శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
కార్ల్ సాగన్ రాసిన కాస్మాస్ పుస్తకం తెలియని 'జనవిజ్ఞాన సాహితీ ప్రియులు' ఉండరేమో.
కాస్మాస్ మొదట టీవీ సీరియల్ రూపంలో 80 లలో వచ్చింది.  ఆ సీరియల్ ని ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాలలో సుమారు  500 మిలియన్ల మంది  చూశారని అంచనా.

కాస్మాస్ పుస్తకానికి నా తెలుగు అనువాదాన్ని ఇటీవల ఎమెస్కో ప్రచురణలు 'విశ్వసంద్రపు తీరాలు' అన్న పేరుతో ప్రచురించారు. ఆ పుస్తకంలో మొదటి అధ్యాయం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.



అధ్యాయం 1
 విశ్వసంద్రపు తీరాలు 

ఉండినది, ఉన్నది, ఉండబోయేది అంతా కలిపితే అదే విశ్వం. విశ్వం గురించి కాస్తంత ధ్యానించినా చెప్పరాని పులకరింత కలుగుతుంది. వెన్నులో చలిపుడుతుంది, గొంతులో వణుకు పుడుతుంది. ఎత్తు నుండి రాలిపోతున్నామన్న ఏదో పురాతన స్మృతి మదిలో మెదుల్తుంది. అతిప్రగాఢమైన రహస్యాన్ని సమీపిస్తున్నామన్న స్ఫురణ కలుగుతుంది.

విశ్వం యొక్క పరిమాణం, వయసు సామాన్య మానవ అవగాహనకి అందని విషయాలు. బృహత్తుకి, సనాతనత్వానికి మధ్య దారితప్పిన చిన్నారి గ్రహం మన స్వగృహం. విశ్వదృక్కుతో చూస్తే మన మానవ తాపత్రయాలన్నీ అవిశేషమైనవి, అత్యల్పమైనవి. అయినా యవ్వనం, ఉత్సాహం, ధైర్యం గల మానవ జాతి మనది. మంచి భవిష్యత్తు గల జాతి మనది. గత కొద్ది సహస్రాబ్దాలలో విశ్వాన్ని గురించి, అందులో మన స్థానాన్ని గురించి, అద్భుతమైన, అనూహ్యమైన ఆవిష్యరణలెన్నో చేశాము. ఉత్కంఠభరితమైన అద్భుత అన్వేషణలని తలపెడుతున్నాము. ఆశ్చర్యపడే గుణం మానవ పరిణామానికి పరాకాష్ట అని, అవగాహన ఆనందాన్నిస్తుందని, ఉన్కికి విజ్ఞత అవసరమని అవి మనకు గుర్తుజేస్తున్నాయి. ఉషాకిరణాలలో తేలాడే గోధూళికణంలా మహావిశ్వంలో కొట్టుకుపోయే మన జాతి యొక్క భవితవ్యం, విశ్వాన్ని గురించి ఎంత బాగా తెలుసుకుంటాం అన్నదాని మీదే ఆధారపడి ఉంటుందని నా విశ్వాసం.

అన్వేషణలు సాధ్యం కావాలంటే ఊహాశక్తికి, విచక్షణా శక్తి తోడవ్వాలి. మునుపు లేని నవ్యలోకాలకి ఊహాశక్తి మనను ఎత్తుకుపోతుంది. అదే లేకుంటే మనం ఎక్కడికీ పోలేము. వాస్తవానికి ఊహకి మధ్య భేదాన్ని ఎత్తి చూపుతుంది విచక్షణ. మన ఊహలలోని నిజానిజాలని పరీక్షిస్తుంది. మరి విశ్వం మన కొలమానాలకి అందని అద్భుతం. అతిసుందర వాస్తవాల కూటమి. అసాధారణ సంబంధాల కొలువు. అత్యంత ఆశ్చర్యకర యంత్రజాలం.


విశ్వసముద్రానికి తీరం మన భూమి ఉపరితలం. ఇంతవరకు మనం తెలుసుకున్నదంతా ఇక్కడి నుండే తెలుసుకున్నాం. ఇటీవలి కాలంలో తీరాన్ని విడిచి సముద్రం లోపలికి రెండు అడుగులు నడిచాం. పాదాలని నీరు తడిపేలా, మడమలని అలలు తాకేలా. నీరు రమ్మని పిలుస్తోంది. సాగరం స్వాగతిస్తోంది. నిజానికి మనం వచ్చింది అక్కడి నుండే నని ఎదలోతుల్లో ఎక్కడో మనకి తెలుసు. తిరిగి అక్కడికే వెళ్లాలని ఉల్లము ఉవ్విళ్లూరుతోంది. ఇవి అనర్థక తపనలు కావని నాకనిపిస్తోంది. అయితే అవి దేవతలకి చిరాకు తెప్పించే  ప్రమాదం ఉంది.

