శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పాశ్చాత్య తీరం దిశగా పయనమయ్యాడు రామనుజన్

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, February 19, 2015
ఉదయం తరచు మద్రాసు లోని ప్రఖ్యాత కన్నెమరా గ్రంథాలయానికి వెళ్లి చదువుకునే వాడు. కొన్ని సార్లు కె.బి. మాథవ అనే ఓ గణాంక శాస్త్రవేత్త (statistician) నుండి గణిత పుస్తకాలు తెచ్చుకుని చదువుకునేవాడు. రాత్రిళ్ళు నారాయణ అయ్యర్ అనే స్నేహితుడితో కలిసి లెక్కలు చేసుకునేవాడు. ఈ నారాయణ అయ్యరు పోర్ట్ ట్రస్ట్ లో పని చేసే రోజుల్లో రామానుజన్ కి ఉన్నతాధికారి. గణితంలో కొంత ప్రవేశం ఉన్నవాడు. ఇద్దరూ రాత్రి తెల్లవార్లూ రెండు పెద్ద పలకల మీద రామానుజన్ ఇంట్లో లెక్కలు చేసుకునేవారు. (పలకల మీద వారి బలపాలు చేసే ‘టక టక’ చప్పుళ్ళకి ఇంట్లో వాళ్లకి నిద్ర కరువయ్యేదట!) ఎన్నో సార్లు రామనుజన్ తన తల్లిని అర్థ రాత్రి లేపమనే వాడట, ఆ నిశాంత నిశా సమయంలో అయితే నిశ్శబ్దంగా, నిరంతరాయంగా లెక్కలు చేసుకోవచ్చని!  గణితంలో పడి ఎన్నో సార్లు అన్నం తినడం మర్చిపోయేవాడట. ఆలోచనా ప్రవాహానికి భంగం కలగకుండా వాళ్ల అమ్మో, అమ్మమ్మో అన్నం ముద్దలు చేసి చేతిలో పెట్టేసేవారట. రామనుజన్ కి అత్యంత ప్రీయమైన వంటకం అయిన గుత్తి వంకాయ చేతిలో పడ్డప్పుడు మాత్రం వ్రత దీక్ష కొంచెం భంగపడేదట!  ఒక పక్క నిలువుగాను, మరో పక్క అడ్డుగాను కోసి మధ్యలో ఉల్లికారం కూరిన వంకాయ, లోకంలో అణువణువునా గణిత చిహ్నాలు చూసే ఆ మేధావికి ఓ అద్భుతమైన గణిత వస్తువులా కనిపించేదేమో!

గణిత అధ్యయనాలు ఒక పక్క అలా ఉధృతంగా సాగుతుండగా, మరో పక్క హార్డికి, రామానుజన్ కి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగుతూ ఉన్నాయి. నిరూపణలు పంపమని హర్డీ ఒత్తిడి చెయ్యడం, ‘అదుగో, ఇదుగో’ అంటూ రామానుజన్ తాత్సారం చెయ్యడం – ఇలా కొంత కాలం జరిగింది.

హార్డీ తన మిత్రుడైన లిటిల్ వుడ్ కి రామానుజన్  ఉత్తరాల గురించి చెప్పాడు. ‘రామానుజన్ ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు,’ అన్నాడు.

‘నిరూపణలు తెలిస్తే బహుశ అతడి సిద్ధాంతాలని  నువ్వే చేశానంటావని అతడి భయం కాబోలు,’ అని సూచించాడు లిటిల్ వుడ్.

ఆ విషయమే హార్డీ రామానుజన్ ఓ ఉత్తరంలో రాశాడు. అది చదివిన రామానుజన్ అలాంటిదేం లేదని, బాధపడుతూ రాశాడు. ఈ ఉత్తర ప్రత్యుత్తరాల వల్ల, దూరభారం వల్ల ఆ దశలో రామానుజన్, హార్డీ ల మధ్య కొంత స్పర్థ ఏర్పడిందనే చెప్పొచ్చు.

పోనీ ఇద్దరి మధ్య ఏర్పడ్డ అపార్థాన్ని తొలగించుకుని, రామానుజన్ సిద్ధాంతాలని లోకం గుర్తించేలా చేసేందుకు గాను, కొంత కాలం రామానుజన్ ఇంగ్లండ్ కి వస్తే బావుంటుందని కూడా హార్డి సూచించాడు. ఆ సూచనకి కూడా రామానుజన్ మొదట సుముఖంగా స్పందించలేదు.

విదేశాలు వెళ్లడానికి రామానుజన్ సుముఖంగా లేకపోడానికి కారణాలు ఎన్నో. ఇంగ్లండ్ కి వెళ్ళడానికి కావలసినంత ధనం ఎక్కణ్ణుంచి సంపాదించాలి? అక్కడ మళ్లీ పరీక్షలు రాయాలా? రాసి తప్పితే తన గతేం కావాలి? ఇలా ఎన్నో ప్రశ్నలు తన మనసులో దొలిచేస్తున్నా, అతి ముఖ్యమైన కారణం మాత్రం ఒకటి వుంది.

