అలా రామనుజన్ పంపిన సిద్ధాంతాలని
పరిశీలిస్తూ హార్డీ, లిటిల్ వుడ్ లు ఎంత సేపు గడిపారో తెలీదు. మొదట్లో రామానుజన్ సృజనలో
ఎంతో కొంత ప్రత్యేకత ఉందనుకున్నారు. నిజంగా గణితం తెలిసిన వాడే, మోసగాడు కాడు అనుకున్నారు.
కాని ఉత్తరాన్ని, అందులోని అంశాలని కొన్ని గంటల పాటు శ్రధ్ధగా పరిశీలించిన మీదట ఆ గణిత
స్నేహితులు ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు – ఆ ఉత్తరాన్ని రాసిన వ్యక్తి “అత్యున్నత
కోవకి చెందిన గణిత వేత్త అయ్యుండాలి.”
అంతకు ముందు రామానుజన్ ఉత్తరాలు
రాసిన ఇద్దరు బ్రిటిష్ గణితవేత్తలు చేసినట్టుగా నిరాకరించి హార్డీ పొరబాటు చెయ్యలేదు.
రామానుజన్ ఉత్తరానికి ప్రతులని
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎందరో ప్రముఖులకి పంపాడు హార్డీ. రామనుజన్ సిద్ధాంతాలు
కేంబ్రిడ్జ్ లో గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. ఇంతలో హార్డీ లండన్ లోని ఇండియా కార్యాలయాన్ని
సంపర్కించి రామనుజన్ ని కేంబ్రిడ్జ్ కి తీసుకు వచ్చే ప్రయత్నాలు మొదలెట్టాడు.
ఇక ఆలస్యం చెయ్యకుండా రామనుజన్
కి ఉత్తరం రాశాడు.
Dear Sir, I was
exceedingly interested by your letter and by the theorems…”
“అయ్యా, మీ ఉత్తరం, అందులో
వివరింపబడ్డ సిద్ధాంతాలు నాకు ఎంతో ఆసక్తికరంగా తోచాయి..”
అంటూ ప్రశంసాపూర్వకంగా మొదలుపెట్టినా ఆ సిద్ధాంతాలకి
నిరూపణలు కూడా జత చేసి వుంటే బావుండేదని, నిరూపణలు
లేకుండా ఆ సిద్ధాంతాల విలువ తేల్చుకోవడానికి సాధ్యం కాదని రాశాడు. ఆ నిరూపణలు కూడా
ఆషామాషీ నిరూపణలు కాదు. “నిస్సందేహమైన నిర్దుష్టత” (absolute rigor) గల నిరూపణలు కావాలని
కోరాడు.
ఆ నిరూపణలు వీలైనంత తొందరగా
పంపమని, సకాలంలో పంపగలిగితే వాటిని అత్యున్నత గణిత పత్రికలలో ప్రచురించడానికి వీలవుతుందని
రాశాడు.
ఒక పక్క రామనుజన్ ప్రతిభకి
ఇంగ్లండ్ నుండి స్పందన ఇల ఉండగా, మద్రాసులో కూడా పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడసాగింది.
మద్రాస్ లో రామానుజన్ కి సర్ ఫ్రాన్సిస్ అనే
అభిమాని, శ్రేయోభిలాషి ఉండేవాడు. ఇతడు గణితంలో ప్రముఖులు ఎవరికైనా రామనుజన్
చేసిన గణిత సృజనని చూపించి రామనుజన్ పట్ల సదభిప్రాయం కలిగే చెయ్యాలని అనుకునేవాడు.
ఓ సారి గిల్బర్ట్ వాకర్ అనే గణిత వేత్త మద్రాస్ కి వచ్చాడు. ఈ వ్యక్తి సిమ్లా లో ‘భారతీయ
వాతావరణ విభాగం’లో పని చేసేవాడు. సర్ ఫ్రాన్సిస్ ఈ వాకర్ కి రామనుజన్ రాసిన నోట్సు
పుస్తకాలు చూపించాడు. ఆ గణితం చూసి వాకర్ మురిసిపోయాడు.
కేంబ్రిడ్జ్ స్థాయి గణిత
వేత్తలతో పోల్చదగ్గ వాడు రామనుజన్ అన్నాడు.
రామానుజన్ పరిశోధించే గణితం ‘శుద్ధ గణితం’ (pure mathematics). కాని వాతావరణ పరిశోధనలలో
గణితాన్ని ఉపయోగించే వాకర్ కి తెలిసిన గణితం ‘అనువర్తిత గణితం’ (applied
mathematics). కనుక ఒక పక్క తనకి రామానుజన్ చేస్తున్న గణితంలో పెద్దగా ప్రవేశం లేదని
ఒప్పుకుంటూనే, రామానుజన్ ని కొంత కాలం ఇంగ్లండ్ లో ఓ పెద్ద విశ్వవిద్యాలయంలో పని చేసేలా
సదుపాయం కల్పిస్తే ఆయన ప్రతిభ లోకానికి తెలుస్తుందని
సూచించాడు.
ఇది విన్న రామానుజన్ కి తన
మీద తనకి నమ్మకం బలపడింది. త్వరలోనే హార్డీకి జవాబు రాశాడు. మొదటి ఉత్తరంలో ప్రాథేయపడుతున్నట్టుగా
ఉన్న ధోరణి ఈ సారి కొంచెం మారింది. తన మొదటి ఉత్తరానికి సుముఖంగా స్పందించినందుకు హర్డీకి
కృతజ్ఞతలు చెప్తూనే ఉత్తరాన్ని ఆరంభిస్తాడు. కాని నిరూపణలు ఇవ్వకపోవడానికి కారణం ఉత్తరంలో
ఖాళీ లేకపోవడమే నని, అంటునే హార్డీకి ఇలా సవాలు విసుర్తాడు – “నేను పంపిన ఫలితాలని
కావాలంటే సమకాలీన గణితవేత్తలు నడిచే గాడిలోనే నడిచి మీకు మీరే సరిచూసుకోండి. అప్పుడు నా గణిత ఫలితాలలో ఏదో లోతైన సత్యం ఉందని
మీకే తెలుస్తుంది.”
వాకర్ ఉత్తరంతో ఉత్సాహం వచ్చిన
బి. హనుమంత రావు అనే లెక్కల ప్రొఫెసరు రామానుజన్ కి సహాయపడుతూ ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో మద్రాసులో కొందరు ప్రముఖులని సమావేశ పరిచి రామనుజన్
కి ఓ స్కాలర్షిప్ అందేలా ఏర్పాటు చేశాడు. నెలకి డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చే ఆ స్కాలర్షిప్
తో మద్రాస్ లో రామానుజన్ పరిస్థితి గణనీయంగా మారింది. పొట్టకూటి కోసం ఇష్టం లేని ఉద్యోగాలు
చెయ్యనక్కర్లేదు. రాత్రనక, పగలనక తనకి ప్రియాతిప్రియమైన గణితంలో మునిగితేలొచ్చు.
(ఇంకా
వుంది)
Very good posts. Please continue to post.