విశ్వం యొక్క పరిమాణం ఎంత గొప్పది అంటే భూమి మీద దూరాలు కొలిచే దూరమానాలు, మీటర్లు, మైళ్లు మొదలైనవి, విశ్వస్థాయిలో ఎందుకూ కొరగావు. ఇక్కడ కాంతివేగం సహాయంతో దూరాలని కొలుచుకుంటాం. కాంతిపుంజం సెకనుకి 186,000 మైళ్లు, అంటే 3,00,000 కిమీలు ప్రయాణిస్తుంది. అంటే భూమి చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేస్తుంది. ఎనిమిది నిముషాలలో అది సూర్యుడి నుండి భూమిని చేరుకుంటుంది. కాబట్టి సూర్యుడు మన నుండి ఎనిమిది కాంతి నిముషాల దూరంలో ఉన్నాడని చెప్పుకోవచ్చు. సాలుకి అది సుమారు పది ట్రిలియన్ కిలోమీటర్లు, అంటే ఆరు ట్రిలియన్ మైళ్లు పరిగెడుతుంది. దూరమానాన్ని, అంటే కాంతి ఒక సంవత్సరంలో పరుగెత్తే దూరాన్నే, కాంతిసంవత్సరం అంటారు. అది కొలిచేది కాలాన్ని కాదు, దూరాలనిబృహత్తరమైన దూరాలని.

భూమి ఒక ప్రదేశం. ఎన్నో ప్రదేశాలలో ఇదీ ఒకటి. ఇదొక సామాన్యమైన ప్రదేశం అనడానికి కూడా లేదు. ఒక గ్రహం గాని, తార గాని, గెలాక్సీ గాని సామాన్యం అనడానికి లేదు. ఎందుకంటే విశ్వం ఇంచుమించు మొత్తం శూన్యమయమే. సామాన్యమైన ప్రదేశం ఒక్కటేఅది విశాల, శీతల, విశ్వశూన్యం. తారాంతర అంతరిక్షం అంతా వ్యాపించిన ప్రగాఢ తామసం. అది ఎంత విచిత్రంగా, ఎంత విపరీతంగా, ఎంత నిర్జనంగా ఉంటుందంటే, దానితో పోల్చితే గ్రహాలు, తారలు, గెలాక్సీలు అన్నీ లోకోత్తర సౌందర్యంతో వెలిగిపోతున్నట్టు కనిపిస్తాయి. మనని ఎవరైనా విశ్వంలో యాదృచ్ఛికంగా ఎక్కడైనా ప్రవేశపెడితే మనం గ్రహం మీదనో, గ్రహం సమీపం లోనో ఉండే ఆస్కారం కేవలం 1 లో ఒక బిలియన్ ట్రిలియన్ ట్రిలియన్ (1023, అంటే ఒకటి పక్కన 23 సున్నాలు) వంతు మాత్రమే. కాబట్టి విశ్వంలో ప్రపంచాలు అత్యంత విలువైన, అరుదైన ప్రదేశాలు.

బృహత్తరమైన తారాంతర దృక్పథం నుండి చూసినప్పుడు అంతరిక్షపు తరంగాల మీద నురగ తరగల్లా విసిరేసినట్టు ఉండే అసంఖ్యాకమైన పలచని కాంతితంతువులు కనిపిస్తాయి. అవే గెలాక్సీలు. వాటిలో కొన్ని ఏకాంత సంచారులు. కాని అధికశాతం మాత్రం విశ్వతమస్సులో దిక్కు తెన్ను లేకుండా ఎటో కొట్టుకుపోయే సంఘనిత రాశులు. కనీవినీ ఎరుగనంత బృహత్తర స్థాయిలో విశ్వం మనకి దర్శనమిస్తోంది. భూమి నుండి ఎనిమిది బిలియన్ కాంతిసంవత్సరాల దూరంలో, మనకి తెలిసిన విశ్వసరిహద్దుల నుండి సగం దూరంలో ఉండే తారానీహారికల సీమలో మనం ఉన్నాం.


(ఇంకా వుంది)



0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts