ధూమం, ధూళి,
తారల సమూహాలే గెలాక్సీలు. కొన్ని కోట్ల, కోట్ల, కోట్ల
తారల సందోహాలు గెలాక్సీలు. అందులో ప్రతీ తార ఎవరో ఒకరికి సూర్యుడు కావచ్చు. ఒక గెలాక్సీలో
లెక్కలేనన్ని తారలు, గ్రహాలు ఉంటాయి. ఇక వాటి మీద అసంఖ్యాకమైన జీవరాశులు, ప్రజ్ఞగల జీవులు, అంతరిక్షసంచారక నాగరికతలు ఉన్నా ఆశ్చర్యం లేదు. ఇక్కడి నుండి, ఇంత దూరం నుండి చూసినప్పుడు, ఆ గెలాక్సీలు, యుగయుగాల పాటు ప్రకృతి ఎంతో ప్రేమతో మలచి, విశ్వతీరం మీద
ఉంచిన గవ్వలని, శంకువులని తలపిస్తుంటాయి.
గెలాక్సీలు నూరు బిలియన్లకి (1011) పైగా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో
సగటున నూరు బిలియన్లకి పైగా తారలు ఉన్నాయి. ఈ గెలాక్సీలు
అన్నిట్లో ఎన్ని తారలు ఉన్నాయో (=1011 x 1011 =
1022) కనీసం
అన్ని గ్రహాలు అయినా ఉంటాయి. అలాంటి బ్రహ్మాండమైన
సంఖ్యల నేపథ్యంలో, మన సూర్యుడిలా
మానవాసాలు గల గ్రహం పరిభ్రమించే తార ఒకే ఒక్కటి ఉంటుంది అనడానికి సంభావ్యత ఎంత? విశ్వంలో
ఒక మారుమూల బతుకుతున్న మనం అంత అదృష్టవంతులం అని ఎలా అనుకోగలం? ఈ విశ్వం
జీవరాసులతో కిటకిటలాడుతోందని నాకు అనిపిస్తుంది. కాని ప్రస్తుతానికి మనకి ఏమీ తెలీదు. మన అన్వేషణలు
ఇంకా ఇప్పుడిప్పుడే ఆరంభం అవుతున్నాయి. ఎనిమిది బిలియన్ల కాంతి సంవత్సరాల దూరం నుండి చూస్తే, భూమి సూర్యుడు
మాట అటుంచి, అసలు మన
పాలపుంత గెలాక్సీ ఉన్న గెలాక్సీ కూటమిని కనిపెట్టడమే గగనం అవుతుంది. మనకి కచ్చితంగా
తెలిసిన గ్రహం ఒకే ఒకటి – లోహంతో, రాతితో కూడుకుని
మండుటెండలో నిగనిగలాడే ఈ భూమి.
కాని అల్లంత దూరం నుండి చూసినపుడు అది గల్లంతై పోతుంది.
ప్రస్తుతం మనం మన భూమి మీద ఖగోళవేత్తలు ‘గెలాక్సీల స్థానిక గుంపు’ (Local Group of Galaxies) అని
పిలిచే ప్రాంతానికి ప్రయాణిద్దాం. కొన్ని మిలియన్ల కాంతిసంవత్సరాల వ్యాసం ఉన్న ఈ అంతరిక్ష ప్రాంతంలో
ఇరవై పైగా గెలాక్సీలు ఉన్నాయి. పలచగా, అవిశేషంగా
ఉంటుందీ గెలాక్సీల కూటమి. వాటిలో ఒకటైన M31
గెలాక్సీ భూమి
నుండి చూసినప్పుడు ఆండ్రోమెడా తారారాశిలో కనిపిస్తుంది. ఎన్నో ఇతర సర్పిలాకార గెలాక్సీల లాగానే ఇది కూడా తారా వాయు ధూళి పూరితమై ఉంటుంది. M31 చుట్టూ తిరిగే రెండు ఉపగెలాక్సీలు కూడా ఉన్నాయి. దీర్ఘవృత్తాకారంలో ఉండే ఈ
రెండు మరుగుజ్జు గెలాక్సీలు దీని చుట్టూ గురుత్వాకర్షణ ప్రభావం చేత పరిభ్రమిస్తూ ఉంటాయి. నన్ను నా
కుర్చీకి అదిమి పట్టే ఆకర్షణే గెలాక్సీలని కూడా కలిపి ఉంచుతోంది. మరి విశ్వంలో
ప్రతీ చోట ప్రకృతి ధర్మాలు ఒకేలా పనిచేస్తాయి. ఇప్పుడు మనం మన ఇంటి నుండి రెండు మిలియన్ల కాంతిసంవత్సరాల దూరానికి వచ్చాం.
(M31 లేదా ఆండ్రోమెడా గెలాక్సీ)
M31 ని
దాటి ఇంకా లోపలికి వస్తే దాన్ని పోలిన మరో గెలాక్సీ ఒకటి – అదే మనం ఉండే గెలాక్సీ – ఎదురవుతుంది. దాని విశాలమైన సర్పిలాకార భుజాలు నెమ్మదిగా 250 మిలియన్ సంవత్సరాలకి ఒకసారి ప్రదక్షిణ చేస్తూ తిరుగుతాయి. ఇప్పుడు ఇంటి నుండి 40 వేల కాంతిసంవత్సరాల దూరానికి వచ్చేశాం. నెమ్మదిగా పాలపుంత
గెలాక్సీ కేంద్రం దిశగా కొట్టుకుపోతున్నాం. కాని అందులో భూమిని చేరుకోవాలంటే గెలాక్సీ అంచు వద్ద, ఒక భుజం
యొక్క కొస వద్దకి ప్రయాణించాలి.
గెలాక్సీ యొక్క సర్పిలాకార భుజాల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం లోంచి ప్రయాణిస్తున్నా కూడా అసంఖ్యాకమైన తారలు అల్లంత దూరంలో వెనక్కు ప్రవహించడం కనిపిస్తుంది. అద్భుతమైన ఆత్మప్రకాశంతో మెరిసే తారలసరాలు అంతరిక్షంలో అంతులేకుండా విస్తరించి ఉంటాయి. వాటిలో కొన్ని
సబ్బుబుడగలలా అతి పలచగా ఉన్నా, పది వేల
సూర్యులని, ట్రిలియన్ భూములని
ఇముడ్చుకోగలిగినంత పెద్దవి. మరి కొన్ని
ఓ చిన్న నగరం
అంత చిన్నవి అయినా సీసం కన్నా వంద ట్రిలియన్ల రెట్ల అధిక సాంద్రత గలవి. కొన్ని తారలు
ఒంటరి తారలు, మన సూర్యుడిలా. మరి కొన్నిటికి తోడుగా ఇతర తారలు ఉంటాయి. వాటిలో చాలా
మటుకు జంట తారలే. ఒకదాని చుట్టూ
ఒకటి పరిభ్రమిస్తూ ఉంటాయి. కొన్ని తారా
త్రయాలు కూడా ఉన్నాయి. కొన్నిట్లో కొన్ని
డజన్ల తారలు కలిసికట్టుగా ఉంటే, మరి కొన్ని
రాశులు కొన్ని లక్షల సూర్యులతో ప్రజ్వరిల్లే బృహత్తరమైన గోళాకార తారారాశులు. కొన్ని జంట తారలు ఎంత దగ్గరగా వస్తాయంటే, సలసల
రగిలే తారా పదార్థం ఒక తార నుండి మరో తార లోకి ప్రవహిస్తుంది. చాలా మటుకు జంట తారల మధ్య దూరం, మన బృహస్పతికి, సూర్యుడికి మధ్య దూరం అంతే ఉంటుంది. కొన్ని తారలు, తేజంలో వాటి మాతృ గెలాక్సీనే తలదన్నే సూపర్నోవాలు. మరి కొన్ని కాసిన్ని కిలోమీటర్ల దూరం నుండి కూడా అదృశ్యంగా మిగిలిపోయే నల్లబిలాలు.
కొన్ని నిశ్చల తేజంతో దీర్ఘకాలం ప్రకాశిస్తే, మరి కొన్ని తటపటాయించే కాంతిలయతో మినుకుమినుకు మంటుంటాయి. కొన్ని మహారాజ
దర్పంతో నెమ్మదిగా గమిస్తుంటే, మరి కొన్ని ఎంత ప్రచండ వేగంతో పరిభ్రమిస్తాయంటే వాటి గోళాకారాన్ని కోల్పోయి పళ్ళెంలా చదునుగా మారిపోతాయి. కొన్ని దృశ్య కాంతిని, పరారుణ తరంగాలని
చిందిస్తే, మరి కొన్ని
ఎక్స్-రే లని, రేడియో తరంగాలని వెలువరిస్తాయి. నీలి తారలు మంచి యవ్వనంలో వేడెక్కి వుంటాయి.
పసుపుపచ్చ
తారలు సాంప్రదాయకంగా మధ్యవయసులో ఉంటాయి. ఎర్రని తారలు
వయసు పైబడి ఉంటాయి. చిన్న పరిమాణం
గలిగి తెల్లని, నల్లని తారలు
కొన ఊపిరితో ఉంటాయి. మన పాలపుంత
గెలాక్సీలో 400 బిలియన్ల నానా రకాల తారలు, సంక్లిష్టమైన, సలక్షణమైన
గమనంతో నెమ్మదిగా కదులుతుంటాయి. ఆ తారలు అన్నిట్లోకి
భూమి వాసులమైన మనకి బాగా, దగ్గరిగా తెలిసిన
తార ఒకే ఒకటి.
0 comments