హైకే వర్గపు
నౌకాదళం అంతా నాశనమయ్యింది. నలభై ముగ్గురు స్త్రీలు మాత్రం మిగిలారు. అంతఃపుర చెలికెత్తెలు
మాత్రం యుద్ధస్థలానికి దరిదాపుల్లో బేస్తవారికి పూలు అమ్మడం తదితర
సేవలు చేసి పొట్టపోసుకున్నారు. చరిత్ర పుటల నుండి హైకేల కథ ఇంచుమించు తుడిచిపెట్టుకుపోయింది. కాని బేస్తవారితో అనుబంధం పెంచుకుని, వారితో సంతానాన్ని
కన్న చెలికెత్తెలు మాత్రం యుద్ధానికి జ్ఞాపకార్థం ఒక ఉత్సవాన్ని ప్రారంభించారు. ఏటేటా ఏప్రిల్ 24 నాడు ఇప్పటికీ జరుగుతుందా పండుగ. హైకే తెగకి
వారసులైన బేస్తవారు ఆ రోజు నల్లని
తలకట్లతో అకామా దేవత ఆలయానికి వెళ్లి అక్కడ సముద్రానికి ఆహుతి అయిన చక్రవర్తి సమాధికి పూజలు చేస్తారు. అక్కడ డానో-ఉరా యుద్ధం లోని సన్నివేశాలని ప్రదర్శించే నాటకాన్ని తిలకిస్తారు. అది జరిగిన ఎన్నో శతాబ్దాల తరువాత కూడా సమూరాయ్ సైనికుల ఆత్మలు సముద్రం మీద విహరిస్తూ కనిపిస్తాయని అక్కడి వారు నమ్ముతారు. జరిగిన పరాభవానికి
నిష్కృతి చేసుకోవాలని, చిందిన
నెత్తుటి ఆనవాళ్లు పోయేలా సముద్రాన్ని శుద్ధి చెయ్యాలని ఆ ఆత్మల ఆరాటం
కాబోలు.
ఈ గాధ
లోంచి ఓ చక్కని శాస్త్ర సమస్య పుడుతుంది. పీత వీపు
మీద యోధుడి ముఖకవళికలు ఎలా ఏర్పడ్డాయి? ఆ గుర్తులు ఒక విధంగా మనుషులు చెక్కినవే
అని దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పీత వీపు
మీద ఉన్న గుర్తులు ఇతర ఎన్నో జీవలక్షణాలకి మల్లె వారసత్వంగా వచ్చినవే. కాని మనుషులలో
లాగానే పీతలలో కూడా ఎన్నో అనువంశిక పరంపరలు ఉంటాయి. ఉదాహరణకి ఈ
ప్రత్యేక పీతకి పూర్వీకులలో ఒక దాని వీపు మీద మానవ ముఖాన్ని చూచాయగానైనా పోలిన గుర్తులు ఉన్నాయని అనుకుందాం. డన్నో-ఉరా
యుద్ధానికి ముందు కూడా అలాంటి పీతని తినడానికి అక్కడి బేస్తవారు సందేహించి ఉంటారు. దాన్ని తిరిగి
సముద్రంలో పారేసే సాంప్రదాయంతో వాళ్లు తెలియకుండా ఓ ప్రత్యేక పరిణామ
ప్రక్రియకి నాంది పాడారు. ఏ ప్రత్యేకతా
లేని మామూలు పీత అయితే దాన్ని బేస్తవారు నిస్సంకోచంగా తింటారు.
