బ్లాగర్లకి నూతన సంవత్సర శూభాకాంక్షలు (కాస్త ముందుగా)!
ఇది ఈ బ్లాగ్ లో వెయ్యవ పోస్ట్ కావడం విశేషం. ఈ పోస్ట్ తో ఐన్‍స్టయిన్ జీవిత కథ సీరియల్ గా ప్రారంభం అవుతోంది.
--
ఇది ఈ బ్లాగ్ లో వెయ్యవ పోస్ట్ కావడం విశేషం. ఈ పోస్ట్ తో ఐన్‍స్టయిన్ జీవిత కథ సీరియల్ గా ప్రారంభం అవుతోంది.
--
ఆల్బర్ట్
ఐన్ స్టయిన్ 1879 లో,
మార్చ్ 14 వ తారీఖు నాడు, జర్మనీలో ఉల్మ్ నగరంలో జన్మించాడు. ఐన్ స్టయిన్ కుటుంబం మధ్యతరగతి కుటుంబం. వారి వంశం 300 ఏళ్లుగా దక్షిణ జర్మనీలో స్థిరపడింది. ఐన్ స్టయిన్ తండ్రి పేరు హెర్మన్. ఇతగాడు మంచి పట్టుదల, ఆత్మవిశ్వాసం గల మనిషి. జీవిక కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు హెర్మన్. కాని ఏవీ పెద్దగా ఫలించలేదు. 1876 లో
ఇతగాడు పాలిన్ కాక్ అనే కన్యని వివాహం చేసుకున్నాడు.
ఐన్
స్టయిన్ వంశస్థులు యూదులు. అయితే యూదు మతాచారాలేవీ పెద్దగా అనుసరించేవాళ్లు కారు. యూదుల ఆలయమైన సైనగాగ్ కి వెళ్ళడం, ఆహార వ్యవహారాలలో తగు నియమాలు పాటించడం వంటివి చేసేవారు కారు.
హెర్మన్,
పాలిన్ దంపతులకి ఆల్బర్ట్ మొదటి సంతానం. కొడుకు తల ఆకారం కాస్త విడ్డూరంగా ఉండడం తల్లి గమనించింది. దాని వల్ల ఏం ముంచుకొస్తుందో నని కాస్త బెంబేలు పడింది. ఏవైనా మానసిక ఋగ్మతలు దాపురిస్తాయేమోనని ఆందోళన చెందింది. చిన్నారి ఆల్బర్ట్ కి మాటలు చాలా ఆలస్యంగా రావడం చూసి ఆ తల్లి మనసు మరింత కలతపడింది.
1880 లో
ఐన్ స్టయిన్ కుటుంబం మ్యూనిక్ నగరానికి మకాం మార్చారు. ఆ రోజుల్లో మ్యూనిక్ బవేరియా ప్రాంతానికి రాజధానిగా ఉండేది. మంచి పారిశ్రామిక కేంద్రంగా రాజిల్లేది. అక్కడైనా మంచి ఉద్యోగావకాశాలు దొరుకుతాయేమోనని హెర్మన్ ఆశాభావంతో ఉన్నాడు. ఐన్
స్టయిన్ కుటుంబం మ్యూనిక్ కి వెళ్లిన మరుసటేడే అంటే 1881 లో ఆల్బర్ట్ చెల్లెలైన మాయా జన్మించింది.
క్రమంగా
హెర్మన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అత్తలు, మామలు, తాతలు, బామ్మలు ఇలా బంధువర్గం అంతా ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. చుట్టాల రాకపోకలతో ఇల్లు
ఎప్పుడూ సందడిగా, కళకళలాడుతూ ఉండేది. ఇలా రోజులు హాయిగా గడిచిపోతున్నా ఒక్క విషయం మాత్రం హెర్మన్, పాలిన్ దంపతుల మనసులని ఓ మూల దొలిచేస్తూ ఉండేది. పెద్ద కొడుకు ఆల్బర్ట్ అందరు పిల్లల లాగా సక్రమంగా ఎదగడం లేదు. తొమ్మిదేళ్ల వయసులో కూడా ఆగాగి నెమ్మదిగా మాట్లాడేవాడు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా, సందేహిస్తునట్టుగా మాట్లాడేవాడు.
