స్విట్జర్లాండ్ లో
తనకి కలిగిన మంచి అనుభవాల కారణంగా, ప్రొఫెసర్ వింట్లర్ చూపించిన ఆదరణ కారణంగా ఆల్బర్ట్ పరీక్షల్లో విజయం సాధించాడు. గణిత, భౌతిక శాస్త్రాలలో తన తోటి విద్యార్థులెవరూ తనకి సాటి రారు. మిగతా సబ్జెక్ట్ లలో కూడా ఈ సారి గౌరవనీయమైన మార్కులతో పాసు అయ్యాడు. ఎన్నాళ్ళుగానో ఎదురుచూసున్న ఫెడరల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత చదువు చదువుకోడానికి ప్రవేశం దొరికింది. ఆల్బర్ట్ లో లో
జీవనోత్సాహం
మళ్ళీ పుంజుకుంది. జర్మనీలో కలిగిన చేదు అనుభవాలకి, తల్లిదండ్రులు తన శక్తిసామార్థ్యాల పట్ల చూపించిన అవిశ్వాసానికి అంతవరకు బాగా డీలా పడిపోయాడు. ఏదో ఒక కాలేజిలో చదువు పూర్తి చేసి, వీలైనంత త్వరగా ఏదో ఓ ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులని మెప్పించాలనే ఆలోచనలో వున్నాడు. కాని ఇటీవల కలిగిన పరిణామాల వల్ల ఆత్మవిశ్వాసం
పెరిగింది.
తనకి ఇష్టం లేని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో చేరకూడదని నిశ్చయించుకున్నాడు. ఆ నిర్ణయం గురించి ఇలా రాసుకున్నాడు:
“యవ్వనంలో ఉన్నవాళ్ళు తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. తమ జీవనలక్ష్యాల గురించి వీలైనంత కచ్చితమైన అవగాహన పొందాలని తాపత్రయపడతారు. నా అదృష్టం బావుండి పరీక్షలు పాసు అయితే జ్యూరిక్
లో వున్న విశ్వవిద్యాలంలో చేరుతాను. అక్కడ
నాలుగేళ్లు గణితం, భౌతిక శాస్త్రం చదువుకుంటాను. తదనంతరం ఆయా రంగాల్లో టీచరు కావాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా సైద్ధాంతిక రంగంలో ప్రత్యేక శ్రధ్ధ చూపించాలని ఉద్దేశం.”
విజ్ఞాన
శాస్త్రానికి
ప్రయోగమే పునాది. ప్రయోగం ద్వారా ప్రకృతి చెప్పే సాక్షమే వైజ్ఞానిక
సిద్ధాంతాల నిజానిజాలని తేల్చిచెప్పే గీటురాయి. కాని ప్రయోగం చెప్పే కథని అర్థం చేసుకోడానికి సరైన సిద్ధాంతం కావాలి. కొన్ని వేల ప్రయోగాల సారం ఒక్క సిద్ధాంతంలో ఇమిడి వుంటుంది. ఆల్బర్ట్ కి మొదటి నుంచీ కూడా ప్రయోగం కన్నా సిద్ధాంతం మీదే ఎక్కువ మక్కువ. ఆ మక్కువని ఇలా వ్యక్తం చేసుకున్నాడు: “నా ప్రవృత్తి అంతా సహజంగా మహోన్నతమైన గణితచింతన దిశగానే పోతుంది… ఎవరికి ఎందులో నైపుణ్యం వుందో వారు ఆ రంగంలోనే పని చెయ్యాలి. వైజ్ఞానిక రంగం వ్యక్తికి ఇచ్చే ఈ రకమైన స్వేచ్ఛే నన్ను ఆకట్టుకుంది.”
