ఎదుగుతున్న
పిల్లలు గల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలని ఎప్పుడెప్పుడు బళ్లో పడేద్దామా అని ఆత్రుతగా ఉంటుంది. కాని చిక్కేంటంటే ఆల్బర్ట్ కి చిన్నప్పట్నుంచీ బడులన్నా, బడిపంతుళ్లన్నా పడేది కాదు. బళ్లో పాఠాలు చెప్పే టీచర్లు డ్రిల్లు మాస్టర్లలాగానో, సేనాధిపతుల లాగానో కనిపించేవారు. ఇంట్లో హాయిగా, స్వేచ్ఛగా తన ఊహాలోకంలో తేలిపోతూ కాలం గడపడానికి అలవాటు పడ్డ ఆల్బర్ట్ కి బడి చదువు అంటే రంపపుకోతగా ఉండేది. మన దేశంలో చదువుల లాగానే ఆ రోజుల్లో జర్మనీలో బట్టీ పద్ధతి బాగా చలామణిలో వుండేది. “ఎలాంటి శిక్షనైనా భరించగలను గాని బట్టీ పద్ధతిలో చదువుకోవడం అంటే సహించలేకపోయేవాణ్ణి,” అని తదనంతరం తన చిన్న తనం గురించి తలచుకుంటూ చెప్పుకున్నాడు ఐన్
స్టయిన్.
క్లాసులో
టీచర్ చెప్పిందే వేదం అన్నట్టుగా ఉండేది. పిల్లలు అతిగా ప్రశ్నలు వేస్తే టీచర్లు క్షమించేవారు కారు. సందేహాలు తీర్చుకోకుండా విషయం అర్థం చేసుకునేదెలాగో చిన్నారి ఆల్బర్ట్ కి బోధపడేది కాదు. ఒకసారి ఓ సైన్స్ టీచరు ఆల్బర్ట్ కి పక్కకి పిలిచి గదమాయించాడట,
“ఏంటి నువ్వు చేస్తున్న పని? నీ సంగతి కొంతకాలంగా చూస్తున్నాను. ఏంటా తిక్క ప్రశ్నలు? ఆ ప్రశ్నలకి క్లాసులో మిగతా పిల్లలకి ఎంత ఇబ్బందిగా ఉందో తెలుసా?” ఇబ్బంది తతిమా పిల్లలకి కాదని, తనకని టీచరు ఒప్పుకోలేదు.
“నేనేం చేశాను సర్!” భయపడకుండా తిరుగు ప్రశ్న వేశాడు ఆల్బర్ట్. “నిజం ఏంటో తెలుసుకోవాలని చూశానంతే!”
సందేహలన్నీ
తీర్చుతూ,
నిజమేంటో క్షుణ్ణంగా చెప్పగలిగే స్థితిలో లేడా టీచరు.
“సరి సర్లే. ఈ సారి నించి క్లాసులో కిమ్మనకుండా కూర్చో. నీ అర్థం లేని ప్రశ్నలతో క్లాసులో నన్ను, మిగతా పిల్లల్ని ఇబ్బంది పెట్టకు. అర్థమయ్యిందా?” టీచరు గొంతు పెంచుతూ అన్నాడు.
అర్థం
కాకపోయినా మౌనంగా తలాడించాడు ఆల్బర్ట్.
