పైన చెప్పుకున్న
చర్య విలియమ్సన్ చెప్పిన ఉత్‍క్రమణీయ చర్యల లాంటిదే. ఇలాంటి చర్యలు సమతాస్థితిని చేరుకుంటాయని,
ఆ స్థితిలో A, B, C, D లు అన్నీ ఆ రసాయనిక వ్యవస్థలో కలిసి వుంటాయని మనకి ఇప్పుడు తెలుసు. A, B ల మధ్య చర్య జరిగే వేగం (రేటు 1) బట్టి C, D లు
చర్య జరిపే వేగం (రేటు 2) ఎంత ఎక్కువ (లేక
తక్కువ) అన్న దాని మీద సమతాస్థితి ఆధారపడుతుంది.
రేటు 1 రేటు
2 కన్నా బాగా ఎక్కువ అనుకుందాం. అప్పుడు A, B ల
మధ్య వేగంగా చర్య సాగుతుంది. అధిక మొత్తంలో C, D
లు ఉత్పన్నమవుతాయి. మరో పక్క C,
D లు నెమ్మదిగా చర్య జరపగా తక్కువ మోతాదులో A, B లు
ఉత్పన్నమవుతాయి. అందుచేత A, B లు అధిక శాతం
C,D లుగా మారిపోతాయి. వ్యతిరేక దిశలో పెద్దగా మార్పు జరగలేదు. కనుక సమతాస్థితి
వద్ద ఎక్కువగా C, D లే కనిపిస్తాయి. పైన ఇవ్వబడ్డ సమీకరణాన్ని గమనిస్తే
అలాంటి పరిస్థితుల్లో సమతాస్థితి బాగా కుడి పక్కకి జరిగింది అంటాము.
అదే విధంగా రేటు 2 రేటు 1
కన్నా బాగా ఎక్కువైనప్పుడు అందుకు విరుద్ధమైన ఫలితాలు వస్తాయి. అలాంటప్పుడు
C, D ల మధ్య వేగంగా చర్య జరిగి, A, B లు
అధిక మొత్తంలో పుడతాయి. A, B ల మధ్య చర్య
అంత వేగంగా సాగడం లేదు కనుక అవి అలాగే ఉండిపోతాయి. ఈ పరిస్థితుల్లో సమతాస్థితి వద్ద
ఎక్కువగా A, B లే ఉంటాయి. అలాంటప్పుడు సమతాస్థితి బాగా ఎడమ పక్కకి
జరిగింది అంటాము.
కాని రేటు 1 , A యొక్క
అణువు ఎంత తరచుగా B యొక్క అణువుని ఢీకొంటుంది
అన్న దాని మీద ఆధారపడుతుంది. ఎందుకంటే అణువులు ఢీకొన్నప్పుడే చర్య జరుగుతుంది. పైగా
ఢీ కొన్నంత మాత్రాన చర్య జరగాలని లేదు. అదే విధంగా రేటు 2, C యొక్క అణువు
D యొక్క అణువుతో ఎంత తరచుగా ఢీ కొంటుంది
అన్నదాని మీద ఆధారపడుతుంది.
ఇప్పుడు ఆ వ్యవస్థ
యొక్క ఘనపరిమాణాన్ని మార్చకుండా కాస్త అదనంగా
A గాని లేక B గాని (లేక రెండూ గాని) ఆ వ్యవస్థకి కలిపాము అనుకుందాం.
A, B ల గాఢత పెరిగింది కనుక వాటి అణువుల మధ్య
అభిఘాతాలు (collisions) మరింత తరచుగా జరుగుతాయి.
(దీనికి సారూప్యాన్ని చెప్పుకోవాలంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాలు
ఒకదాన్నొకటి గుద్దుకునే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అర్థరాత్రి పూట ట్రాఫిక్ పలచగా ఉన్నప్పుడు
ఆ అవకాశం తక్కువ.)
అందుచేత A యొక్క,
B యొక్క (లేదా రెండిటి యొక్క) గాఢత పెంచినప్పుడు రేటు 1 పెరుగుతుంది.
గాఢత తగ్గిస్తే రేటు కూడా తగ్గుతుంది. అలాగే C యొక్క, లేక D ల యొక్క (లేదా రెండిటి
యొక్క) గాఢత పెంచితే రేటు 2 పెరుగుతుంది.
ఆ విధంగా రేటు 1 ని గాని, రేటు 2 ని గాని మార్చి సమతాస్థితిలో ఉండే
పదార్థాల గాఢతలని నియంత్రించొచ్చు. చర్యలో పాల్గొనే పదార్థాల గాఢతలని మార్చి ఆ విధంగా
సమతాస్థితిని వీలుగా మార్చుకోవచ్చు.
సమతాస్థితి వద్ద A, B, C, D
ల గాఢతలు మారుతాయని, మార్చుకోవచ్చని తెలుసుకున్న గుల్డ్‍బర్గ్, వాగేలు మరో ముఖ్యమైన
విషయం గమనించారు. A, B, C, D లు మారుతున్నా
వాటి వెనుక మారకుండా నేపథ్యంలో ఒక రాశి వుందని గుర్తించారు. ద్వంద్వ బాణాలకి ఎడమ పక్క
ఉన్న రసాయనాల గాఢతల లబ్దానికి, అలాగే కుడి పక్కన ఉన్న రసాయనాల గాఢతల లబ్దానికి మధ్య
నిష్పత్తి, సమతాస్థితి వద్ద మారకుండా ఉండడం గమనించారు.
ఒక ప్రత్యేక
పదార్థం యొక్క గాఢతని ఆ పదార్థం యొక్క చిహ్నానికి ఇరు పక్కల బ్రకెట్లు పెట్టి సూచించొచ్చు
అనుకుందాం. అప్పుడు సమతాస్థితి వద్ద ఈ కింది రాశి స్థిరాంకం అవుతుంది.
పై సమీకరణంలో
K ని సమతాస్థితి స్థిరాంకం (equilibirium
constant) అంటారు. ఒక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద ఏ ఉత్‍క్రమణీయ చర్యకైనా ఇలాంటి స్థిరాంకం
ఒకటి ఉంటుంది.
ఆ విధంగా గుల్డ్‍బర్గ్,
వాగే లు ప్రతిపాదించిన ఈ ‘సమిష్టి ప్రభావపు నియమం (law of mass action)’ ఉత్‍క్రమణీయ
చర్యలని చక్కగా వివరించగలిగింది. బెర్థొలే చేసిన తప్పుడు సూచన కన్నా ఇది ఎంతో మేలని
తేలింది. అయితే దురదృష్టవశాత్తు గుల్డ్‍బర్గ్, వాగే లు తమ కృషి గురించి నార్వేజియన్
భాషలో రాసి ప్రచురించారు. అందుచేత 1879 లో
దాన్ని జర్మన్ భాషలోకి తర్జుమా చేసిన దాకా దాని గురించి ప్రపంచానికి పెద్దగా తెలియలేదు.
(ఇంకా వుంది)
0 comments