చాలా
చిన్నతనంలోనే
ఆల్బర్ట్ సంగీతం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆ ఆకర్షణ జీవితంలో
చివరికంటా తనతో నిలిచింది. తల్లి పాలిన్ కి పియానో వాయుద్యంలోనే కాక గాత్రంలో కూడా ప్రావీణ్యం ఉండేది. తీరికవేళ్లల్లో పియానో వాయిస్తూ ఏదో రాగం తీసేది. బీథోవెన్, మోత్సార్ట్ వంటి పాశ్చాత్య వాగ్గేయకారుల కృతులు ఆ అభ్యాసంలో చోటు చేసుకునేవి. పిల్లలు
ఆల్బర్ట్,
మాయా లు తల్లి పక్కనే కూర్చుని ఆ స్వరాల తీపులని ఆస్వాదించేవారు. తల్లి చేతి వేళ్లు పియానో మెట్ల మీద వడిగా, ఒడుపుగా కదులుతుంటే ఆల్బర్ట్ చకితుడై చూసేవాడు. వేళ్లు ఒక ప్రత్యేక క్రమంలో కదిలితే, స్వరాలు ఒక ప్రత్యేక క్రమంలో పుడితే, గొప్ప సంగీతం పుడుతుంది, రసానుభూతి కలుగుతుంది. అదే క్రమం తప్పితే అంతా రసాభాస అవుతుంది. సంగీతంలోనే కాక ప్రకృతి లయలన్నిట్లో ఏదో రహస్య క్రమం ఉందని గ్రహించడానికి ఆల్బర్ట్ కి ఎంతో కాలం పట్టలేదు.
సంగీతం
పట్ల ప్ర్రేమ ఆ విధంగా ఆల్బర్ట్ కి తన తల్లి నుండి వంటబట్టింది. ఊరికే సంగీతం వినడంతో సరిబెట్టుకోకుండా ఒక దశలో వయొలిన్ వాయించడం నేర్చుకున్నాడు. చిన్నప్పుడే వయొలిన్ తో మొదలైన సావాసం చివరికంటా తనని వదిలిపెట్టలేదు. విరామం లేని అధ్యయనం వల్ల తల వేడెక్కిపోయినప్పుడు వయొలిన్ వాయిద్యంతో విశ్రాంతి పొందేవాడు. ఒంటరి ఘడియలని వయొలిన్ స్వరాలతో పూరించుకుని ఊరట చెందేవాడు. పెద్దయ్యాక, విశ్వవిఖ్యాతి పొందిన శాస్త్రవేత్తగా పరిణతి చెందిన దశలో కూడా ఎక్కడికి వెళ్ళినా ఒక చేతిలో చిన్న సూట్ కేసు, మరో చేతిలో వయిలెన్ పెట్టె తో బయల్దేరేవాడు. ఏం మర్చిపోయినా, ఎవరు మర్చిపోయినా ఆ వయొలిన్ పెట్టె మాత్రం ఎప్పుడూ మర్చిపోకుండా తోడుగా వచ్చేది.
(ఇంకా వుంది)
1000వ టపాసందర్భంగా మీకూ మీ బ్లాగుకూ శుభాకాంక్షలు.
ఎంతమంది చదువుతున్నారో తెలియదు. కాని మీ యీ బ్లాగు ఒక విజ్ఞానభాండాగారం!
ముఖ్యంగా విద్యార్థులకు మీ బ్లాగు మంచి ఆలోచనలనూ ప్రోత్సాహాన్నీ ఇస్తుంది.
ఆధునికవిజ్ఞానశాస్త్రవిషయాలను సులభశైలిలో మీరు చెబుతున్న విధానం మరింతమందిని ఇటువంతి రచనలు చేయటానికి తప్పక స్ఫూర్తినిస్తుంది.
మరొక్కసారి అభినందనలు.
good post. waiting to hear more about albert.
శ్యామలీయం గారు మీ ప్రోత్సాహపు మాటలకి కృతజ్ఞతలు.
అనానిమస్ గారు, ధన్యవాదాలు.
అంతరంగ ఆవిష్కరణ ఎంత బాగుంటుందో, థాంక్స్.
నేను తప్పకుండా చదువుతున్నా మొదటినుండీ. అద్భుతమైన బ్లాగు ఇది. నూతన సంవత్సరానికీ వెయ్యో టపాకీ అభినందనలు.