తరచు
సుస్తీ చెయ్యడం వల్ల తమకి తెలిసిన ఓ డాక్టరు దగ్గరికి వెళ్లి చూపించుకున్నాడు. ఆల్బర్ట్ ని చూడగానే డాక్టరు అదిరిపోయాడు. పిల్లవాడు బాగా చిక్కిపోయాడు. ఏం జరిగిందని అడిగాడు, డాక్టరు. ఆల్బర్ట్ జరిగిందంతా ఏకరువు పెట్టాడు. ఇంట్లో వాళ్లు చాలా గుర్తొస్తున్నారని ఎలాగైనా వెళ్లి వాళ్లని చేరుకోవాలని వుందన్నాడు. విషయం అర్థమైన ఆ మంచి డాక్టరు ఆల్బర్ట్ బడి అధికారులని ఉద్దేశిస్తూ ఓ ఉత్తరం రాసి ఇచ్చాడు. ఆల్బర్ట్ కొంత కాలం తన కుటుంబీకులతో గడిపి వస్తే గాని తన ఆరోగ్యం కుదుట పడదని ఆ ఉత్తరంలో సూచించాడు. ఆ ఉత్తరం చూసిన ఆల్బర్ట్ కి ప్రాణం లేచొచ్చినట్టయ్యింది.
కాని
ఆ ఉత్తరం చదివిన హెడ్ మాస్టర్ మాత్రం అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. కొన్ని రోజుల సెలవేం ఖర్మ, అసలు పూర్తిగా బడికి స్వస్తి చెప్పరాదూ? అంటూ వ్యంగ్యంగా అడిగాడు. ఇలాగైనా ఈ మొద్దు స్వరూపాన్ని వొదిలించుకోవచ్చని హెడ్ మాస్టర్ ఆలోచన. బడి చదువు ఇలా అర్థంతరంగా వదిలి మిలాన్ కి వెళ్తే తండ్రి ఎలా స్పందిస్తాడో ఆల్బర్ట్ కి బాగా తెలుసు. కాని ఏదైతే అది అవుతుంది. ఇలాగైనా ఈ బడిని మాత్రం శాశ్వతంగా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు ఆల్బర్ట్. పిల్లవాడు తమ బడిలో చదువు పూర్తిచేస్తున్నట్టు ధృవపత్రం ఇచ్చాడు హెడ్ మాస్టరు. ఇలా అర్థాంతరంగా బడిని వొలిలేస్తున్నట్టుగా ధృవపత్రం ఉంటే ఇటలీలో బడులలో ప్రవేశం కష్టం కావచ్చని ఆల్బర్ట్ గ్రహించకపోలేదు. తనకి ఇష్టమైన సబ్జెక్ట్ లు గణితం, భౌతికశాస్త్రం. ఈ రెండు సబ్జెక్ట్ లలో తను క్లాసులో ఎప్పుడూ ఉన్నత స్థాయిలో ఉండేవాడు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ తనకి లెక్కలు, భౌతిక శాస్త్రం చెప్పిన గురువులు ధృవపత్రాలు ఇస్తే బావుంటుంది. అలాంటి ధృవపత్రాలు ఇస్తారా అని వెళ్లి ఆ గురువుల అభ్యర్థించాడు. ఆల్బర్ట్ ప్రతిభ గురించి తెలిసిన ఆ ఆచార్యులు ఒప్పుకుని అలా ఉత్తరాలు రాసి ఇచ్చారు. ఆ ఉత్తరాలు చేతబట్టుకుని ఇటలీకి బయల్దేరాడు ఆల్బర్ట్.
పెట్టె
చెత పట్టుకుని మిలాన్ లో ఐన్ స్టయిన్ కుటుంబం ఉంటున్న ఇంటి ముంగిట్లో ప్రత్యక్షం అయ్యాడు ఆల్బర్ట్. చెప్పా పెట్టకుండా వచ్చి వాలిన పిల్లవాణ్ణి చూసి నిర్ఘాంతపోయారు ఇంట్లో వాళ్ళు. ఎముకల గూడులా మారిపోయిన పిల్లవాణ్ని చూసి తల్లి విలవిలలాడింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బడిని వదిలేసి అంత పెద్ద నిర్ణయం సొంతంగా తీసుకున్నందుకు తండ్రి మొదట కొంచెం విసుక్కున్నా, తరువాత కొడుకు దుస్థితి అర్థం చేసుకుని ఊరుకున్నాడు.
