచ్చేస్తాం. భయంకరమైన శూన్యంలో పడిపోతాం. పదండి వీడి ఖర్మకి వీణ్ణి వదిలిపెట్టి మన స్వదేశానికి వెళ్ళిపోదాం. నేటితో ఈ నీటి చెర నుండి తప్పించుకుందాం.
(సెబాస్టియన్ కి క్షమాభిక్ష దొరికింది. గాస్పర్ కి మరణ దండన తప్పలేదు. పర్యాటక బృందం తమ భయంకర పయనంలో ముందుకి సాగిపోయింది. అమెరికా దక్షిణ కొమ్ము దగ్గర ఆ నౌకాదళం పశ్చిమంగా తిరిగి ముందుకి సాగిపోయింది. అప్పుడో పెనుకడలి ఎదురయ్యింది.)
నావికుడు1 - అయ్యా! అయ్యా! అంతం వచ్చేసింది! లోకానికి అంతం వచ్చేసింది. ఇంకా ముందుకి పోతే ఓడలు అగాధంలో పడిపోతాయి.
మెగాలెన్ - (నవ్వి) కాదు కాదు. ఇది అమెరికా ఖండం అవతల ఉన్న మహాసముద్రం. అబ్బ! ఎంత ప్రశాంతంగా ఉందో! దీనికి ప్రశాంత సముద్రం, అంటే పసిఫిక్ ఓషన్ అని పేరు పెడదాం.
నావికుడు1 - అయ్యా! ఖండాలు ఇలా వస్తున్నాయి, అలా పోతున్నాయి. సముద్రాలు ఇలా వస్తున్నాయి, అలా పోతున్నాయి. నేనీ టెన్షన్ భరించలేను గాని అసలు ఇంతకీ ఇండియా నేను చచ్చేలోపు వస్తుందో లేదో కచ్చితంగాచెప్పేయండి అయ్యగారూ! మీకు పుణ్యం ఉంటుంది.
మెగాలెన్ - అయ్యో ఇంకేముంది! ఈ మహాసముద్రం దాటితే వచ్చేది ఇండియానే!
(నావికుడు మూర్చబోతాడు)
(కొన్ని నెలల ప్రయాణం తరువాత మరో తీరం వచ్చింది.)
మెగాలెన్ - ఏదో తీరం కనిపిస్తోంది. ఇండియానే అయ్యుండాలి. పోయి కనుక్కురండి.
నావికుడు1 - అక్కర్లేదండి అయ్యగారు. అది ఇండియా కాదని కచ్చితంగా చెప్పొచ్చు.
మెగాలెన్ - అరె! అంత కచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు.
నావికుడు1 - అయ్యా! భూప్రపంచం అంతా తిప్పుకొచ్చారు. ఇండియా తప్ప మిగతా అన్నీ చూపించారు. ఇంకో రెండు అడుగులు వేస్తే మనిల్లు వచ్చేస్తుందండి. దీన్ని బట్టి నాకు అర్థం అయ్యేదేమిటి అంటేనండి అసలు ఇండియా అనేదే లేదనండి. లేకపోతే రోడ్ల మీద రేగుపళ్లు అమ్మినట్టు రత్నాలు అమ్ముతారా! ఏదో మన బామ్మలు చెప్తుంటే విని ఊకొడుతూ నిదరోయేవాళ్లం. ఆ కథలు విని మన రాజుగారు మీకు మమ్మల్ని అప్పచెప్పి పంపించడం. మీరేమో ఎగేసుకుని సముద్రాలన్నీ ఇండియా ఇండియా అంటూ దేవుళ్లాడడం - మా బాగుందండి!
మెగాలెన్ - ఏడ్చావులే. పోయి కనుక్కుని రా.
(వాకబు చేస్తే ఆ ప్రాంతం ఫిలిపీన్స్ అనబడే దీవి అని తెలిసింది. అప్పటికే బాగా అలసిపోయిన నౌకా సిబ్బంది అక్కడే కొన్ని నెలలు బస చేసింది. ప్రాంతీయుల కలహాల్లో మెగాలెన్ తల దూర్చవలసి వచ్చింది. ఆ కలహాలే తన ప్రాణం మీదకి వచ్చాయి. మెగాలెన్ మరణ వార్త విని నావికుల మనసులు విలవిలలాడాయి.)
