స్విస్
ఫెడెరల్ ఇన్స్టిట్యూట్ స్ ఆఫ్ టెక్నాలజీ (Swisss Federal
Institutes of Technology) స్విట్జర్లాండ్ కి చెందిన ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల సముదాయం. వాటిలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత వున్నది
జ్యూరిక్ నగరంలో వున్న విశ్వవిద్యాలయం. మన దేశంలో ఐ.ఐ.టి. లకి మల్లె ఇది ప్రత్యేకించి సాంకేతిక రంగంలో పేరు పొందిన విశ్వవిద్యాలయం. ఇప్పటికీ ఈ సంస్థ యూరప్ లోని విశ్వవిద్యాలయాలలో కెల్లా ఒకటి, రెండు స్థానాలలో ఉంటుంది. ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో, లేదా ఇక్కడ పని చేసే ప్రొఫెసర్లలోను నోబెల్ బహుమతి పొందిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఆల్బర్ట్ ఐన్ స్టయిన్ ఒకరు.
ఎలక్ట్రికల్
ఇంజినీరింగ్
చదువులో ప్రవేశం పొందే లక్ష్యంతో కుర్రవాడైన ఆల్బర్ట్ ఫెడెరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
టెక్నాలజీ గడప తొక్కాడు. అయితే ఆ లక్ష్యం అంత సులభంగా నెరవేరేలా లేదు. విశ్వవిద్యాలయంలో ప్రవేశం కావాలంటే ఓ ప్రవేశ పరీక్ష పాసు కావాలి. గణిత, భౌతిక శాస్త్రాలలో తన సత్తా మీద తనకి మంచి నమ్మకం వుంది. కాని జీవ శాస్త్రం, ఆధునిక భాషలు – ఈ సబ్జెక్ట్ లలోనే కొంచెం సందేహం. ఈ సబ్జెక్ట్ లలో ఎవరైనా కాస్త సహాయం చేస్తే బావుణ్ణు. కాని అలాంటి సహాయం ఏదీ అందలేదు. ఎలాగో ధైర్యం చేసి పరీక్ష రాశాడు. పరీక్ష ఫలితాలు ప్రకటించే రోజు వచ్చింది. ఆ రోజు సంస్థ డైరెక్టర్ అయిన డా. హెర్జాగ్ తో ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో జాతకం అటో ఇటో తేలిపోతుంది.
డా.
హెర్జాగ్ గది బయట ఆందోళనగా ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఆల్బర్ట్. కాసేపయ్యాక లోపలి నుండి పిలుపు వచ్చింది. లోపలికి వెళ్ళి డైరెక్టర్ గారి ముందు నించుని, ‘గుడ్ మార్నింగ్’ అంటూ పలకరించాడు.
ఆయన
ఓ సారి కుర్రవాణ్ణి ఎగాదిగా చూసి, “సారీ ఆల్బర్ట్. నువ్వు పరీక్ష తప్పావు” అన్నాడు. ఆల్బర్ట్ నీరుగారి పోయాడు. ఆ క్షణం భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది. వెనక్కి తిరిగి వెళ్లిపోబోతుంటే మళ్లీ ఆయనే పిలిచాడు.
“ఒక్క నిముషం… కూర్చో. నీతో కొంచెం మాట్లాడాలి,” అనునయిస్తూ అన్నాడు డా. హెర్జాగ్. “లెక్కల్లోను, భౌతిక శాస్త్రంలోను అద్భుతంగా చేశావు.” ఆల్బర్ట్
ముఖం కాస్త వికసించింది. “నన్నడిగితే నీకు ఇబ్బందికరంగా ఉన్న సబ్జెక్ట్ లలో కాస్త శిక్షణ పొంది మళ్లీ పరీక్షకి కూర్చోమని అంటాను. ఆ సబ్జెక్ట్ లు నీకు నచ్చవని నాకు తెలుసు. వాటిలో కేవలం పాస్ మార్కులు తెచ్చుకుంటే చాలు. ఆ మాత్రం నీకు చాతనవునని నాకు తెలుసు. అలా చేశావంటే మా సంస్థలో చేర్చుకోడానికి నాకు అభ్యంతరం లేదు.”
పెద్దాయన
అంత ఇదిగా చెప్తుంటే ఆల్బర్ట్ కాదనలేకపోయాడు. ఆయన చెప్పినట్టే గట్టి ప్రయత్నం చేసి మళ్లీ పరీక్ష రాయాలి. ఆయనకి మనసారా కృతజ్ఞతలు చెప్పి బయటికి నడిచాడు.
జరిగిందంతా
తల్లి దండ్రులకి వివరంగా ఉత్తరం రాశాడు. తండ్రి ఎప్పట్లాగే మండి పడ్డాడు.
