1894 లో
రామ్సే లోగడ కావెండిష్ చేసిన ప్రయోగం మళ్లీ చేసి చూశాడు. కాని ఈ సారి చేసినప్పుడు కావెండిష్
వద్ద లేని ఓ విశ్లేషణా పరికరాన్ని (analytical instrument) వాడి చూశాడు. ప్రయోగం ఆఖరులో
మిగిలిపోయిన వాయువుని వేడి చేసి దాని వర్ణపటాన్ని పరిశీలించాడు రామ్సే. ఆ వర్ణపటంలో
కనిపించే ప్రముఖ రేఖలు అంతవరకు తెలిసిన ఏ మూలకంతోను సరిపోవడం లేదు. ఆ వాయువు ఏదో కొత్త
వాయువు అన్నమాట. నైట్రోజన్ కన్నా దాని సాంద్రత కాస్త ఎక్కువ. వాయుమండలంలో అది
1% ఘనపరిమాణాన్ని ఆక్రమిస్తోంది. అది రసాయనికంగా
జడంగా ఉంది. మరే ఇతర మూలకంతోను చర్య జరపడం లేదు. కనుక దానికి ఆర్గాన్ (argon) అని పేరు పెట్టారు. ఆర్గాన్ అంటే గ్రీకులో ‘జడం’
అని అర్థం.
ఆర్గాన్ పరమాణు
భారం 40 కన్నా కాస్త తక్కువని తేలింది. అంటే
అది ఆవర్తన పట్టికలో ఈ కింది మూలకాలు ఉన్న ప్రాంతాల్లో ఎక్కడో ఇమడాలి. ఆ మూలకాలు –
సల్ఫర్ (పరమాణు భారం 32), క్లోరిన్ (పరమాణు భారం 35.5), పొటాషియం (పరమాణు భారం
39), కాల్షియం (పరమాణు భారం 40 కన్నా కాస్త
ఎక్కువ).
కేవలం ఆర్గాన్
యొక్క పరమాణు భారం బట్టి చూస్తే దాని స్థానం పొటాషియం కి, కాల్షియమ్ కి మధ్యన ఉండాలి.
కాని పరమాణు భారం కన్నా సంయోజకత ముఖ్యం అని మెండెలేవ్ రూఢి చేశాడు. కాని మరి ఆర్గాన్
మరే ఇతర మూలకంతోను కలియడం లేదు. అందుచేత దాని సంయోజకత 0 అనుకోవాలి. ఇలాంటి మూలకానికి స్థానం ఏది?
సల్ఫర్ సంయోజకత
2, క్లోరిన్ ది 1, పొటాషియమ్ ది 1, కాల్షియమ్ ది 2. ఆవర్తన పట్టికలో ఈ ప్రాంతంలో సంయోజకతల విలువలు వరుసగా
ఇలా వున్నాయి – 2,1,1,2. కనుక 0 సంయోజతక రెండు 1 ల మధ్య
చక్కగా ఇముడుతుంది. ఇలా - 2, 1, 0, 1, 2. అందుచేత
ఆర్గాన్ ని క్లోరిన్ కి పొటాషియమ్ కి మధ్య ఉంచారు.
కాని ఆవర్తన
పట్టికలో అంతర్లీనంగా ఉన్న తర్కాన్ని మనం ఈ సందర్భంలో కూడా అనుసరించినట్టయితే, ఆర్గాన్
ఒక ప్రత్యేక మూలకం కారాదు. అదొక మూలకాల వర్గానికి ప్రతినిధి కావాలి. అది 0 సంయోజకత
గల జడవాయువుల (inert gases) కుటుంబంలో ఒకటి కావాలి. అలాంటి కుటుంబం సరిగ్గా 1 సంయోజకత గల హాలొజెన్ లకి (క్లోరిన్, బ్రోమిన్ మొదలైనవి)
ఆల్కలీ లోహాలకి (సోడియమ్, పొటాషియమ్ మొదలైనవి) మధ్యన ఇమడాలి.
