అయితే ఒకటి. కాంతి వేగంతో పోల్చితే భూమి వేగం అత్యల్పం. కనుక
కాంతి వేగం నుండి భూమి వేగం తీసేసినా, దాన్ని కలిపినా పెద్ద తేడా వుండదు. మరి కాంతి వేగంలో భూమి వేగం పాలుని ఎలా కనిపెట్టగలం?
ఈ సమస్యని తేల్చడానికి 1881 లో మికెల్సన్ interferometer అనే ఓ పరికరాన్ని నిర్మించాడు. ఆ పరికరంలో ఒక కాంతి
పుంజం రెండుగా చీల్చబడి, ఆ పుంజాలు రెండూ వేరు వేరు దిశలలో పంపబడి, మళ్లీ ఒక దగ్గరికి
చేర్చబడతాయి.
చీల్చబడ్డ కాంతి పుంజంలో ఒక అంశం ఒక దిశలో భూమి చలన దిశలోనే
ప్రయాణిస్తే, తిరుగు ప్రయాణంలో భూమి చలన దిశకి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తుంది. కాంతి
పుంజంలోని రెండవ అంశం రాను, పోను మార్గాలు రెండిట్లోను భూమి చలన దిశకి లంబంగా ప్రయాణిస్తుంది.
ఈ పరికరాన్ని రూపొందించడంలో మికెల్సన్ ఉద్దేశం ఇది. ఈథర్ నిశ్చలంగా
వుండి, భూమి కదులుతున్నట్లయితే, కాంతి పుంజంలోని అంశాలు తిరిగి మొదటి స్థానానికి వచ్చాక
రెండు తరంగాలలో తేడా వుంటుంది.
రెండు తరంగాలు కొన్ని చోట్ల ఒకదాన్నొకటి సంవర్ధనం చేసుకుంటాయి.
అలాంటి చోట్ల కాంతి మరింత ప్రకాశవంతంగా ఉంటుంది. కొన్ని చోట్ల ఒకదాన్నొకటి నిరోధించుకుంటాయి. ఒకదాన్నొకటి వమ్ము చేసుకుంటాయి. అలాంటి చోట్ల కాంతి
మరింత బలహీనంగా ఉంటుంది.
కనుక రెండు పుంజాలు కలిసే చోట తెర మీద చిత్రాన్ని చూస్తే అది
తెలుపు నలుపుల రేఖావిన్యాసంలా ఉంటుంది. అలంటి
రేఖలనే interference fringes (వ్యతికరణ చారలు)
అంటారు. ఆ చారల మందాన్ని బట్టి కాంతి పుంజాల వేగాలలోని భేదాన్ని లెక్కించొచ్చు.
అలాగే భూమి యొక్క నిరపేక్ష వేగాన్ని కూడా లెక్కించొచ్చు.
1887 కల్లే మికెల్సన్
తను ఊహించిన ప్రయోగానికి సంబంధించిన లెక్కలన్నీ పూర్తి చేసి సిద్ధంగా వున్నాడు. ఎడ్వర్డ్
విలియమ్స్ మార్లే (1838-1923) అని మరో శాస్త్రవేత్తతో
కలిసి ప్రఖ్యాత ‘మికెల్సన్-మార్లే ప్రయోగాన్ని’ చెయ్యడానికి ఆయత్తం అయ్యాడు.
తీరా ప్రయోగం చేసి చూడగా ప్రయోగం విఫలమైనట్టు తోచింది. అనుకున్నట్టుగా
వ్యతికరణ చారలు కనిపించలేదు. ఏ దిశలో చూసినా కాంతి ఒకే వేగంతో ప్రయాణిస్తున్నట్టు కనిపించింది.
అది ఎలా సాధ్యమో ఎవరికీ అర్థం కాలేదు. మికెల్సన్ ఆ ప్రయోగాన్ని పదే పదే చేసి చూశాడు.
ఎన్ని సార్లు చేసినా ఫలితం ఒకటే. చారలు లేవు. అన్ని దిశలలో కాంతి వేగం ఒక్కటే.
నిజానికి మికెల్సన్-మార్లే ప్రయోగాన్ని గత నూరేళ్లలో ఎన్నో
సార్లు చేసి చూశారు. పందొమ్మిదవ శతాబ్దంలో మికెల్సన్ వాడిన పరికరాల కన్నా ఎంతో సునిశితమైన
పరికరాలతో ప్రయోగాలు చేశారు. పరికరాలు మారాయిగాని ఫలితాలు మారలేదు. కాంతి ఏ దిశలో కదిలినా,
భూమి ఎటు కదిలినా, ఎంతలా కదిలినా, కాంతి వేగం మాత్రం ఒక్కటే!
ఇలా విషయం ఎటూ తేలకుండా ఉన్న తరుణంలో 1905 లో ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ (1879-1955) అనే జర్మన్-స్విస్
శాస్త్రవేత్త రంగప్రవేశం చేశాడు. ఐన్ స్టయిన్ ‘సాపేక్ష సిద్ధాంతం’ (theory of
relativity) అనే కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
ఈ సిద్ధాంతం సహాయంతో చలనాన్ని ఓ కొత్త కోణం నుండి చూడడానికి వీలయ్యింది. ఐన్ స్టయిన్
నిరపేక్షమైన చలనం, నిరపేక్షమైన నైశ్యల్య స్థితి అనేవి లేనే లేవన్నాడు. ఒక వస్తువు యొక్క
చలనం గురించి మరో వస్తువుని బట్టి వర్ణించడానికి వీలవుతుంది గాని, ఏ వస్తువు తోనూ ప్రమేయం
లేకుండా నిరపేక్షంగా వర్ణించడానికి వీల్లేదన్నాడు.
(ఇంకా వుంది)
0 comments