ఆల్బర్ట్
కి క్లాసులో టీచర్లు డ్రిల్లు
మాస్టర్ల లాగానో, సేనాపతుల లాగనో కనిపించడాకి
మరో కారణం కూడా ఉండొచ్చు. ఆల్బర్ట్ కి ఐదారేళ్ల వయసులో ఓ సంఘటన చూశాడు. అది తన మనసులో చెరగని ముద్ర వేసింది. ఒక ఆదివారం నాడు పిల్లవాడు తన తల్లిదండ్రులతో పాటు ఓ సిపాయిల కవాతు చూడడానికి వెళ్లాడు. ఒక నేత ముందుగా నడుస్తూ ఏవో ఆదేశాలిస్తూ గట్టిగా అరుస్తున్నాడు. వెనుకనే కచ్చితమైన వరుసల్లో కొందరు సిపాయిలు లయబద్ధంగా నడుస్తున్నారు. నేత అరిచిన అరుపులకి అనుగుణంగా వెనుక గుంపు కచ్చితంగా కదులుతోంది. చూడడానికి అదో మానవ సమూహంలా కనిపించలేదు ఆల్బర్ట్ కి. మీట నొక్కితే మెదిలే మహా యంత్రంలా తోచింది. ఆ దృశ్యం చూస్తేనే ఆ పిల్లవాడి ఒళ్ళు జలదరించింది. మనిషిని ఓ యంత్రంలా, ఓ మారణ యంత్రంలా మార్చేసే ఆ యుద్ధ సంస్కృతి అంటే ఏహ్యభావం కలిగింది. తదనంతరం తన జీవితంలో కలిగిన అనుభవాలు ఆ ఏహ్యభావాన్ని మరింత గాఢతరం చేశాయేగాని తొలగించలేకపోయాయి.
ఆ
విధంగా చిన్నారి ఆల్బర్ట్ కి తన విద్యాజీవనం అంత సంతోషంగా సాగలేదు. బడి తన అవసరాలని తీర్చలేకపోయింది. తను అడిగింది ఇవ్వకపోగా తనకి ఇష్టం లేని రీతుల్లో తన ప్రవర్తనని మలచాలని చూస్తుంది. నిరంకుశంగా తనని కట్టడి చెయ్యాలని చూస్తుంది. ఆల్బర్ట్ మనసులో అసలు బడి అంటేనే ఒకరకమైన ఏహ్యభావం మొదలయ్యింది. బడిలో జరిగే వ్యవహారాల పట్ల ఆసక్తి సన్నగిల్ల సాగింది. క్లాసులో ఆఖరి బెంచీలో కూర్చుని తన ఆలోచనల ప్రపంచంలో మునిగిపోయేవాడు. టీచరు చెప్తున్న దాంట్లో ఎప్పుడైనా ఒకటి రెండు పదాలు చెవిలోకెక్కేవి. టీచరు చెప్తున్న విషయం పేలవంగా వున్నా ఒకొక్కప్పుడు అది మరేదో ఆసక్తికరమైన విషయాన్ని స్ఫురింపజేసేది. ఏదో గొప్ప ఆలోచన మనసులో మెదిలేది. ఆ ఆలోచనకి ఆ పిల్లవాడి పెదాల మీద చిరునవ్వు విరిసేది.
అది గమనించిన టీచర్లు ఒక్కొక్కసారి చిన్నబుచ్చుకునే వారు. చివరి బెంచీలో కూర్చుని క్లాసులో వున్న వాళ్లంతా పిచ్చివాళ్ళు అన్నట్టు నవ్వుకునే ఆ కుర్రాణ్ణి చూస్తే మంటగా ఉండేది. ఒకసారి అలాగే ఓ టీచరు పిలిచి ఆలర్ట్ తో
“నువ్వలా చివరి బెంచీలో కూర్చుని నవ్వేసుకోవడం ఏం బాలేదు సుమా! టీచరు అంటే క్లాసుకి భయభక్తులు ఉండాలి. నువ్వా మర్యాద మంటగలిపేస్తున్నావు,” అని చీవాట్లు పెట్టాడు.
(ఇంకా
వుంది)
మీ శైలి, సైన్స్ ను చిన్న చిన్న పదాలతో వివరించడం బాగుంది. నాకున్న ఒకటే చింత ఏమిటంటే ఇది చదివి తెలుసుకొనే చిన్నారులెంతమంది ఉంటారని? అలా అని మీప్రయత్నాన్ని చిన్నబుచ్చటం కాదు. మీ కృషి సఫలీకృతం కావాలని ఆశిస్తున్నాను.