“ఇదుగో చూడండి,” మామయ్య గొంతు సవరించుకుంటూ అన్నాడు. “మన వద్ద ఉన్న సామాన్ని మూడు భాగాలుగా చేస్తాం. ఒక్కొక్కరు ఒక భాగాన్ని మోస్తారు. పెళుసుగా, సులభంగా పగిలిపోయే సామాన్లని మాత్రమే మోస్తాం.”
మా శాల్తీలు ఆ లెక్కలోకి రావని అర్థమయ్యింది.
“పని ముట్లు, సంభారాలలో ఒక భాగం హన్స్ మోస్తాడు. సంభారాలలో మూడో వంతుతో పాటు, ఆయుధాలు నువ్వు మోస్తావు. తక్కిన సంభారాలతో పాటు సున్నితమైన పరికరాలు నేను మోస్తాను,” అంటూ పనులు అప్పగించాడు మామయ్య.
“మరి ఈ బట్టలు, నిచ్చెన తాళ్లు… వీటన్నిటినీ ఎవడు మోస్తాడు?” అర్థంగాక అడిగాను.
“అవి వాటంతకి అవే వెళ్లిపోతాయి.”
“అదెలా?”
“నువ్వే చూద్దువుగాని.”
ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులు, సాంప్రదాయాలు కనిపెట్టడంలో మామయ్య దిట్ట. మామయ్య ఆదేశాలని హన్స్ తుచ తప్పకుండా పాటించేశాడు. పెళుసుగా లేని వస్తువులన్నీ ఓ మూటగట్టి, దానికో త్రాడు కట్టి, దాన్ని ఎదురుగా ఉన్న అగాధంలో పారేశాడు.
అలా విసిరిన మూట ఎక్కడో లోతుల్లో ‘దబ్’ మని పడ్డ చప్పుడు వినిపించింది. అగాధంలోకి తొంగి చూస్తున్న మామయ్య, మూట మాయం కాగానే సంతృప్తిగా ఓ సారి తలాడించి ఇటు తిరిగి,
“బావుంది. ఇక మన వంతు…” అన్నాడు. మామయ్య అన్న మాటలకి వెన్నులోంచి చలి పుట్టుకొచ్చింది. నాకే కాదు మానవ మాత్రుడు ఎవడైనా అలాంటి మాటలు వెంటే అలాగే చలి తన్నుకొస్తుంది.
ప్రొఫెసరు మామయ్య పరికరాల సంచీనీ తన భుజాలకి ఎత్తుకున్నాడు. హన్స్ పనిముట్లు, నేను ఆయుధాలు అందుకున్నాం. ముందుగా హన్స్, ఆ తరువాత మామయ్య, తరువాత నేను – మా అవరోహణ ఈ క్రమంలో మొదలయ్యింది. భయంకరమైన నిశ్శబ్దంలో ముగ్గురం కిందికి దిగసాగాం. అప్పుడప్పుడు కాస్త వదులుగా ఉన్న రాళ్ళు గోడల నుండి విడవడి కింద పడుతున చప్పుడు మాత్రమే ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తోంది.
రెండు పాయలు ఉన్నా తాడుని ఒక చేత్తో బలంగా పట్టుకుని, మరో చేత్తో పట్టుకున్న కర్రతో గోడ మీద భారం వెయ్యడానికి ప్రయత్నించాను. ఒకే తాటి మీద ముగ్గరం వేలాడుతున్నాం. ఆ తాడు కట్టిన రాయిగాని ఊడి వస్తే ఏం జరుగుతుందో ఊహించడానికి కూడా ప్రయత్నించలేదు. అందుకే కాళ్లు ఖాళీగా ఉండడం ఎందుకని, ఆ కాళ్ళే చేతులనుకుని వాటితో గోడల లోంచి పొడుచుకొస్తున్న లావా రాళ్లని ఒడిసి పట్టుకోడానికి ప్రయత్నించాను.
అంతలో హన్స్ యొక్క భారీ శరీరం ఓ పెద్ద బండ మీద వాలినప్పుడు కొంచెం జారి చప్పుడయ్యింది. అప్పుడు హన్స్ మా కేసి తిరిగి,
“గిఫాక్ట్” అన్నాడు.
“జాగ్రత్త” అనువదించాడు మామయ్య.
అరగంట గడిచే లోగా పొగగొట్టానికి అడ్డుగా పొడుచుకొచ్చిన పెద్ద బండ మీద ముగ్గురం నిలిచివున్నాం.
హన్స్ తను అంతవరకు పట్టుకుని వేలాడిన తాడుని ఓసారి లాగాడు. ఆ తాడు దాన్ని పైనుండి కాస్తున్న బండ మీదుగా జారి మళ్ళీ కిందికి వచ్చింది. ఆ జారడంలో బోలెడంత లావా మట్టి మా నెత్తిన అక్షింతల వర్షంలా రాలింది.
నించున్న బండ మీంచి ఓ సారి తొంగి చూసి కింద ఇంకా ఎంత లోతుందోనని ఓ సారి చూశాను. కాని ఆ అగాధానికి అంతు ఎక్కడుందో ఇక్కణ్ణుంచి కూడా కనిపించడం లేదు.
ఇంతకు ముందు చేసిన ప్రక్రియనే మరో సారి చేశాం. మరో అరగంట గడిచేసరికి మరో రెండొందల అడుగుల లోతు దాటాం.
ఎంతటి వెర్రిబాగుల జియాలజిస్టు అయినా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో చుట్టూ ఉన్న రాళ్ల లక్షణాలని పరిశీలిస్తాడని అనుకోను. చుట్టూ ఎన్నో రకాల రాళ్లు కనిపిస్తున్నా, వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు. ప్లియోసీన్, మియోసీన్, క్రిటేషియస్, జురాసిక్, ట్రయాసిక్, పర్మియన్, కార్బొనీఫెరస్, డెవోనియన్, సిలూరియన్ మొదలైన రాతి జాతులన్నీ ఆ క్షణం ఒక్కలాగానే కనిపించాయి. కాని ప్రొఫెసర్ మాత్రం శ్రద్ధగా నోట్స్ తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. పైగా మా మజిలీలలో మామయ్య ఓ సారి నాతో ఇలా అన్నాడు,
“ముందుకు పోతున్న కొద్ది నా నమ్మకం ఇంకా బలపడుతోంది ఏక్సెల్. ఈ అగ్నిపర్వత శిలల విన్యాసాలు చూస్తుంటే డేవీ సిద్ధాంతాలు మరింత బలపడుతున్నట్టు అనిపిస్తోంది. మన చుట్టూ ఉన్న రాళ్ళు అతి పురాతనమైన రాళ్ళు. లోహాలతో నీరు చర్య జరపగా ఏర్పడ్డ రాళ్ళివి. కేంద్రం నుండి ఉష్ణం పుట్టుకొస్తోందన్న వాదన నాకు పూర్తిగా తప్పని అనిపిస్తోంది. దానికి ఆధారాలు కూడా త్వరలోనే మనకి కనిపిస్తాయి.”
(ఇంకా వుంది)
0 comments