బెర్థెలో నాటీకే
ఉత్‍క్రమణీయ చర్యల గురించి తెలుసు. 1850 లో
వాటిని మొట్టమొదట విలియమ్సన్ ప్రత్యేకమైన శ్రద్ధతో అధ్యయనం చేశాడు. ఆ అధ్యయనాలే ఈథర్ ల మీద తను చేసిన
పరిశోధనలకి దారి తీసింది. అతడు కొన్ని రసాయన చర్యలలో A, B అనే మిశ్రమంతో మొదలెడితే C, D అనే పదార్థాలు ఏర్పడడం గమనించాడు. అలాగే C, D ల
మిశ్రమంతో మొదలెడితే A, B లు ఉత్పన్నం కావడం
చూశాడు. రెండు సందర్భాలలో చివర్లో A, B, C, D
లు నాలుగూ మిగలడం కనిపించింది. ఆ నాలుగింటి మధ్య స్థిర నిష్పత్తులు ఉండడం కనిపించింది.
ఆ మిశ్రమం సమతాస్థితి (equilibrium) వద్ద ఉన్నట్టు తెలిసింది.
చివర్లో నాలుగు
పదార్థాలు స్థిరమైన మోతాదుల్లో ఉండడం చూసి ఇక చర్య జరగడం ఆగిపోయిందని విలిమ్సన్ పొరబడలేదు.
అలాంటి స్థితిలో కూడా A, B లు C, D లతో చర్య జరుపుతున్నాయనే అనుకున్నాడు. ఆ చర్య రెండు
దిశలలోను నడుస్తూనే వుంది. అయితే ఒక దిశలో సాధించిన పురోగతి, రెండవ దిశలో జరిగిన మార్పు
వమ్ము చేస్తోంది. కనుక తటస్థంగా ఉన్న భ్రాంతి కలుగుతుంది. ఈ స్థితినే చలిత సమతాస్థితి అంటారు (dynamic
equilibrium).
విలియమ్సన్ కృషి
రసాయనిక చలన శాస్త్రానికి నాంది పాడింది. ఒక రసాయన చర్య ముందుకు సాగాలంటే అది కేవలం
ఉష్ణం వెలువడడం మీద ఆధారపడి లేదని విలియమ్సన్ కృషి వల్ల తెలిసింది. ఒక పక్క బెర్థెలో,
థామ్సన్ లు ఉష్ణమానినితో కొలతలు తీసుకుంటుంటే, మరో పక్క ఉష్ణం కాకపోతే రసాయన చర్య యొక్క
గమన దిశని నిర్ధారించే ఆ “అదనపు కారణం” ఏమిటి
అన్న విషయం మీద లోతైన కృషి జరుగుతోంది. కాని ఆ కొత్త భావాలు ఎవరికీ అర్థం గాక ఆ కృషి
ఎంతో కాలం మూలనపడింది.
రసాయనిక ఉష్ణగతిశాస్త్రం
(chemical thermodynamics)
1863 లో కాటో
మాక్సిమిలియన్ గుల్డ్‍బర్గ్ (1836-1902), పీటర్ వాగే (1833-1900) అని నార్వేకి చెందిన ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలు
అప్రయత్నంగా జరిగే రసాయన చర్యల గురించి ఓ పత్రం రాశారు. అర్థ శతాబ్దం క్రితం బెర్థెలొ
ఈ విషయం గురించి ఓ సూచన చేశాడు. ఒక చర్య ఏ దిశలో పురోగమిస్తుంది అన్నది అందులోని అంశాల
ద్రవ్యరాశి మీద ఆధారపడుతుంది అన్నది బెర్థెలొ ఆలోచన. నార్వేకి చెందిన ఇద్దరు రసాయన
శాస్త్రవేత్తలు ఈ సూచన మీదకి దృష్టి పోనిచ్చారు.
పై ప్రశ్నకి
సమాధానం పూర్తిగా ద్రవ్యరాశిలో లేదని గుల్డ్‍బర్గ్, వాగే లు అభిప్రాయ పడ్డారు. ద్రవ్యరాశి
మీద కాక ఒక నియత ఘనపరిమాణంలో ఎంత ద్రవ్యరాశి కుదించబడింది అన్న దాని మీద, అంటే ఆ పదార్థపు
గాఢత (concentration) మీద పై ప్రశ్నకి సమాధానం ఆధారపడిందని వీరి అభిప్రాయం.
ఉదాహరణకి A,
B ల మధ్య చర్య జరిగినప్పుడు C, D లు పుడతాయని అనుకుందాం. అలాగే C, D ల
మధ్య చర్య జరిగినప్పుడు తిరిగి A, B లు పుడతాయి.
ఈ ద్వంద్వ చర్యని ఇలా వ్యక్తం చెయ్యొచ్చు-
A + B
<-> C + D ->
0 comments