నావికుడు1 - ఇది అన్యాయం అయ్యగారూ! ఇది అన్యాయం! కనిపించిన ప్రతీ తీరం ఇండియానే అనుకుని మిమ్మల్ని తొందర పెట్టాను. ఇండియా ఎంతకీ రాదేంటని మిమ్మల్ని తెగ వేధించాను. చివరికి అసలు ఇండియా అనేదే లేదని సందేహించాను. అయితే అయ్యగారూ! ఇండియా అనేది ఉందో లేదో ఇప్పటికీ నాకు తెలీదు. కాని మీరు పొరబాటు చెయ్యరని మాత్రం నాకు తెలుసు. ఇండియా తప్పకుండా ఉంటుంది. కాని మీరే లేకపోతే ఇంక మాకు ఇండియాకి దారి చూపించే వాళ్లు ఎవరున్నారు అయ్యగారూ? ఇంకెవరున్నారు?
(మెగాలెన్ సిబ్బంది ఇండియా వెళ్ళే ప్రయత్నాన్ని విరమించుకుని నేరుగా స్పెయిన్ కి ప్రయాణమయ్యారు. బయల్దేరిన నాటి నుండి సరిగ్గా మూడేళ్ల తరువాత బృందం స్పెయిన్ చేరుకుంది. బయల్దేరింది 270 మంది అయితే ఇంటికి తిరిగొచ్చింది 18 మంది. ఇండియా అయితే కనిపించలేదు కాని భూమి గుండ్రంగా ఉంది అన్న ప్రతిపాదనకి ఆ మహాయాత్ర మొట్టమొదటి నిదర్శనం అయ్యింది.)
ఆ విధంగా సముద్ర యాత్రల వల్ల భూమి గుండ్రంగా ఉందని రూఢి అయ్యింది. కాని అది ప్రత్యక్ష నిదర్శనం కాదు. ఆ నిదర్శనం కావాలంటే అంతరిక్షంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఇరవయ్యో శతాబ్దంలో అంతరిక్షయుగం మొదలయ్యింది. అంతవరకు నేల మీద నించుని అకాశం కేసి ఆశగా చూడడానికి అలవాటు పడ్డ మానవుడికి, ఆకాశంలో నించుని భూమి కేసి ఆశ్చర్యంగా చూడగలిగే అవకాశం ఏర్పడింది. చీకటి ఆకాశంలో భూమి నీలి చందమామలా గుండ్రంగా, అందంగా కనిపించింది. భూమి బల్లపరుపుగా ఉంది అని నమ్మే విడ్డూరం మనుషులు ఇప్పటికీ ఉన్నారు. కంటికి కనిపించేదీ, మనసుకి అనిపించేదీ నిజమని నమ్మితే నిస్సందేహంగా భూమి గుండ్రంగానే ఉంది.
నన్నొక B. Tech మిత్రుడు ఇదే అడిగాడు. "భూమెక్కడరా గుండ్రంగా వుంది?" అని. ఒక వేళ అలావుంటే అవతలివైపువున్న వాళ్ళు ఎలా నిలబడగలుగుతున్నారు అని. నేనేం చెప్పానో తెలుసా? "నువ్వన్నాక మామా నాకూ అదేఅనిపిస్తుందిరా" అని. దాంతో వాడు ఖుష్ నాకు కంఠశోష మిస్స్.
ఈ ప్రశ్న ఒక మూడొతరగతి విద్యార్ది అడిగితే నేను చెప్పగలను. ఐదో తరగతి వాడికి మరికొంచెం వివరంగా చెప్పగలను. పదో తరగతి వాడడిగితే నాకు తెలీదంటాను. ఇంజినీరింగ్ వాడడిగితే ఒప్పుకోక ఇంకేం చేయగలను. :)
Indian Minerva గారు, భూమి గోళం అయితే మనమంతా దాని పై భాగాన జీవిస్తుంటే, మరి మనం ఆ పై భాగం నుండి పక్కకి జరగగానే ఎందుకు జారి పడిపోము? కడలి ఎందుకు ఆకాశంలోకి కారిపోదు? గాలి ఎందుకు కొట్టుకుపోదు?
ఇటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం ఈ లింకు నుండి http://vidyaonline.org/arvindgupta/earthisroundtelegu.pdf e-పుస్తకం download చేసుకుని 15 వ పేజీ చదవండి.
మొన్న జన విజ్ఞాన వేదిక సభ్యుడు బ్రహ్మారెడ్డి గారు వ్రాసిన పుస్తకం చదువుతోంటే పంతులు గారు ఒకరు నన్ను చూసి తిట్టారు. ఈ పుస్తకంలో వ్రాసిన దాంట్లో తప్పేముంది, ఆడ-మగ కలిస్తేనే పిల్లలు పుడతారు, పిల్లల్ని దేవుడు పుట్టించడు, ఎంత నమ్మాకాలు లేనివాళ్ళు కలిసినా పిల్లలు పుడతారు అని చెప్పాను. ఆ పంతులు గారు నా మీదకి ఒక చాలెంజ్ విసిరారు. నేను నీ దగ్గరకి ఒక అమ్మాయిని తీసుకొస్తాను. దేవుడి కరుణతో పని లేకుండా ఆమెతో కలిసి పిల్లల్ని పుట్టించు చూద్దాం అన్నాడు. అలా చేస్తే ఆమె కుటుంబ సభ్యులు నన్ను పట్టుకుని తంతారు లేదా ఆమెని మోసం చేసి కడుపు చేశానని పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు అన్నాను. నీకేమీ కాకుండా నేను చూస్తాను అంటూ ఆ పంతులు గారు నాతో వాదించారు. ఈ పంతులు గారికి మనం ఎలా సమాధానం చెప్పలేమో భూమి బల్లపరుపుగా ఉందని వాదించేవాళ్ళకి కూడా అలాగే సమాధానం చెప్పలేం.
సందేహం,నాకో సందేహముండేది; ఈ నాగ ప్రసాద్ ఆ సందేహమేనా అని!ఇవ్వాళ తీరిపోయింది;నేనుండే నెట్వర్క్ లో తెలుగు అని అడ్రెస్ లో ఉంటే , అవి చూడలేను; ఇవ్వాళ పనిగట్టుకొని ఇదెవరని తేల్చుకుందుకు వచ్చాను. సంతోషం.
ఒక్కళ్ళే ఇన్ని ట్యాబ్ ల మెటీరియల్ చెయ్యగలరా అని మరో సందేహం వచ్చింది; ఫ్రొఫైల్ల్లో టీం మెంబెర్స్ ఉన్నారని చూసి కాస్తంత ధైర్యం వచ్చింది.
మంచి బ్లాగు పేరు రావల్ని, పలువురికి "ఆలోచనలు" కలిగించి, అందులో కొన్నిటిని "నమ్మకాలు" గా మార్చుకొని, శాస్త్ర దృక్పదాలతో సత్య శోధనలో జీవితాలని గడపగలరని ఆకాంక్షిస్తున్నాను.
ఆల్ ది బెస్ట్ ...దిస్ ఈజ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దీస్ టైంస్.
అసలు భుమీ గుండ్రంగా ఎందుకు ఉందో ఎంత అలోచించిన అర్ధం కావడం లేదు మరి మీకు
@నాగప్రసాద్ గారు: నాకు అతనితో వాదించేంత సమయమూ ఉద్దేశ్యమూ లేదు అనిచెప్పాలని ప్రయత్నించాను. మీరు నన్నపార్ధం చేసుకున్నట్లున్నారు.
వేగంగా భ్రమించే వస్తువులు తమ ద్రవ్యరాశిని అన్ని వైపులా సమంగా ditribute చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి (conditions apply). తక్కువ చదరపు వైశాల్యం తద్వార పరిసరాలతో తక్కువ ఘర్షణ సాధ్యమౌతాయి.కాబట్టి భ్రమించే వస్తువులు క్రమంగా ఈ ఆకృతిని సంతరించుకుంటాయి. అసలామాటకొస్తే భూమి Foot baal లా గోళాకృతిలోనేమీ లేదు Rugby ball లా కోలగా వుంటుంది. ఇది భూమి ఆత్మభ్రమణం వల్ల కలిగిన ఎఫెక్టు.