మానవ ముఖపు గుర్తులు గల హైకే పీత
అలాంటి పీత
సంతతి తరుగుతూ వస్తుంది. అలా కాకుండా
వీపు మీద మనిషి ముఖపు గుర్తులు ఉన్న పీత అయితే దాన్ని తిరిగి సముద్రంలో పారేస్తారు. అలాంటి పీతల సంతతి వృద్ధి చెందుతూ వస్తుంది. వీపు మీద
ముఖపు గుర్తులు ఆ పీతల జాతికి
పెట్టని కోటలా సంరక్షిస్తాయి, వరం లాంటి వారసత్వంలా సంక్రమిస్తాయి. కొన్ని తరాల పీతల, బేస్తవాళ్ల తరువాత
పరిస్థితిలో ఎంతో మార్పు వస్తుంది. ప్రత్యేకించి సమూరాయ్
ముఖపు గుర్తులు ఉన్న పీతల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కేవలం మానవ
ముఖమో, జపనీజ్ ముఖమో
కాదు, ప్రత్యేకించి పరమభీకర
సమూరాయ్ యోధుడి ముఖ చిహ్నాలు గల పీతల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ మార్పులన్నీ
పీతలు కావాలని కోరుకున్నవి కావు. బాహ్య శక్తుల
చేత ఆపాదించబడ్డ ఎంపిక ఇది. పీత
మీద గుర్తులు సమూరాయ్ ముఖానికి ఎంత సన్నిహితంగా ఉంటే అది బతికి బట్టకట్టే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. అలా కొన్ని
తరాలు గడిచాక సమూరాయ్ పీతల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
ఈ ప్రక్రియనే
కృత్రిమ ఎంపిక అంటారు. హైకే పీతల
విషయంలో ఇలాంటి పరిణామాన్ని అక్కడి బేస్తవారు అనుకోకుండానే కలుగజేశారు. ఆ పరిణామంలో ఇక
పాపం ఆ పీతల ప్రమేయం
సుతరామూ లేదు. ఎంపిక చేత
జీవపరిణామాన్ని నియంత్రించడం మనకి కొత్తేమీ కాదు.
మొక్కలు, జంతువుల విషయంలో ఏవి నిలుస్తాయో, ఏవి సమసిపోతాయో కొన్ని వేల ఏళ్లుగా మనుషులు ఎంపిక చేస్తూ, నియంత్రిస్తూ వచ్చారు. మనం చిన్నప్పటి నుండి మన చుట్టూ రకరకాల పంటలని, పళ్ల చెట్లని, కూరగాయల మొక్కలని, పెంపుడు జంతువులని
చూస్తాము. ఇవన్నీ ఎక్కడి
నుండి వచ్చాయి? ఒకప్పుడు కారడవులలో
సంచరించే ఈ వన్యమృగాలని మనం
పెంచుకోవడం మొదలెట్టాక అవి మన పొలంలో, పెరట్లో మరింత
సాఫీ జీవనానికి అలవాటు పడ్డాయా? లేదు.
వాస్తవం అందుకు పూర్తిగా భిన్నం. వాటిలో చాలా
మటుకు మనం సృష్టించినవే.
పది వేల
ఏళ్ల క్రితం పాడియావులు గాని, పెంపుడు కుక్కలు
గాని, పొడవాటి జొన్న
పొత్తులు గాని లేవు. ఆ మొక్కలని, పశువులని మనం పెంపకానికి ఎంచుకున్నప్పుడే వాటి వారసత్వ ప్రక్రియని నియంత్రించడం మొదలెట్టాం. మొదట్లో ఆ జీవాల స్థితికి, ప్రస్తుతం వాటి స్థితి మధ్య ఎంతో భేదం ఉండి ఉండొచ్చు. మనకి నచ్చిన
లక్షణాలు గల వృక్ష, జంతు జాతుల
సంఖ్య పెరిగేలా వాటి పునరుత్పత్తిని నియంత్రిస్తూ వచ్చాం. పశువులని కాయడంలో
సహాయపడే కుక్క అవసరమైనప్పుడు, కుక్కల ఉపజాతులలో కాస్త తెలివైనవి, విధేయమైనవి, పశువులని
కాయడంలో కొంత సహజ ప్రవృత్తిని ప్రదర్శించేవి (గుంపులుగా వేటాడే జంతువులలో ఈ లక్షణాలు సహజంగా
ఉంటాయి) అయిన కుక్కలని
ఎంచుకుని వాటి సంఖ్య పెంచుతూ వచ్చాం. అలాగే పాలు, వెన్న మొదలైన పదార్థాల వైపు మొగ్గు చూపిన మానవుడు ఇంతేసి పొదుగులున్న పాడియావులని సృష్టించాడు. పదివేల తరాల మానవనియంత్రిత పరిణామాన్ని చవి చూసిన మొక్క జొన్న, బక్కచిక్కిన దాని
మూలరూపం కన్నా మరింత రుచిగా, మరింత పోషక
శక్తిగల గింజగా రూపుదేలింది. అసలు ఆ మొక్కజొన్న ఎంతగా
మారిపోయిందంటే మానవుడి జోక్యం లేకుండా తనని తాను ఎలా పునరుత్పత్తి చేసుకోవాలో కూడా మర్చిపోయింది.
(ఇంకా వుంది)
0 comments