రామ్సే అన్వేషణ
ఆరంభించాడు. అమెరికాలో ఏదో యురేనియమ్ ఖనిజం నుండి కొన్ని వాయువులని వెలికి తీశారని
(ఆ వాయువు నైట్రోజన్ ఆని ఆ రోజుల్లో తప్పుగా అనుకున్నారు) 1895 లో రామ్సే విన్నాడు. రామ్సే ఆ ప్రయోగాన్ని సొంతంగా
చేసి అందు లోంచి వెలువడ్డ వాయువుని వర్ణమానిని సహాయంతో విశ్లేషించాడు. అలా వచ్చిన వర్ణపటం
నైట్రోజన్ కి గాని, ఆర్గాన్ కి గాని చెందనిదని తెలిసింది. అన్నిటి కన్నా చిత్రమైన విషయం
ఏంటంటే వర్ణపటంలో అలాంటి రేఖలని లోగడ ఫ్రెంచ్ ఖగోళ శాస్త్రవేత్త పియర్ జూల్స్ సేసర్
యాన్సెన్ (1824-1907) 1868 లో జరిగిన సూర్యగ్రహణ
సందర్భంలో కనిపెట్టాడు. ఆ సందర్భంలో ఇంగ్లీష్ ఖగోళవేత్త జోసెఫ్ నార్మన్ లాక్యర్
(1836-1920) తను హీలియమ్ (helium) అని పేరు పెట్టిన ఓ కొత్త మూలకానికి ఆ వర్ణపటాన్ని
ఆపాదించాడు. హీలోస్ అంటే గ్రీకు భాషలో సూర్యుడు అని అర్థం.
మరి ఎందుచేతనో
కేవలం వర్ణపట ఫలితాల ఆధారంగా సూర్యుడిలో ఓ
కొత్త మూలకం ఉండొచ్చనే అవకాశాన్ని రసాయన శాస్త్రవేత్తలు పెద్దగా లక్ష్యపెట్టలేదు. రామ్సే
కృషి వల్ల ఆ మూలకం భూమి మీద కూడా దొరుకుతుందని తెలిసింది. హీలియమ్ అని లాక్యర్ ఇచ్చిన
పేరునే రామ్సే కూడా స్వీకరించాడు. జడ వాయువులు అన్నిట్లోకి హీలియమ్ అతి తేలికైనది.
అతితక్కువ పరమాణు భారం గల హైడ్రోజన్ పక్కగా హీలియమ్ తన సముచిత స్థానాన్ని ఆక్రమించింది.
1898 లో రామ్సే ద్రవ రూపంలో ఉండే గాలిని జాగ్రత్తగా మరిగించి అందులోంచి మొదట జడ వాయువులు ఉత్పన్నం అవుతాయేమో
నని చూశాడు. అతడికి మూడు వాయువులు దొరికాయి. వాటికి ‘నియాన్’ (neon, “కొత్తది”), ‘క్రిప్టాన్’
(krypton, “రహస్యమైనది”), జెనాన్ (xenon, “చిత్రమైనది”) అని పేర్లు పెట్టాడు.
జడ వాయువుల గురించి
ఎవరో ఛాందస రసాయన శాస్త్రవేత్తలకి తప్ప ఇంకెవరికీ అక్కర్లేని రసాయనిక వైపరీత్యాలుగా
మొదట్లో భావించేవారు. కాని 1910 లో మొదలైన పరిశోధనల లో ఓ ఆసక్తికరమైన విషయం బయటపడింది.
నియాన్ వంటి వాయువుల లోంచి కరెంటు పంపించినప్పుడు ఓ సున్నితమైన, రంగు కాంతి పుడుతుందని
ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త జార్జ్ క్లాడ్ (1870-1960) ప్రదర్శించాడు.
అలాంటి వాయువుతో
పూరించబడ్డ నాళాలని అక్షరాలుగా, పదాలుగా, చిహ్నాలుగా నానా ఆకారాలలో వంచి దాంతో కాంతులీనే
చిహ్నాలు తయారుచెయ్యసాగారు. 1940 ల కల్లా ఈ
కొత్త దీపాలు ఎన్నో నగరాలలో ముఖ్య దారులని అలంకరించాయి.
(అధ్యాయం సమాప్తం)
0 comments