శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

10. సముద్ర తీరంలో పిల్లవాడు

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, December 22, 2016
తండ్రి ఎవరో కూడా తెలియకుండా జీవితాన్ని అరంభించి, కనికరం లేని తల్లి పెంపకంలో చిన్న తనాన్ని అనుభవించి, నూనూగు మీసాల నూత్న యవ్వనంలోనే క్యాల్కులస్ ని కనిపెట్టి, గురుత్వ సిద్ధాంతం, కాంతి సిద్ధాంతం మొదలైన సిద్ధాంతాలతో అద్భుత విశ్వదర్శానాన్ని మానవాళికి అందించి, కేవలం సిద్ధాంత రచనతోనే ఆగిపోకుండా రాయల్ సొసయిటీ లాంటి వైజ్ఞానిక సంస్థని సంస్కరించిన ఐసాక్ న్యూటన్, అసలితడు మనిషేనా అని తోటి శాస్త్రవేత్తలు ముక్కున వేలేసుకున్న ఐసాక్ న్యూటన్ కూడా మానవ మాత్రుడేనని, వృద్ధి, వార్ధక్యం అతడికీ ఉంటాయని మరచిపోకూడదు.

  1722  నాటికి న్యూటన్ తీవ్రమైన అస్వస్థత పాలయ్యాడు. అప్పటికి అతడి ఎనభయ్యవ పుట్టినరోజు దగ్గరపడుతోంది. మూత్ర పిండాల్లో రాళ్ల వల్ల ఆగాగి విపరీతమైన నొప్పి ఒళ్ళంతా ఆక్రమించేది. న్యూటన్ కి వ్యక్తిగత వైద్యుడైన డా రిచర్డ్ మీడ్ అందించిన సేవలతో నెమ్మదిగా కోలుకున్నాడు. ఎనభై దశకాల జీవితాన్ని చూసిన ఎంతో మంది లాగా న్యూటన్ జవసత్వాలుడిగి మంచం పట్టి లేడు. వార్ధక్యం శరీరానికే గాని బుద్ధికి మాత్రం పదును తగ్గలేదు. వైజ్ఞానిక విషయాలలో ఎలాంటి కసరత్తుకైనా, కయ్యానికైనా సయ్యంటూ సిద్ధంగా వున్నాడు. కాని కయ్యానికి సయ్యనడానికి అతనితో కాలు దువ్విన ఎందరో తోటి శాస్త్రవేత్తలు అప్పటికే లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. రాబర్ట్ హూక్ ఇక లేడు. కాల్కులస్ ని న్యూటన్ కన్నా ముందే తనే కనిపెట్టానని వాదించే జర్మన్  గణితజ్ఞుడు లీబ్నిజ్ మరి లేడు. న్యూటన్ తో తను కనుక్కున్న ఖగోళ సమాచారం పంచుకోనని మొండికేసిన బ్రిటిష్ ఆస్థాన ఖగోళ వేత్త ఫ్లామ్ స్టీడ్ కూడా లేడు. అడవిలోని చిన్న చితక జంతువులన్నిటినీ ఓడించి తన ఏక ఛత్రాధిపత్యాన్ని స్థాపించిన వృద్ధ సింహంలా బతుకుతున్నాడు న్యూటన్.

మహా శాస్త్రవేత్తగా అంతర్జాతీయ ఖ్యాతి నొందిన న్యూటన్ ని చూడడానికి దేశ దేశాల నుండి సందర్శకులు వస్తుండేవారు. జీవితాతం పెళ్లి చేసుకోకుండా ఏకాంతంగా జీవించిన న్యూటన్ కి ఆలనా పాలనా చూసుకోడానికి సతీ మణి లేదు. అతడి మేనగోడలు కాథరిన్, ఆమె కుంటుబ సమేతంగా న్యూటన్ ఇంట్లోనే ఉంటూ అతడి బాగోగులు చూసుకునేది. న్యూటన్ ఆరోగ్యం సన్నగిల్లుతోందని గమనించిన కాథరిన్ సందర్శకులకి విషయాన్ని విడమర్చి చెప్పి బయటి నుండే పంపించేసేది. అలా న్యూటన్ దర్శనార్థం వచ్చి వీలుపడక నిరాశగా తిరిగి వెళ్లిన ప్రముఖులలో అమెరికా కి చెందిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా వున్నాడు. ఫ్రాన్క్లిన్ తదనంతరం అమెరికా రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతాడు.

భోజనం విషయంలో జీవితాంతం ఎంతో క్రమశిక్షణ పటిస్తూ రావడమే న్యూటన్ యొక్క సహజమైన  ఆరోగ్యం వెనుక ఉన్న రహస్యం అంటాడు, అతడికి బాగా సన్నిహితుడైన విలియమ్ స్టుక్లీ అనే వైద్యుడు. 1725  లో అంటే న్యూటన్ కి ఎనభై మూడేళ్ళ వయసులో అతణ్ణి సందర్శించిన స్టుక్లీ న్యూటన్ ఆరోగ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. బారైన అంకెల పట్టికని కళ్ళజోడు సహాయం లేకుండా, పెన్ను, సిరా అవసరం లేకుండా, న్యూటన్ కేవలం నోటి మీద లెక్కించడం చూసి స్టుక్లీ నోరెళ్లబెట్టాడు. ఉదయానే కాసిన్ని నారింజ తొనలు, తియ్యని టీ, కొన్ని రొట్టెలు, వెన్నఇదీ ఫలహారం. భోజనంలో ఎక్కువగా ఉడికించిన కూరగాయలు, పళ్ళు తీసుకునేవాడట. వైన్ రుచి చూసినా రవ్వంతే గాని మోతాదు మీరేవాడు కాదట. నీరు మాత్రం పుష్కలంగా సేవించేవాడట. మాంసాహారం మొదటి నుంచి తక్కువే అయినా, క్రమేపీ పూర్తిగా మానేశాడని గమనిస్తాడు స్టుక్లీ.