కాని ఈ సారి తల్లి వెనకేసుకొచ్చింది. జర్మనీ ఉండే రోజుల్లో ఆల్బర్ట్ చదువు పాడవడానికి కారణం కొంత వరకు కుటుంబంలోని అనిశ్చిత పరిస్థితులే నని వాదించింది. కాని ప్రస్తుతం పరిస్థితి వేరు. ఈ సారి స్విట్జర్ లాండ్ లోని మంచి కాలేజిలో వేద్దామంది. అక్కడ కొంత శిక్షణ పొందిన తర్వాత ఫెడెరల్ ఇన్స్టిట్యూట్ స్ ఆఫ్ టెక్నాలజీ లో చేరే అవకాశం ఏర్పడవచ్చు.
జ్యూరిక్
నగరానికి దగ్గర్లో, ఆరావ్ అనే ఓ చిన్న ఊళ్లో ఓ కాలేజిలో ఆల్బర్ట్ చదువుకుంటాడని నిర్ణయమయ్యింది. ఈ కొత్త కాలేజి ఎలా ఉంటుందో నని ఒక పక్క ఆల్బర్ట్ మనసులో సందేహంగా వుంది. వెనకటికి జర్మనీలో జరిగిన చేదు అనుభవాలే మళ్లీ ఎదురవుతాయా, లేక ఇక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయా? కాలేజిలో చేరిన ఆల్బర్ట్ కి స్విట్జర్లాండ్ లో చదువుకి,
జర్మనీలో చదువుకి మధ్య తేడా స్పష్టంగా కనిపించింది. స్విట్జర్లండ్ వ్యక్తిగత స్వాతంత్రానికి ఎంతో విలువనిచ్చే దేశం. ప్రతి మనిషి తాను నమ్మిన మార్గంలో ధీమాగా నడిచే స్వేచ్ఛనిచ్చే సంస్కృతి వారిది. జర్మను విద్యాలయాలలో లాగా సేనలకి శిక్షణ ఇచ్చినట్టుగా కరకుగా లేదు ఇక్కడి చదువు.
ఆరావ్
లోని కాలేజిలో ఆల్బర్ట్ చదువు ప్రారంభం అయ్యింది. సర్కస్ లో రింగ్ మాస్టర్ల లాగా కాకుండా ఇక్కడి ప్రొఫెసర్ లు ఎంతో స్నేహంగా ఉన్నారు. సందేహాలు అడిగితే ఒకటికి రెండు సార్లు ఓపిగ్గా సమాధానం చెప్తారు. సంక్లిష్టమైన భావాలని
కూడా ఎంతో సరళీకరించి, పిల్లల మనసుకి హత్తుకునేలా చెప్తారు. ఏకంగా కాలేజి ప్రిన్సిపాల్ అయిన ప్రొఫెసర్ వింట్లర్ ని కూడా కలుసుకుని సందేహ నివృత్తి చేసుకోవచ్చు. ఆల్బర్ట్ కి క్రమంగా స్విట్జర్లాండ్ అంటే ఇష్టం పెరగసాగింది.
వ్యక్తికి
స్వేచ్ఛ నిచ్చే ఆ సంస్కృతిలో ఆల్బర్ట్ వ్యక్తిత్వం అందంగా రూపుదిద్దుకుంది. ఒక శాస్త్రవేత్తకి ఉండే సహజ లక్షణాలు తనకు అంకురించసాగాయి. ఒక శాస్త్రవేత్త ముఖ్య లక్ష్యం సత్యశోధన. నిజాన్ని తెలుసుకోగోరేవాడికి ఉండాల్సిన మొదటి లక్షణం నిర్భయం. శోధన ఎటు తీసుకుపోతే అటు దూసుకుపోయే ధైర్యం వుండాలి. ఎప్పుడూ సత్యానికే పెద్ద పీట వేస్తూ వ్యక్తులకి, వ్యక్తిత్వాలకి, అహంకారాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా నడచుకోవాలి. తెలుసుకున్న విషయాన్ని నిస్సంకోచంగా – అవతలి వారు ఎవరు, ఏమిటీ అని చూసుకోకుండా – చెప్పే తెగువ ఉండాలి. ఈ లక్షణాలు క్రమంగా ఆల్బర్ట్ లో ఊపిరి పోసుకుంటున్నాయి.
(ఇంకా
వుంది)
ఒక శాస్త్రవేత్త ముఖ్య లక్ష్యం "సత్యశోధన". నిజాన్ని తెలుసుకోగోరేవాడికి ఉండాల్సిన మొదటి లక్షణం "నిర్భయం". శోధన ఎటు తీసుకుపోతే అటు దూసుకుపోయే ధైర్యం వుండాలి. ఎప్పుడూ సత్యానికే పెద్ద పీట వేస్తూ వ్యక్తులకి, వ్యక్తిత్వాలకి, అహంకారాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా నడచుకోవాలి. తెలుసుకున్న విషయాన్ని నిస్సంకోచంగా – అవతలి వారు ఎవరు, ఏమిటీ అని చూసుకోకుండా – చెప్పే తెగువ ఉండాలి. ఈ లక్షణాలు క్రమంగా ఆల్బర్ట్ లో ఊపిరి పోసుకుంటున్నాయి.
Your narration Skill is Super Sir!