మాంగనీస్
లాగానే మరెన్నో ఇతర లోహాలని కూడా స్టీలుకి కలిపి చూశారు. క్రోమియమ్, మాలిబ్డినమ్, వెనేడియమ్, టంగ్స్టన్, నియోబియమ్, మొదలైన లోహాలు కలిపి ప్రత్యేక ప్రయోజనాలకి సరిపోయే అలాయ్ స్టీలు తయారు చేశారు. 1919 కల్లా క్రోమియమ్, నికెల్ కలిసిన, తుప్పపట్టని స్టీల్ తయారయ్యింది. అమెరికన్ ఆవిష్కర్త ఎల్వుడ్ హెయిన్స్ (1857-1925) దాని మీద పేటెంట్ తీసుకున్నాడు. ఈ దిశలో 1916లో జపనీస్ లోహవైజ్ఞానికుడు కొటారో హోండా మరో ముఖ్యమైన విజయం సాధించాడు. టంగ్స్టన్ స్టీలుకి కోబాల్ట్ జతచేస్తే పుట్టే మిశ్రలోహంతో మామూలు స్టీలుతో సాధ్యమయ్యే దాని కన్నా అత్యంత శక్తివంతమైన అయస్కాంతాన్ని తయారు చెయ్యొచ్చని అతడు కనుక్కున్నాడు. ఈ విజయం మరింత శక్తివంతమైన అయస్కాంతిక మిశ్రలోహాల తయారీకి నాంది పాడింది.
కొటారో
హోండా
క్రమంగా
కొత్త కొత్త లోహాలు వినియోగంలోకి వచ్చాయి. ఉదాహరణకి భూగర్భంలో ఇనుము కన్నా అలూమినమ్ మరింత విరివిగా దొరుకుతుంది. నిజానికి లోహాలన్నిటిలోకి అలూమినమే అత్యంత సమృద్ధిగా దొరుకుతుంది. అయితే అది రకరకాల సమ్మేళనాలలో నాటుకుపోయి వుంటుంది. కాని ఎందుచేతనో మరి పూర్వచారిత్రక కాలం నుండి ఇనుము గురించిన పరిజ్ఞానం వున్నా, 1827 లో వోలర్ అలూమినమ్ యొక్క అశుద్ధ రూపాన్ని తయారు
చేసిన
దాకా ఆ లోహం ఉన్కి గురించి ఎవరికీ తెలియదు.
1855 లో ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ ఎతియెన్ సాంత్-క్లార్ దెవిల్ (1818-1881) అంతోఇంతో పరిశుద్ధమైన అలూమినమ్ ని, హెచ్చు మోతాదుల్లో తయారు చెయ్యడానికి ఓ విధానం రూపొందించాడు. అప్పటికీ అలూమినమ్ ఖరీదు ఇనుము కన్నా ఎక్కువగానే ఉండేది. అందుకే ఆ రోజుల్లో అలూమినమ్ వస్తువుల వినియోగం ఏదో అలంకార ప్రాయంగా ఉండేది. నెపోలియన్-III యొక్క కుమార రత్నం ఆడుకునే గిలకలోనో, లేక వాషింగ్టన్ స్మారక చిహం యొక్క శిఖరానికి తొడుగు గానో అలూమినమ్ ని వాడడం జరిగింది.