ఇంజినీరింగ్
బదులు భౌతిక శాస్త్రం చదువుకుంటానంటే ఇంట్లో ఏమంటారో ఆల్బర్ట్ కి బాగా తెలుసు. కాని తల్లిదండ్రుల అనుమతి లేకుండా అలాంటి నిర్ణయం తీసుకోవడం కష్టం. అయినా తప్పదు కనుక కొన్ని రోజులు సెలవు తీసుకుని ఆరావ్ వదిలి మిలాన్ కి ప్రయాణం అయ్యాడు. ఇంటికి వచ్చిన కొడుకుని చూసి తల్లి మురిసిపోయింది. మునుపటి కన్నా ఇప్పుడు ఆస్త ఆరోగ్యంగా ఉన్నాడు. కొడుకు ప్రవర్తనలో ఇప్పుడు ఓ కొత్త ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కనిపించాయి తండ్రికి. ఇక అన్నయ్యని చూసిన మాయా సంతోషానికి పగ్గాల్లేవు. ఇలాంటి వాతావరణంలో తన నిర్ణయం మాట ఎత్తితే బాగుండదని ఒక రోజు ఆగి మెల్లగా తన మనసులో మాట బయటపెట్టాడు ఆల్బర్ట్. అది వినగానే తండ్రి ఉగ్రుడయ్యాడు. కొడుకు మీద ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మిలాన్ కి వచ్చాక చక్కబడుతుంది అనుకున్న వారి ఆర్థిక పరిస్థితి ఇక్కడ కూడా అంతంత మాత్రంగానే వుంది. కుర్రవాడైన ఆల్బర్ట్ త్వరగా చదువు పూర్తి చేసి ఎప్పుడు ఉద్యోగంలో
చేరుతాడా అని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్ చేస్తే ఉద్యోగాలు సులభంగా వస్తాయి. భౌతిక శాస్త్రంలో, ముఖ్యంగా సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో మనుగడ కష్టం. పైగా అంతంత మాత్రంగానే చదువు వెలిగిస్తున్న తన పుత్రరత్నం సైద్ధాంతిక భౌతిక శాస్త్రంలో ఊడబొడిచేదేవుంది? అసలైనా అంత గట్టి పోటీ ఉండే చదువులో తనకి ప్రవేశం వచ్చేదెలా?
ఏదేమైనా
తనకి నచ్చిన చదువే చదువుకుంటానని ఆల్బర్ట్ పట్టుబట్టాడు. అందుకు విధిలేక ఒప్పుకున్నా ఆ చదువుకు అయ్యే ఖర్చు భరించలేని స్థితిలో వున్నాడు తండ్రి హర్మన్. కాని అంతలో ఆస్తిపరుడైన ఓ దూరపు బంధువు సాయం చెయ్యడానికి ముందుకు వచ్చాడు. అలా సకాలంలో అందిన సహాయంతో ఆల్బర్ట్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువు ప్రారంభించాడు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీలోకి
అడుగుపెడుతున్న
ఆల్బర్ట్ ఓ వైజ్ఞానిక స్వర్గంలోకి ప్రవేశిస్తున్నట్టు ఊహించుకున్నాడు. అంతవరకు భౌతికశాస్త్రంలో టీచర్ల నుండి, బడుల నుండి నేర్చుకున్న దాని కన్నా, స్వయంకృషితో, స్వాధ్యాయంతో నేర్చుకున్నదే ఎక్కువ. స్విట్జర్లాండ్ లో పరిస్థితి జర్మనీలో పరిస్థితి కన్నా నిశ్చయంగా మెరుగ్గానే వుంది. ఓ చిన్న కాలేజిలోనే చదువు అంత మిన్నగా
ఉన్నప్పుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాంటి ప్రపంచ ప్రసిద్ధి గల విశ్వవిద్యాలయంలో విద్యాప్రమాణాలు మరెంత ఉన్నతంగా ఉంటాయో? ఈ రకంగా ఊహించుకుంటున్న ఆల్బర్ట్ కి ఆ విశ్వవిద్యాలంలో వాస్తవం కాస్త నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి.
(ఇంకా
వుంది)
0 comments