మ్యూనిక్
తో పోల్చితే మిలాన్
లో జీవితం పూర్తిగా భిన్నంగా తోచింది ఆల్బర్ట్ కి. మ్యూనిక్ లో అయితే ఆకాశం ఎప్పుడూ మేఘావృతమై నల్లగా జేవురించినట్టు ఉంటుంది. ఉహుహూ అంటూ చలికి వణుకుతూ కూర్చోవాలి. కాని మిలాన్ లో చక్కగా ఎండ కాస్తుంది. ఊరంతా రవికాంతుల చిరునవ్వులు పూస్తున్నట్టుగా కళకళలాడుతూ ఉంటుంది. మ్యూనిక్
లో జీవన వ్యవహారాలన్నీ క్రమబద్ధంగా ఓ పోలీస్ కవాతులా జరుగుతుంటాయి. మిలాన్ లో జీవన లయలు ఓ దరహాసంలా సహజంగా, సజావుగా సాగిపోతుంటాయి. మ్యూనిక్
లో జీవనం కఠిన కారాగార వాసం అయితే, మిలాన్ లోజీవితం సుందర విహర యాత్ర.
అంతవరకు
పుస్తకాల పేజీల్లో ఒంటరిగా నిర్బంధ జీవితం గడిపిన ఆల్బర్ట్ ఇప్పుడు నెమ్మదిగా మనుషుల్లో పడడం మొదలెట్టాడు. చెల్లెలు మాయా వల్ల మిలాన్ లో తన ఈడు పిల్లలతో పరిచయం ఏర్పడింది. వారితో క్రమంగా స్నేహం పెరిగింది. నలుగురితో కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం, సరదాగా నవ్వుకోవడం, సంబంధం వున్న వాటి గురించి లేని వాటి గురించి చర్చించుకోవడం, వాదించుకోవడం, వాదన తేలకపోతే అరచుకోవడం… ఎదిగే పిల్లల జీవితలలో ముఖ్యాంశాలైన ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు ఆల్బర్ట్ జీవితంలో కూడా చోటుచేసుకుంటున్నాయి. అన్నయ్యలో వస్తున్న ఈ కొత్త మార్పు చూసి మాయా ఆశ్చర్యపోయింది. ఎప్పుడూ పుస్తకాలలో మునిగిపోయి కాస్త ముభావంగా ఉండే అన్నయ్య ఇప్పుడు కరుగుతున్న హిమవన్నగంలా కనిపిస్తున్నాడు. అన్నయ్య ఇంత మాటకారి అని ఇంతవరకు తనకి తెలీదు. మాటల్లో చక్కని చమత్కృతి వుంటుంది. సందోర్బోచితమైన హాస్యం వుంటుంది. వయసుకి
మించిన ప్రతిభ కనిపిస్తుంది. మాయాకి అన్నయ్య మీద వున్న
గౌరవం, అభిమానం రెండింతలు అయ్యాయి.
అన్నా,
చెల్లెళ్లు ఇద్దరూ ఏ బాదర బందీలు లేకుండా జీవితాన్ని ఆనందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. పగలంతా మిలాన్ పురవీధుల సంచారంలో గడిపేవారు. మ్యూజియమ్ లు, వనాలు, కళాప్రదర్శన శాలలు, ఆలయాలు, గ్రంథాలయాలు – ఆసక్తిరకంగా వున్నది, తెలుసుకోదగ్గది, చూడదగ్గది ఏం ఉన్నా అక్కడ హాజరు అయ్యేవారు. పుస్తకాలతో, చిత్రపటాలతో మెదడు మరీ వేడెక్కిపోతే ఏదో కెఫెటీరియా లోకి దూరి అంతవరకు ఆ రోజు తాము చూసిన దానిగురించి, చదివిన దాని గురించి మంచి కాఫీ తాగుతూ ముచ్చటించుకునేవారు. ఇలాంటి అనుభవాల ప్రభావం వల్ల ఆల్బర్ట్ క్రమంగా జర్మనీలో తన చేదు అనుభవాలనే కాక తన విద్యా భవిష్యత్తు గురించిన అనిశ్చితిని కూడ మర్చిపోసాగాడు. అలా మిలాన్ లో ఓ నెల గడిచింది.
(ఇంకా
వుంది)
postlink