ప్రతీ తారామండలం అంతరిక్షంలో ఓ ద్వీపం లాంటిది. పొరుగు తారామండలాల నుండి కాంతిసంవత్సరాల దూరంలో ఉంటుంది. కాబట్టి అసంఖ్యాకమైన
ప్రపంచాల మీద వేరు వేరు జీవరాశులు ఎవరికి వారే తమ ప్రప్రథమ విజ్ఞానపు ఓనమాలు దిద్దుకుంటూ, ఒంటరిగా వికాసం చెందుతున్నట్టు ఊహించుకుంటాను. మన ఎదుగుదల ఏకాంతంలోనే జరుగుతుంది. చాలా నెమ్మదిగానే మనం విశ్వం యొక్క అసలు స్వరూపాన్ని గ్రహించగలుగుతాం.
కొన్ని తారల చుట్టూ కొన్ని లక్షల జీవరహితమైన, శిలామయమైన చిన్న చిన్న ప్రపంచాలు పరిభ్రమిస్తూ ఉండొచ్చు. అవి విశ్వవికాసపు
తొలినాళ్లలో ఘనీభవించిన గ్రహ వ్యవస్థలు కావచ్చు. ఎన్నో తారలకి
మన సౌరమండలాన్ని పోలిన గ్రహవ్యవస్థలు ఉండి ఉండొచ్చు. వాటి అంచుల
వద్ద హిమావృతమైన ఉపగ్రహాలు కలిగిన, బృహత్తర, వలయాలంకృత, వాయు దిగ్గజాలు ఉండొచ్చు. కేంద్రానికి మరి
కాస్త దగ్గరగా నీలం, తెలుపు ఛాయలు
అలముకున్న, వెచ్చని చిట్టి
గ్రహాలు ఉండొచ్చు. వాటిలో కొన్నిటి
మీద ప్రజ్ఞ గల జీవరాశులు జీవిస్తూ ఉండొచ్చు. వారు తాము జీవించే
గ్రహోపరితలం అంతా వ్యాపించిన ఓ
విస్తారమైన సాంకేతిక వ్యవస్థని స్థాపించి ఉండొచ్చు. ఈ విశాల
విశ్వంలో వారు మనకి సోదర, సోదరీ జనులౌతారు. మరి మనకి వారికి మధ్య చాలా తేడా ఉంటుందా? వారి రూపం
ఎలా ఉంటుంది? వారి జీవరసాయన
మండలం, నాడీమండలం ఎలా
ఉంటాయి? వారి చరిత్ర, రాజకీయాలు ఎలా ఉంటాయి? వైజ్ఞానిక, సాంకేతిక, కళ, సంగీత, మత, తాత్విక
రంగాలలో వారి సృజన ఎలా ఉంటుంది? బహుశ ఏదో
ఒకనాడు వారిని మనం చూడ గలుగుతామేమో?
ఇప్పుడిక మన ముంగిట్లోకి వచ్చేశాం. భూమి నుండి
ఒక కాంతిసంవత్సరం దూరానికి వచ్చేశాం. అంత దూరంలో
మన సూర్యుడి చుట్టూ మంచుతో, శిలతో, కర్బన
రసాయన అణువులతో కూడుకున్న పెద్ద పెద్ద మంచు బండలు గోళాకారపు మేఘావళిలా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ మంచుబండల
మేఘాలే మనకి కనిపించే ఉల్కలకి జన్మస్థానం. అప్పుడప్పుడు దారే పోయే తార యేదో ఆ మబ్బులని తన
గురుత్వాకర్షణతో సున్నితంగా లాగుతుంది. ఆ దెబ్బకి, ఆ
శీతల మేఘావళి నుండి ఊడిపడ్డ ఓ హిమశిల, అంతర సౌరమండలం దిశగా తన సుదీర్ఘ యాత్ర మొదలెడుతుంది. సూర్యుణ్ణి సమీపించిన హిమశిల సూర్యతాపానికి వేడెక్కుతుంది. మంచు కరిగి ఆవిరి అవుతుంది. ఆ ఆవిరిపదార్థంతో
ఏర్పడ్డ బారైన కుచ్చుతోకని బడాయిగా ప్రదర్శించుకుంటూ అంతరిక్షంలో దూసుకుపోయే బహుదూరపు బాటసారులే తోకచుక్కలు.