ఆ రోజుల్లో బ్రాహ్మణులలో సముద్రాలు దాటి  విదేశాలకి ప్రయాణించకూడదు అన్న నిషేధం ఉండేది. అలా చేసిన వారిని కులం నుండి వెలివేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆచారాలకి, నమ్మకాలకి ఎంతో విలువనిచ్చే రామానుజన్ కుటుంబానికే కాక, రామనుజన్ కి కూడా ఆ  ఆలోచన పెద్దగా రుచించలేదు. ముఖ్యంగా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే కొడుకుని దూరం చేసుకోవడం కోమలతమ్మకి ససేమిరా ఇష్టం లేదు.

ఈ సందిగ్ధ పరిస్థితికి పరిష్కారంగా రామానుజన్ కుటుంబానికి ఒకే మార్గం కనిపించింది -  కులదేవత అయిన నమక్కళ్ దేవతని దారి చూపమని వేడుకోవడం. డిసెంబర్ 1913  లో రామానుజన్ కుటుంబం మొత్తం నమక్కళ్ వెళ్లి అక్కడ వేలుపు దర్శనం చేసుకున్నారు. రామానుజన్ తో పాటు ప్రాణమిత్రుడైన నారాయణ అయ్యర్ కూడా వచ్చాడు. ఒక విధంగా ఈ నమక్కళ్ వెళ్లే ఆలోచన నారాయణ అయ్యర్ దే.  మూడు రోజులు నమక్కళ్ లోనే బస చేశారు. మొదటి రెండు రోజులూ పెద్దగా ఏమీ జరగలేదు గాని, మూడో రాత్రి రామనుజన్ కి ఓ కల వచ్చింది. కలలో కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతిలో నమక్కళ్ దేవత ప్రత్యక్షమై విదేశాలకి వెళ్లమని ఆదేశించిందట. పక్కనే పడుకున్న నారాయణ అయ్యర్ ని లేపి రామానుజన్ తన కల గురించి చెప్పాడు.

ఇలాంటి కలే ఒకటి మరో సందర్భంలో కోమలతమ్మకి కూడా వచ్చింది. ‘రామానుజన్ చుట్టూ కొందరు తెల్ల వారు కూర్చున్నట్టు, తన కొడుకు యొక్క అదృష్టానికి, కొడుక్కి మధ్య తను నించోవద్దని నమక్కళ్ దేవత ఆదేశిస్తున్నట్టు కల!
ఈ కలల మహిమ వల్ల రామానుజన్ కుటుంబం అతడి విదేశీ యానం పట్ల మనసు మార్చుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్ కి వెళ్లడానికి రామానుజన్ సుముఖంగా ఉన్నాడు.

సరిగ్గా అలాంటి తరుణం లో ఎరిక్ నెవిల్ (Eric Neville) అనే గణితవేత్త దేవుళ్లా మద్రాస్ కి వచ్చాడు. ఇతడు హార్డీ పంపిన మనిషి. పట్టున ఇరవై  ఐదు కూడా నిండని నెవిల్ గొప్ప సూక్ష్మ బుద్ధి గల గణిత వేత్త. దక్షిణ భారతంలో గణితం మీద ఉపన్యాసాలు ఇవ్వడానికి వచ్చాడు నెవిల్. అదేపనిగా రామానుజన్ ని కూడా కనుక్కుని విషయం తేల్చుకోమని పంపాడు హార్డీ. రామానుజన్ కి రాసిన ఉత్తరాలలో  స్పష్టం చెయ్యకపోయినా హార్డీకి రామానుజన్ ని ఎలాగైనా ఇంగ్లండ్ కి తెప్పించుకోవాలని బాగా పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్ కి రావడానికి ఎలాగైనా రామానుజన్ ని ఒప్పించమని నెవిల్ పంపాడు హార్డీ.

నెవిల్ రామానుజన్ ని కలుసుకున్నాడు. రామనుజన్ తన నోట్సు పుస్తకాలు చూపించాడు. చేత్తో రాసిన ఆ కాగితాలు చూసి నెవిల్ మంత్రముగ్ధుడయ్యాడు. రామానుజన్ ని ఎలాగినా ఇంగ్లండి కి రావడానికి ఒప్పించాలి. ఇతడికి నమక్కళ్  దేవత కలలో కనిపించిన భాగోతం అంతా తెలీదు. రామానుజన్ ఒప్పుకోడని సందేహిస్తూనే అడిగాడు. కాని తన ఆహ్వానానికి రామనుజన్ వెంటనే ఒప్పుకోవడం చూసి నెవిల్ ఆశ్చర్యపోయాడు.

అక్కడ ఇంగ్లండ్ లో హార్డీ, ఇక్కడ ఇండియాలో నెవిల్  ముమ్మరంగా పని చేసి రామానుజన్ యాత్రకి, ఇంగ్లండ్ లో బసకి కావలసిన నిధులు వేగంగా అతి తక్కువ కాలంలో ఏర్పాటు చేశారు.

ప్రయాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. అంతకు ముందు రామానుజన్ ప్రతిభ విషయంలో ఎటూ తేల్చుకోలేని రామచంద్ర రావుగారు కల్పించుకుని ఈ సన్నాహంలో ఎన్నో విధాలుగా తోడ్పడ్డారు. రామానుజన్ మిత్రులు అతడి పాశ్చాత్య జీవన విధానం గురించి రకరకాలుగా చెప్పారు. వేష భాషల గురించి వేగంగా తర్ఫీదు ఇచ్చారు. రామచంద్ర రావు గారు అతడి పిలక తీసేయక తప్పదని నిర్బంధించారు. ఓ బ్రిటిష్ మిత్రుడు రామానుజన్ ని తన మోటార్ సైకిలు మీద ఊరంతా తిప్పి అవసరమైన బట్టలు కొనిపించాడు. సూటు బూటు వేసుకోడానికి ఎలాగో ఒప్పుకున్నా పాపం రామనుజన్ కి ‘టై’ కట్టుకోవడం మాత్రం మహా తలనొప్పిగా ఉండేది. ఇంత సందడిగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నా రామానుజన్ ఈ యాత్ర పట్ల అంత సంతోషంగా లేదని అనిపించింది రామచంద్ర రావుకి. ఏదో విధి లేక ఇదంతా చేస్తున్నట్టు, “దైవ సంకల్పం కనుక చేస్తున్నట్టు” అనిపించింది ఆయనకి.

ఇంగ్లండ్ యాత్ర విషయంలో రామానుజన్ ని ఇబ్బంది పెట్టే ఓ ముఖ్యమైన విషయం ఆహారం. శుద్ధ శాకాహారం తప్ప మరొకటి తెలియని శ్రోత్రియ బ్రాహ్మణుడు. తినే భోజనమే కాక, దాన్ని వండేదెవరు, వడ్డించేదెవరు మొదలైన వాటి విషయంలో ఎన్నో నియమాలు ఉన్నావాడు. ఈ నియమాలన్నీ ఇంగ్లండ్ లో ఎలా పొసగుతాయి?   శాకాహారం విషయంలో ఏ సమస్యా ఉండదని హార్డీ హామీ ఇచ్చాక ఆ చింత కాస్త తీరింది.

మార్చ్  14  నాడు రామానుజన్ తన తల్లిని, భార్యని కుంభకోణం వెళ్లే రైలు ఎక్కించాడు. భార్య జానకమ్మ ఎలాగైనా భర్తతో పాటు ఇంగ్లండి వెళ్లాలనుకుంది. పెళ్ళయ్యాక భర్తతో ఒకే చూరు కింద జీవించిన కాలం తక్కువ. చాల కాలం తరువాత కుంభకోణం నుండి వచ్చి మద్రాసులో పని చేస్తున్న భర్త వద్దకి చేరుకుంది. ఎప్పుడూ గణితంలో మునిగితేలే భర్త తనని పెద్దగా పట్టించుకోకపోయినా, రోజూ కళ్ళెదుట భర్త కనిపిస్తూ ఉంటే ఆమెకో తృప్తి. పోనీ మద్రాసులోనే వున్నా అప్పుడప్పుడు అయినా కుంభకోణం నుండి వచ్చి చూసి పోయే అవకాశం ఉండేది. విశాల సముద్రాలు దాటి ఇప్పుడు విదేశాలకి పయనిస్తున్నాడు. మళ్లీ కొన్నేళ్ల దాక తిరిగి రాడు. మళ్లీ భర్తని ఎప్పుడు చూసుకుంటుందో తెలీదు. ఒకరోజు అత్తగారు ఇంట్లో లేని సమయంలో భర్తని తను కూడా ఇంగ్లండ్ తీసుకెళ్లమని అడిగింది. రామనుజన్ వీలుపడదని గట్టిగా చెప్పలేకపోయాడు. కాని తరువాత రామచంద్రరావు  కల్పించుకుని రామనుజన్ ఒంటరిగా వెళ్ళడమే శ్రేయస్కరమని, అక్కడ అతడు ఏకాగ్రచిత్తంతో గణిత అధ్యయనాలు కొనసాగించాలని, సపరివారంగా ఇంగ్లండ్ కి వెళ్ళడం ప్రస్తుత పరిస్థితుల్లో వీలుపడదని చెప్పి ఒప్పించాడు.


మార్చ్ 17  1913  నాడు ఎస్. ఎస్. నెవాసా అన్న ఓడలో ఇంగ్లండ్ కి బయల్దేరాడు. అంతవరకు గణిత లోకంలో ఎన్నో అద్భుత తీరాలని చూసిన రామనుజన్, ఇప్పుడు తన జీవితాన్ని సమూలంగా మార్చేసే ఓ పాశ్చాత్య తీరం దిశగా పయనమయ్యాడు.
(ఇంకా వుంది)

3 comments

 1. Anonymous Says:
 2. Excellent narration and truly inspiring

   
 3. Thank you!!!

   
 4. Sujata Says:
 5. Please. Dinni oka pustakam laa teesuku randi.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email