1770 ల లో ప్రీస్లీ మరిన్ని వాయువులని అధ్యయనం చేశాడు. ఆ కాలంలో విజ్ఞాన శాస్త్రానికి తెలిసిన వాయువులు మూడు. వాటిలో ఒకటి గాలి, రెండవది ఫాన్ హెల్మాంట్ మరియు బ్లాక్ లు అధ్యయనం చేసిన కార్బన్ డయాక్సయిడ్, మూడవది కావెండిష్ కనుక్కున్న హైడ్రోజెన్. ఇక నాలుగవ్ వాయువుగా రూథర్ఫర్డ్ నైట్రోజెన్ ని పై వాయువుల జాబితాలోకి చేర్చనున్నాడు. కాని ప్రీస్లీ అక్కడితో ఆగక మరిన్ని వాయువులని అధ్యయనం చెయ్యసాగాడు.
కార్బన్ డయాక్సయిడ్ తో అతడి అనుభవం వల్ల వాయువులు నీటిలో కరుగుతాయని తెలిసింది. కనుక నీటి మీదుగా పట్టిన వాయువులలో కొంత నష్టం అయ్యే అవకాశం ఉంది. కనుక పాదరసం మీదుగా వాయువులని పట్టడానికి ప్రయత్నించాడు. ఈ కొత్త పద్ధతిలో నైట్రొజెన్ ఆక్సయిడ్, అమోనియా, హైడ్రోజెన్ క్లోరైడ్, సల్ఫర్ డయాక్సయిడ్ (ఇవన్నీ ఆ వాయువుల ఆధునిక నామాలు) మొదలైన ఎన్నో వాయువులని పాదరసం మీదుగా సేకరించగలిగాడు. ఈ వాయువులన్నీ నీట్లో బాగా కరిగిపోయేవే.
1774 లో పాదరసం మీదుగా వాయువులని పట్టే ఈ కొత్త పద్ధతి మూలంగా ప్రీస్లే తన అతి ముఖ్యమైన ఆవిష్కరణని సాధించగలిగాడు. పాదరసాన్ని గాల్లో వేడిచేస్తే ఓ ఇటుక రంగు పదార్థం తయారవుతుంది. (దీన్నే ప్రస్తుతం మనం మెర్క్యురిక్ ఆక్సయిడ్ అంటాము.) ప్రీస్లీ ఈ పదార్థాన్ని ఓ పరీక్షానాళంలో (test tube) లో వేసి, ఓ కటకం సహాయంతో సూర్యకాంతిని ఆ పదార్థం మీద కేంద్రీకరించాడు. ఆ చర్యలో ఆ ఎరుపు రంగు పదార్థం తిరిగి పాదరసంగా మారిపోయింది. పరీక్షా నాళపు పై భాగంలో మెరిసే పాదరసపు బొట్లు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఈ చర్య వల్ల ఆ పదార్థం లోంచి విచిత్రమైన లక్షణాలు గల ఓ వాయువు వెలువడింది. మండే వస్తువులు ఆ వాయువులు మరింత వేగంగా, ప్రజ్వలంగా మండడం కనిపించింది. ఆ వాయువు ఉన్న ఓ పాత్ర లోకి ఓ నిప్పుకణికని ప్రవేశపెడితే అది భగ్గున మండింది.
ఈ కొత్త చర్యని ప్రీస్లీ ఫ్లాగిస్టాన్ సిద్ధాంతంతో వివరించడానికి ప్రయత్నించాడు. ఈ వాయువులో వస్తువులు మరింత వేగంగా మండగలుగుతున్నాయి కనుక అవి మరింత సులభంగా ఫ్లాగిస్టాన్ ని వెలువరించ గలుగుతున్నాయి. బహుశ గాలిలోని ఫ్లాగిస్టాన్ ని తొలగించగా మిగిలినదే ఈ కొత్త వాయువేమో. అందుకే అది మండే వస్తువుల లోంచి వెలువడే ఫ్లాగిస్టాన్ ని వేగంగా స్వీకరిస్తోంది. అందుకే ఈ కొత్త వాయువుని ప్రీస్లీ “ఫ్లాగిస్టాన్ రహిత గాలి” (dephlogisticated air) అన్నాడు. (కొన్నేళ్ల తరువాత ఆ వయువుకి ఆక్సిజన్ అని పేరు పెట్టారు. ఆ పేరునే ప్రస్తుతం మనం వాడుతున్నాం.)
(సశేషం…)
wow...its a great way of producing oxygen. i think its costly process.