ఇక నెమ్మదిగా మన సౌరమండలంలోని గ్రహసీమ లోకి ప్రవేశిద్దాం. సూర్యుడి గురుత్వాకర్షణకి చిక్కి, సూర్య తాపం
చేత వెచ్చనవుతూ, సూర్యుడి చుట్టూ ఇంచుమించుగా వృత్తాకార కక్ష్యలలో పరిభ్రమించే ప్రపంచాలివి. ఘనీభవించిన మీథేన్ చేత ఆవరించబడ్డ గ్రహం ప్లూటో (Pluto). దాని ఏకాంత, భారీ ఉపగ్రహం
షారన్ (Charon). అల్లంత దూరం నుండి పడుతున్న సూర్యకిరణాల వల్ల చిమ్మచీకటిలో చిన్న వెలుగు చినుకులా కనిపిస్తుంది షారన్. ఆ
తరువాత వరుసగా వచ్చే బృహత్తర, వాయు ప్రపంచాలు – నెప్ట్యూన్, యురేనస్, సాటర్న్, జూపిటర్. వీటన్నిటి చుట్టూ హిమావృతమైన ఉపగ్రహాల దళాలే వున్నాయి. వాయు గ్రహాల
సీమను దాటి అంతర సౌరమండలంలోకి వస్తే రాళ్ల సీమలు ఎదురవుతాయి. ఉదాహరణకి ఎర్రని గ్రహమైన మార్స్ నే తీసుకుందాం. ఆకాశంలోకి అల్లంత ఎత్తుకి లేచే అగ్నిపర్వతాలతో, లోతు తెలియని అగాధాలతో, గ్రహోపరితలాన్ని అతలాకుతలం చేసే
ఇసుకతుఫానులతో, బహుశా ఏవో కొన్ని సూక్ష్మమైన జీవరాశులతో కూడుకున్న విచిత్ర ప్రపంచం మార్స్. ఈ గ్రహాలన్నీ
మనకి అతి దగ్గరి తార అయిన సూర్యుడి చుట్టూ, హీలియమ్, హైడ్రోజన్ల
మధ్య జరిగే ఉష్ణకేంద్రక చర్యలతో కూడుకున్న ప్రళయభీకర అగ్నికుండమైన సూర్యుడి చుట్టూ, మన గ్రహమండలం
మీద కాంతులు కురిపించే సూర్యుడి చుట్టూ, తిరుగుతూ ఉంటాయి.
మన విశ్వసంచారాల అంతానికి వచ్చాము. తెలుపు-నీలపు
ఛాయతో వెలిగిపోయే, మన చిన్నారి, నాజూకైన గ్రహానికి, మన స్వగృహానికి తిరిగొచ్చాము. మన ఊహ తాకలేనంత విశాలమైన విశ్వసముద్రంలో ఓ మూల కొట్టుకుపోతున్న
ఓ బుల్లి తెప్ప
మన ప్రపంచం. అనంతకోటి ప్రపంచాలలో
మనదీ ఒక ప్రపంచం. ఈ భూమే
మన ఇల్లు, మన తల్లి. మన లాంటి జీవం ఇక్కడ పుట్టింది, ఎదిగింది. మానవ
జాతి ఇక్కడ పరిపాకం చెందుతోంది. విశ్వాన్ని తరచిచూడాలన్న తపన ఈ ప్రపంచంలోనే మనలో
ఊపిరిపోసుకుంది. ఇక్కడే మనం మన భవితవ్యాన్ని స్వహస్తాలతో రూపుదిద్దుకుంటున్నాం.
(ఇంకా
వుంది)
postlink