1886 లో చార్లెస్ మార్టిన్ హాల్ అనే రసాయన శాస్త్రం చదువుకునే ఓ కుర్ర అమెరికన్ విద్యార్థి చవకగా అలూమినమ్ ని తయారు చేసే పనిలో పడ్డాడు. అలూమినమ్ ని చవకగా తయారుచెయ్యగలిగిన వారికి బోలెడంత డబ్బు, కీర్తి దక్కుతుందని ఇతగాడి టీచరు ఒకాయన ఒక సారి అనగా విన్న ఈ కుర్రాడికి ఉత్సాహం వచ్చింది. ఇంట్లోనే ఒక ప్రయోగశాల నిర్మించుకుని పరిశోధనలు మొదలెట్టాడు. క్రయోలైట్ (cryolite) అనబడే ఓ ద్రవరూపంలో వుండే ఖనిజంలో అలూమినమ్ ఆక్సయిడ్ ని కరిగించొచ్చని ఇతడు కనుక్కున్నాడు. అలా ఆక్సయిడ్ ని కరిగించాక విద్యుత్ విశ్లేషణ చేత అలూమినమ్ ని శుద్ధి చెయ్యొచ్చు. అదే సంవత్సరం ఫ్రెంచ్ లోహవైజ్ఞానికుడు పాల్ లూయీ హెరోల్ (1863-1914) అలూమినమ్ ని శుద్ధి చెయ్యడానికి ఇంచుమించు అలాంటి విధానమే రూపొందించాడు. ఈ హాల్-హెరోల్ విధానాన్ని ఉపయోగించి అలూమినమ్ ని ఎంతో చవకగా తయారు చెయ్యడానికి సాధ్యమయ్యింది. అతి సామన్యమైన వంటింటి పాత్రలని కూడా అలూమినమ్ తో తయారు చెయ్యడానికి వీలయ్యింది.
అలూమినమ్
యొక్క అత్యంత విలువైన లక్షణం దాని తేలికదనం. స్టీలు బరువులో దీని బరువు మూడో వంతు. ఈ కారణం చేత అలూమినమ్ కి వైమానిక పరిశ్రమలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ పరిశ్రమ మెగ్నీషియమ్ లోహాన్ని కూడా విరివిగా వాడుతుంది. ఇది అలూమినమ్ కన్నా తేలికైన లోహం. 1930 లలో సముద్ర జలాల లోంచి మెగ్నీషియమ్ లోహాన్ని ఆచరణయుక్తంగా వెలికితీయగల విధానాలు రూపొందించబడ్డాయి. దాంతో ఈ లోహాన్ని కూడా చవకగా, పెద్ద ఎత్తున తయారు చేసే వీలు ఏర్పడింది. (మామూలు ఉప్పునే కాక బ్రోమిన్, అయొడిన్ మూలకాలని కూడా సముద్ర జలాల నుండి లాభదాయకంగా వెలికి తీయొచ్చు. సముద్ర జాలలని శుద్ధి చేసి మంచి నీరు తయారు చేసే సమస్య భవిష్యత్తులో ఓ ముఖ్యమైన సమస్యగా పరిణమిస్తుంది.)
టైటానియమ్
లాంటి లోహాలకి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇదో సామాన్య లోహం. ఆసిడ్ల వినాశక ప్రభావానికి ఇది లొంగదు. బరువులో స్టీలుకి, అలూమినమ్ కి మధ్యస్థంగా ఉంటుంది. బరువులో తులతూగగల లోహాలన్నిటి లోకి ఇది ధృఢమైనది. జిర్కోనియమ్ కూడా కొంచెం దీన్ని పోలిన లక్షణాలే ఉంటాయి. కాని ఇది మరి కాస్త సామాన్యంగా లభిస్తుంది. కాని మరి కాస్త భారమైనది.
శబ్దం
కన్నా వేగంగా ప్రయాణించగల సూపర్ సోనిక్ విమానాల నిర్మాణంలో టైటానియమ్ కి మంచి భవిష్యత్తు ఉంది. అంత విపరీతమైన వేగాల వద్ద వాయుమండలం లోని పలుచని పైపొరలలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా విమానానికి చుట్టూ ఉండే గాలికి మధ్య విపరీతమైన రాపిడి ఉంటుంది. విమానం యొక్క పై పొర అత్యధిక ఉష్ణోగ్రతలని తట్టుకోగలిగి ఉండాలి. ఇక్కడే టైటానియమ్ కి మంచి పాత్ర వుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఇతర లోహాల కన్నా మిన్నగా ధృఢత్వాన్ని కోల్పోకుండా మనగల్గుతుంది.
(ఇంకా వుంది)
0 comments