శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఆల్బర్ట్ అడిగే ఎడతెగని ప్రశ్నలు

Posted by శ్రీనివాస చక్రవర్తి Wednesday, January 11, 2017

ప్రతి పిల్లవాడు, పసిపాప సహజంగా శాస్త్రవేత్తే. అందుకు పిల్లవాడు ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ కానక్కర్లేదు. దారే పోతున్న పురుగుని వెంటపడి నోట్లో పెట్టుకోయిన పసికందు శాస్త్రవేత్తలా విచిత్రమైన చిన్న నల్లని వస్తువుని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తోంది. ‘భూమికి అంచు ఎక్కడుంది?’ అనో, ‘తారలు ఎంత దూరంలో వున్నాయి?’ అనో యక్షప్రశ్నలతో తండ్రిని వేధించే పాప శాస్త్రవేత్తలా తన పరిసరాలని అధ్యయనం చేస్తోంది. కాని దురదృష్టవశాత్తు ఎంతో మందిలో వయసు  పెరుగుతున్న కొద్ది అలా ప్రశ్నించే ఉత్సుకత క్రమంగా అణగారిపోతుంది. ఆల్బర్ట్ విషయంలో అలాంటి పరిణామం సంభవించలేదు.

ఆల్బర్ట్ చిన్నారి మెదడులో తన పరిసరాల పట్ల కోట్ల కొద్ది ప్రశ్నలు తలెత్తేవి. తన ప్రశ్నలకి తెలిసినంత మేరకు ఓపిగ్గా సమాధానాలు చేప్పే మావయ్య ఉండేవాడు. “అసలు చీకటి ఎందుకు పడుతుంది?”, “సూర్యకిరణాల లో ఏం వుంటుంది?”, “సూర్య కిరణాలు ఎంత వేగంగా కదులుతాయి?”, “ కిరణాల పక్కనే నేను అంతే వేగంగా పరిగెడితే, కాంతి ఆగిపోయినట్టు కనిపిస్తుందా?”  - ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలతో మావయ్యని ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. “ఒరేయ్! ఇవన్నీ నీ కెందుకురా? పోయి హోం వర్కు చేసుకోరాదూ?” అని ఎంతో మంది మావయ్యలలా ఆల్బర్ట్ మావయ్య తనని నిరుత్సాహ పరచలేదు. ప్రశ్నలకి వీలైనంత వరకు ఓపిగ్గా సమాధానాలు చెప్పేవాడు. అలా వయసులో అమాయకంగా అడిగిన ప్రశ్నలే తదనంతరం భౌతిక శాస్త్ర చరిత్రనే మార్చిన ప్రగాఢ పరిశోధనలకి పునాదులయ్యాయి.

ఆల్బర్ట్ కి ఐదేళ్ల వయసులో సారి బాగా అనారోగ్యం పాలయ్యాడు. డీలా పడి వున్న పిల్లవాణ్ణి కాస్త ఉత్సాహపరచాలని తండ్రి బహుమతి తెచ్చి ఇచ్చాడు. ఆల్బర్ట్ ఆత్రంగా బహుమతి పెట్టె తెరిచి చూశాడు. అందులో ఉన్నది దిక్సూచికంపాస్. దీని సహాయంతో ఎక్కడున్నాఉత్తర-దక్షిణదిశలని కనిపెట్టొచ్చు అని వివరించాడు తండ్రి. ఉదయాన ఆకాశంలో సూర్యుడు ఉన్న దిశ తూర్పు అనుకుంటే, సూర్యుడి కేసి తిరిగి చేతులు చాచితే, ఎడమ చెయ్యి ఉత్తరాన్ని, కుడి చెయ్యి దక్షిణాన్ని చూపుతుందని ఎంతో మంది పిల్లల లాగానే ఆల్బర్ట్ కి కూడా తెలుసు. కాని ఆకాశంలో మబ్బేస్తే దిక్కులు తెలుసుకునేదెలా? అలాగే రాత్రి వేళల్లో ఎలా కనుక్కోవాలి?