అయితే ప్రీస్లీ, రూథర్ఫర్డ్ ల కన్నా ముందే ఈ ఆవిష్కరణలు చేసినా, పేరు పెద్దగా పైకి రాని మరో గొప్ప రసాయనికుడు ఉన్నాడు. స్వీడెన్ దేశానికి చెందిన ఇతగాడి పేరు కార్ల్ విల్హెల్మ్ షీలే (1742-1786). పద్దెనిమిదవ శతాబ్దంలో వైజ్ఞానిక రంగంలో స్వీడెన్ దేశాన్ని ఓ ఎత్తుకు తీసుకెళ్లిన కొందరు మేటి రసాయనికులలో ఒకడితడు.
ఈ స్వీడిష్ రసాయనికులలో మరొకడైన జార్జ్ బ్రాండ్ 1730 ప్రాంతంలో ఓ నీలిరంగు ఖనిజాన్ని అధ్యయనం చేశాడు. పోలికలో ఈ ఖనిజం ముడి రాగికి దగ్గరగా ఉంది. కాని ముడి రాగి నుండి రాగిని వెలికి తీయడానికి అవసరమైన సంస్కారాలన్నీ ప్రయోగిస్తే ఇందులోంచి రాగి వెలికి రాకపోవడం చూసి ఖనిజకారులు ఆశ్చర్యపోయారు. ఆ ముడి ఖనిజానికి ఏదో దెయ్యం పట్టిందని అనుకున్నారు. భూమిని ఆవహించి బతికే ఆ దెయ్యాలని "కోబోల్డ్" లు అని పిలిచేవారు. ఆ ముడి ఖనిజం మీద అధ్యయనాలు చేసిన బ్రాండ్ అందులో ఉన్నది రాగి కాదని, మరో కొత లోహమని కనుక్కున్నాడు. "కోబోల్డ్" దెయ్యం పేరు మీద ఆ లోహానికి కోబాల్ట్ అని పేరు పెట్టాడు.
1751 లో ఏక్సెల్ ఫ్రెడెరిక్ క్రోన్స్టెడ్ (1722-1765) అనే మరో రసాయనికుడు అలాంటిదే మరో లోహాన్ని కనుక్కున్నాడు. యోహాన్ గోట్లీబ్ గాన్ (1745-1818) 1774 లో మాంగనీస్ ని శుద్ధి చేశాడు; పీటర్ జేకబ్ హెల్మ్ (1746-1813) 1782 లో మాలిబ్డెనమ్ ని శుద్ధి చేశాడు. స్వీడిష్ దేశస్థులు కనుక్కున్న ఈ కొత్త మూలకాలన్నీ ఖనిజవిజ్ఞానంలో ఆ దేశం సాధించిన ప్రగతికి తార్కాణాలు.
ఉదాహరణకి క్రోన్స్టెడ్ ఖనిజ విజ్ఞానంలో ఊదుడుగొట్టం (blowpipe) యొక్క వినియోగాన్ని పరిచయం చేశాడు. ఇందులో కూసుగా ఉండే కొస గల ఓ పొడవాటి గొట్టం ఉంటుంది. నోరు వెడల్పుగా ఉండే కొస నుండి ఊదితే కూసుగా ఉండే కొస నుండి సన్నని వాయు ధార వేగంగా బయటికి వస్తుంది. ఈ వాయు ధారని అగ్ని మీదకి సారిస్తే ఆ అగ్ని మరింత ప్రజ్వలంగా మండుతుంది. అలా తీవ్రతరమైన జ్వాలకి, ఖనిజానికి మధ్య సంపర్కం కలిగిస్తే, ఆ చర్య వల్ల జ్వాల యొక్క రంగులో వచ్చే మార్పుని బట్టి, అందులోంచి పుట్టుకొచ్చే ఆవిరుల తత్వాన్ని బట్టి, చర్య తరువాత మిగిలే లోహ పదార్థాల ఆక్సయిడ్ల బట్టి, ఖనిజం యొక్క లక్షణాలని అంచనా వెయ్యడానికి వీలవుతుంది. ఆ విధంగా ఓ శతాబ్ద కాలం పాటు రసాయనిక విశ్లేషణలో ఊదుడుగొట్టం ఓ ముఖ్యమైన సాధనంగా చలామణి అయ్యింది.
(సశేషం...)
0 comments