1930 లో ఇంగ్లీష్ భౌతిక శాస్త్రవేత్త పాల్ అడ్రియెన్ మారిస్ డిరాక్ (1902-1984) ప్రోటాన్లకి, ఎలక్ట్రాన్లకి పూర్తిగా వ్యతిరేకమైన రేణువులు (ప్రతిరేణువులు) ఉంటాయని సైద్ధాంతికంగా నిరూపించాడు. ప్రతి-ఎలక్ట్రాన్ కి ఎలక్ట్రాన్ కి ఉండే ద్రవ్యరాశి ఉంటుంది గాని ధనావేశం ఉంటుంది. అలాగే ప్రతి-ప్రోటాన్ కి ప్రోటాన్ కి ఉండే ద్రవ్యరాశే ఉంటుంది ఋణావేశం ఉంటుంది.
1932 లో నిజంగా ప్రతి-ఎలక్ట్రాన్ కనుక్కోబడింది. కాస్మిక్
కిరణాలని అధ్యయనం చేస్తున్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త కార్ల్ డేవిడ్ ఆండర్సన్ (1905-1991) ఈ రేణువుని కనుక్కున్నాడు. కాస్మిక్ కిరణాలు వాయుమండలంలోని పరమాణువుల కేంద్రకాలని ఢీకొన్నప్పుడు కొన్ని ప్రత్యేక రేణువులు పుట్టాయి. ఎలక్ట్రాన్ల లాగానే ఇవి కూడా అయస్కాంత క్షేత్రంలో వంపు తిరిగాయి గాని వ్యతిరేక దిశలో తిరిగాయి. ఈ రేణువుకి ఆండర్సన్ పాజిట్రాన్ అని పేరు పెట్టాడు.
(కాస్మిక్ కిరణాలలో అంతరిక్షం నుండి పృథ్వీ వాతావరణంలోకి ప్రవేశించే రేణువులు ఉంటాయి. వాటిలో అధిక శాతం ఉండేవి ప్రోటాన్లే. తారల మధ్య అంతరిక్షంలో ఉండే విద్యుత్ క్షేత్రాల వల్ల ఈ కిరణాలు అత్యధిక వేగాల వద్దకి త్వరితం గావింపబడతాయి.)
ఓ పావు
శతాబ్ద కాలం దాకా ప్రతి-ప్రోటాన్ ని కనుక్కోవడానికి సాధ్యపడలేదు. ప్రతి-ఎలక్ట్రాన్ కన్నా ప్రతి-ప్రోటాన్ బరువు 1836 రెట్లు ఎక్కువ కనుక దాన్ని రూపొందించడానికి కూడా అంత ఎక్కువ శక్తి కావాలి. 1950 ల వరకు అందుకు కావలసిన పరికరాలు నిర్మింపబడలేదు. పెద్ద పెద్ద త్వరణ యంత్రాలు ఉపయోగించి ఇటాలియన్-అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఎమిలియో
సెగ్రే (1905-1989), అతడు సహచరుడు అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఓవెన్ చాంబెర్లెయిన్ (1920-2006) లు కలిసి 1955 లో ప్రతి-ప్రోటాన్ ని కనుక్కున్నారు.
ప్రతి-ప్రోటాన్లు, ప్రతి-ఎలక్ట్రాన్లు ఉన్నప్పుడు ప్రతి-పరమాణువులు కూడా ఉండొచ్చు నన్న భావన ఉదయించింది. ఈ ప్రతి-పరమాణువులలో కేంద్రకంలో ఋణావేశపు రేణువులైన ప్రతి-ప్రోటాన్లు ఉండి, కేంద్రకం బయట ధనావేశపు రేణువులైన పాజిట్రాన్లు ఉండొచ్చని అనిపించింది. కాని అలాంటి ప్రతి-పదార్థం భూమి మీద ఎంతో సేపు నిలవలేదు. భూమి మీదే కాదు అసలు గెలాక్సీలోనే ఎక్కువ కాలం నిలువలేదు. ఎందుకంటే పదార్థం, ప్రతి-పదార్థం కలుసుకున్నాయంటే రెండూ ఓ మహావిస్ఫోటంలో పరస్పరం హరించుకుంటాయి. అసలు మొత్తం గెలాక్సీలే ప్రతి-పదార్థమయమై ఉంటాయా అని కూడా ఖగోళశాస్త్రవేత్తలు ప్రశ్నించారు. అలాంటి గెలాక్సీలు ఉన్నా వాటిని గుర్తించడం బహు కష్టం.
(ఇంకా వుంది)
0 comments