కొంతమంది
ఏరోజు కారోజు అన్నట్టు బతుకుతూ ఉంటారు. మరి కొంతమందికి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాల కాలం భవిష్యత్తులోకి చూడగలిగే దూరదృష్టి ఉంటుంది. ఎప్పుడో రానున్న అవసరాలకి నేడే స్పందించి గొప్ప గొప్ప పథకాలు ఆలోచిస్తుంటారు.
సాంకేతిక రంగంలో అలాంటి విప్లవాత్మకమైక పధకాలు వేసినవాడిలో ఒకడు జర్మనీ కి చెందిన హర్మన్ సోర్గెల్. నీటి నుండి విద్యుత్తుని ఉత్పత్తి చేసే ప్రయత్నంలో ఇతడు కొన్ని సాహసోపేతమైన మార్గాలు ఆలోచించాడు.
నీటి
నుండి విద్యుత్తుని ఉత్పత్తి చేసే ప్రయత్నం మొట్టమొదటి సారిగా ఇంగ్లండ్ లో 1878లో జరిగింది. అప్పటి నుండి పదేళ్లు
తిరిగేలోగా వేగంగా
ప్రపంచంలో ఎన్నో చోట్ల జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ ల నిర్మాణం జరిగింది. సామాన్యంగా జలవిద్యుత్తు ఉత్పత్తి కోసం ఓ నదీ ప్రవాహానికి అడ్డుగా ఓ ఆనకట్ట కడతారు. దాంతో ఆనకట్ట వెనుక జలం స్తంభిస్తుంది. ఆ కారణం చేత ఆనకట్ట వెనుక నీటి మట్టం పెరుగుతుంది. అలా మట్టం పెరిగిన నీరు ఎత్తు నుండి కిందికి ప్రవహించే మార్గ మధ్యంలో ఆ ప్రవాహం సహాయంతో టర్బయిన్లు తిరిగేలా
ఏర్పాటు చేస్తారు. తిరుగుతున్న టర్బయిన్ల నుండి విద్యుత్తు ఉత్పత్తి చేస్తారు.
మామూలుగా
నదులని ఆనకట్టలు కట్టడం అంటేనే అంత సులభం
కాదు. అలాంటిది ఏకంగా ఓ సముద్రాన్ని ఆపేలా ఆనకట్ట కడితే ఎలా ఉంటుందని ఆలోచించాడు మన జర్మన్ ఇంజినీరు హర్మన్ సోర్గెల్.
రామాయణంలో వారిధి మీద
వారధి కట్టిన ప్రయత్నాన్నే
ఓ మహత్యంలా చెప్పుకుంటాం. అలాంటిది సముద్రానికి
అడ్డుగా గోడ కట్టడమేమిటి? హద్దుల్లేకుండా విస్తరించే
మహాసముద్రం మీద ఎక్కడ పడితే అక్కడ గోడలు కట్టడం అయ్యేపనేనా? కాని మరి సోర్గెల్ తెలివితక్కువ వాడేం కాదు. ఆ ఆనకట్టని సోర్గెల్
వ్యూహాత్మకంగా ఓ
ప్రత్యేకమైన
చోట నిర్మించాలని అనుకున్నాడు.
యూరప్
కి పశ్చిమ తీరం వద్ద అట్లాంటిక్ మహాసముద్రం ఉంటుంది. అలాగే యూరప్ కి దక్షిణాన మధ్యధరా సముద్రం ఉంటుంది. ఈ రెండు సముద్రాలని కలుపుతూ ఓ సన్నని జలసంధి ఉంటుంది. దీన్నే strait of Gibraltar అంటారు. అట్లాంటిక్ మహాసముద్రం నుండి మధ్యధరా సముద్రంలోకి ప్రవేశించినప్పుడు ఈ
సన్నని “ద్వారం”లోంచి ముందుకి సాగాలి. ఆ ద్వారం
వెడల్పు కేవలం 14 కిలోమీటర్లే. ఉత్తర-దక్షిణ దిశలో మధ్యధరా సముద్రం వెడల్పు 1600 కిలోమీటర్లు ఉంటుందని గుర్తుంచుకుంటే ఆ “ద్వారం” ఎంత సన్నదో ఊచించుకోవచ్చు.
జిబ్రాల్టర్
జలసంధికి అడ్డుగా ఓ ఆనకట్టి కడితే దానికి ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని మొట్టమొదటి సారిగా 1920 లో సూచించాడు సోర్గెల్. అవతలి
పక్క ఉవ్వెత్తున పడిలేచే కెరటాలతో అతలాకుతలంగా ఉండే
అట్లాంటిక్ మహా సముద్రాన్ని నిలువరిస్తూ గోడ కట్టడం అంత సులభం కాదు. అలాంటి ఆనకట్టకి పునాది వెడల్పు 2.5 కిమీలు ఉండాలని నిర్ణయించాడు సోర్గెల్. దాని ఎత్తు 300 మీటర్లు ఉండాలట. దాన్ని నిర్మించడానికి పదేళ్లు పడుతుందని, 2 లక్షల మంది కార్మికులు అవసరమని ఊహించాడు సోర్గెల్. అంత బృహత్తర ప్రాజెక్ట్ ని పూర్తి చెయ్యడానికి ప్రపంచంలో ఉన్న సిమెంట్ మొత్తం వాడినా సరిపోతుందో లేదో అనుమానమే.
