కుర్ర
ఆల్బర్ట్ లో నెమ్మదిగా రాజుకుంటున్న అగ్గిని ప్రొఫెసర్ వింట్లర్ గుర్తించాడు. ఆల్బర్ట్
తదనంతరం ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ గా పేరు పొందిన తరువాత, ఎప్పుడో తన వద్ద చదువుకున్న ఆల్బర్ట్ గురించి గుర్తు తెచ్చుకుంటూ ప్రొఫెసర్ వింట్లర్ ఇలా అంటాడు: “నడకలో మంచి బలం, ధీమా కనిపించేవి. ముఖం మీద కదలాడే దరహాసంలో కాస్త పరిహాసం కలిసేది. అవతలి వాడు ఎవడు, ఏమనుకుంటాడు అని చూడకుండా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం తన తత్వం.”
గణిత,
భౌతిక శాస్త్ర రంగాలలో ఆల్బర్ట్ ప్రతిభని ప్రొఫెసర్ వింట్లర్ త్వరలోనే గుర్తించాడు. భాషలు, జీవశాస్త్రం మొదలైన సబ్జెక్ట్ లలో బాగా చెయ్యకపోవడం వల్ల ఫెడరల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశపరీక్షలో తప్పిన సంగతి కూడా తెలుసుకున్నాడు. కుర్రవాడికి ఈ రంగాలలో కాస్త ప్రత్యేక శిక్షణ ఇస్తే తన ప్రతిభకి తగ్గ విశ్వవిద్యాలయంలో స్థానం సంపాదించగలుగుతాడు.
ఆల్బర్ట్
ని చేరదీసి ప్రొఫెసర్ వింట్లర్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాడు. తన ఇంటికి పిలిచి తన పరివారానికి పరిచయం చేశాడు. అంతే కాక వాళ్ల ఇంట్లోనే వేరేగా ఓ గదిలో ఉండి చదువుకునే అవకాశం ఇచ్చాడు. ఆయన చూపించిన కరుణకి ఆల్బర్ట్ కదిలిపోయాడు. ఈ ప్రేమాభిమానాలు కొరవడినందుకే జర్మనీలో తన జీవితం అంత దుర్భరం అయ్యింది. ఈ ప్రేమాభిమానాలు మెండుగా అందినందుకే స్విట్జర్లాండ్ తనకి అంతగా ప్రీతిపాత్రమయ్యింది.
ప్రొఫెసర్
వింట్లర్ తన వద్ద చదువుకునే విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రధ్ధ చూపించి వారికి సహాయం చెయ్యడమే కాక, తను కూడా ఓ విద్యార్థిలాగానే మెలగేవాడు. కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా సరికొత్త వైజ్ఞానిక ఆవిష్కరణల గురించి, నూతన సిద్ధాంతాల ఆవిర్భావం గురించి వైజ్ఞానిక పత్రికలు తెప్పించుకుని ఎప్పటికప్పుడు చదువుకుంటూ వుండేవాడు. తను నేర్చుకున్న కొత్త విషయాలని క్లాసులో విద్యార్థులకి సమయోచితంగా వెల్లడి చేసేవాడు. అంతా తెలుసని తృప్తి పడిపోకుండా ఆచార్యులు కూడా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలన్నది ప్రొఫెసర్
వింట్లర్ అభిమతం. “తెలుసుకోదగ్గ ప్రతీ విషయం నేర్చుకోవడం ఎవ్వరి వల్లా కాదు. మనం తెలుసుకోవాలనుకునే ప్రతీ విషయాన్ని నేర్చుకోడానికి కావలసినంత సమయం ఎవరికీ ఉండదు. కాని జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉండే ఎడాన్ని ఎప్పటికప్పుడు పూరించుకునే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అలాంటి ప్రయత్నం జీవితాంతం సాగాలి.” గురువు గారు నేర్పిన ఈ పాఠం మాత్రం ఆల్బర్ట్ కి జీవితాంతం గుర్తుండిపోయింది.
ప్రొఫెసర్
వింట్లర్ ది పెద్ద పరివారం. బోలెడు మంది పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. వారిలో ఒకరిద్దరు పిల్లలు ఆల్బర్ట్ ఈడు వాళ్లే. త్వరలోనే వారితో తన స్నేహం పెరిగింది. పిల్లలంతా కలిసి ఆడుకునే వాళ్లు. తీరిక వేళల్లో చుట్టుపక్కల కొండలు ఎక్కేవాళ్ళు. పైన్ చెట్లు బారులు తీరి, ఇంపుగా వంపులు తిరిగే దారుల మీద సైకిల్ పోటీలు పెట్టుకునే వారు. అందరూ కలిసి ఇంట్లో తమకి నచ్చిన సంగీతం వినేవారు. పాటలు పాడుకునే వాళ్లు. అలాంటి సందర్భాల్లో అప్పుడప్పుడు ఆల్బర్ట్ తను ఎక్కడికెళ్లినా తోడుగా వచ్చే వయొలిన్ ని బయటికి తీసి వాయించేవాడు. ఒక సారి అలా వాయిస్తుంటే గమనించిన ప్రొఫెసర్ “బాగా వాయిస్తున్నావే!” అని మెచ్చుకున్నాడు. అది విన్న ఆల్బర్ట్ గట్టిగా నవ్వేశాడు.
“ఏం నవ్వుతున్నావు?”
“ఏం లేదు,” ఆల్బర్ట్ వివరించాడు. “మీరు అలా అన్నప్పుడు నా వయొలిన్ చరిత్ర అంతా ఓ సారి కళ్ల ముందు మెదిలింది.”
తన
చిన్నతనంలో వయొలిన్ అభ్యాసంలో వేసిన తొలిమెట్లు, తప్పటడుగులు గుర్తొచ్చాయి. మొదట్లో ‘టుప్పు, టుప్పు’ మన్న చప్పుళ్ళు తప్ప పెద్దగా ఏమీ వచ్చేవి కావు. కొన్నేళ్లు అభ్యసించినా పురోగతి లేదు. అప్పుడు సంగీతంలో ప్రావీణ్యం వున్న వాళ్ల అమ్మ చేరదీసి ప్రత్యేక శ్రద్ధ చూపించి వయొలిన్ వాయిద్యం నేర్పించింది. అప్పట్నుంచి వేగంగా అందుకున్నాడు. ఇప్పుడు గొప్ప వాగ్గేయకారుల కృతులని వాయించే స్థాయికి చేరుకున్నాడు. ఏదో ఒక దశలో తన జీవితంలోకి ప్రవేశించి తరువాత నిష్క్రమించిన వాళ్ళు ఉన్నారు. కాని ఈ వయొలిన్ మాత్రం ఎప్పుడూ ఓ నమ్మకమైన స్నేహితుడిలా చివరికంటా తనతో వచ్చింది.
(ఇంకా
వుంది)
0 comments