5. న్యూటన్ ప్రత్యర్థులు
వైజ్ఞానిక చరిత్రలో కొత్త భావాలని వైజ్ఞానిక సమాజాలు ఏ అభ్యంతరమూ లేకుండా మనస్పూర్తిగా సమ్మతించే సందర్భాలు ఎంతో అరుదు. సిద్ధాంతకర్త ఎంతటి ఘనుడైనా ఆ సిద్ధాంతం ప్రత్యర్థుల విమర్శల ధాటికి గురి కాక తప్పదు. దాన్ని ప్రయోగం అనే గీటు రాయి మీద పరీక్షించక తప్పదు. విఖ్యాతి గల వాడు కదా అని విమర్శించకుండా ఊరుకోవడం అనేది జరగని పని. కనుక న్యూటన్ సిద్ధాంతాలు కూడా తొలిదశల్లో గంపెడంత విమర్శని, వివాదాన్ని ఎదుర్కోవలాసి వచ్చింది. విమర్శకి నొచ్చుకోవడం మానవ సహజం. కాని వైజ్ఞానిక ప్రపంచంలో విమర్శ తప్పదని తెలిసినప్పుడు నిజం నెమ్మది మీద తేలుతుందిలే అని ఓర్పు వహించే వాళ్ళు ఉంటారు.
కాని న్యూటన్ ది కాస్త సున్నితమైన స్వభావం. కనుక విమర్శలని తేలికగా తీసుకోలేకపోయేవాడు.
ఏదైనా
కొత్త
సిద్ధాంతాన్ని
ప్రకటించగానే
మొదట్లో
ఏదో
విమర్శ
వినిపిస్తుంది.
దానికి
నొచ్చుకుని
తన
కలుగులోకి
దూరి
కొంతకాలం
పాటు
ఏకాంతవాసంలో
తలదాచుకునేవాడు. అందరితోనూ సంబంధాలు తెంచుకుని తన సొంత భావ ప్రపంచంలోకి పారిపోయేవాడు. విమర్శలకి సముచిత రీతిలో స్పందించే నైజం లేకపోవడం వల్ల న్యూటన్ సిద్ధాంతాల మీద ఇతరులు చేసిన విమర్శలు అతడి మనసును తీవ్రంగా గాయపరచినట్టు కనిపిస్తుంది. అతడిలో చేదు జ్ఞాపకాలనే మిగిల్చినట్టు కనిపిస్తుంది.
న్యూటన్ ప్రత్యర్థుల్లో, ముఖ్యంగా కాంతి శాస్త్రం మీద న్యూటన్ చేసిన ఆవిష్కరణలని నిశితంగా విమర్శించిన వారిలో ముఖ్యుడు రాబర్ట్ హూక్. న్యూటన్ తో కలహాలతో కొంత తన సొంత పేరు చెడగొట్టుకున్న మాట నిజమే అయినా రాబర్ట్ హూక్ కూడా అంత తక్కువ వాడేమీ కాడు. ఎంతో వైవిధ్యం గల వైజ్ఞానిక రంగాల్లో కృషి చేసి ఎన్నో కొత్త విషయాలు కనుక్కున్నాడు. సిద్ధాంతాలని రూపొందించడమే కాక ఇతడు సాంకేతిక రంగంలో గొప్ప ప్రతిభని ప్రదర్శించాడు. న్యూటన్ లాగానే ఇతడు కూడా ఓ పరావర్తక దూరదర్శినిని సొంతంగా నిర్మించాడు. అయితే న్యూటన్ నిర్మించిన ఐదేళ్ల తరువాతే హూక్ తన దూరదర్శినిని నిర్మించాడు.
దూరదర్శినితో ఆగిపోకుండా ఇతడు సూక్ష్మదర్శినిని కూడా నిర్మించుకుని దాని సహాయంతో సూక్ష్మజీవులకి చెందిన మొట్టమొదటి పరిశీలనలు చేశాడు. ఈ పరిశీలనలని అతడు Micrographia అనే ఓ చక్కని పుస్తకంలో పొందుపరిచాడు. తన సూక్ష్మదర్శినితో శిలాజాలని కూడా పరిశీలించి ఆ పరిశీలనల ఆధారంగా భూమి మీద జీవాలు క్రమంగా పరిణామం చెందుతూ ఉండాలన్న భావనని ఊహించాడు. ఆ విధంగా అతడు పరిణామ సిద్ధాంతానికి దగ్గరగా వచ్చాడు.
రాబర్ట్ హూక్
అగ్నిప్రమాదంలో లండన్ లో అధికభాగం కాలిపోయిన తరువాత ఆ నగరాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సందర్భంలో హూక్ లండన్ నగరాన్ని క్షుణ్ణంగా సర్వే చేసి ఓ అధునాతన డిజైన్ ని సమర్పించాడు. గురుత్వం విషయంలో, వర్గవిలోమ నియమం విషయంలో కూడా హూక్ కొన్ని మౌలిక భావనలని తెలుసుకోగలిగాడని, అయితే న్యూటన్ కి ఉన్న అపారమైన గణిత సామర్థ్యం హూక్ కి లేకపోవడం వల్ల ఆ భావాలని గణితపరంగా వ్యక్తం చెయ్యలేకపోయాడని అంటారు. ఇటలీకి లియొనార్డో డా వించీ ఎంతో బ్రిటన్ కి రాబర్ట్ హూక్ అంత అంటూ ఇటీవలి కాలంలో అలాన్ చాప్ మన్ అనే వైజ్ఞానిక చారిత్రకుడు హూక్ యొక్క బహుముఖ ప్రతిభని ప్రశంసించాడు.
న్యూటన్ కి, హూక్ కి మధ్య స్పర్థ ముఖ్యంగా కాంతి శాస్త్రం విషయంలో తలెత్తింది. ఆ పోరాటం న్యూటన్ నిర్మించిన పరావర్తక దూరదర్శినితో మొదలయ్యింది. న్యూటన్ నిర్మించిన దూరదర్శిని రాయల్ సొసయిటీలో ప్రదర్శనకి వచ్చినప్పుడు అక్కడే వున్న హూక్ అసూయతో ‘ఇది పెద్ద విశేషమేమీ కాద’న్నాడు. ఎనిమిదేళ్ళ క్రితమే తను ఇంతకన్నా గొప్ప వక్రీభవన దూరదర్శనిని (refracting
telescope) తయారుచేశాడని, కేవలం ఒక ఇంచి పొడవున్న ఆ దూరదర్శినిని ‘కీ చెయిన్’ లో వేసుకుని తిరగొచ్చని గొప్పగా చెప్పుకున్నాడు. నూట యాభై అడుగుల పొడవున్న మహా మహా దూరదర్శినుల కన్నా ఈ దూరదర్శిని మరింత శక్తివంతమైనదని దండోరా వేసుకున్నాడు. హూక్ తన ఆవిష్కరణల గురించి విచ్చలవిడిగా దండోరా వేసుకోవడం తన వైజ్ఞానిక నేస్తాలకి కొత్తేం కాదు. ఊరికే ఊరంతటినీ ఊరించే బదులు ఆ కనుక్కున్న విషయాన్ని విపులంగా ఎక్కడైనా ప్రచురించ రాదా? అని ఎవరైనా అడిగితే “భావచౌర్యం చేస్తారని భయం!” అనేవాడు.
(ఇంకా వుంది)
0 comments