కాని
అసలంటూ అలాంటి గోడ కట్టగలిగితే ఇటుపక్కన దిగువన ఉన్న మధ్యధరా సముద్రంలో నీరు అడుగంటుతుందట. ఆ
సముద్రంలో నీటి మట్టం ఇంచుమించు 200 మీటర్ల వరకు కిందకి పడుతుందట. అంత ఎత్తు నుండి అంత వెడల్పయిన ఆనకట్ట మీదుగా నీరు కిందకి ప్రవహిస్తే ఆ ప్రవాహం నుండి అనూహ్యమైన మోతాదుల్లో విద్యుత్ శక్తిని ఉత్పత్తి చెయ్యొచ్చు. పైగా నదుల మీద ఆనకట్టలు కట్టినప్పుడు నది ఎండిపోతే ఇక విద్యుత్ శక్తి పుట్టదు. కాని సముద్రం మీద ఆనకట్టల విషయంలో అలాంటి ప్రమాదం
ఉండదు. ఎందుకంటే అట్లాంటిక్ మహాసముద్రమే ఎండిపోయే పరిస్థితి వస్తే ఇక భూమి మీద జీవరాశి మనలేని పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాటే!
ఆ
విధంగా జిబ్రాల్టర్ జలసంధి మీద ఆనకట్ట కట్టినప్పుడు, ఆనకట్ట దిగువ ప్రాంతంలో ఎన్నో సంచలనాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయని ఊహించాడు సోర్గెల్. మధ్యధరా
సముద్రం అట్టడుగున ఉన్న నేల ఎన్నో చోట్ల బహిర్గతం అవుతుందట. అలా ఆవిర్బవించిన కొత్త భూమిని దానికి దక్షిణంగా ఉన్న ఆఫ్రికాతో కలుపుకుంటూ ఓ కొత్త ఖండంగా ఊహించుకున్నాడు సోర్గెల్. దానికి “అల్లాంట్రోపా” అని పేరు పెట్టాడు. అసలే
భూభాగం తక్కువైన యూరోపియన్ దేశాల వారికి ఇలా కొత్తగా ఏర్పడ్డ భూమిలో తమ దేశాలని విస్తరింపజేసుకునే బంగారు అవకాశం కనిపించింది.
అలా
మధ్యధరా సముద్రం మొత్తాన్ని ఓ ఖండంగా మార్చే ఆలోచనతో ఆగిపోలేదు సోర్గెల్. దిగువన ఉన్న ఆఫ్రికాని కూడా సమూలంగా మార్చేసే పథకాలు ఆలోచించాడు. అట్లాంటిక్ మహాసముద్రం నుండి ప్రవహించే నీటిని పెద్ద పెద్ద కాలువల సహాయంతో ఆఫ్రికా ఖండంలోకి మళ్లించి ఆ ఖండంలో సముద్రాలని పోలిన మూడు పెద్ద పెద్ద కృత్రిమ చెరువులు సృష్టించాలని
కూడా సోర్గెల్ ఆలోచించాడు. అలాంటి చెరువుల సహాయంతో మొత్తం సహారా ఎడారినే సస్యశ్యామలమైన ప్రదేశంగా మార్చాలని కలలు గన్నాడు.
సోర్గెల్
భావాలు ఎంతో మంది మేధావులని ఆకర్షించాయి. తన కలలని సాకారం చేసుకోడానికి “అల్లాంట్రోపా సంస్థ” అనే సంస్థని స్థాపించాడు. ఆ సంస్థలోని సభ్యులు అల్లాంట్రోపా ప్రాజెక్ట్ మీద ఎన్నో నివేదికలు తయారు చేసి దాని నిర్మాణానికి కావలసిన ధనాన్ని పోగుచేసే ప్రయత్నం చేశారు. కాని దురదృష్ట వశాత్తు ఆ ప్రాజెక్ట్ పథకాల స్థాయిని మించి పోలేదు. 1952 లో ఓ కారు ప్రమాదంలో సోర్గెల్ మరణించాడు. 1960లో అలాంట్రోపా సంస్థ
మూతపడ్డాక ఆ ప్రాజెక్ట్ ని అంతా మర్చిపోయారు.
సోర్గెల్
ఊహించినంత బ్రహాండమైన స్థాయిలో భూమి రూపురేఖలని మార్చాలనుకోవడం బహుశా దుడుకుతనమే కావచ్చు. కాని కాస్త తక్కువ స్థాయిలో ప్రస్తుతం
మన దేశంలో ఎన్నో ప్రకృతిగతమైన సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా మన దేశంలో నీటి ఎద్దడి ఏటేటా మరింత విషమమైన సమస్యగా దాపురిస్తోంది. నదీ జలాల అనుసంధానం అయితేనేం, సముద్రజలాల నిర్లవణీకరణం అయితేనేం – దేవుడి మీద భారం వేసి చేతులు కట్టుకు కూర్చోకుండా, దూరదృష్టితో పని చేస్తూ తగిన చర్యలు చేపడితే, ఎంత కఠినమైన
ప్రకృతిగత సవాళ్లనైనా సృజనాత్మకమైన పరిశ్రమతో ఎదుర్కోవచ్చు.
అలాంట్రోపా
ఆనకట్ట (ఊహా చిత్రం)
హెర్మన్
సోర్గెల్
మధ్యధరా
సముద్రం
– జిబ్రాల్టర్
జలసంధి –
అలాంట్రోపా ఆనకట్ట (ఊహా చిత్రం)
postlink