అధ్యాయం 34
భూగర్భంలో వేణ్ణీటి
బుగ్గ
బుధవారం – ఆగస్టు
19
మా రాత బాగుండి
అదే సమయంలో బలమైన గాలి వీచింది. ఆ ఊపుకి మా బుల్లి తెప్ప ఆ జలరణరంగం నుండి దూరంగా తరలిపోయింది.
హన్స్ పడవ నడుపుతున్నాడు. ఎప్పుడూ పరధ్యానంగా ఉండే మావయ్య ఎదుట జరుగుతున్న దారుణ ఘట్టాలకి
కాస్త తెప్పరిల్లి, చుట్టూ అసహనంగా చుశాడు.
మా యాత్ర మునుపట్లాగా
ప్రశాంతంగా కొనసాగింది. కనుక నిన్న జరిగిన విషయాలనే మళ్లీ ఏకరువు పెట్టి విసిగించదలచుకోలేదు.
గురువారం – ఆగస్టు
20
గాలి – ఉత్తర.
ఉత్తర. తూర్పు దిశగా వీస్తోంది. ఆగాగి వీస్తోంది. ఉష్ణోగ్రత అధికంగా వుంది. గమనం –
గంటకి మూడున్నర కోసులు. సుమారు మధ్యాహ్నం సమయానికి దూరంగా ఏదో చప్పుడు వినిపించింది.
ఏంటో అర్థం కాలేదు గాని దాని గురించి నా పుస్తకంలో రాసుకున్నాను. ఎడతెగని ఘోష…
“దూరంగా ఏదో
రాయో, కొండో వుంది,” మామయ్య వివరించాడు. “అది కెరటాలు బండ మీద పడుతున్న చప్పుడు.”
హన్స్ తెరచాప
కట్టిన గుంజ మీదకి ఎక్కి చూశాడు. తనకి ఏ రాయి రప్ప కనిపించలేదు.
మూడు గంటలు గడిచాయి.
ఆ శబ్దం దూరంగా వున్న ఏదో జలపాతం నుండి వస్తోంది అనిపించింది.
ఆ విషయమే మామయ్యని
అడిగాను. “అవును. నా నమ్మకం నిజమని పిస్తోంది” కాస్త సందేహంగానే అన్నాడు మావయ్య.
అంటే ఏ పాతాళ
లోతుల్లోకో దూకుతున్న భయంకర జలపాతపు అంచు వద్దకి దూసుకుపోతున్నామా?
ఈ పద్ధతిలో పాతాళంలోకి
ఇంకా వేగంగా పురోగమించొచ్చు. మా మామయ్యకి ఇలాంటి దుడుకు పద్ధతులు బాగా నచ్చుతాయి కూడా.
కాని నా లాంటి మానవమాత్రులకి ఐతే కాస్త సాఫీగా, నేలకి సమాంతరంగా సాగే పురోగమనం అంటే
ఇష్టం.
ఏదేమైనా ఆ ఘోష
వస్తున్న చోటు మరి కాసిన్ని కోసుల దూరంలోనే ఉన్నట్టుంది. ఎందుకంటే శబ్దం అంతకంతకు పెరుగుతోంది.
శబ్దం ఎక్కణ్ణుంచి వస్తోంది? ఆకాశం లోంచా, సముద్రం లోంచా?
గాలి లోకి లేస్తున్న
ఆవిర్ల కేసి చూసి అవి ఎంత లోతు నుండి వస్తున్నాయో తెలుసుకోడానికి ప్రయత్నించాను. ఆకాశం
నిశ్శబ్దంగా, నిర్మలంగా వుంది. మబ్బుల్లో విద్యుల్లతలు ఎప్పట్లాగే లాస్యం చేస్తున్నాయి.
శబ్దం వస్తున్నది పై నుండి మాత్రం కాదు. దిక్చక్రం కేసి చూశాను. అక్కడ అంతా ప్రశాంతంగా
వుంది. దాని రూపురేఖల్లో ఏ మార్పూ లేదు. ఈ భీకర ఘోష ఏ జలపాతం నుండో వస్తుంటే, ఆ దిశగా
తరంగం వేగంగా ప్రవహించాలి. కాని నీటిని పరిశీలిస్తే అసలు ప్రవాహమే లేదు. ఈ నీటి మీద
ఓ ఖాళీ సీసా విసిర్తే అది వేసిన చోటే తేలుతూ ఉండిపోతుంది.
నాలుగు గంటలకి
హన్స్ మళ్లీ తెరచాప గుంజ మీదకి ఎక్కాడు. చుట్టూ కలయజూస్తున్న అతడి దృష్టి ఒక చోట నిలిచిపోయింది.
ముఖంలో ఆశ్చర్యం లేదు కాని కళ్లు మాత్రం నిశ్చలంగా అటే చూస్తున్నాయి.
“తనకేదో కనిపించింది,”
అన్నాడు మావయ్య.
“అలాగే వుంది.”
హన్స్ కిందికి
దిగి వచ్చి, దక్షిణం కేసి చేయి చూపిస్తూ అన్నాడు,
“Dere nere!”
“ఏవిటి కిందనా?”
ఆదుర్దాగా అడిగాడు మావయ్య.
(ఇంకా వుంది)
0 comments